ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండు రోజులలో రెండు పరస్పర విరుద్ధమైన నిర్ణయాలు ప్రకటించింది. రెండో నిర్ణయం మొదటి నిర్ణయం స్ఫూర్తిని నీరు కార్చింది. 13 సెప్టెంబర్ 2020న ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశంలో మీడియాను గట్టిగా సమర్థించింది. మీడియాకు కొండంత అండగా నిలిచింది. ఒకానొక మీడియా సంస్థ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనగా ప్రభుత్వ, పోలీసు వ్యవస్థల తీరును అభివర్ణించింది. రెండు రోజుల అనంతరం, 15 సెప్టెంబర్ 2020వ తేదీన ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వు మీడియాను అవమానించింది. తుంగలో తొక్కింది. రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఒక పిటిషన్ దాఖలు చేసి తనపైన ఆరోపణలతో దాఖలయ్యే ప్రాథమిక సాక్ష్యాధారాల నివేదిక (ఎఫ్ఐఆర్ – ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) ను ప్రచురించే హక్కును మీడియాకు లేకుండా చేయాలని అభ్యర్థించారు. శ్రీనివాస్ అభ్యర్థనను హైకోర్టు మన్నించి తన పరువు తానే నట్టేట ముంచుకున్నది. ఈ ద్వంద్వవైఖరిని వివరిస్తూ, విమర్శిస్తూ, ఎండగడుతూ ప్రఖ్యాత న్యాయశాస్త్ర అధ్యాపకుడూ, మాజీ కేంద్ర సమాచారహక్కుల సంస్థ సభ్యుడు మాడభూషి శ్రీధర్ రాసిన వ్యాసం ఇది. ఇందులో రెండు వ్యాసాలు ఉన్నాయి. మొదటిది మీడియాను సమర్థించేంది. రెండవది హైకోర్టు నిర్ణయాన్ని విమర్శించేది. సుదీర్ఘంగా ఉన్నప్పటికీ, రెండిటినీ కలిపి చదువుకుంటే అసలు విషయం బోధపడుతుంది.
మీడియా గొంతునొక్కడాన్ని అభిశంసించిన హైకోర్టు
ఎఫ్ఐఆర్ లోని అంశాలను ప్రచురించరాదంటూ వార్తాపత్రికలనూ, ప్రసారం చేయవద్దంటూ టీవీ న్యాస్ చానళ్ళనూ, ప్రచారం చేయవద్దంటూ సోషల్ మీడియానూ కట్టడి చేస్తూ 15 సెప్టెంబర్ 2020న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసాధారణమైన ఆదేశం జారీ చేసింది. ఇది వాక్ స్వాతంత్ర్యాన్ని హరించడమేనంటూ దేశవ్యాప్తంగా విమర్శలు వినిపించాయి. ఇందుకు హైకోర్టును విమర్శించే ముందు 13 సెప్టెంబర్ 2020న సీఐడీ పెట్టిన తప్పుడు కేసుల నుంచి ఒక జర్నలిస్టును రక్షిస్తూ అదే హైకోర్టు పోలీసులను ఎంత తీవ్రంగా దుయ్యపట్టిందో గమనించాలి. పోలీసుల వైఖరిని ‘కాకిస్ట్రోకసీ’ అంటూ ఉన్నత న్యాయస్థానం నిందించింది.
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగుల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణను వెబ్ పోర్టల్ లో పెట్టి వినిపించినందుకు ఒక జర్నలిస్టుపైన కేసులు పెట్టడాన్ని తప్పుపడుతూ, ‘ఇప్పుడు మనం డెమాక్రసీలో ఉన్నామా, కాకిస్ట్రోకసీలో ఉన్నామా?’ అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది.
కాకిస్ట్రోకసీ అంటే నిఘంటువులో అర్థం ఇట్లా ఉంది: అత్యంత అల్పులూ, కనీసమైన అర్హత లేనివారూ, ఏ మాత్రం న్యాయాన్యాయ విచక్షణ లేని పౌరులూ నడుపుతున్న ప్రభుత్వవ్యవస్థ. ఈ పదాన్ని రెండు గ్రీక్ పదాలతో సంధించారు. ‘కాకిస్ట్రోస్’ అనే మాట ఒకటి. దీని అర్థం అతిచెడ్డది అని. ‘క్రాటోస్’ అనేది రెండవది. దీని అర్థం పరిపాలన అని. అంటే అత్యంత చెడ్డవారి పాలన అని అర్థం. (ఇవాన్స్ రాడ్ ఎల్. (2011). పెంగ్విన్ పేజీ 87)
వ్యతిరేక మీడియాపైన దాడి
ఒక ఆడియోక్లిప్ ను తెలుగు ఒన్.కామ్ అనే మీడియా పోర్టల్ అప్ లోడ్ చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ పోలీసులు మనస్తాపానికి గురైనారు. ఆ ఆడియో క్లిప్ ఏపీ ప్రభుత్వంలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగుల మధ్య జరిగిన సంభాషణను వెల్లడించింది. ఇండియా మొత్తంలోకీ ఈ రాష్ట్రంలోనే ప్రజలు అత్యధికంగా బాధలు పడుతున్నారనీ, కోవిద్19 విస్తరించకుండా నిరోధించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైనదనీ వారు చర్చించుకోవడం వినిపించింది. ఈ సంభాషణపైన న్యూస్ పోర్టల్ ఎటువంటి వ్యాఖ్యానాన్నీ జోడించలేదు. ‘ఏపీ సీఎం ఆఫీసునుంచి లీకైన సంభాషణ ఆడియోరికార్డ్’ అంటూ పోర్టల్ లో పెట్టారు. ఈ న్యూస్ పోర్టల్ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంపైన పోలీసులు దాడి చేశారు. డజన్లకొద్దీ కంప్యూటర్లనూ, ఇతర ఎలక్ట్రానిక్స సామగ్రినీ స్వాధినం చేసుకున్నారు. ’అధికారంలో ఉన్న రాజీకీయ పక్షాన్ని సంతోషపెట్టడమే లక్యంగా పోలీసులు వ్యవహరించారు,’ అంటూ ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
తెలుగుఒన్.కామ్ ఆడియో క్లిప్
గణనీయమైన ప్రజాదరణ కలిగిన న్యూస్ పోర్టల్ ‘తెలుగుఒన్.కామ్’ మేనేజింగ్ డైరెక్టర్ పైన దాఖలు చేసిన ఎఫ్ ఐ ఆర్ ను కొట్టివేయాలంటూ అభ్యర్థించిన పిటిషన్ పైన 13 సెప్టెంబర్ 2020న విచారిస్తూ జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి సీఐడీ వైఖరిని ‘అధికార దుర్వినియోగం’గా అభివర్ణించారు. ఐపీసీ సెక్షన్లు 188, 505 (2), డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్, 2005 లోని 54వ సెక్షన్ కింద కల్పించిన అంశాలతో కూడిన ఆడియోక్లిప్ ను యూట్యూబ్ ద్వారా ప్రచారం చేస్తున్నారనే అభియోగంతో సీఐడీ క్రిమినల్ కేసులు పెట్టింది. ముఖ్యమంత్రి పట్ల అయోమయం, అసౌకర్యం, ఆగ్రహం, అవమానం, గాయం, నేరపూరితమైన ఆగడం, ద్వేషం సృష్టించేందుకూ, ప్రభుత్వంపట్ల వ్యతిరేకత కలిగించేందుకు ఉద్దేశించి ఈ వీడియోక్లిప్ ను సృష్టించారంటూ సీఐడీ ఆరోపించింది. కోవిద్ వ్యాధి వ్యాపించిన ఈ తరుణంలో
రాష్ట్రంలో ఉండటం క్షేమదాయకం కాదని ప్రజల మనసులలో అనుమానబీజాలు నాటడానికి ఈ పోర్టల్ ప్రయత్నించిందని పోలీసుల అభియోగం. ఈ పోర్టల్ ప్రజలను తప్పుదారి పట్టించి వారిలో ముఖ్యమంత్రిపట్ల ద్వేషం పెంచడానికి ప్రయత్నించిందని అడిషనల్ డీజీపీ ఆరోపించారు.
ఆధారాలు లేవు
కులం, మతం, ప్రాంతం, వదంతులు, ఆందోళన కలిగించే అంశాలూ పోర్టల్ చేసిన ప్రచారంలో ఉన్నాయంటూ అభియోగం మోపిన పోలీసులు వాటిని ధ్రువీకరించే పత్రాలనూ, సాక్ష్యాలనూ ఎఫ్ ఐ ఆర్ లో జతచేయలేదని న్యాయస్థానం గుర్తించింది. వివిధ వర్గాల మధ్య ద్వేషం పెంచడానికి ప్రయత్నం జరిగిందని నిరూపించే ఆధారాలు ఏవీ పోలీసులు సేకరించలేకపోయారనీ, అసలు వివిధ వర్గాల గురించిన ప్రస్తావనే లేదనీ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
అధికార దుర్వినియోగం
అందుకని ఐపీసీ 505 సెక్షన్ కింద నేరం జరిగినట్టు పోలీసులు నిరూపించలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది. ‘సీఐడీ ప్రభుత్వం చేతికింద పని చేస్తున్నది కనుక న్యాయవిధివిధానాలను దుర్వినియోగం చేసి పిటిషనర్ నేరం చేసినట్టు కల్పించి కేసు పెట్టారు’ అని న్యాయమూర్తి అన్నారు. ఐపీసీ 506 కింద నేరం జరిగిన దాఖలా కానీ ప్రజలకు ఆందోళన కలిగించే ప్రయత్నం జరిగినట్టు ఆధారాలు కానీ లేవని కూడా కోర్టు నిర్ధారించింది. ఇది మరోసారి అధికార దుర్వినియోగం చేయడం తప్ప వేరేమీ కాదని న్యాయమూర్తి అభివర్ణించారు.
ఐపీసీ 188 (ప్రభుత్వాధికారి ఆదేశాన్ని అమలు చేయకపోవడం అనే నేరం)కింద చేసిన ఆరోపణను నిరూపించే ఆధారాలు కూడా ఏమీ లేవని చెబుతూ, ప్రభుత్వ అధికారి జారీ చేసిన ఆర్డినెన్స్ ఏదీ లేదనీ, కనుక దానికి ధిక్కరించే సమస్య ఉత్పన్నం కాదనీ కోర్టు అభిప్రాయపడింది. సీఆర్పీసీ సెక్టన్ 195 (1)(ఎ)(ఐ) ప్రకారం ప్రభుత్వోద్యోగి నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు దాఖలు చేయడం విధిగా చేయవలసిన పని అని కోర్టు గుర్తుచేసింది. ఫిర్యాదు లేకపోతే ఈ ఆరోపణను పరిశీలించడం అసాధ్యమనీ, అలా చేయడం వల్ల విచారణ గాడి తప్పుతుందనీ కోర్టు స్పష్టం చేసింది.
జర్నలిస్టుకు వ్యతిరేకంగా డీఎం చట్టం
మరో నేరారోపణ డీఎం చట్టం ప్రకారం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పరిస్థితిని ప్రమాదకరంగా చిత్రించి ప్రజలలో భయాందోళనలను కలిగించడం ఈ చట్టం కింద నేరం. ఈ నేరం చేసినవారిని ఒక సంవత్సరం వరకూ జైలులో పెట్టవచ్చు. జరిమానా విధించవచ్చు. ఇది నాన్ –కాగ్నిజబుల్ అఫెన్స్. అంటే ఫిర్యాదు లేకుండా పరిశీలించే విషయం కాదు. ఈ విషయాన్ని డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ లోని 60 వ సెక్షన్ స్పష్టం చేస్తున్నది. జాతీయ అధికార సంస్థ కానీ, రాష్ట్ర స్థాయి అధికార సంస్థ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా అధికారి కానీ, జిల్లా అధికార సంస్థ కానీ, ప్రభుత్వం నియమించిన మరే అధికారి కానీ ఫిర్యాదు చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆయా స్థాయిలలో అధికార సంస్థలకు కానీ, జిల్లా స్థాయి అధికారులకు కానీ, అధికార సంస్థలకు కానీ 30 రోజులు తక్కువ కాకుండా నోటీసు ఇచ్చి చేసిన ఫిర్యాదుకు పరిశీలనార్హత ఉంటుంది. అటువంటి ఫిర్యాదు ఏదీ ఇక్కడ లేదు. జర్నలిస్టు పైన డీఎం యాక్ట్ 54వ సెక్షన్ కింద కేసు పెట్టడం న్యాయవిధానాన్ని వక్రీకరించి, అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇది తీవ్రమైన అక్రమమని కూడా కోర్టు స్పష్టం చేసింది.
పోలీసు యంత్రాంగానికి కోర్టు అక్షింతలు
వివిధ సెక్షన్ల కింద చేసిన ఆరోపణలు ఒకటి తర్వాత ఒకటి వీగిపోవడంతో తప్పుడు కేసులు పెట్టి ప్రజలను వేధిస్తున్నందుకు పోలీసు యంత్రాంగాన్ని హైకోర్టు మందలించింది. పోలీసులు దర్యాప్తు పేరుతో ప్రజలను కష్టాలపాలు చేయడం వల్ల ప్రజలు ప్రజాస్వామ్యంలో నివసిస్తున్నప్పటికీ ‘కాకిస్ట్రోకసీ’లో నివసిస్తున్నట్టు అనిపిస్తుందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
న్యాయశాస్త్రం గురించి కనీసమైన అవగాహనలేనివారు తయారు చేసిన ఈ ఎఫ్ ఐ ఆర్ కోర్టును ఆశ్చర్యపరచింది. పోలీసు శాఖను నియంత్రించవలసిన అధికారికి శాఖపైన పట్టు ఏమాత్రం లేనట్టు తెలుస్తున్నదంటూ వ్యాఖ్యానించింది.
సమాజానికీ, పోలీసులకూ మధ్య ఉన్న సంబంధాల గురించి అందరికీ తెలుసు. దీనివల్ల దర్యాప్త సమయంలో సమస్యలు తలెత్తుతాయి. సమాజంలోని అన్ని కష్టాలనూ పోలీసులే పరిష్కరించాలని పోలీసులు అనుకుంటారు. మనిషి ప్రాణాలు కాపాడటం, స్వేచ్ఛను పరిరక్షించడం, ఆస్తులను కాపాడటం, లా అండ్ ఆర్డర్ ను పర్యవేక్షించడం పోలీసుల కనీస కర్తవ్యమంటూ ఉన్నత న్యాయస్థానం పోలీసులకు ఉద్బోధించింది.
పోలీసులు అంటే భయం
పెరుగుతున్న నేరాలూ, ప్రజల జీవనంపైన పెరుగుతున్న ఒత్తిళ్ళూ, పెరుగుతున్న జనాభా, కార్మిక వివాదాలూ, విద్యార్థుల సమస్యలూ, తీవ్రవాదుల పిలుపుపైన జరిగే రాజకీయ కార్యకలాపాలూ, సామాజిక, ఆర్థిక పరమైన చట్టాలను అమలుచేయడం, తదితర బాధ్యతల కారణంగా దేశంలో పోలీసు వ్యవస్థపైన భారం పెరిగింది. ప్రజల సహకారం లేకపోతే పోలీసులు తమ పనులను తాము సమర్థంగా చేయలేరని హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది.
‘నేరం చేసేవారి కంటే చట్టానికి లోబడి జీవించే ప్రజలు పోలీసులంటే భయపడతారనే విషయం విదితమే. నేరం చేసేవారు హింసకు పాల్పడతారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు పరపతిని వినియోగిస్తారు. బెదిరిస్తారు. సాధారణ పౌరులు సమాజంతో సంబంధాలు పెట్టుకోరు. న్యాయస్థానాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటారు. వారికి కష్టం కలిగినా, నష్టం కలిగినా మౌనంగా ఉంటారు కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళి వారి చర్యలు కోరుతూ ఫిర్యాదు చేసే సాహసం చేయరనే విషయం అందరికీ తెలిసిందే‘ అని హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది.
ప్రజలను రక్షించడమే పోలీసుల కర్తవ్యమనీ, దర్యాప్తు జరిపే సమయంలో నిజాయితీగా, సమర్థంగా వ్యవహరించాలనీ, లేకపోతే అమాయకులు దోషులుగా శిక్షకు గురి అవుతారనీ, నేరగాళ్ళు తప్పించుకుంటారనీ చెబుతూ, దర్యాప్తు సందర్భంగా కృతకమైన సాక్ష్యాధారాలను సృష్టించే ప్రయత్నం చేయవద్దంటూ హెచ్చరించింది. న్యాయసూత్రాలను దుర్వినియోగం చేసి క్రిమినల్ కేసు పెట్టడం వల్ల పిటిషనర్ జీవితానికీ, స్వేచ్ఛకూ ప్రమాదం ఏర్పడటమే కాకుండా రాజ్యాంగం అధికరణలు 19, 21లను ఉల్లంఘించినట్టు అవుతుందనీ, అతని వ్యాపారం కూడా దెబ్బతింటుందనీ ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. 226వ అధికరణ ప్రసాదించిన అధికారంతో ఈ కేసును కొట్టివేయవచ్చుననీ, ఈ అధికరణ సీఆర్పీసీలోని 482వ సెక్షన్ వంటిదేననీ కోర్టు తెలిపింది. ఇటువంటి అధికారుల చర్యలను నియంత్రించకపోతే పౌరుల భద్రతకూ, స్వేచ్ఛకూ, గౌరవ ప్రతిష్ఠలకూ భంగం వాటిల్లుతుందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.
టీవీ5 యాంకర్ పైన ఆంధ్రప్రదేశ్ పోలీసు సీఐడీ విభాగం పెట్టిన మరో కేసులో విశ్వవిద్యాలయాల ఎగ్జిక్యుటీవ్ కౌన్సిళ్ళకు నియామకాలకు సంబంధించిన పత్రాలు యాంకర్ దగ్గర ఉన్నాయంటూ ఆరోపించింది. ఆ పత్రాలను సచివాలయంలో ఈ-ఫైల్ నుంచి తస్కరించారని ఆరోపణ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని సెక్షన్ 66బి కిందా, ఐపీసీ 380, 468, 469, 120బి కిందా యాంకర్ పైన క్రిమినల్ కేసు పెట్టారు. యాంకర్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు 4 జూన్ 2020ను ఉత్తర్వులు జారీ చేసింది. విశ్వవిద్యాలయాల ఎగ్జిక్యుటీవ్ కమిటీలలో సభ్యులను నియమించడంపైన టీవీ చానల్ ఒక చర్చాగోష్ఠిని ప్రసారం చేసిందని కోర్టు గమనించింది. న్యూస్ చానల్ చౌర్యానికి పాల్పడిందని ప్రాసిక్యూషన్ చెబుతున్నప్పటికీ ఆ మేరకు ఆరోపణ ఏదీ లేదు. ‘నిందితుడు’ మాత్రం నిత్యం విధిగా పోలీసు స్టేషన్ లో హాజరు కావాలి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విధానాలను తమ చానల్ విమర్శిస్తుంది కనుక తమను వేదిస్తున్నారంటూ చానల్ యాజమాన్యం చెబుతోంది.
మీడియా నిర్వహకుల వ్యక్తిగత స్వేచ్చనూ, వాక్ స్వాతంత్ర్యాన్నీ అధికార దుర్వినియోగం నుంచి పరిరక్షించేందుకు న్యాయస్థానాలు మాత్రమే దిక్కు అన్న వాస్తవాన్ని ఈ రెండు ఘటనలూ నిరూపిస్తున్నాయి.
మీడియా ప్రచురణ, ప్రసారాల నిలిపివేత అవసరమా?
ఏపీ ప్రభుత్వానికి చెందిన అవినీతినిరోధకసంస్థ (యాంటీ కరప్షన్ బ్యూరో-ఏసీబీ) 15 సెప్టెంబర్ 2020న ఏపీ హైకోర్టులో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ప్రాథమిక సమాచార నివేదిక – ఎఫ్ ఐఆర్)ను దాఖలు చేసింది. ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాన్ని వినియోగించుకొని కొందరు ప్రముఖులు అక్రమంగా భూములను కొనుగోలు చేశారనే ఆరోపణలు ఎఫ్ ఐఆర్ లో ఉన్నాయి. ఆ రోజు సాయంత్రం పొద్దుపోయిన తర్వాత హైకోర్టు ఒక తాత్కాలిక ఉత్తర్వును జారీ చేసింది. రిట్ పిటిషన్ నంబర్ 16486పై విచారణ జరిపి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఎఫ్ ఐఆర్ లో చేసిన ఆరోపణలపైన ప్రభుత్వం దర్యాప్తును తర్వాత హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చేవరకూ నిలిపివేయాలి.
హైకోర్టు ఉత్తుర్వుల ప్రకారం ఏసీబీ 15 సెప్టెంబర్ 2020న దాఖలు చేసిన ఎఫ్ ఐఆర్ (No. 08/RCO-ACB-GNT/2020 of ACP, Guntur) లోని అంశాలను పత్రికలు ప్రచురించకూడదు. టీవీ చానళ్ళు ప్రసారం చేయకూడదు. సోషల్ మీడియా ప్రచారం చేయరాదు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నూ, ఇతర సంస్థలనూ ఎఫ్ఐఆర్ లోని అంశాలు ప్రచారం చేయకుండా నిలువరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు ఈ ఉత్తర్వులను కేంద్ర సమాచార మంత్రిత్వశాఖకు పంపింది.
ఇది ఆశ్చర్యకరం. ఎఫ్ ఐఆర్ దాఖలు కావడం, పిటిషన్ దాఖలు కావడం, విచారణ పూర్తి చేసి తాత్కాలిక ఉత్తర్వులను జారీ చేయడం అంతా జెట్ వేగంతో కొద్ది గంటల వ్యవధిలో జరిగిపోయింది. సాయంత్రం పిటిషన్ దాఖలు చేయడానికి ముందే ఎఫ్ ఐఆర్ లోని అంశాలు ప్రచురించిన డిజిటల్ మీడియా సంస్థలు వాటిని వెబ్ సైట్లనుంచి తొలగించవలసి వచ్చింది. ఎఫ్ ఐఆర్ లోని అంశాల ప్రచురణ, ప్రసారం, ప్రచారం నిలిపివేయడాన్ని చాలామంది విమర్శించారు. ఇది అజమంజసమైన ఉత్తర్వు అని అభివర్ణించారు. ఉన్నత స్థాయిలలో ఉన్న వ్యక్తులపైన క్రిమినల్ ఆరోపణలు చేసిన ఎఫ్ ఐఆర్ ను వెలుగు చూడకుండా నిరోధించడం, ఆ ఆరోపణలపైన దర్యాప్తును సైతం నిలిపివేయడం తీవ్రమైన విమర్శలకు గురైనది.
అనేక కోర్టు తీర్పులలో ఎఫ్ ఐఆర్ ను బహిరంగ పత్రంగా పరిగణిస్తూ దానిని ప్రజల దృష్టికి 24 గంటలలోగా తీసుకురావాలనీ, సమాచార హక్కు కింద ఎవరు అడిగినా వారికి అందుబాటులో ఉంచాలనీ స్పష్టం చేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి ఎఫ్ఐఆర్ పైన రిపోర్టు చేయరాదనీ, దానిపైన వ్యాఖ్యానించరాదనీ ఆంక్షలు విధించడం విశేషం.
ఎఫ్ఐఆర్ లోని అంశాలను ప్రచురించరాదనీ, ప్రసారం చేయరాదనీ మీడియాపైన ఆంక్షలు విధించడం ద్వారా హైకోర్టు ప్రజల సమాచారహక్కును కూడా భంగపరిచింది. ఆ ఆరోపణల గురించి ఆలోచించే స్వేచ్ఛ కూడా లేకుండా చేసింది. మరుసటి రోజు విచారణ కొనసాగించి ఈ ఉత్తర్వులు సమర్థనీయమైనవా, కావా అనే అంశంపైన వాదోపవాదాలు వింటే, ఒక రాత్రికి మాత్రమే నిషేధం విధించినట్లయితే అర్థం చేసుకోవచ్చు. కానీ మరుసటి రోజు విచారణ లేదు. మళ్ళీ ఉన్నత న్యాయస్థానం ఆదేశించేవరకూ నిషేధం అమలులో ఉంటుంది.
నిజానికి వివాదాస్పదమైన ఎఫ్ఐఆర్ ఉన్నత న్యాయస్థానం నిషేధించే వరకూ ఒక పూటంతా ప్రజలకు అందుబాటులో ఉంది. సోషల్ మీడియా వాయువేగంతో పయనిస్తున్న ఈ రోజులలో ఈ సమాచారం క్షణాలలో లక్షలాదిమందికి చేరుతుంది. హైకోర్టు ఉత్తర్వులు వాట్సప్ లో ఎఫ్ ఐఆర్ ని ఫార్వర్డ్ చేయడానికి అడ్డురావు. చాలా చిన్న, అజ్ఞాత గ్రూపులకు ఆ సమాచారం చేరి ఉంటుంది. ఈ సమాచారం తెలిసినవారంతా ఎఫ్ ఐఆర్ లో పేర్కొన్న పెద్దమనుషుల పరువు నిలబడుతుందని భావించకపోవచ్చు. నిషేధం వల్ల నిజానికి వారి పరువుకు నష్టం వాటిల్లి ఉండవచ్చు.
ఒక సారి ఎప్ ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత దానిలో చేసిన ఆరోపణలపైన విచారణను ఎవ్వరూ కొన్ని గంటల వ్యవధిలో నిలువరించజాలరు.
సుప్రీంకోర్టు నిగ్రహం
మీడియాను నియంత్రించాలంటూ తనపైన ఒత్తిడి వచ్చిన అనేక సందర్భాలలో సుప్రీంకోర్టు నిగ్రహం ప్రదర్శించింది. సుదర్శన్ టీవీలో యూపీఎస్ సీ జిహాద్ పేరతో బిందాస్ బోల్ ఎపిసోడ్ లను ప్రసారం చేయకుండా నిలువరించాలని ఎంత ఒత్తిడి తెచ్చినా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. చివరికి 16 సెప్టెంబర్ 2020న ఆ హిందీ టెలివిజన్ చానల్ ఇకమీదట ఎపిసోడ్ లు ప్రసారం చేయకుండా నిలువరించవలసిన అవసరం ఉన్నదని గట్టిగా భావించింది. ముస్లింలు యూపీఎస్ సిలో చొరబడటానికి కుట్ర చేస్తున్నారని తమ పరిశోధనలో వెల్లడైనదని సుదర్శన్ చానెల్ చెప్పుకున్నది. దీనివల్ల మతభేదాలు తలెత్తే ప్రమాదం ఉన్నదని సుప్రీంకోర్టు భావించింది.
తబ్లిఘీ కేసులో నిషేధం లేదు
తబ్లిఘీ జమాతేకు సంబంధించి నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన సంఘటనపైన వార్తలూ, వ్యాఖ్యలూ ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా తాత్కాలికంగా కానీ, శాశ్వతంగా కానీ మీడియాపైన నిషేధం విధించాలన్న మనవిని ప్రధాన న్యాయమూర్తి ఎస్. ఏ. బాబ్డే నాయకత్వంలోని బెంచ్ తోసిపుచ్చింది. (https://www.deccanherald.com/national/wont-gag-media-sc-on-plea-against-reporting-after-nizamuddin-markaz-incident-824855.htm)
కోర్టుల విశేషాధికారాలు
మీడియాను నియంత్రించడానికి రాజ్యాంగం సుప్రీంకోర్టుకూ, హైకోర్టులకూ అధికారం ఇచ్చింది. హైకోర్టులకు అదనంగా సివిల్ ప్రొసీజర్ కోడ్ లోని 151 వ సెక్షన్ కింద కూడా న్యాయనిర్వహణకోసం అవసరం అనుకుంటే మీడియాపైన ఆంక్షలు విధించవచ్చు. హేతుబద్దమైన పరిమితులు విధించిన తర్వాత ఆ పరిమితులను ఎందుకు విధించవలసి వచ్చిందో వివరించవలసిన బాధ్యత ఉన్నత న్యాయస్థానంపైన విధిగా ఉంటుంది. అసాధారణమైన పరిస్థితులలోనే రిపోర్టింగ్ పైనా, ప్రసారాలపైనా, ప్రచురణలపైనా నిషేధం విధించాలని న్యాయస్థానాలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి.
కోవిద్19 సంక్షోభంలో వలస కార్మికుల వెతలపైన దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సందర్భంలో అవాస్తవాలతో కల్పించిన తప్పుడు వార్తలనూ, ప్రజలలో భయభ్రాంతులు కలిగించే వార్తలను పత్రికలు ప్రచురించకుండా, టీవీ చానళ్ళు ప్రసారం చేయకుండా, సోషల్ మీడియా ప్రచారం చేసి సమాజంలో అభద్రతాభావాన్ని కలిగించకుండా నిలుపుచేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. సుప్రీంకోర్టు అందుకు అంగీకరించలేదు. (https://www.thehindubusinessline.com/opinion/quick-take/deplorable-attempt-to-gag-the-media/article31244760.ece)
దర్యాప్తులను కూడా కోర్టులు నిలువరించగలవా?
న్యాయపాలనలో అవసరమైతే ఎటువంటి ఉత్తర్వులను అయినా జారీ చేయవచ్చునంటూ హైకోర్టులకు రాజ్యాంగం విస్తృతమైన అధికారాలను 226వ అధికరణ ద్వారా ఇచ్చింది. అంతే కాకుండా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ లోని 482 సెక్షన్ కింద, సివిల్ ప్రొసీజర్ కోడ్ లోని 151వ సెక్షన్ కిందా హైకోర్టు పరిధిలో న్యాయనిర్వహణ విధానాలను దుర్వినియోగం చేయకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకునే అధికారం హైకోర్టులకు ఉంది. అందుకే మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రినివాస్ తన పిటిషన్ ను సివిల్ ప్రొసీజర్ కోడ్ 151 వ సెక్షన్ కింద దాఖలు చేశారు.
న్యాయనిర్వహణలో అత్యవసరమని భావిస్తే దర్యాప్తును హైకోర్టుల నిలువరించవచ్చునంటూ సుప్రీంకోర్టు చెప్పింది. ఇంతియాజ్ అహ్మద్ వర్సెస్ యూపీ అండ్ అదర్స్ కేసుపైన 2012లో విచారణ జరిగినప్పుడు అనేక పిటిషన్లు చాలా హైకోర్టులలో పడినాయి. కేసులు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నప్పటికీ ఆరోపణలపైన దర్యాప్తును నిలిపివేశారు. న్యాయం జరగడానికి దోహదం చేసే విధంగా, న్యాయనిర్వహణ విధానాలను దురుపయోగం చేయకుండా నివారంచేందుకూ దర్యాప్తును నిలువరించడం అనేది చాలా అరుదుగా జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ప్రముఖ జర్నలిస్టు వినోద్ దువాను ఇటీవల ధిల్లీ హైకోర్టు ఆదుకున్నది. ఆయనపైన రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తప్పుడు కేసులు పెట్టి వేధించారు. ఈ విషయం ధిల్లీ హైకోర్టు దృష్టికి తెచ్చినప్పుడు న్యాయస్థానం వినోద్ దువాపైన దర్యాప్తును నిలుపుచేసింది. 2012లో ఇంతియాజ్ అహ్మద్ వర్సెస్ యూపీ అండ్ అదర్స్ కేసులో (https://indiankanoon.org/doc/50352079) మూడు మార్గదర్శకాలను సూచించారు. 1. ఇటువంటి అసాధారణమైన అధికారాలని బహుజాగ్రత్తగా, సంపూర్ణమైన అవగాహనతో వినియోగించాలి. 2. ఒక సారి అసాధారణ అధికారాలను వినియోగించిన తర్వాత అసలు కేసుపైనుంచి హైకోర్టు దృష్టి మరలకూడదు. విచారణ నిర్వఘ్నంగా కొనసాగాలి. 3. దర్యాప్తుపైన స్టే విధించిన తర్వాత ఆరు మాసాలలోగా విచారణ పూర్తి చేయాలి.
రియాచక్రవర్తిని మీడియా ట్రయల్ కు గురి చేస్తూ టీవీ చానళ్ళు బాధ్యతారహితంగా వార్తలూ, వ్యాఖ్యలూ ప్రసారం చేయడాన్ని కొంతకాలంపాటు నిలిపివేయాలని బాంబే హైకోర్టును కోరుతూ కొందరు మాజీ ఐపీఎస్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. నిగ్రహం పాటించాలంటూ టీవీ చానళ్ళకు బాంబేహైకోర్టు సలహా ఇచ్చింది. నిషేధం మాత్రం విధించలేదు.
రిపబ్లికన్ టీవీనీ, దాని ప్రధాన సంపాదకుడు అర్ణబ్ గోస్వామినీ సునందా పుష్కర్ మరణానికి సంబంధించిన రిపోర్టుల ప్రసారం విషయంలో నిగ్రహం ప్రదర్శించాలని ధిల్లీ హైకోర్టు 10 సెప్టెంబర్ 2020న ఆదేశించింది. కోర్టులో ఇచ్చిన హామీని గుర్తుపెట్టుకొని వ్యవహరించాలని కూడా అర్ణబ్ కు కోర్టు గుర్తుచేసింది. అంతేకానీ చానల్ గొంతునొక్కలేదు.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ప్రచురిస్తున్న వరుస కథనాలను నిలుపుచేయాలంటూ రిలయెన్స్ యాజమాన్యం బాంబేహైకోర్టును 1988లో ఆశ్రయించింది. (రిలయన్స్ పెట్రోకెమికల్స్ వర్సెస్ ప్రొప్రైటర్స్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ న్యూస్ పేపర్స్, బాంబే). ఈ కేసును 23 సెప్టెంబర్ 1988న పరిష్కరించారు. (https://indiankanoon.org/doc/1351834). రిలయెన్స్ కంపెనీ స్టేక్ హోల్డర్లకి డిబెంచర్స్ పంపిణీ చేసేవరకూ వ్యాసపరంపరను నిలిపివేయాలంటూ ఒక ఇంజక్షన్ (ఉత్తర్వు) బాంబేహైకోర్టు జారీ చేసింది. ఎందుకంటే స్టేక్ హెల్డర్లకి డిబెంచర్లు ఇచ్చే అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నది. న్యాయపాలనకు తక్షణ అవరోధం కలిగితే తప్ప కోర్టులు పత్రికల ప్రచురణలను నిలిపివేయరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది.
తన సాక్ష్యాన్ని ప్రచురించినా, ప్రచారం చేసినా తన పరువుప్రతిష్ఠలకు భంగం కలగడమే కాకుండా తన వ్యాపారానికి నష్టం కలుగుతుందని సుప్రీంకోర్టులో ఒక సాక్షి అన్నాడు. ప్రచురణ జరగకుండా నిలిపివేయాలని కోర్టును అభ్యర్థించాడు. న్యాయనిర్వహణకు తీవ్రమైన ఆటంకం కలిగితే తప్ప బహిరంగంగా విచారించడాన్నీ, కోర్టు వార్తలను ప్రచురించడాన్నీ నిలుపుచేయలేదమని సుప్రీకోర్టు స్పష్టం చేసింది. (నరేష్ శ్రీధర్ మరాజ్కర్ వర్సెస్ స్టేట్ ఆప్ మహారాష్ట్ర https://indiankanoon.org/doc/1643138). ఈ కేసును 3 మార్చి 1966న పరిష్కరించారు.
సహారా రియల్ ఎస్టేట్ లిమిటెడ్ వర్సెస్ సెబీ కేసు విచారణ జరుగుతున్న సమయంలో రాజీ సూత్రంలోని ఒక అంశాన్ని ఒక టీవీ చానల్ ప్రసారం చేసింది. ఈ ప్రసారం వల్ల తమ ప్రయోజనాలు దెబ్బతిన్నాయనీ, అటువంటి ప్రసారాలను నిలిపివేయవలసిందిగా చానల్ ను ఆదేశించాలని ఒక కక్షిదారు కోర్టును కోరారు. న్యాయబద్ధమైన విచారణకు విఘాతం కలుగుతుందని భావించినప్పుడే ప్రచురణను కానీ ప్రసారాన్ని కానీ వాయిదా వేయవలసిందిగా ఆదేశిస్తామంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. (సహారా ఇండియా రియల్ ఎస్టేట్ లిమిటెడ్ వర్సెస్ సెబీ ఆఫ్ ఇండియా. https://indiankanoon.org/doc/15887669). ఈ కేసును 11 సెప్టెంబర్ 2012న పరిష్కరించారు.
స్వేచ్చ అంటే అసలైన అర్థం ముందరికాళ్ళకు బంధం వేసే నియంత్రణ లేకపోవడం. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో సాధారణంగా ఇదే అభిప్రాయం వెలిబుచ్చింది. వాక్ స్వాతంత్ర్యం అపరిమితమైనది కాదు. నియంత్రణను నిషేధించడం కూడా అపరిమితమైన అధికారం కాదని పైన పేర్కొన్న ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే ప్రచురణను వాయిదా వేయాలనే ఆదేశాలను కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే జారీ చేస్తారు. అదే విధంగా ప్రచురణనూ, ప్రసారాలనూ నియంత్రించే అధికారం కూడా అపరిమితమైనది కాదు. కొన్ని హద్దులకు లోబడే ఇది జరగాలి.
నిందితుల విభజన
ఇటువంటి తీవ్రమైన ఆరోపణలపైన దర్యాప్తు చేయకుండా, వాటిపైన వార్తల ప్రచురణనూ, ప్రసారాలనూ అనుమతించకుండా నియంత్రించడం వల్ల ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న వ్యక్తులను రెండు వర్గాలుగా విభజించినట్టు అవుతుంది. ఒకటి, ఉన్నతస్థాయిలో ఉన్న పెద్దమనుషులు. వారు నేరం చేసినట్టు ప్రజలకు తెలిసినా వారి నేరాలపైన దర్యాప్తు ఉండదు. వారి వార్తల ప్రచురణ, ప్రసారం అనుమతించరు. రెండు, సమాజంలోని సాధారణ పౌరులు. గొలుసు లాగడం వంటి చిన్న నేరాలు చేసినవారి పేర్లూ, చిన్నచిన్న దొంగతనాలు చేసినవారి పేర్లూ ఎఫ్ఐఆర్ లో పేర్కొంటారు. పత్రికలూ, టీవీ చానళ్ళూ, సోషల్ మీడియా స్వేచ్ఛగా ప్రచారం చేస్తాయి.
ఇది సమంజసమా?
రాజకీయ కక్షసాధింపుకోసమే ఈ కేసు తనపైన రుద్దారంటూ మాజీ అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఇటువంటి ఉత్తర్వుకు సమంజసమైన, బలమైన ప్రాతిపదిక ఏదీ లేదు. సత్యాసత్య విచికిత్సకు పోకుండా ఎఫ్ఐఆర్ లోని అంశాలను వార్తలాగా ప్రచురించడానికీ, ప్రసారం చేయడానికీ మీడియాకు స్వేచ్ఛ లేకుండా ఎందుకు చేయాలి? గత ప్రభుత్వంలో పెద్ద పదవిలో ఉన్నారు కనుక వారి భూమి లావాదేవీల వ్యవహారం తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా?
అటువంటి ఫిర్యాదుపైన విచారణ జరగాలి. ఎఫ్ఐఆర్ ని బహిరంగ పత్రంగా పరిగణించవలసింది. మీడియాలో ప్రచురించవలసింది. ప్రసారం చేయవలసింది. ఇతరుల విషయంలో మామూలుగా జరిగిన విధంగానే ప్రముఖుల విషయంలో కూడా జరిగి ఉండవలసింది. అటువంటి చర్చ, పారదర్శకత వల్ల ఇదివరకు మోసపోయిన వ్యక్తులు బయటపడి తమకు జరిగిన అన్యాయాలను వెల్లడించడానికి సాహసిస్తారు. ఉత్సాహం ప్రదర్శిస్తారు. దర్యాప్తులో ఆరోపణలు నిరాధారమైనవని తేలితే నిందితులు పరిశుభ్రంగా బయటపడవచ్చు కదా? నిందితులు తమపైన దర్యాప్తును నిలుపుదల చేయాలంటూ కోర్టులను వేడుకోవడం మంచి పద్ధతి కాదు. దర్యాప్తు చేయడం అన్నది సుశిక్షితులైన పోలీసు అధికారులు చేయవలసిన పని.
ఎఫ్ ఐఆర్ బహిరంగపత్రం
ఎఫ్ఐఆర్ ని రిజిస్టర్ చేసిన తర్వాత 24 గంటలలోగా ఆన్ లైన్ లో అపలోడ్ చేయాలని దిల్లీ హైకోర్టు 6 డిసెంబర్ 2010న ప్రకటించింది. ఎఫ్ ఐఆర్ లో దర్యాప్తును ప్రభావితం చేసే అంశాలు లేనిపక్షంలో సమాచార హక్కు చట్టం కింద అడిగినవారికి ఒక కాపీని తప్పకుండా ఇవ్వవలసి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. బాల్టా ఘటనకు సంబంధించిన ఎఫ్ ఐఆర్ ను ఇవ్వాలంటూ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) ఆదేశించడాన్ని సవాలు చేస్తూ దిల్లీ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు హైకోర్టు పై విధంగా తీర్పు చెప్పింది. (http://legalperspectives.blogspot.come/2010/01/copy-of-fir-can-be-obtained-under-rti.html) ఈ కేసును 7 జనవరి 2010నాడు పరిష్కరించారు. శ్యామ్ లాల్ వర్సెస్ స్టేట్ ఆప్ యూపీ అండ్ అదర్స్ కేసులో అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఎఫ్ ఐఆర్ బహిరంగపత్రం అంటూ తీర్పు ఇచ్చింది. మహమ్మద్ ఇజ్రాత్ వర్సెస్ టి.ఎస్. హనీఫా కేసులో మద్రాసు హైకోర్టు ఎఫ్ఐఆర్ ను పత్రికలు ప్రచురించవచ్చునని 14 జూన్ 2017న తీర్పు ఇచ్చింది. (http://indiankanoon.org/doc/39942524)