- టీటీడీ ఈవో అధక్షతన కమిటీ భేటి
- భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోనున్న కమిటీ
తిరుమల శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన స్థలాలను ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించే అంశాన్ని పరిశీలించాలని టిటిడి ఆస్తుల పరిరక్షణ కమిటీ అధికారులకు సూచించింది. టిటిడి పరిపాలనా భవనంలో ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి అధ్యక్షతన గురువారం కమిటీ తొలి సమావేశం జరిగింది. శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తులు, భూములను శాశ్వతంగా విక్రయించరాదని, వినియోగంలో లేని భూములను ఏవిధంగా ఉపయోగంలోకి తీసుకురావాలనే విషయాలను పరిశీలించడానికి ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. ఈ మేరకు శృంగేరి శారదాపీఠం సిఈవో శ్రీ గౌరీశంకర్, కంచి మఠం ప్రతినిధి శ్రీ సీతారామమూర్తి, రిటైర్డ్ చీఫ్ జస్టిస్, మంత్రాలయం పీఠాధిపతి ప్రతినిధి శ్రీ శ్రీధర్‌రావు, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ వైద్యనాథన్ కృష్ణమూర్తి, శ్రీ గోవింద హరి, సీనియర్ జర్నలిస్టు శ్రీ కె.రామచంద్రమూర్తి, సామాజికవేత్త శ్రీ బయ్యా శ్రీనివాసులుతో టిటిడి కమిటీని ఏర్పాటు చేసింది.
1974 నుంచి 2014 దాకా దేశవ్యాప్తంగా టిటిడి విక్రయించిన ఆస్తులకు సంబంధించిన వివరాలు, ప్రస్తుతం ఉన్న ఆస్తుల స్థితికి సంబంధించిన వివరాలు, కోర్టు కేసులు ఇతర వివాదాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటీ సభ్యులకు వివరించారు. తక్కువ విస్తీర్ణం గల స్థలాల్లో గోశాలలు, గీతామందిరాలు, ఇతర ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు:
భక్తులు స్వామివారికి స్థలాలు, భూములు కానుకగా సమర్పించే సమయంలో అధికారులు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగ పడేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో డాక్టర్ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టిటిడి భూములకు సంబంధించిన లీజు పాలసీని పునఃపరిశీలన చేయాలన్నారు. త్వరలో కమిటీ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో జెఈవో, కమిటీ కన్వీనర్ శ్రీమతి సదా భార్గవి, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ మల్లిఖార్జున పాల్గొన్నారు.
ఇది చదవండి: తిరుపతిలో వేడెక్కుతున్న రాజకీయాలు