————————
( ‘ GOLDEN BELT’ FROM ‘ THE WANDERER ‘ BY KAHLIL GIBRAN )
తెలుగు అనువాదం:డా. సి. బి. చంద్ర మోహన్
27. సంచారి తత్త్వాలు
———————–
ఒకానొక రోజు రహదారిలో కలిసిన ఇద్దరు మనుషులు సలామిస్ నగరానికి వెళ్ల సాగారు. మధ్యాహ్నానికి వారు ఒక వెడల్పుగా ఉన్న నది వద్దకు చేరుకున్నారు. ఆ నదిని దాటటానికి వంతెన లేదు. వాళ్ళు ఈదుకుంటూ నదిని దాటాలి లేదా వారికి తెలియని దారి వెంబడి ప్రయాణం సాగించాలి.
వారిలో వారు ఇలా అనుకున్నారు ” నదిని ఈదుకుంటూ దాటుదాం. నది పెద్ద వెడల్పు లేదు కదా!”
ఇద్దరూ నదిలో దిగి ఈదసాగారు.
వారిలో ఒకరికి నదుల గురించి, వాటి తీరు తెన్నుల గురించి బాగా తెలుసు. కానీ అతడు ప్రవాహం మధ్య, అకస్మాత్తుగా పట్టు కోల్పోయి నీటి ఒరవడికి కొట్టుకు పోసాగాడు. ఎప్పుడూ ఈదని రెండో మనిషి మాత్రం నదిని అవలీలగా దాటి, ఆవలి ఒడ్డున నిలబడ్డాడు.
తన సహచరుడు ప్రవాహంతో ఇంకా కుస్తీ పడుతూ ఉండడం చూసి, అతను మరలా నీళ్లలో దూకి, రెండో మనిషిని ఒడ్డుకి చేర్చాడు.
ప్రవాహంతో కొట్టుకు పోయిన మనిషి తనను రక్షించిన మనిషితో ఇలా అన్నాడు .” నీకు ఈత రాదని చెప్పావు కదా! అంత భరోసాతో నదిని ఎట్లా దాటగలిగావు?”
ఆ రెండో మనిషి ఇలా చెప్పాడు ” నా నడుము చుట్టూ ఉన్న బెల్టు చూస్తున్నావు కదా! నా భార్యా, పిల్లల కోసం సంపాదించిన బంగారు నాణాలు దాని నిండా ఉన్నాయి. ఒక పూర్తి సంవత్సరం పని చేసి వాటిని సంపాదించాను. ఈ బంగారు బెల్టు బరువే నా భార్య, పిల్లల దగ్గరకు నన్ను చేర్చింది. నేను ఈదే టప్పుడు నా భార్యా పిల్లలు నా భుజాలపై ఉన్నట్లే ఉంది!”
తరువాత, వారిద్దరూ సలామిస్ నగరం వైపు నడక సాగించారు.
Also read: దాతృత్వం
Also read: జాద్ మైదానము
Also read: నిండు చంద్రుడు
Also read: బోధన
Also read: ఎర్ర మట్టి