మధుపరవమ్ములేవి? మధుమాస పికీధ్వనులేవి పైదలీ?
శిథిలవనాంతరాళముల జీవనరాగము
లుండునే ప్రియా!
చిదిమిన పారిజాతములు, ఛిద్రసరోవర పద్మపత్రముల్,
చెదలును, వేరుపుర్వులును, చీమలబారులు, ముండ్లదారులున్,
విధురరసాలవాటికల వేదనతో సొమసిల్లు కోయిలల్,
మధువని మౌనదీక్షగొని మ్రాన్పడిపోయిన గంధవాహుడున్!
*
పొదల రహస్యకాముకుల మోహకలాపములేవి చెప్పుమా?
శిథిలవనమ్ము చోటిపుడు చీకటిరేయి భుజంగకోటికిన్!
*
వెదకుదు దేనికై రమణి! విన్నదనంబున వెఱ్ఱిచూపులన్?
సదమల పూర్ణిమానిశల, చారుముఖీ! మురళీరవమ్ముకై!
.
చెదరి వినీలకేశములు చెంపల జారగ చల్లగాలికిన్,
పెదవుల బేలగానొదిగి పిల్లనగ్రోవియు పారవశ్యతన్,
మదనశరీరసౌరభము, మంజులరూపము, మందహాసమున్,
ముదితలు శ్యామసుందరుని మోహవశమ్మగు తావిదే సఖీ!
.
మృదుపదలాస్యకేళి కుసుమించెడు సిగ్గులతో కృశాంగినుల్;
కదలికలో ప్రవాహగతి, కన్నెల మధ్య నిమీల నేత్రుడై,
సుధలొలికించు గాయకుని సుందరచేతనలో విలీనమై,
మధురఝళంఝళారవళి, మానవతీ! యమునాస్రవంతియున్!
.
పొదుగున క్షీరధారలటు పొంగు శశాంకుని పూర్ణరాత్రులన్,
మధువనమెల్ల మైమరచు మాధవు వేణుసుధారవమ్ములో!
శిథిలలతల్ చిగిర్చి నవజీవనశోభ గడించు కోమలీ!
సదయత, శాంతమున్, క్షమయు, సౌఖ్యము, మామక చిత్తవృత్తులన్!
*
చెదరెను హోరుగాలులకు క్షీణవనాంతర జీర్ణపత్రముల్
మధువనిలో మరొక్కపరి మాధురి పొంపిరి వోవదే చెలీ?
ముదమున గోపకాంతలము, మోహవతీ! నిదురించురేయి, నె
మ్మదిగ నిశాకరుండు నునుమబ్బుల కౌగిలి వీడురేయి, మా
మధురిమలెల్ల కొల్లగొని మాయము నొందెనెవండు? వెఱ్ఱిగా
వెదకుచునుంటి మెల్లెరము, వింటివె మోహన వేణుగానమున్?
నివర్తి మోహన్ కుమార్