Saturday, December 28, 2024

కల్లోల సమయాల్లో..సాంత్వనగీతం-‘ఎబైడ్ విత్ మీ’

జాన్ సన్ చోరగుడి

ఏడాది మన రిపబ్లిక్ దినోత్సవాన్ని- 75 ఏళ్ల స్వాత్యంత్రాన్నిపురస్కరించుకుని, భారత ప్రభుత్వం దాన్ని- ‘ఆజాదీ-కా- అమృత్ ఉత్సవ్’ పేరుతో ఘనంగా నిర్వహిస్తూ వుంది. ప్రతి ఏటా ‘రిపబ్లిక్ డే’ ఉత్సవాల లాంఛన ముగింపు జనవరి 29 సాయంత్రం రాజధాని డిల్లీలోని విజయ్ చౌక్ వద్ద జరిగే- ‘బీటింగ్ ది రిట్రీట్’ తో ముగుస్తుంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో మిలటరీ బ్యాండ్ బృందాలు ఎంపిక చేయబడిన గీతాలను అక్కడ ఆలపిస్తారు. అయితే, ఈ ఏడాది ఇందులో జాతిపిత గాంధీజీకి ఎంతో ఇష్టమైన- ‘ఎబైడ్ విత్ మీ’ గీతాన్ని అందులో నుంచి తొలగించారు. అక్కడ దీన్ని ఆలపించే సంప్రదాయం 1950 నుంచి కొనసాగుతూ ఉంది.

‘వైష్ణవ జనకో’ – ‘ఎబైడ్ విత్ మీ’

జాతి పిత (‘ఫాదర్ ఆఫ్ ది నేషన్’) గా పిలవబడే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 150వ జయంతిని 2 అక్టోబర్ 2020-2021 మధ్య దేశమంతా జరుపుకుంది నిజానికి 2020 జనవరి తర్వాత కారణాలు చెప్పకుండానే, దీన్ని ‘బీటింగ్ ద రిట్రీట్’ లో వినిపించడం ఆపాలని అనుకున్నారు. దీని మీద కొంత చర్చ జరిగాక, అప్పట్లో ఆ నిర్ణయం అమలు కాలేదు. అయితే, 2022 జనవరిలో, ఈ ప్రత్యేక సందర్భంలో పూర్తిగా దేశీయ గీతాల ఆలాపనకు పరిమితం కావాలని, ఈ- ‘ఎబైడ్ విత్ మీ’ గీతం ఆలపించడం ఆపారు! మహాత్మాగాంధీకి ఎంతో ఇష్టమైన గీతం ఇది. సబర్మతి ఆశ్రమ భజనావళిలో ‘వైష్ణవ జనకో’, ‘రఘుపతి రాఘవ రాజారామ్’, తో పాటుగా దీన్ని పాడేవారు.

బీటింగ్ రిట్రీట్ (ఫైల్ ఫొటో)

గాంధీజీ జన్మతా తనకున్న భారతీయ సనాతన ఆధ్యాత్మిక వారసత్వానికి, దక్షణ ఆఫ్రికాలో తన ఆంగ్లికన్ క్రైస్తవ మిత్రుల సహవాసం వల్ల కాలక్రమంలో జోడించుకున్నది- క్రైస్తవ్యం. ఆయన తన వైఖిరిని ఆధునీకరించుకోవడానికి, బయట నుండి తెచ్చుకున్న సరళీకృత భావజాలం- బైబిల్ నుంచి గ్రహించారు. జీసస్ పర్వత ప్రసంగాన్ని గాంధీజీ ఎంతగానో ఇష్టపడేవారు. దేన్ని అయినా లోతుగా అధ్యయనం చేసే గాంధీజీకి బైబిల్ పాత నిబంధనలో జన్మతః తనకు తెలిసిన భారతీయ సనాతన జీవన విధానం, దాని మూలాలు కనిపించి ఉండాలి.

మోజెస్ ధర్మశాస్త్ర ఆచరణ, వేర్వేరు కాలాల్లో రూపాంతరం చెంది చివరికది సనాతన హైందవ ధర్మం పేరుతో భారత దేశంలో ఆచరణలో ఉండడం విషయంలో ఆయనకు స్పష్టత ఉంది. అందుకే, ఆయన బైబిల్ పాత నిబంధన వైపు చూడకుండా, నేరుగా నూతన నిబంధనలోకి చూసారు. అక్కడ- మోజెస్ ధర్మశాస్త్ర ఆచరణ, జీజస్ బోధనలలో సరళీకృత రూపం తీసుకుని, అది ఆధునికత వైపు జరిగిన మళ్లింపుగా గాంధీ గుర్తించి, దాని పట్ల ఆయన ఆకర్షితుడు అయ్యారు. అలా గాంధీ మార్గం అంటే, సనాతన ధర్మంలోనే- భిన్నమైన జ్ఞాన మార్గం అయింది!

‘మీ పంధాలోకి రాను’

దక్షణ ఆఫ్రికాలో 1904- 1906 మధ్య యువ గాంధీ ఉంటున్న ఇంటిలో ఒక పోర్షన్లో ఇంగ్లాండ్ లో పుట్టిన యూదు జాతీయుడు హెన్రీ పొలాక్ దంపతులు ఉండేవారు. వాళ్ళు ఒకరికొకరు తరుచూ పుస్తకాలు ఇచ్చి పుచ్చుకుంటూ ఉండేవారు. గాంధీజీ ఆఫీస్ గదిలో గోడకు రనడే, అనీబీసెంట్ పోటోల మధ్య పెద్దగా కనిపించే జీసస్ ఫోటో ఉండేది. ఒకరోజు ‘మీరు క్రైస్తవ్యాన్ని ఎందుకు మీ విశ్వాసంగా హత్తుకోలేదు  గాంధీజీ?’ అంటూ మిసెస్ పొలాక్ నేరుగానే గాంధీజీని అడిగింది.

అందుకాయన – (“ To be a good Hindu also meant that I would be good Christian. There was no need for join your creed to be a believer in the beauty of teachings of Jesus or to follow his example”) ఒక ఉత్తమ హిందూగా జీవించడం అంటే, ఉత్తమ క్రైస్తవుడిగా జీవించడమే. జీసస్ బోధనల అంతర్యంలో ఉన్న సౌందర్యారాదనతోనో, లేదా ఆయన ప్రబోధించిన మార్గాన్ని అనుసరించడానికో ఒక విస్వాసిగా మళ్ళీ నేను మీ పంధాలోకి రానక్కరలేదు’.  అంటూ, బైబిల్ పాత నిబంధనలో ఇప్పటికీ తమ ఆధ్యాత్మిక గమ్యాలను వెతుక్కుంటున్న, భారతీయ సనాతన మార్గ దృక్పధాన్ని వారికి చెప్పడానికి గాంధీజీ ప్రయత్నించారు.

ఇది జరిగిన సుమారు ఇరవై ఏళ్ళకు ఇండియాలో మహత్మ గాంధీని పెన్సిల్వేనియా స్వార్త్ మోర్ కాలేజి ఫిలాసఫీ ప్రొఫెసర్ డా. జే. హెచ్. హోల్మ్స్ తన ఇండియా పర్యటనలో 1927 జనవరి 11న గుజరాత్ లోని వార్ధాలో కలసి మాట్లాడారు. అప్పటికి ఆయన రాజకీయ రంగంలో ఉన్నారు. క్రైస్తవం గురించి గాంధీజీ తన మునుపటి అభిప్రాయాలనే ఇప్పుడు మరింత పదునుగా నిర్మొహమాటంగా ఆయన వెల్లడించారు.

దక్షిణాఫ్రికాలో గాంధీ

“నేను క్రీస్తును ఇష్టపడతాను, కానీ క్రైస్తవ్యాన్ని కాదు” (I like your  Christ, but not your Christianity) అని నిర్ద్వందంగా తన అభిప్రాయాన్ని చెబుతూ “నేను క్రీస్తు బోధనలను విశ్వసిస్తాను, కానీ మీది (క్రైస్తవులది) క్రీస్తుకు భిన్నమైన ప్రపంచం. నేను బైబిల్ గ్రంధాన్ని ఎంతో విశ్వాసంతో అధ్యయనం చేస్తాను, కానీ దానిలో తమకు విశ్వాసం ఉందని ప్రకటించుకునే ‘చర్చి’ లో నేను క్రీస్తును చూడలేదు” అన్నారు.

“క్రైస్తవులు అందరి మాదిరిగానే సంపద కోసం వెంపర్లాడతారు (బైబిల్ వాక్యానికి భిన్నంగా అనేది ఆయన ఉద్దేశ్యం కావచ్చు) తమ పొరుగువాడు నష్టపోయినా సరే, వాళ్ళు అది తనకు ప్రయోజనం అయితే చాలు అనుకొంటారు. వాళ్ళు ఇతరుల జీవితాలు, స్వేఛ్చ, సంతోషాలను ఫణంగా పెట్టి తమ క్షేమం సమృద్ది చూసుకుంటారు. క్రైస్తవుల్లో (దేశాల్లో) యుద్ద కాంక్ష ఎక్కువ” ఇవి జాతీయ ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్న కాలంలో గాంధీజీ అభిప్రాయాలు.

అయితే, ఇక్కడ గాంధీజీ వేర్వేరుగా రెండుగా చూస్తున్నవి ఏమిటి? ‘క్రైస్తవ్యం’ గురించి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చిస్ పూర్వ కార్యదర్శి సుప్రసిద్ధ ఇండియన్ మిస్సాలజిస్ట్ డా. మథాయ్ జఖర్య చేసిన ఒక ఆసక్తికరమైన పరిశీలన తన ‘ఇన్ సైడ్ ది ఇండియన్ చర్చి’ (I.S.P.C.K. ప్రచురణ 1994) గ్రంధంలో మనకు కనిపిస్తున్నది “క్రైస్తవ్యం – భిన్న మత, నాగరికత, సంస్కృతులను ఒక్కటిగా అంటుకట్టిన ఒక వృక్ష ఫలం. గ్రీకు తత్వశాస్త్రం, రోమన్ న్యాయశాస్త్రం, మెడిటరేనియన్ ప్రాంతపు ఆరాధనా విధానాలు, హీబ్రూ మత నిష్ఠ, దేవుని నిరంతర మార్గదర్శకత్వం, వీటన్నిటి సమ్మేళనం – క్రైస్తవ్యం అంటారాయన.

క్రైస్తవ్యానికి సహజంగా ఉన్న ‘డైనమిజం’ లక్షణం వల్ల, ఆదిమ ప్రపంచ స్తబ్ధ శతాబ్దాల కాలాన్ని అది ఛేదించింది. దాన్ని వెనక్కి నెట్టి, ‘సరళతరమైన విశ్వాసం’ గా ముందుకు రావడంతో, దావానంలా ప్రపంచం నలుమూలలకు అది వేగంగా వ్యాపించింది” అంటారు డా. మథాయ్ జఖర్య. ఈ గ్రంధ రచనకు, 90 ఏళ్ళ ముందుగా దక్షణ ఆఫ్రికాలో మిసెస్ పొలాక్ తో గాంధీజీ చెప్పాలని అనుకున్నది, దానికున్న ఈ సహజ- ‘డైనమిజం’ గురించే!

గాంధీజీ ‘క్రిస్మస్’ సందేశం

రెండవ రౌడ్ టేబుల్ కాన్ఫరెన్స్ కోసం లండన్ వెళ్ళిన గాంధీ

గాంధీజీ ఏసుక్రీస్తు బోధనల లోతుల్ని స్పృశించిన వైనం మరొక చారిత్రిక సందర్భంలో కూడా చూస్తాం. లండన్ లో 1931 డిసెంబర్ లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై గాంధీజీ తన బృందంతో సముద్రమార్గంలో ఇండియా తిరిగి వస్తూ ఉండగా ఇది జరిగింది. ప్రతి రోజు ఉదయం ఆయన ఓడలో నిర్వహించే ప్రార్ధనలలో పాల్గోనే కొందరు ఆరోజు ‘క్రిస్మస్’ కావడంతో గాంధీజీని వారు కోరడంతో ఆయన అక్కడ ‘క్రిస్మస్’ సందేశం ఇచ్చారు.

ఆయన మాట్లాడ్డం ముగిసాక, అదే రోజు ఆ ఓడలో వున్న అసోసియేట్ ప్రెస్ ఆఫ్ అమెరికా ప్రతినిధి మిస్టర్ మిల్స్ ఆ ప్రసంగ పాఠం తనకు చెప్పమని అడిగి రాసుకున్నారు. అదే వారం అది ‘యంగ్ ఇండియా’ మరియు ‘హరిజన్’ పత్రికల్లో వచ్చింది. ‘గాంధీస్ క్రిస్టమస్ సెర్మన్’ శీర్షికతో  7 జనవరి 1932 న ‘ది గార్డియన్’ పత్రికలో కూడా వచ్చింది.

దాని సంక్షిప్త పాఠం ఇది – “ఒక హైందవ మతస్థుడనైన నేను యేసుక్రీస్తు జీవితం గురించి, ఆయన బోధల గురించి ఎలా తెలిసుకున్నానో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఆశిస్తున్నాను. దాదాపుగా నలభై ఐదేళ్ళ క్రితం నుండే నాకు ‘పరిశద్ధగ్రంథం’ తో పరిచయం ఉంది‌. హోటల్ లో పరిచయమైన నా  స్నేహితుడి ప్రోత్సాహం ద్వారా ఇదంతా జరిగింది. పరిశుద్ధ  గ్రంథాన్ని మొదటిసారి చదివినప్పుడు నాకు పాత నిబంధన గ్రంథం మీద అంతగా ఆసక్తి కలుగలేదు. కానీ, ఎప్పుడైతే నేను కొత్త నిబంధన చదవడం మొదలు పెట్టానో నాకు క్రీస్తు బోధల మీద ఒక అవగాహన ఏర్పడింది. ముఖ్యంగా ‘కొండ మీద ప్రసంగం’ నన్ను చాలా ఆకట్టుకుంది. ఆ ప్రసంగం చిన్నతనంలో నేను నేర్చుకున్న విలువలని గుర్తు చేసింది. అది నా జీవన విధానానికి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించింది.

‘‘వేరే మతస్థుడనైన నాకు ఆ ప్రసంగం నాకు అంత ప్రాముఖ్యమైనది కాకపోవచ్చును. కానీ ఇది చెడుశక్తులతో సహా, ఎవరికీ హాని కలిగించనిది. దీన్ని చదివాక నేను తెలుసుకున్న దేమిటంటే, యేసుక్రీస్తు ఒక కొత్త ధర్మాన్ని బోధించడానికి వచ్చారని. నిజానికి తాను కొత్త ధర్మాన్ని ఇవ్వడానికి రాలేదు అని ఆయన చెప్పినప్పటికీ; పాతనిబంధనలోని మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరణ సాధ్యమైనరీతిలో సరళతరం చేయడానికి ఆయన వచ్చారు. ‘కంటికి కన్ను, పంటికి పన్ను’ చట్టం కాకుండా, ఒక అంగీ అడిగితే రెండు అంగీలు ఇవ్వడం, ఒక మైలు తోడు రమ్మంటే, రెండు మైళ్ళు వెళ్ళమనే సహృధయతను ఆయన బోధించారు. ఈ మంచి లక్షణాలను ప్రతీ ఒక్కరూ బాల్యంలోనే నేర్చుకోవడం చాలా అవసరమని నేను భావించాను.

గాంధీజీ మాట్లాడుతున్న దృశ్యం

‘‘చిన్నతనంలో క్రైస్తవ్యం అన్నా, క్రైస్తవులు అన్నా నాకొక దురభిప్రాయం ఉండేది. వారికి ఒక చేతిలో మద్యం, మరో చేతిలో మాంసం ఉంటాయని అనుకునేవాడిని. ఎప్పుడైతే నేను ఈ ‘కొండ మీద ప్రసంగం చదివానో, వారిపట్ల నాకున్న ఈ చెడు అభిప్రాయం పటాపంచలయ్యింది‌. ఆ తరువాత, దేవునికి నిజంగా భయపడే నా క్రైస్తవ స్నేహితులు కొందరు క్రైస్తవ్యంపై నాకున్న సదభిప్రాయాన్ని మరింత పెంచారు.

కొండమీది ప్రసంగం క్రీస్తు వ్యక్తిత్వాన్ని తెలియజేసింది. ఆ ప్రసంగాన్ని చదివి, అర్థం చేసుకున్నాక- నేను తెలుసుకున్నదేమిటంటే క్రైస్తవ్యం అనేది ‘మతం’ కాదు, ‘జీవన విధానం’ అని. ఏ వ్యక్తి అయితే అవధులు లేని ప్రేమని చూపిస్తూ ప్రతీకారం, ఈర్ష్య అసూయ ద్వేషం లాంటివి మరచిపోతాడో, అతడే నిజమైన క్రైస్తవుడు. అలాంటి వ్యక్తి జీవితంలో అన్ని ఆటంకాల్ని అధిగమిస్తాడు. ఇటువంటి జీవన విధానం అవలంబించడం ఒకింత కష్టంగానూ, ఎదుటివారికి అర్థం కానట్లుగానూ ఉంటుంది.

‘‘దేవుని దయ వలన పరిశుద్ధ గ్రంథం కొందరు విధ్వంసకారుల నుండి భద్రపరచబడింది. బ్రిటీష్ వారు మరియు ఫారిన్ బైబిల్ సొసైటీ వారు పరిశుద్ధ గ్రంథాన్ని అనేక‌ భాషల్లో తర్జుమా చేసారు. ఆ తర్జుమాలు సమయం వచ్చినప్పుడు, వాటి ఉద్దేశాన్ని నెరవేర్చాయి. యేసుక్రీస్తు బోధించిన ఈ అంశాలను మనం ఆచరించకపోతే, రెండు వేల సంవత్సరాల పాటు ఉన్న ఈ సజీవ నమ్మకానికి అర్థం లేనట్లే‌. మరియు మనం పాడుకునే ‘పరలోకమందున్న దేవునికి సమస్త మహిమ, భూమి మీద ఆయన భక్తులకి సమాధానం కలుగును గాక…’ అనే పాటలో ఉన్నట్లుగా దేవునికి మహిమ, మనకి సమాధానం రెండూ కలగవు.

‘‘మనలోని ఆత్మీయ తృష్ణ చల్లారేంత వరకూ, క్రీస్తు మన హృదయంలో జన్మించేంత వరకూ మనం ఆయన కోసం ఎదురు చూడాలి. ఎప్పుడైతే ఆయన మన హృదయాల్లో జన్మించడం వలన నిజమైన శాంతి నెలకుంటుందో, అప్పుడు మనకిక వేరే సాక్ష్యాలు అవసరం లేదు. అది మన జీవితాల ద్వారా ప్రతిబింబిస్తుంది. కేవలం మన వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగా కూడా ఈ మార్పు కనపడుతుంది. నా మట్డుకు ఈ పాట యొక్క అసలైన అర్థం ఇదేనని తోస్తుంది.

‘‘క్రీస్తు మనలో జన్మించడం అన్నది కేవలం ఒకరోజుకే పరిమితమయ్యేది కాదు కానీ, మన జీవితాల్లో ఎప్పటికీ గుర్తుంఛుకోవాల్సిన విషయం. ఈ లోకంలోని మతాల గురించి నేను ఆలోచించినప్పుడెల్లా, ఈ భూమిమీదకి దిగివచ్చిన మహోన్నతమైన గురువుల గురించి ఆలోచిస్తాను. వారి పుట్టుకకి కారణం- నేను మొదట చెప్పినట్టుగా, వారు ఈ భూమి మీద ఒక సత్యాన్ని  ప్రచురించడానికి అవతరించారు. దానికి ఏ గుర్తు, సాక్ష్యం అవసరం లేదు. ఆ సత్యాన్ని వాళ్ళు జీవించిన జీవన విధానం ద్వారా లోకానికి తెలియజేసారు. ఈ సత్యం ఎన్నటికీ ఆగిపోదు, నాశనం చెందదు. క్రీస్తు తమలో జన్మించనంత వరకూ ఎవరైనా ‘క్రిస్మస్ శుభాకాంక్షలు’ తెలియజేస్తే, అది అర్థం లేనిదే అవుతుంది.” ఆ రోజు ఆయన ప్రసంగ ధార ఆ ఓడ ప్రయాణంలో ఇలా సాగింది.

‘ఎబైడ్ విత్ మీ’ లో ఏముంది?

 ‘గుడ్ ఫ్రైడే’ నాడు ఏసుక్రీస్తు శిలువ మరణం తర్వాత, ‘ఈస్టర్’ ఆదివారం ఉదయం సమాధి నుంచి ఆయన బయటకు వచ్చి వొకరిద్దరికి కనిపించడం వరకు ‘బైబిల్’లోని అన్ని సువార్తలలో ఉంటుంది. అయితే ఆ ఆదివారం మధ్యాహ్నం తర్వాత జరిగినవి, జీసస్ ఆ రోజు రాత్రి ఎక్కడ ఉన్నది, అక్కడ జరిగింది ఏమిటి, వొక్క లూకా మాత్రమే 24: 13-35 లో ప్రత్యక్ష కధనంలా రాసాడు. (జీసస్) ఏసుక్రీస్తు శిష్యులు ఎవరు లేని ఆవూళ్ళో జరిగిన ఈ విషయాలు గురించి రాసిన లూకా, జీసస్ తో పాటుగా అక్కడ ఉన్న ఇద్దరిలో వొకరైన – క్లేయోపస్ పేరు ప్రస్తావించడం ద్వారా- అక్కడ జరిగినదానికీ, అలాగే రేపటి రోజు తన రచనకు రెండింటికీ సాధికారికత వచ్చేట్టుగా స్వతహాగా వైద్యుడైన లూకా ముందుగానే జాగ్రత్త పడ్డాడు! ఈ లూకా జీసస్ తర్వాతి చరిత్ర, సెయింట్ పాల్ చేసిన ఆదిమ క్రైస్తవ సంఘాల నిర్మాణం గురించి బైబిల్లోని అపోస్తులు కార్యములు అనే గ్రంధంలో సాకల్యంగా రాసాడు. 

‘ఎబైడ్ విత్ మి’ ప్రతీకాత్మక చిత్రం

ఆ రోజు మధ్యాహ్నం జెరూసలేం నుంచి ఎమ్మాయి గ్రామం వెళుతున్న ఇద్దరు వ్యక్తులు, గత మూడు రోజులుగా జెరూసలేంలో జీసస్ చుట్టూ జరిగిన రాజకీయ పరిణామాలు గురించి మాట్లాడుకుంటూ వెళుతున్నారు. రోమన్ చక్రవర్తి యూదు ప్రజల ‘డిమాండ్’ మేరకు, జీసస్ కు మరణ శిక్ష విధించాడు. అయితే, ఆయన మరణం తర్వాత, మూడవ రోజు సమాధి నుంచి తిరిగి లేస్తానని, ఆయన అన్నాడని ఆ ప్రాంతంలో అనుకున్నారు. దాన్ని కొందరు నమ్మరు కూడా. అదే, వాళ్ళు మాట్లాడుకుంటూ వెళుతున్నారు.

ఆ దారిలో జీసస్ వారితో కలిసి తను కూడా వారితో మాటలు కలిపాడు. అయితే వారు ఆయన్ని గుర్తుపట్టలేదు. వాళ్ళు ఎమ్మాయి చేరాక, దారిలో తమతో కలిసిన బాటసారి (జీసస్) తో ‘‘చీకటి పడుతున్నది రాత్రి అవుతున్నది, చూస్తుంటే- మీరు ఇంకా దూరం వెళుతున్నట్టుగా ఉంది. ఇక్కడ ఆగిపోండి, మామాట మన్నించి… ఈ రాత్రి మాతో కలిసి ఉండండి’’ అన్నారు. వారు ఆయనతో హీబ్రూ భాషలో- ‘ఎబాయ్’ అన్నట్టుగా లూకా 24: 29 లో రాసారు. ఆ పదం తొలుత గ్రీకు, తర్వాత లాటిన్, అలా… ఆంగ్లంలోకి మారిన క్రమంలో అది- ‘Abide’ అయింది. నానార్ధాలతో అది- stay, live, remain, stop అయింది. అయితే, తెలుగులో- ‘మన్నించి’ అనే మాట ఇక్కడ సందర్భోచితం అవుతున్నది.  

విషయం అక్కడ ఆగిఉంటే, దానిగురించి ఇంత చెప్పనక్కరలేదు. అయితే, హెన్రీ ఫ్రాన్సిస్ లైట్ అనే ఆంగ్లికన్ ప్రీస్ట్, కవి 1847 లో కేవలం లూకా 24: 29 లోని ‘Abide’ అనే మాటను తీసుకుని, మా మాట ‘మన్నించవా…’ అంటూ ఐదు వచనాలతో వొక కవిత రాసారు, దానికి 1823-1889 నాటి సంగీత కారుడు విలియం హెన్రీ మాంక్ ట్యూన్ సమకూర్చారు. అప్పటి నుంచి అది ప్రపంచం అంతా పాడబడుతూనే ఉంది! ఈ మధ్య కూడా అమెరికన్ సింగర్ ఆడ్రీ అస్సాడ్ పాడిన ఈ గీతం ఇప్పుడు యూట్యూబ్ లో మనకు అందుబాటులో వుంది.  

హెన్రీ ఫ్రాన్సిస్ లైట్ (రచన) 8 ఆడ్రీ అస్సాద్ (గానం) 9 విలియం హెన్రీ మాంక్ (సంగీతం)

అయితే, 2020 జనవరి తర్వాత కారణాలు చెప్పకుండానే ‘బీటింగ్ ద రిట్రీట్’ లో దీని ఆలాపన ఆపాలి అనుకున్నప్పుడు, దీనిపై పలు ఆంగ్ల జాతీయ పత్రికలు అప్పట్లోనే స్పందించాయి. అప్పట్లో- ‘ది హిందూ’ పత్రికలో 29.1.2020 న రాస్తూ…“Many verses from hymns across the world were composed in times of doubt and trouble, and comfort us even today” అంటూ ప్రపంచ వ్యాప్తంగా అసందిగ్ద కల్లోల సమయాల్లో ఈ గీతంలోని పంక్తులు కలిగించగలిగే సాంత్వనము, అన్ని కాలాలకు అందులో వున్న  ప్రాసంగికతను, శ్లాఘించడం జరిగింది. రెండు వేల ఏళ్ల క్రితం, ఎవరో తెలియని బాటసారిని ‘ఎచటికి పోతావ్ ఈ రాత్రి?’ అంటూ… ఆర్తితో చేసిన అభ్యర్ధన, ప్రపంచం అంతా వొక ప్రేమ ధోరణిగా… విస్తరించడం ఎలా సాధ్యం అయింది?! బహుశా అదే బాపును సబర్మతీ ఆశ్రమ ఉదయ ప్రార్ధనలలో దాన్ని అలపించేట్టుగా చేసి ఉండాలి! 

Abide with me (కవితాత్మక స్వేచ్ఛానువాదం)

అనువాదం : దాసరి ప్రవీణ్

1. Abide with me! fast falls the even tide;The darkness deepens; Lord, with me abide!When other helpers fail and comforts flee,Help of the helpless, oh, abide with me.
నిసి తెరల క్రీనీడకాలంతో పోటీ పడుతూదినాంత వేళ అవనిని ఆవహిస్తోంది.ఛాయ చిక్కనవుతోంది,మసక చీకటి ముసుగు నలుపెక్కుతోంది!ఓ ప్రభువా, నను వీడకు!సాయమందించే హస్తాలు విఫలమై,సౌఖ్యాలు ఎండమావులైన వేళ నిస్సహాయుల సాయమా, నాతో వసించు!
2. Swift to its close ebbs out life’s little day; Earth’s joys grow dim, its glories pass away;Change and decay in all around I see; O Thou who changeth not, abide with me.
 నా రిక్త జీవితం ఒక స్వల్ప దినం; తన సమీప పోటు కెరటాలను ఓ చిరు దోనెలా, దురితంగా చేరుతోంది. లోక సంతోషాలు కాంతి విహీనమై, కీర్తి కిరీటాలు చరిత్ర సమాధులలో నిరర్థక స్మృతుల కపాలాలయినై. నా చుట్టూ కలియచూస్తే అంతటా మార్పు; సర్వం క్షయమయం.మార్పు చెందని దైవమా, నాతో వసించు!
3. Come not in terrors, as the King of kings; But kind and good, with healing in Thy wings:Tears for all woes, a heart for every plea;Come, Friend of sinners, thus abide with me.
భీకరుడవై రాకు; నీ కోపాగ్నికి తాళలేని లేలేత చిగురుటాకును.రాజాధిరాజులా రాకు; నీ తేజస్సు కాంచలేని ఆధ్యాత్మిక అంధుడను. సుశీలుడవై, దయార్ద్ర హృదయుడవై,నీ బాహువులలో స్వస్థతతో రమ్ము!సకల శ్రమలకు నా స్పందన వ్యాకులత. నా దుఃఖ సాగరానికి ప్రతిస్పందనగా గుండె లోతుల్లో నుండి పెల్లుబికే కన్నీటి ధారలు కురిపిస్తూ,ప్రతి విజ్ఞాపనను ఆలకించే మనసై,పాపుల నేస్తమా, అలా వచ్చి నాతో వసించు!
4. I need Thy presence every passing hour:What but Thy grace can foil the tempter’s power? Who like Thyself my guide and stay can be? Through cloud and sunshine, oh, abide with me.
గడిచిపోతున్న ప్రతి ఘడియలోను నీ సన్నిధి నాకు ఆవశ్యకం! నీ నిర్హేతుక జాయమాన కటాక్షం తప్ప, అపవాది ప్రలోభాధికారాన్ని నిర్వీర్యం చేసే శక్తి మరొకటి కలదా? ఓడ స్తంభానికి దన్నుగా కట్టిన ఉక్కు తీగలా, నాకు మార్గదర్శిగానిలబడేవారు, నీవు కాక ఇంకెవరు? మేఘావృత ఖేదములోను,సూర్యతేజ మోదములోను నాతో వసించు!
5. I fear no foe, with Thee at hand to bless: Ills have no weight, and tears no bitterness:Where is death’s sting? where, grave, thy victory? I triumph still, if Thou abide with me.
ఏ శత్రువుకూ వెరువను దీవెనల నెలవైన నీవు నాకు అత్యంత సమీపంలో ఉంటే. కడగండ్లకు ప్రాధాన్యత శూన్యం; కన్నీటిలో ఆవేదన అదృశ్యం! మరణపు ముల్లు ఎక్కడ? సమాధీ, నీ విజయమెక్కడ? కలత చెందక నిశ్చలతతో నెగ్గుతాను, ప్రభువా, నాతో వసించు.

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

2 COMMENTS

  1. Great consoling & meaningful song at the hour of loneliness.Discarding doesn’t loss the author, English literature, to that matter not to achristian or to the church.Feelings are universal like hunger and thirst.where there is pain expressions come out irrespective of the language, region,race or colour.
    An implemented decision of dropping a meaningful hymn was regretful needs review with with due considerations.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles