- ఎన్నికల ఫలితాలపై వైసీపీ, టీడీపీలు
- ప్రజాతీర్పును అపహాస్యం చేస్తున్న నేతలు
తొలిదశ పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. ఎన్నికల ఫలితాలపై అధికార, ప్రతిపక్షాలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి. తొలిదశ పోరులో మేము ఎక్కువ పంచాయతీల్లో గెలుపొందాం అంటే కాదు మేం ఎక్కువ అంటూ ఊదరగొడుతున్నాయి.
ఏ ఎన్నికలయినా అధికార పార్టీ హవా సాగడం సర్వసాధారణం. తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో ప్రోత్సాహకాల పేరుతో సుమారు 5 వందలకు పైగా ఏకగ్రీవాల్లో అధికార వైసీపీ విజయం సాధించింది. అయితే ఎన్నికల ఫలితాలను అధికార ప్రతిపక్షాలు తమకే అనుకూలంగా ఉన్నాయంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఫలితాలపై నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఎవరి డప్పు వాళ్లే వాయించుకున్నట్లు ఉందని ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఫలితాలపై బొత్స ఏమన్నారంటే?
ఈనాడు దిన పత్రిక కథనం ప్రకారం తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 94% పంచాయతీలను గెలుస్తున్నామంటూ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు, వైసీపీ కార్యాలయంవద్ద కార్యకర్తల సంబురాలు అంటూ ప్రచురితమయింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయానికి 1383 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారని బొత్స వెల్లడించారని కథనం ప్రచురితమయింది. తొలి విడతలో వైసీపీ మద్దతుదారులు గెలిచిన పంచాయతీలను జిల్లాల వారీగా పేర్కొంటూ వైసీపీ కేంద్ర కార్యాలయం జాబితా విడుదల చేసిన విషయాన్ని పత్రికలో ప్రచురించారు.
సాయంత్రానికి మాట మార్చిన బొత్స:
అయితే బుధవారం (ఫిబ్రవరి 10) సాయంత్రం నాలుగు గంటల సమయంలో సాక్షి దినపత్రికలో దీనికి కొద్దిగా భిన్నమైన వార్త ప్రచురితమైంది. తొలిదశలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 82 శాతానికి పైగా వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నట్లు వార్త ప్రచురితమయింది. తొలిదశలో జరిగిన ఎన్నికల్లో 2637 పంచాయతీల్లో తమ పార్టీ మద్దతుదారులు గెలుపొందారని బొత్స వివరించారు. ఎన్నికల ఫలితాలపై తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొత్స మాట్లాడినట్లు అందులో తెలిపారు.
ప్రజల గుండెల్లో తెలుగుదేశం:
మరోవైపు తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు జగన్ సర్కార్ పతనానికి నాంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు మీడియానుద్దేశించి మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ ప్రజల గుండెల్లో ఉందన్నారు. అధికార పార్టీ ఎన్ని దుర్మార్గాలకు పాల్పడినా ప్రజలు అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. 38.74 శాతం ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. అయితే 94 శాతం వైసీపీ గెలుచుకుందని గాలి కబుర్లు చెబుతారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అచ్చెన్నాయుడుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడి అక్రమంగా కేసులు పెట్టారని చంద్రబాబు ఆక్రోశం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలకడం మంచిది కాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై 174 కేసులు పెట్టినట్లు చంద్రబాబు తెలిపారు. ఏ తప్పూ చేయని కొల్లు రవీంద్రపై కేసు పెట్టారని చంద్రబాబు అన్నారు.