- టెస్టులీగ్ ఫైనల్స్ బెర్త్ కు భారత్ తహతహ
- మోతేరా పిచ్ దెబ్బతో బెంబేలెత్తిపోతున్న ఇంగ్లండ్
ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ క్లైయ్ మాక్స్ దశకు చేరింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలోని బయోబబుల్ వాతావరణంలో డే మ్యాచ్ గా జరిగే ఆఖరాటకు తెరలేవనుంది.సిరీస్ లోని మొదటి మూడుటెస్టుల్లో 2-1తో పైచేయి సాధించిన ఆతిథ్య భారత్..టెస్టులీగ్ ఫైనల్స్ చేరాలంటే ఈ ఆఖరిటెస్టును డ్రాగా ముగిస్తే సరిపోతుంది. ఒకవేళ ఇంగ్లండ్ సంచలన విజయం సాధించినా ఫైనల్స్ చేరే అవకాశం ఏమాత్రం లేదు.
స్పిన్నర్ల అడ్డా మోతేరా…
మోతేరాలోని నరేంద్ర మోడీ స్టేడియం సాంప్రదాయంగా స్పిన్ బౌలర్లకే ఎక్కువ అనుకూలంగా ఉంటూ వస్తోంది. 1983 నుంచి 2021 సిరీస్ వరకూ జరిగిన 12 టెస్టుల్లో స్పిన్నర్లే 60 శాతం వికెట్లు పడగొట్టగలిగారు.ఇదే స్టేడియం వేదికగా జరిగిన డే-నైట్ టెస్టు రెండురోజుల్లోనే ముగిసిపోడం, భారత స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొనలేక రెండురోజుల్లో రెండుసార్లు ఆలౌట్ కావడం ఇంగ్లండ్ టీమ్ మేనేజ్ మెంట్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.ఆఖరిటెస్టుకు సైతం స్పిన్ పిచ్ నే సిద్ధం చేస్తే..ఏం చేయాలో, ఎలా ఎదుర్కొనాలో తెలియక అయోమయంలో చిక్కుకొంది. తుదిజట్టులో పేసర్లకు బదులుగా స్పిన్నర్లకే చోటు కల్పించే అవకాశం ఉంది. ఆఫ్ స్పిన్నర్ బెస్, లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ లకు చోటు కల్పించినా ఆశ్చర్యం లేదు.
Also Read: అశ్విన్ ను ఊరిస్తున్న మరో రికార్డు
సిరాజ్ లేదా ఉమేశ్ యాదవ్…
మరోవైపు భారతజట్టు మాత్రం ఒకేఒక్క మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. జస్ ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరం కావడంతో ఆ స్థానాన్ని ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ లేదా పేసర్ మహ్మద్ సిరాజ్ లలో ఎవరో ఒకరితో భర్తీ చేసే అవకాశం ఉంది.అశ్విన్, అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్ లతో కూడిన భారత స్పిన్ దళం ముప్పేటదాడితో మరోసారి ఇంగ్లండ్ టాపార్డర్ ను ఉక్కిరిబిక్కిరి చేయాలన్న పట్టుదలతో ఉంది. బ్యాటింగ్ లో డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కొహ్లీ, నయావాల్ పూజారా మూడంకెల స్కోరుకు గురిపెట్టారు.సహజసిద్ధమైన వేసవికాలం ఎండవేడిమి వాతావరణంలో ఐదురోజులపాటు జరుగనున్న ఈమ్యాచ్ శీతలదేశం నుంచి వచ్చిన ఇంగ్లీష్ క్రికెటర్ల సహనానికి పరీక్షకానుంది.టాస్ నెగ్గిన జట్టు ఎప్పటిలానే బ్యాటింగ్ కు దిగటం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
విజయాల హ్యాట్రిక్ పైన కొహ్లీ కన్ను
టెస్టు క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్ రికార్డు ను అహ్మదాబాద్ డే-నైట్ టెస్టు గెలుపుతో ఇప్పటికే సొంతం చేసుకొన్న విరాట్ కొహ్లీ వరుసగా మూడో విజయానికి గురిపెట్టాడు.2011లో ధోనీ నాయకత్వంలోనే టెస్టు అరంగేట్రం చేసిన కొహ్లీ మహీ పేరుతో ఉన్న అత్యధిక టెస్టు విజయాల రికార్డును చెన్నై విజయం ద్వారా సమం చేయటమే కాదు అహ్మదాబాద్ తొలిటెస్టును రెండురోజుల్లోనే నెగ్గడం ద్వారా మొత్తం 22 విజయాలతో ధోనీ 21 విజయాల రికార్డును అధిగమించాడు.
Also Read: మొతేరాలో స్పిన్నర్లే విన్నర్లు
2014-15 సీజన్లో ధోనీ నుంచి భారత టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన విరాట్ కొహ్లీ ప్రస్తుత సిరీస్ లోని మూడోటెస్టు వరకూ 29 టెస్టుల్లో సారథ్యం వహించి 22 విజయాలు నమోదు చేశాడు. మరో ఐదు మ్యాచ్‌లను డ్రా కాగా, రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి ఎదురైంది. కాగా, ధోని సారథ్యంలో టీమిండియా భారత గడ్డపై 30 మ్యాచ్‌లు ఆడి 21 విజయాలు నమోదు చేసింది. మూడు పరాజయాలు, ఆరు డ్రాలు ధోనీ ఖాతాలో ఉన్నాయి.
పిచ్ పైన జోరుగా ఊహాగానాలు…
డే-నైట్ టెస్టు కోసం తయారు చేసిన పిచ్ తొలిరోజు తొలిగంట నుంచే స్పిన్ బౌలర్లకు అనుకూలించడం, రెండురోజుల్లో 30 వికెట్లు కూలటం, టాస్ఓడిన భారత్ 10 వికెట్ల తేడాతో మ్యాచ్ నెగ్గటం తీవ్రవిమర్శలకు దారితీసింది. అహ్మదాబాద్ పిచ్ ఐదురోజుల టెస్టుకు తగ్గట్టుగా లేదంటూ వివిధ దేశాలకు చెందిన పలువురు మాజీ క్రికెటర్లు అసంతృప్తివ్యక్తం చేశారు. దీంతో ఆఖరిటెస్టుకు ఎలాంటి పిచ్ ను సిద్ధం చేస్తారు అన్నఅంశమై క్రికెట్ వర్గాలలో ఊహాగానాలు జోరందుకొన్నాయి.భారత్ మరోసారి స్థానబలాన్ని ఉపయోగించుకొని తన బౌలింగ్ అవసరాలకు తగ్గట్టుగా వికెట్ తయారు చేస్తుందా? లేక విమర్శలకు భయపడి స్పోర్టివ్ పిచ్ ను తయారు చేస్తుందా? అన్నది ఎక్కడలేని ఉత్కంఠను కలిగిస్తోంది.
Also Read: భారత చీఫ్ కోచ్ కు కరోనా వాక్సిన్
దేశంలోని క్రికెట్ అభిమానులు మాత్రం మ్యాచ్ ఐదురోజులపాటుసాగే వికెట్ ను సిద్ధం చేయాలని కోరుకొంటున్నారు. భారత టీమ్ మేనేజ్ మెంట్ మాత్రం వ్రతం చెడినా ఫలితం దక్కాలన్న పట్టుదలతో ఉంది. డే మ్యాచ్ గా జరిగే ఈ టెస్టు గురువారం ఉదయం 9 గంటల 30 నిముషాలకు ప్రారంభమవుతుంది.