• రాజీనామా చేసిన నారాయణస్వామి
• దక్షిణాదిలో ఉన్న ఒకే ఒక్క ప్రభుత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్
పుదుచ్ఛేరి: పుదుచ్ఛేరిలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోయింది. మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేదీ ప్రతిపక్షాలతో కుమ్మక్కు అయ్యారనీ, బీజేపీ, ప్రతిపక్ష ఎన్.ఆర్. కాంగ్రెస్ లు అక్రమ, అవినీతి రాజకీయాలకు ఒడిగట్టాయనీ ముఖ్యమంత్రి వి. నారాయణస్వామి విమర్శించారు. ఆదివారంనాడు మరో ఇద్దరు ఎంఎల్ఏలు కాంగ్రెస్ నుంచి నిష్క్రమించడంతో కాంగ్రెస్ శాసనసభ పక్షం బలం 12కి తగ్గింది. మెజారిటీ ఉండాలంటే 14 మంది ఎంఎల్ఏలు ఉండాలి. మొత్తం 28 మంది సభ్యులు శాసనసభలో ఉన్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు తీసుకున్న గురువారంనాడే, సోమవారం బలం నిరూపించుకోవాలని ముఖ్యమంత్రిని ఆదేశించారు. గురువారంనాడే రాహుల్ గాంధీ పుదుచ్ఛేరి సందర్శించారు. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఇద్దరు శాసనసభ్యులు కాంగ్రెస్- డిఎంకె కూటమికి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ కు కె. లక్ష్మీనారాయణ, డిఎంకేకి వెంకటేశన్ రాజీనామా చేశారు. తనను మంత్రి చేయలేదనీ, కనీసం స్పీకర్ పదవి లేదా చీఫ్ విప్ పదవి కూడా ఇవ్వలేదనీ, పైగా బీజేపీ, ఎన్. ఆర్. కాంగ్రెస్ప పార్టీవారు తనను ఆహ్వానించారనీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.
Also Read: పుదుచ్ఛేరిలో పావులు కదుపుతున్న బీజేపీ
పుదుచ్ఛేరి అసెంబ్లీకి తమిళనాడు అసెంబ్లీతోపాటు మూడు మాసాలలోఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలో లేకుండా చేసేందుకు ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులను దువ్వి రాజీనామా చేయించడంలో బీజేపీ, ఎన్. ఆర్. కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఎన్.ఆర్. కాంగ్రెస్ నాయకత్వంలోని ఈ కూటమికి ఇప్పుడు 14 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఈ కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా తాత్కాలిక లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై అడగవచ్చు.
సోమవారం ఉదయం శాసనసభ ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ నామినేట్ అయిన ముగ్గురు బీజేపీ సభ్యులనూ ఓటింగ్ లో పాల్గొనకుండా ఆపుచేయాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ ముఖ్యమంత్రి విన్నపాన్ని ఖాతరు చేయలేదు. నామినేటెడ్ సభ్యులు కూడా ఓటింగ్ లో పాల్గొనవచ్చునంటూ సుప్రీంకోర్టు లోగడ తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు సభ్యులు రాజీనామా చేయడంతో సంక్షోభం ఏర్పడింది. ఓటింగ్ లేకుండానే నారాయణస్వామి తన రాజీనామాను సమర్పించారు. ‘ఆపరేషన్ కమలం’ నిర్వహించి తన ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టిందంటూ నారాయణస్వామి విమర్శించారు. మేలో జరగనున్న ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలో లేకపోవడం బీజేపీ కి లాభిస్తుందని ఆ పార్టీ అంచనా. ఈ రకంగా దక్షిణాదిలో ఉన్న ఒకే ఒక ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పోగొట్టుకున్నది. 2019లో బీజేపీ తమిళనాడులో ఒక్క లోక్ సభ స్థానం కూడా గెలుచుకోలేకపోయింది.