—————
( ‘ OF HOUSES ‘ FROM ‘THE PROPHET ‘ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం: డా.సి. బి. చంద్ర మోహన్
————–
అప్పుడు ఒక తాపీ మేస్త్రి ముందుకు వచ్చి “మాకు గృహాల గురించి చెప్పండి .” అన్నాడు.
ఆల్ ముస్తఫా ఇలా చెప్పసాగాడు:
అరణ్యంలో పర్ణశాల కట్టుకున్నట్లు
మీ ఊహల్లో ఉన్న సౌధాన్ని
నగర గోడల మధ్యనే నిర్మించుకోండి.
సాయంసంధ్యలో
ఇంటిదారి పట్టినప్పుడు,
గృహం చేరినా గాని
మీలోని సంచారి ఎప్పుడూ
ఒంటరిగా, దూరంగానే ఉంటాడు.
మీ బృహత్ శరీరమే మీ ఇల్లు.
అది సూర్యకాంతిలో పెరుగుతుంది.
ప్రశాంత నిశీధిలో నిద్రిస్తుంది !
మీ ఆవాసం స్వప్న రహిత కాదు!
మీ ఇల్లు స్వప్నించకుండా ఉంటుందా?
కలలు కంటూ నగరం విడిచి
తోటల్లోకి, కొండ శిఖరాల పైకి వెళ్లదా?
మీ ఇళ్లను నా చేతిలో పోగు చేసి
విత్తనాలు జల్లే మనిషిలా
అడవి లోనూ, పచ్చిక బీళ్ళ లోనూ జల్లనా?
అప్పుడు —
లోయలే వీధులవుతాయి!
పచ్చటి మైదానాలు సందు గొందులవుతాయి!
ద్రాక్ష తోటల్లో ఒకరినొకరు కలుసుకుంటారు.
మట్టి సువాసనతో ఉన్న దుస్తులతో
ఇళ్లకు తరలుతారు.
ఇవన్నీ—
ఇంకా జరగవలసి ఉంది!
మీ పూర్వీకులు వారి భయాలతో
మిమ్ములను ఒక చోట పోగు చేసి ఉంచారు.
ఆ భయం కొంత కాలం భరించక తప్పదు.
మరికొంత కాలం ,
నగర గోడలు — పొలాల నుండి
మీ వంట పొయ్యిలను దూరంగా ఉంచవచ్చు బహుశా!
ఆర్ఫలేస్ ప్రజలారా!
నాకు ఇది చెప్పండి!
ఈ ఇళ్లల్లో ఏముందని?
బిగించిన తలుపులతో మీరు
దేనికి కావలి కాస్తారు?
మీ శక్తిని వెల్లడి చేసే
ప్రశాంతత మీకు లభిస్తుందా?
అంతరంగ శిఖరాలపై మెరుస్తున్న తోరణాల
జ్ఞాపకాలు మీకు ఉంటాయా?
చెక్కతోను, రాళ్లతోనూ శిల్పాలు చెక్కిన
పవిత్ర పర్వతం యొక్క
‘హృదయాన్ని ఉప్పొంగించే‘ — సౌందర్యం
మీ ఆవాసాలకు ఉంటుందా?
చెప్పండి , మీ గృహాల్లో ఇవి ఉంటాయా?
ఆ ఇళ్ళల్లో మీకున్నది సౌకర్యాలు మాత్రమేనా?
లేక,
ఒక ‘దొంగ‘ అతిథిలా మీ ఇంట ప్రవేశించి,
ఆతిథ్యమిచ్చే వానిలా మారి,
చివరికి ఇంటికే సొంత దారుడయ్యే
— ‘సుఖాలపైమోహమా‘?
ఔను, ఆ ‘మోహం‘ ముందు మచ్చిక చేసుకుంటుంది
మీ బృహత్ కోరికలను కొక్కెము, పాశంతో
తోలు బొమ్మలాటలాడిస్తుంది!
దాని హస్తాలు పట్టు దారాలే గాని
గుండె ఇనుమే!
మీ దేహ గౌరవాన్ని అపహాస్యం చేస్తూ
మీ పడక పక్కనే నిలబడి
జోలపాడుతూ నిదుర పుచ్చుతుంది!
మీ బలమైన ఇంద్రియాలను ఎగతాళి చేస్తుంది!
గాజు పాత్రలను పిండి చేసినట్లు
మీ ఇంద్రియాలను పిండి చేస్తుంది!
నిజానికి, ఈ సుఖ వ్యామోహం
మీ ఆత్మ భావావేశాన్ని ఖూనీ చేస్తుంది!
అంత్యక్రియల్లో నవ్వుకుంటూ నడుస్తుంది!
విశ్రాంతిలో ఉన్న అవిశ్రాంత ఆకాశ పుత్రులారా!
మీరు ఆ వ్యామోహంతో చిక్కు పడకండి
దానితో మచ్చిక చేయబడకండి!
మీ ఇల్లు లంగరు కావద్దు
ఓడ తెరచాప స్తంభం కావాలి!
అది పుండుకు కప్పే గాజు గుడ్డలా కాదు
కంటి ని కాపాడే రెప్పలా ఉండాలి!
ఆ గృహంలో–
గుమ్మాలు దాటటానికి మీ రెక్కలు
ముడుచు కోనవసరం లేదు!
పైకప్పు తగలకుండా శిరస్సులు వంచనక్కరలేదు!
గోడలు పగుళ్లిచ్చి పడిపోతాయని, భయంగా
ఊపిరిపీల్చుకోనవసరంలేదు!
బ్రతికి ఉన్న వారి కోసం గతించిన వారు కట్టిన
సమాధుల్లో మీరు ఉండనక్కరలేదు!
మీ ఆవాసం ఎంతో శోభ, వైభవంతో ఉన్నాగాని
అది మీ రహస్యాలను పట్టి ఉంచలేదు
మీ అభిలాష లకు ఆశ్రయమివ్వలేదు!
ఉషోదయపు మంచుతెరలు ద్వారాలుగా,
గీతాలు – నీరవ నిశీధులు — గవాక్షాలుగా
కలిగి ఉన్న ఆకాశహర్మ్యం–
హద్దుల్లేని మీ మనో రహస్యాలకు, ఆకాంక్షలకు
ఆలవాలమవుతుంది.