వ్యంగ్యరచన
ఒక్కొక్క అబద్ధం ఒక్కో రూపం తీసుకుంటుంది. కలలోనా, ఇలలోనా తెలవదు. కానీ అతను బోనెక్కి కూర్చున్నాడు.‘పాపం పుణ్యం ప్రపంచ మార్గం’ అన్నాడు శ్రీశ్రీ. ‘‘నేను ఏ పాపం చెయ్యలేదు. రాజ్యం కోసం యుద్ధం చేసి మనుషుల్ని చంపలేదు. అలా చంపి మహారాజులై రాజ్యాలేలిన వాళ్ళకి లేని శిక్ష నాకెందుకు విధిస్తున్నారు’’ అని గోలపెట్టాడు. ‘‘రాజు నేరం చెయ్యడు’’ అన్నది రాజరికం నానుడి. చట్టం చేసేవాడు నేరస్తువడానికి వీల్లేదు, అయినా యుద్ధంలో మనుషుల్ని చంపడం నేరం కాదు. దేన్నే ‘ఇన్ స్టెంట్ జస్టిస్’ అంటారు. నీ ఏలికలో కూడా ప్రతిఘటన పేరిట పోలీసులు చేసిన నేరాలకీ ఆ పోలీసుల్నీ, నిన్నూ శిక్షించడం లేదు. సమస్య అది కాదు. అమాయకులకీ, అలగాజనానికీ అరచేతిలో స్వర్గం చూపించావు. ప్రతిపక్షాన్ని ఓడిస్తే మన రాజ్యం వస్తుందన్నావు. శ్రీరాముడ్ని సింహాసనం ఎక్కించినట్లుగా, పేదవాళ్ళనీ, నిర్భాగ్యుల్నీ అందలం ఎక్కించి, వాళ్ళ పాదాల దగ్గర పడి ఉండి, ఆంజనేయుడిలా సేవించుకుంటానన్నావు.’’ తీరా నిన్ను నమ్మి ఓట్లేసిన తరువాత సింహాసనం ఎక్కి కూర్చున్నావు. ఏమయ్యాయి! ఎన్నికల్నాటి నీ ప్రమాణాలంటే, మావోయిజం అంటువ్యాధిలా సోకి పోయిందనీ, పేదల్తో జేరి ప్రతిపక్షం కుట్రపన్నుతోందనీ, పేరు నాదైతేనేంటి ప్రతిష్ట మన రాష్ట్రానిదీ, దేశాన్దీ. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ అడుగుజాడల్లో నడుస్తున్నాడు. మహాకవి మాట కాదంటే దేశం మట్టికొట్టుకు పోతుందని దబాయిస్తున్నాడు. మనుషులంతా ఎవరికి వాళ్ళు అద్దాల్లో తమ మొహాలు చూసుకొని , బ్రతుకు జీవుడానని హమ్మయ్య అని కడుపులో తలపెట్టుకొని పడుకుంటున్నారు. తన మీద ప్రశ్నల్ని సంధిస్తున్న వాళ్ళెవరూ తన కంటికి కానడం లేదు. అసెంబ్లీలోనూ, పార్లమెంటులోనూ ప్రతిపక్షం వాళ్ళ గోలలా కాకుండా ధర్నాచౌక్ దగ్గర తను కుర్చీ వేసుక్కూర్చున్నట్టుగా ఉంది.
Also read: నీలాకాశాన్ని కొలిచే కొలబద్ద
తను ఇంతకాలం ఎవర్నీ నోరెత్తకుండా ఇదేమిటన్నవాళ్లమీద అరిచి, ఎక్కడ కరిచేస్తాడోనని భయపెట్టి బ్రతికేశాడు. ఇప్పుడుతనిలో ఉన్న కుక్క బయటికొచ్చి తనని చూసే మొరుగుతోంది.
దాని పొట్ట డొక్కలోకి ఈడ్చుకుపోయింది. ఆకలితో, దాహంతో నాలుక బయటపెట్టి, కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో తనని పీక్కుతింటే తప్ప ఒదిలేట్టు లేదు.
నిన్ను గానీ ఏపామైనా కాటేసిందా? కుక్కబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. పిచ్చికుక్కని నా సెక్యూరిటీవాళ్ళు కాల్చేస్తారు. ఏ కోర్టూ పట్టించుకోదు. ‘‘దిక్కులేని చావు చస్తావు’’ అని బెదిరించాడు.
Also read: కుక్కచావు
క్రూరంగా నవ్వింది. ‘‘చేస్తానన్న పనులు చెయ్యకుండా, చేసిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రశ్నించినవాళ్ళమీద అరిచి ఆధిక్యం ప్రదర్శించినప్పుడే అరిచే కుక్కగా నా అస్తిత్వం కోల్పోయాను. ఇప్పుడు నువు నన్ను కాల్చినా, నేను నిన్ను కర్చినా పెద్ద తేడా ఏమీ ఉండదు. నేను చచ్చినా కుక్క చావు చస్తాను. బ్రతికినా కుక్క బ్రతుకు బ్రతుకుతాను. నీకా అదృష్టం లేదు. నువు ఏ కులపోడిగానో కొందర్లో, ఏ జాతివాడివో కొందర్లో కుక్కవో, నక్కవో, పిల్లివో, హైనావో, దేశ సంపదని దేశానికి తెలవకుండా తినేసే పందికొక్కువో, గుర్రానివో, ఏనుగువో, ఎలుగుబంటినవొ, గాడిదవో ,సింహానివో, పులివో తేల్చుకోలేక ఇటు జనమూ, అటు జంతువులూ కొట్టుకు చస్తాయి. అదీ నీ ఆయుష్షు తీరకుండా ఉండటానికి కారణం,’’ అంటూ రెండడుగులు ముందుకు వేసింది.
‘‘ఆగు ఆగు. అక్కడే ఆగిపో. చూడు నువ్వు అరిచీ, గీ పెట్టినా మారాం చేసినా పట్టించుకేవాణ్ణి కాదు. అరుస్తే ఎంగిలి మెతుకులు కూడా విసరను. చూశావు కదా, ఆ మధ్యన స్ట్రైక్ చేసినవాళ్ళ డిమాండ్లేవీ నేను ఒప్పుకోలేదు. వెదవలు పని మానుకొని, తిండికి మాడి, రోడు పట్టినప్పుడు, చూస్తూ ఊరుకోలేక పనుల్లో జాయిన్ అవమని ఆర్డర్ వేశాను. కాదంటే మాడి చస్తారని బెదిరించాను. భయానికో, భయంతో నా మాటలమీద విశ్వాసంతో తిరిగి అంతా పనుల్లో జేరారు. అప్పుడు నాకు వాళ్ళమీద కోసం తగ్గి జాలేసి వరాలవర్షం కురిపించాను. కానీ నేనైనా ఏం చెయ్యగలను పైన ఉన్న భగవంతుడు జాలితల్చందే. అలాగే భగవంతుడు దయతో నీక్కూడా కుక్క బ్రతుకు లేకుండా చేస్తాను. అప్పటి వరకూ నే వేసిన బిస్కట్టు తిని, నాలాగే పడి ఉండు. నా అరుపుల్లో నిన్ను నీవు చూసుకొని బ్రతికున్నందకు సంతోషించు’’ అన్నాడు.
Also read: గీతోపదేశం
కుక్క అతనిలో లీనమైపోయింది.
ఇంతలో అతనిలోంచి హైనా బయటికొచ్చింది. ‘‘బక్కగా ఉన్నావు. ఎముకల గూళ్ళా ఉన్నావు డొక్కలీడ్చుకుపోయి నాలానే. నక్కవో, కుక్కవో, తోడేలువో తెలవనట్టుగా ఉన్నావు. అధికారం వెంటపడ్డ నువ్వు, నిన్ను నమ్ముకున్న జనాన్నీ నీ అధికారానికి బలి చేశావు. నిన్ను వదిలితే నా ఉనిక్కే ప్రమాదం’’ అంటూ అతనిమీద పడబోయింది హైనా.
‘‘ఆగాగు. అక్కడే ఆగు. నక్కనైనా, కుక్కనైనా, తోడేళ్ళైనా చివరాకరికి నువ్వు నమ్ముకొన్న పులినైనా నేనే. ఆ మాటకొస్తే నువు అనుకొంటున్న హైనానైనా నేనే. నన్ను కాదంటే, నన్ను లేకుండా చేశావంటే, నువు ఉనికిలోకి లేకుండా పోయినట్లే.
Also read: మృగరాజు
భయంలో హైనా అతనిలో లీనమైపోయింది.
ఒక్కో దుర్గుణమో, ఒక్కో సద్గుణమో ఈ భూమ్మీద ఉన్న జీవుల మనుగడకు కారణమవుతుంది. అన్ని జీవుల దుర్గుణాలు కలబోసుకున్న జీవి ఏదైనా ఉందంటే, అది రాజకీయనాయకులు. అందుచేత ఈ భూమ్మీద ఏ జీవైనా మనుగడ సాగించాలంటే రాజకీయ నాయకుల అవసరం ఉందని జీవులన్నీ గుర్తించాలి.
‘‘ఈ నేల నాది అంటే అధికారానిది,’’ అని అతను వికృతాకారం దాల్చాడు. ఏ జీవీ అతన్లో తనను తాను పోల్చుకోలేకపోయింది.
‘‘దటీజ్ పవర్.’’
‘‘ఐ ఆమ్ పవర్’’
పవర్ కి ఆకారం లేదు. వికారమే ఆకారం. ‘‘అయితే ఏంటి నాకంతా దాసులే’’ అనుకొని నిద్రలోకి జారుకొన్నాడు తను.
అయినా లోకమంతా సజావుగానే సాగిపోతోంది.
Also read: హెడ్డు ఎప్పుడు మారతాడు?