Thursday, November 7, 2024

మరచిపోతున్న ‘మహాత్ముని’ మరణం… కొన్ని వాస్తవాలు

“ఇటువంటి ఒక వ్యక్తి రక్త-మాంసాలతో నిజంగా మన మధ్యన జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మటం నిజంగా చాలా కష్టం” అన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‍స్టీన్ మాటలు నిజం చేస్తున్నారు మన భారతీయులు. ఆయన చెప్పింది మన మహాత్మాగాంధీ గురించే…! మన దేశంలో  గాంధీ జయంతి మాత్రం చాలామందికి గుర్తుంటుంది… ఎందుకంటే, అక్టోబరు 2 ఒక తప్పనిసరి జాతీయ సెలవు రోజు గాబట్టి…  ఇంకా ‘డ్రై-డే’ కాబట్టి, మందు బాబులకు మాత్రం ముందు జాగ్రత్త కోసం చాలా ప్రత్యేకంగా గుర్తుంటుంది…!

ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు?

కానీ, గాడ్సే ఘోరంగా హత్య చేసిన  మన మహాత్మ గాంధీజీ వర్ధంతి అయిన జనవరి 30 మాత్రం ఎంతమందికి గుర్తుంటుంది? అసలు ఈ రోజుల్లో, ఇప్పటి ప్రపంచంలో ఎంతమంది గాంధీజీని సరిగా అర్ధం చేసుకున్నారు? గుర్తుంచుకున్నారు? ఈ సరికొత్త అల్ట్రామోడరన్, మోస్ట్ అడ్వాన్స్ డ్ కంప్యూటరైజ్డ్,  మొబైల్ జనరేషన్ లో అసలెంతమందికి మహాత్మాగాంధీ గుర్తున్నారు? ఎంతమందికి మహాత్ముడి గురించి, ఆయన సిద్ధాంతాల గురించి, ఆశయాల గురుంచి నిజంగా తెలుసు? భారతీయులందరూ మహాత్మునిగా, బాపుగా, గాంధీజీగా పిలిచే మన భారత జాతిపిత పూజ్యులు శ్రీ ‘మోహన్ దాస్ కరంచంద్ గాంధీ’.

ఇది చదవండి: రాజకీయ రణ’తంత్రం’ గా మన ప్రజా ‘గణతంత్రం’!

మానవాళిని ప్రభావితం చేసిన మహనీయుడు:

ఇరవయ్యో శతాబ్దిలోని ప్రపంచ రాజకీయనాయకులలో అత్యధికంగా  మానవాళిని ప్రభావితం చేసిన ఒక గొప్ప మహోన్నత స్వాతంత్ర్య సమరయోధుడు, మానవ జాతికి ఆదర్శప్రాయుడు మన మహాత్మ గాంధీజీ. సత్యం, క్రమశిక్షణ, అహింసలు గాంధీజీ నమ్మే ప్రధాన సిద్ధాంతాలు. సహనం, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం ఆయన ముఖ్య ఆయుధాలు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడికి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటిన ఈ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్నిగడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యం, అంకితభావం, సహనం చివరివరకూ కావాలని బోధించాడు మన భారతీయ మహాత్ముడు గాంధీజీ.

స్వంతంత్ర్య సమర నాయకులలో అగ్రగణ్యుడు:

బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకులలో గాంధీజీ అగ్రగణ్యుడు. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు నెల్సన్‌ మండేలా గానీ, అమెరికాలో పౌర హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ గానీ, బర్మా లో ప్రజాస్వామ్య యోధురాలు ఆంగ్ సాన్ సూకీ గానీ, ప్రఖ్యాత అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా గానీ ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎందరో నాయకులకు, ఎన్నెన్నో దేశాలకు, పీడిత ప్రజలకు, స్వతంత్ర ఉద్యమకారులకు, ప్రజాస్వామ్య పోరాట యోధులకు గాంధీజీ ఉద్యమ స్ఫూర్తి. వీరందరిలోనూ అహింస, సహాయ నిరాకరణ, చేతన- చైతన్యం – నిబద్ధత అనే ప్రధాన ప్రజా పోరాట స్ఫూర్తిని నింపింది మన గాంధీజీయే.

సమైక్యస్ఫూర్తి:

కేవలం పట్టణాలకూ, పత్రికలకూ, కొన్ని ప్రాంతాలకూ మాత్రమే పరిమితమైన స్వతంత్ర పోరాటాన్ని క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, చంపారన్ వంటి ఎన్నో సహాయనిరాకరణలతో, ఎన్నో సత్యాగ్రహాలతో, ఎన్నెన్నో అఖండ ఉద్యమాలతో భారతదేశం మొత్తాన్ని సంపూర్ణంగా సంఘటితం చేసి దేశం మొత్తం ఆసేతు హిమాచలపర్యంతం కుల, మత, వర్గ విభేదాలనేవి లేకుండా విస్తరించేలా సమైక్యస్ఫూర్తిని విస్తృతి చేసిన మహనీయుడు మన గాంధీజీ. సంపన్న వర్గాలకే పరిమితమైన స్వతంత్ర పోరాటాన్ని పేదలకు, బడుగు, బలహీన, నిమ్న వర్గాలకు సైతం చేరువ చేసి ఒక మహా యజ్ఞంలా మన స్వతంత్ర పోరాటాన్ని ముందుండి నడిపిన ‘మాస్-హీరో’ ఒక మహా పోరాటయోధుడు మన గాంధీజీ.  నిగర్వి, నిస్వార్ధి, పక్కా మొండివాడు గానీ నిరంకుశుడు ఎంత మాత్రమూ కాదు!

హింసామార్గంలోకి వెడితే అంతే

కొన్నిసార్లు ఉవ్వెత్తున ఎగుస్తున్నఉద్యమాల్ని ఆయన అర్ధంతరంగా మధ్యలోనే నిలిపివేయయడానికి ఒకే కారణం. ఉద్యమం , ప్రజలు హింసామార్గం లోకి వెళ్ళకూడదనే ఒక్కసారి హింస తో విజయం సాధిస్తే అది ప్రజల మనోభావాల్ని ఎంతగానో ప్రభావితం చేసి రాక్షసత్వానికి,  హింసావాదం వైపు ప్రజల్ని ప్రోత్సహిస్తుందని ఆయన భయం. ఆయన శాకాహార సిద్ధాంతం అహింసావాద సాత్వికజీవన లక్ష్యసాధన కోసం అస్పృశ్యత, అంటరానితనం పూర్తిగా నిర్మూలన చేయడం, దేవాలయాల్లోకి అన్ని కులాలవారిని అనుమతించడం, మనిషిలో మత్తునూ, రాక్షసత్వాన్ని పెంచే మద్యానికి దూరంగా ఉండటం, పరమత సహనం, కుల, వర్గ, ప్రాంతీయ విద్వేషాలను పూర్తిగా రూపుమాపడం ఆయన లక్ష్యాలు.

ఇది చదవండి: ‘కులం’ చేత… ‘కులం’ కోసం… ‘కులం’ తో… సకలం ‘కులం’ గా… సం’కులం’తో వ్యా’కుల’మైపోతున్న మన ‘భారతీయం’

స్త్రీ లను గౌరవించడం, స్త్రీ శక్తి ని పెంపొందించి ఆడవారికి కూడా సమాన గౌరవం , విలువ ఇవ్వడం, స్త్రీ విద్య కోసం పోరాటం గాంధీజీ విధానాలు. తన భార్య కస్తూర్బా గాంధీ కి కడదాకా సమాన స్థాయి ఇచ్చిన స్త్రీ పక్షపాతి. పరాయి దేశాల్ని, ఇతర దేశస్తుల్ని ఇతర దేశాల సార్వభౌమత్వాన్నిగౌరవించడం భారత విదేశాంగ విధానానికి పునాది ఆయన. జాతీయ సమైక్యత కు ఒక రూపాన్నిచ్చి, ఉత్తర, దక్షిణ భారతదేశాల్ని రాజకీయంగా ఏకం చేసి సమ దృష్ఠి తో చూసిన గొప్ప వ్యక్తి గాంధీజీ. ఆయనకు భారతదేశ ప్రజలంతా ఒక్కటే ఎవరి పట్లా పక్షపాతం, భేదభావం, ప్రత్యేక ప్రేమ లేదు. ఆయన ఒక ఆదర్శ నాయకుడు. ఒక గొప్ప నేత.

ఆయనా మనిషే:

ఆయన జీవితంలో, వ్యక్తిత్వంలో కొన్ని వైరుధ్యాలు, కొన్ని విమర్శలు, కొన్ని వైకల్యాలు, కొన్ని మానవ బలహీనతలు ఏమైనా ఉంటే ఉండవచ్చు. ఎంతైనా ఆయన కూడా ఒక మనిషే. ఎంతటి అత్యున్నత గొప్ప మనీషి ఐనా ఒక మనిషే కదా! ఆయన బలం సత్యమే. ఆయన ఊపిరి అహింస. ఆయన ఎంతగానో నమ్మిన వారు చాలామంది ఆయన్నుఎన్నో సార్లు చాలా మోసం చేసారు. కానీ, ఆయన వారిని విమర్శించింది చాలా తక్కువ. వాళ్ళ తప్పులకు కూడా ఆయనే నైతిక భాద్యత వహించారు. నిరాహార దీక్షలు చేసారు. తనకు తానే ఎన్నోసార్లు శిక్ష వేసుకున్నారు. ఎటువంటి ఆడంబరాలు, అలంకరణలూ లేకుండా ఒక సన్యాసి లాగా జీవితాంతం ఒక యోగి లాగా ఆయన ఎంతో ఉన్నతం గా జీవించారు…

సంఘటితశక్తి

భారతదేశం మొత్తాన్ని భాషాభేదాలు, ప్రాంతీయ విభేదాలు, రాజరికాలు, కుల-మత-వర్గ విభేదాలకతీతంగా సంఘటితం చేసి భారత జాతీయ సమైక్యతను, భారత జాతి బలాన్ని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిలిపి, స్వాతంత్య్రాన్ని గెలిచి ప్రపంచానికి ఒక సరికొత్త దారి, శాంతియుత ఉద్యమ మార్గాన్ని చూపించారు. హిందూ-ముస్లిం వైషమ్యాలు, గొడవలు, రక్తపాతం, అల్లర్లు ఆయన్ని చివరి వరకూ బాధపెడుతూనే వున్నాయి. చివరి వరకూ హిందూ-ముస్లిం ఐక్యత కోసమే పాటుపడి దానికే ఆయన అన్యాయం గా బలైపోయారు… ఒకరకం గా భారతదేశ విభజనతోనే ఆయన మానసికంగా చనిపోయారు. గాడ్సే హత్యచేసింది, చంపింది కేవలం ఆయన దేహాన్నే!

బాపూ ఇప్పుడు బతికుంటే

నిజంగా బాపూజీ ఇప్పుడు బ్రతికుంటే ఇప్పటి రాజకీయనాయకులను, వాళ్ళ స్వార్ధ, నీచ-నికృష్ట రాజకీయాలు చూసి అనుక్షణం మరణించేవారు. ఆయనకు ఆత్మశాంతి కలగకుండా చేస్తున్నారు గాంధేయవాదులుగా చెప్పుకుతిరుగుతున్న ఇప్పటి రాజకీయనాయకులు. నలుగురు కొడుకులున్నా, గాంధీ ఎవ్వర్నీ రాజకీయాల్లోకి ప్రోత్సహించింది గానీ నాయకత్వ వారసత్వం చేయూత నిచ్చింది గానీ ఎన్నడూ లేదు… నిజాయితీ, ముక్కుసూటి వ్యక్తిత్వం వల్ల భారత జాతిపితకు తన సొంత కొడుకే దూరమయ్యాడు. జీవితాంతం గాంధీజీ-కస్తూర్బా తమ పెద్దకొడుకు దూరమై ఎంతో కుమిలిపోయారు. కానీ, కన్న కొడుకే కదా అని కనికరం గానీ, బంధుప్రీతి, వారసత్వం, కుటుంబ ప్రేమ, పక్షపాతం ఆయన ఎంతమాత్రం చూపలేదు. చివర్లో ఐతే, ఆయన్ను ఎవరూ ఎంతమాత్రమూ నమ్మలేదు. ఆయనక్కూడా మతం ముసుగులు కప్పారు. మతాభిమానాన్ని అంటగట్టారు.

సమంగా ద్వేషించాం :

ఆయన ఎంతో ప్రేమించిన హిందువులు – ముస్లింలు ఇద్దరూ కూడా ఆయన్ను ఎంతో సమానంగా ద్వేషించారు. హిందువులు ముస్లిం పక్షపాతి అన్నారు. ముస్లింలు ఎంతైనా హిందువే కదా అని విమర్శించారు. గాంధీజీ ద్రోహి కాదు. అయన ఎవ్వరికీ ఎలాంటి ద్రోహం చేయలేదు. ఆయన తుది క్షణం వరకూ దీనిగురించి, మత కలహాలగురించి ఎంతో క్షోభ పడ్డారు. గాంధీజీ భయపడిందంతా నిజమైంది…! దేశ విభజన మానవ చరిత్ర లో ఒక పెద్ద విషాదం గా నిలిచిపోయింది… దేశవిభజన కారణం గా హింస లో చనిపోయిన లక్షలాది హిందువులూ, ముస్లింల గురించి, నిరాశ్రయులైన అసంఖ్యాక  ప్రజలగురించి ఆయన తుది వరకూ ఎంతో మనస్తాపం చెందారు…

గాంధేయ సిద్ధాంతాలు అజరామరం :

ప్రతి సిద్ధాంతం ప్రపంచంలో, జీవితంలో, ఏదో ఒక కాలం లో, ఎప్పుడో ఒకప్పుడు విఫలమవుతుంది. కానీ, మహాత్మాగాంధీ ప్రవచించిన, ఆచరించి చూపించిన గాంధేయ సిద్ధాంతాలకు మరణం లేదు. అవి సృష్టి ఉన్నంతకాలం నిత్య నిరంతర సత్యాలే. మన పవిత్ర భారత దేశంలో మహాత్మా గాంధీ అందరివాడు. కానీ నిజంగా ఆయన ఎందరి వాడు? ఈ శతాబ్ద కాలంగా మహాత్మాగాంధీ భారతదేశం లో ఒక గొప్ప బ్రాండ్. ప్రజల మనస్సులో కొలువున్న ఒక విలువైన స్పూర్తిప్రదాత. పచ్చిగా చెప్పాలంటే, రాజకీయులకు ఒక వాణిజ్య వస్తువు. నిజంగానే, ఈ మోడరన్ రాజకీయాల్లో ఆయన పేరు ఒక వ్యాపార వస్తువు గా చలామణి అవుతోంది. ఓట్ల కోసం ఆయన్ని, ఆయన కాంగ్రెస్ పార్టీ పేరును, సిద్ధాంతాల్ని నిస్సిగ్గుగా వంచనతో వాడుకుంటున్నారు…

ఇది చదవండి: కొందరు యోగులు… ఇంకొందరు భోగులు… మరికొందరు నియంతలు… ఇంకెందరో గొప్పోళ్ళు-పెద్ద మనుషులు…

ఎవరు నిజమైన వారసులు?

ఆయన పేరుచెప్పుకుని అధికారాన్ని అనుభవించిన వాళ్ళు గానీ, ఆయన ప్రాంతం వారి మంటూ అయన పేరు జపిస్తూ అధికారంలోకి వచ్చిన వారు గానీ, ఆయన సిద్ధాంతాలు చెప్పుకొని అధికారం అనుభవిస్తున్నవారు గానీ ఆయనకు నిజమైన వారసులా? గాంధీజీ పేరుచెప్పుకొంటూ, తెచ్చి పెట్టుకున్న పార్శీ గాంధీ పేరుతొ ఒక కుటుంబం నాలుగు  దశాబ్దాలు ప్రత్యక్షం గానూ రెండు దశాబ్దాలు తమ ప్రత్యక్ష  పర్యవేక్షణలో పరోక్షం గానూ  మొత్తమ్మీద ఆరు దశాబ్దాలకు పైగా ఈ దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. గాంధీ పేరుకున్న విలువను తగ్గించారు. నిరంకుశులయ్యారు. ప్రజల్ని వంచించారు. నియంతలుగా కూడా చాలా మంచి పేరుతెచ్చుకున్నారు.

మహాత్ముడి ఆత్మను చంపేస్తున్నారు:

మహాత్మాగాంధీ పవిత్ర ఆత్మ ను సైతం ఇప్పటికీ మన రాజకీయనాయకులు  ప్రతిక్షణం చంపేస్తున్నారు. ఆయన బతికుంటే నిజంగా ఎంతో క్షోభ పడే వారు. ఎందరో నయా గాంధీ లు, ఈ తరం గాంధీలు, గాంధీ వారసులు అని చెప్పుకుంటూ ప్రతి ఏటా పుట్టుకొస్తున్నారు. కానీ, ఆయన నిజమైన ఆధ్యాత్మిక, సిద్ధాంత వారసులు ఇంతవరకు పుట్టలేదు. ఆయన కల బాపూజీ జీవితకాలంలో దురదృష్టవశాత్తూ నిజం కాలేదు. కానీ ఎప్పటికైనా బాపూజీ కన్న కలల్ని మనం నిజం చేయాల్సిన భాద్యత మన భారతీయులందరిపై ఉంది.

వాణిజ్య వస్తువుగా మిగిలిపోయాడా?

గాంధీజీ ఆశయాలను ప్రతిక్షణం తూట్లు పొడుస్తూ, కేవలం కరెన్సీ నోట్లమీదే మహాత్ముడికి విలువ ఇస్తున్న ఇప్పటి తరాలు, రాబోయే తరాల గురించే  మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం ప్రపంచానికే ఆదర్శవంతమైన నేత గా ఎదిగిన మన బాపూజీ మన దేశం లోనే చాలామందికి ఒక వాడుక వాణిజ్య వస్తువుగా, ఒక వైఫల్యంగా, ఒక విమర్శగా మిగిలిపోయాడు. ఇది కేవలం నైతికంగా పతనమైన కొందరి దిగజారిన రాజకీయుల అభిప్రాయం.  కేవలం రాజకీయం. గాంధీజీ నిస్వార్ధపరుడు. ఆయనది స్వార్ధరహిత వ్యక్తిత్వం… అవినీతి , అశ్రీతపక్షపాతం బంధు ప్రీతికి ఆయన పూర్తిగా వ్యతిరేకం… ఏ పాపం ఎరుగని నిష్కల్మషుడు ఆయన…

గాంధీజీ పేరుతో వంచన

అన్యాయాలకు, పక్షపాతానికి, కులాలకు, మతాలకు వ్యతిరేకం గా తన జీవితాంతం అలుపులేని పోరాటం చేసిన ఒక మహోన్నత వ్యక్తి గాంధీజీ. స్వతంత్రం వచ్చినవెంటనే కాంగ్రెస్ పార్టీ ని రద్దుచేసి రాజకీయపార్టీ గా కాకుండా కేవలం ప్రజలకు నిస్వార్ధం గా సేవ చేసి సంస్థ గా మాత్రమే కొనసాగాలని చెప్పిన ఉత్తముడు గాంధీజీ. కానీ, కొందరు స్వార్ధపరులు ఇంకా గాంధీజీ పేరు, కాంగ్రెస్ పేరు చెప్పి వారి వారసులు గా ప్రజల్ని ఇంకా వంచిస్తూనే వున్నారు. ఎన్నెనో వందల పార్టీలు కాంగ్రెస్ తోక పేరు తగిలించుకొని ఇప్పటికీ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వీళ్ళెవరూ గాంధీజీ కీ ఆయన కాంగ్రెస్ పార్టీ కి ఎలాంటి వారసులు కారు..!

సత్యశోధకుడు

‘సత్యం’ తోనే ప్రయోగాలు చేసిన ‘సత్య’శోధకుడు మహాత్మాగాంధీజీ. ఆయన్ని భారతదేశం మొత్తం జీవితాంతం ప్రేమించింది, గౌరవించిందింది… ఆసేతుహిమాచలపర్యంతం కుల, మత, వర్గ విభేదాలకతీతంగా భారత ప్రజలందరూ గాంధీజీకి చందన కర్పూర నీరాజనాలు సమర్పించుకున్నారు. ఇప్పటికీ గుండెల్లో పెట్టుకున్నారు. ఒక రకంగా దేవుడిలా కొలిచారు. అందరివాడు అనిపించుకున్నాడు. భారతదేశ అధికారం మొత్తం కాళ్లపై పడ్డా, త్యాగం చేసి అధికారాన్ని తృణీకరించిన అత్యుత్తముడాయన. ఎటువంటి అధికారం, పదవులు ఆయన ఆశించలేదు. హిందూ ముస్లింలు రెండు కళ్ళుగా భావించే ఆయన అన్ని మతాలతో కూడిన అఖండ భారతదేశ స్వప్నం లక్ష్యం గా జీవితాంతం పోరాడాడు.

దేశవిభజన నివారించడంకోసం:

ఒక దశలో దేశవిభజన ను ఆపడానికి మొహమ్మద్ అలీ జిన్నాను అఖండ భారత ప్రధాని గా కూడా ప్రతిపాదించిన అమాయకుడు ఆయన. ద్విజాతి సిద్ధాంతం పై భారత జాతి విడిపోయినా మన దేశం లోని ఇతర మతాల రక్షణకు, లౌకిక సంరక్షణ కు ఆమరణ దీక్ష చేసిన ధీశాలి. ఆయన నమ్మినవాళ్లు ఆయన్ని మోసం చేసివుండొచ్చు. గాంధీజీ ఎవరికీ ద్రోహమో, విద్రోహమో ఎంతమాత్రం చేయలేదు. ఆయన్ని ఘోరంగా హత్య చేసి చంపే పాపమైతే అసలేమాత్రమూ  చేయలేదు. బాపూజీ ని మీరు ప్రేమించొచ్చు. ఇష్టపడొచ్చు. ద్వేషించొచ్చు. గౌరవించొచ్చు. విమర్శించవచ్చు. కోపంపెంచోకోవచ్చు. పూజించొచ్చు. తృణీకరించవచ్చు. కానీ విస్మరించలేరు. ఆయన చిరస్మరణీయుడు. భారత దేశ పవిత్ర ఆత్మ గాంధీజీ. భారతదేశ స్వతంత్రంలో, భారత జాతి నిర్మాణంలో గాంధీజీ పాత్ర చాలా విస్తృతం. అనంతం. చిరస్మరణీయం.

ఇది చదవండి: నేడు రాజ్యాంగ రూపకల్పనకు మూలమైన జాతీయోద్యమ స్ఫూర్తి ఎక్కడ?

బాపూ, మమ్ములను మన్నించు

ఓ బాపూ మమ్మల్ని మన్నించు…

రఘుపతి రాఘవ రాజారామ్

 పతిత పావన సీతారామ్

ఈశ్వర అల్లా తేరేనామ్

 సబ్ కొ సమ్మతి దే భగవాన్

తప్పు చేసినవారినీ, ఇప్పటికీ తప్పులు చేస్తున్నవారిని, మీ పట్ల మహాపరాధాలు చేసినవార్ని, ఇంకా చేస్తున్నవారినీ, మీ అమృతహృదయం తో క్షమించమని వేడుకొంటూ… ప్రార్ధిస్తూ…

జై హింద్… భారత మాతకు జై…

(జనవరి 30 – గాంధీజీ 73వ వర్ధంతి సందర్భంగా)

Ashoka Varma Penmetsa
Ashoka Varma Penmetsa
Mr. Ashoka Varma Penmetsa is a Senior Consultant of Advertising, Branding, Media& Public Relations. He has been in this field for more than 25 Years. He takes care of Corporate Communications Department at a Leading Healthcare Group as HOD. He is also a good writer.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles