- 125 సంవత్సరాల స్వామి శివానంద పురస్కారం గ్రహించిన అద్భుత దృశ్యం
- వివిధ ప్రాంతాలలో అనేకమందికి స్ఫూర్తిప్రసాదించిన అమృతమూర్తి
- కుష్ఠువాళ్ళకూ, ముష్టివాళ్ళకూ జీవితపర్యంతం సేవలందించిన కరుణామయుడు
‘పద్మపురస్కారాలు’ ఇప్పటి వరకూ పొందినవారు కొన్ని వేలమంది ఉన్నారు.125 ఏళ్ళ వయస్సులో పురస్కారాన్ని అందుకున్న ఏకైక వ్యక్తి స్వామిశివానంద మాత్రమే. అసలు 125 ఏళ్ళు బతికిఉండడమే పెద్ద ఆశ్చర్యం. అందునా అమిత ఆరోగ్యంతో స్వయంగా పురస్కారాన్ని స్వీకరించడం అసామాన్యమైన విషయం. వేడుక జరుగుతున్న ‘దర్బార్ హల్’ లో పురస్కారం అందుకోడానికి ఆయన సిద్ధమవ్వగానే ప్రపంచమంతా ఆయన వైపు అమితాశ్చర్యంగా చూసింది. దేశ ప్రథమ పౌరుడికి, దేశాధినేతకు, భూమాతకు తన శరీరాన్ని వంచి అభివందనం చేస్తుంటే.. యావత్తు మానవలోకం నిబిడాశ్చర్యంలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఆయన కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోలేదు. ఆ ప్రాంగణాన్ని దేవాలయంగా భావించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ సంస్కారానికి కదిలిపోయి ప్రతినమస్కారం చేశారు.
Also read: ఇంటి నుంచి పనికి ఇకపై స్వస్తి?
పులకించిన ప్రపంచం
ఈ అద్భుత దృశ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది చూశారు. ‘దర్బార్ హాల్’ కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. అందరూ లేచి నిలబడి తమ భక్తిప్రపత్తులు చాటుకున్నారు. “నా ఇంటిపేరు ప్రపంచం – ప్రజలే నా కుటుంబం – వెదజల్లుతా దిగ్దిగంతం అభ్యుదయ సుగంధం- -అప్పుడు నా జీవితమే ఒక ప్రబంధం” అన్నాడు మహాకవి శ్రీ శ్రీ. స్వామి శివానంద జీవిత సిద్ధాంతానికి ఈ కవితా పంక్తులు నూటికి నూరు శాతం సరిపోతాయి. “ప్రపంచమే నా ఇల్లు – ప్రజలే నా తల్లిదండ్రులు -ప్రేమ, సేవ నా మతం ” అన్నారు శివానంద. అనడమే కాదు. ఆచరించి చూపించారు, ఆచరిస్తూనే ఉన్నారు. బెంగాల్ లోని నవద్వీపం (నబ్ ద్వీప్)లో మొదలైన ఆ జీవితం అనేక ప్రాంతాలలోని అసంఖ్యాక అభాగ్యుల జీవితాలలో దీపం వెలిగించింది. కుష్ఠువాళ్ళకు, ముష్టివాళ్ళకు ఇంతగా అంకితమైనవారు ఇంకొకరు లేరనే చెప్పాలి. ఆయనకేమీ ట్రస్టులు, వ్యవస్థలు లేవు. ఆయనే ఒక వ్యవస్థ. ప్రతిరోజూ కొన్ని వందలమందికి ఆ నిస్వార్ధ సేవ దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు, పూరి, హరిద్వార్ లోనూ ఈ మహామనిషి ఎందరికో తన ఆపన్నహస్తాన్ని అందించారు. కొన్నేళ్లుగా వారణాసిలోని రోగులకు తనను తాను అంకితం చేసుకున్నారు. “రోగులలో, అభాగ్యులలో నాకు దైవం కన్పిస్తారు” అని స్వామి చెబుతూ ఉంటారు. పురస్కారాల కోసమో, కీర్తికాంక్షతోనో ఆయన ఈ సేవాజీవితాన్ని మొదలు పెట్టలేదు. తన జీవితంలో నుంచే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. తన ఆరేళ్ళ వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. వారేమీ ధనవంతులు కారు. కటికపేదవాళ్లు. బిక్షాటన ద్వారానే జీవించేవారు. ఆ మార్గంలో దొరికిన ఆ కాస్త ఆహరంతోనే కడుపునింపుకోవడం అప్పటి నుంచే అలవాటైంది. బీదల పట్ల, బిక్షుల పట్ల అనురాగం అప్పుడే అంకురించింది. తల్లిదండ్రులను పోగొట్టుకున్న తర్వాత గురువు ఓంకారానందస్వామి అన్నీ తానై పెంచి పెద్ద చేశారు. మామూలు చదువులు చెప్పలేదు. ఆధ్యాత్మిక విద్య, యోగాభ్యాసం మాత్రమే నేర్పించారు. పాఠశాలల గడప తొక్కలేదు. గురు బోధనల ద్వారా, స్వానుభవాల నుంచి సంస్కారాన్ని, జ్ఞానాన్ని విద్యగా పొందారు.’ సమాజం కోసమే జీవితం ‘ అనే బోధనను ఆచరణలోనే అభ్యసిస్తూ వస్తున్నారు. సేవ,ధ్యానం, యోగ… ఇవే ఆయన జీవనశైలి. అందుకే ఆయన ‘యోగి’ శబ్దవాచ్యుడు.
Also read: యుద్ధపర్వంలో ఎత్తులు పైఎత్తులు
అతినిరాడంబర జీవితం
అతి సాధారణమైన జీవన విధానం. అన్నం, ఉడికిన పప్పు.. ఇదే ఆయన ఆహరం. అందులోకి కాసిన్ని పచ్చిమిరపకాయలు. పాలు,పండ్లకు పూర్తి దూరం. అవి భాగ్యవంతుల ఆహారమని ఆయన భావన (ఫ్యాన్సీ ఫుడ్). అందరు వ్యక్తుల పట్ల, జీవితంలోని అన్ని పరిణామాల పట్ల సమభావం, సానుకూల దృక్పథం (పాజిటివ్ థింకింగ్) ఆయన నైజం. కరోనా కాలంలో ఆయన చేసిన సేవ అనితర సాధ్యం. పండ్లు, పాలు ఆయన తీసుకోకపోయినా, రోగులకు పండ్లతోపాటు, బట్టలు,
దుప్పట్లు, దోమతెరలు, వంటసామగ్రి, కావాల్సిన సరుకులు, సరంజామా అందిస్తూ ఉన్నారు. ఈ సేవలో స్వచ్ఛందంగా ఎవరు ముందుకు వస్తే వారిని కలుపుకెళ్తూ ఉంటారు. ప్రతిరోజూ ధ్యాన,యోగ విద్యలను సాధనం చెయ్యడం, బోధించడం తన కర్తవ్యంగా పెట్టుకున్నారు.125 ఏళ్ళ వయస్సులోనూ అంత చలాకీగా ఉండడానికి ఆయన సాధన, మానసిక ప్రవృత్తి, జీవనశైలి ప్రధానకారణాలు. ఈయన శారీరక, మానసిక ఆరోగ్యాలను అధ్యయనం చెయ్యడానికి ప్రపంచ దేశాల నుంచి ఎందరెందరో శాస్త్రవేత్తలు, వైద్యులు, వృత్తినిపుణులు వచ్చిపోతూనే ఉన్నారు.125 ఏళ్ళ ఈ యువకుడిపై ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని వేటినీ పట్టించుకోకుండా, స్వధర్మ సాధన దిశగా,ఆయన తన మానాన తాను బతుకుతున్నారు, ఎందరినో బతికిస్తున్నారు. ఈ భూమిపై ఇటువంటి మహనీయులు ఎందరు ఉన్నారో వెతుకుదాం. వారి నుంచి జీవితసారాన్ని, జీవన గమ్యాన్ని తెలుసుకుందాం. ఎప్పుడో 1896లో ఆగస్టు 8 వ తేదీన అవిభాజ్య భారతదేశంలోని సిల్హెత్ లో ఈ మహనీయుడు జన్మించాడు. ఇది ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉంది. ఎప్పటి మనిషి?! ఇప్పటికీ ఉక్కుసంకల్పంతో ఉక్కుమనిషిలా ఉన్నారు. నేటి ఆధునిక మానవప్రపంచానికి అమితాశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. తెల్లని ధోవతి, కుర్తా వేసుకొని, అతి సామాన్యంగా జీవించే స్వామి శివానంద అసామాన్యుడు, ఆదర్శపురుషుడు. ఈ శతాధిక పురుషుని పాద’పద్మ’ములకు శతకోటి వందనాలు. ఇటువంటి మాననీయులకు పురస్కార గౌరవాలు అందిస్తే ‘పద్మం’ నిజంగా పులకిస్తుంది.
Also read: మరోసారి పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్