Sunday, November 24, 2024

మళ్ళీ వస్తోంది మహమ్మారి!

వ్యాక్సిన్ల రాకతో, ఇక కరోనా అధ్యాయం ముగిసినట్లేనని అందరూ భావిస్తున్నారు. కొత్తరకం వైరస్ లు పుట్టుకొస్తున్నా, అవి ప్రమాదకరం కావని ప్రచారం జరగడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఒకప్పటి సాధారణ పరిస్థితులు తిరిగి వస్తున్నాయి. వినోదాలు, వేడుకల్లో పాల్గొనేవారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఎయిర్ పోర్టులు, దుకాణాలు, రెస్టారెంట్లు,సినిమా థియేటర్లు, కూడళ్ళలో రద్దీ పెరిగిపోయింది. మాస్కులు ధరించడం మినహా, భౌతికంగానూ దగ్గరవుతున్నారు.

రెండో డోస్ వాక్సిన్ ప్రారంభం

వ్యాక్సిన్ రెండవ డోస్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 50 ఏళ్ళు పైబడిన వారికి కూడా మార్చి నుంచి వ్యాక్సినేషన్ మొదలు పెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తంమీద, నిన్నటి వరకూ ఉన్న నిస్సత్తువ నుంచి బయటకు వచ్చి, కొత్త ఉత్సాహంతో ప్రజలు ముందుకు సాగుతున్నారు. ఇటువంటి శుభ తరుణంలో, మళ్ళీ కరోనా విజృంభణ మొదలైందనే పాడు వార్తలు కలవరం పెడుతున్నాయి.

ఇది చదవండి: కరోనా వ్యాక్సినేషన్ రెండో డోస్ ప్రక్రియ ప్రారంభం

నాలుగింట మూడు కొత్త కేసులు కేరళ, మహారాష్ట్రలోనే

ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో కేసుల సంఖ్య పెరుగుతోంది. పుణేలో వైరస్ తీవ్రత ఎక్కువ కావడంతో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించడానికి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ గా ఉన్న కేసుల్లో 75శాతంకు పైగా మహారాష్ట్ర, కేరళలోనే ఉన్నాయి. యాక్టివ్ కేసులు సంఖ్యాపరంగా కేరళలోనే ఎక్కువగా ఉన్నాయి. మనదేశంలో కరోనా కేసులను మొదటిగా గుర్తించిన రాష్ట్రం, తక్కువ సమయంలోనే అదుపులోకి తెచ్చి అందరి మన్ననలు పొందింది కూడా ఈ రాష్ట్రమే. ఇప్పుడు అధికంగా కొత్త కేసులు నమోదవుతుంది కూడా కేరళయే కావడం ఆశ్చర్యంగా ఉంది. ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, పంజాబ్, జమ్మూకశ్మీర్ లోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

పెరుగుతున్న రాకపోకలు

రాష్ట్రాల మధ్య రాకపోకలు కూడా బాగా పెరుగుతున్నాయి. దిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంలో, భౌతికదూరం మరచి వేలాదిగా పాల్గొంటున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమంలోనూ పాల్గొంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొత్త రకం కరోనా వైరస్ లు పెరిగిపోతున్న నేపథ్యంలో, అన్ని రాష్ట్రాల ప్రజలూ అప్రమత్తంగా ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే వుంది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. నిన్నటి వరకూ తమిళనాడులో కరోనా తీవ్రస్థాయిలో విజృంభించింది. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాధి నిరోధకత సాధించడం అంత తేలికైన విషయం కాదు.

ఇది చదవండి: కరోనా ప్రపంచానికి నేర్పిన సంస్కారం మన నమస్కారం

వేగంగా వ్యాపించే లక్షణం

కొత్త కరోనా రకాలకు వేగంగా వ్యాపించే లక్షణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. ఇప్పటికే కరోనా వచ్చి, తగ్గినవారిలోనూ, యాంటీ బాడీస్ ఉన్నవారిలో కూడా మళ్ళీ కరోనా సోకే ప్రమాదం ఉందని అంటున్నారు. వేగంగా వ్యాప్తి చెందే లక్షణమే ప్రమాదహేతువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకూ 240 కరోనా రకాలను గుర్తించారు.వ్యాక్సిన్ వేసుకున్నవారికి ఎటువంటి ప్రమాదం ఉండదని ఇప్పటి వరకూ చెప్పారు.

వాక్సన్ తీసుకున్నవారికీ కరోనా ప్రమాదం

వైరస్ లోని మ్యుటేషన్స్ కారణంగా వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా మళ్ళీ కరోనా సోకే ప్రమాదం ఉందని ఇప్పుడు చెబుతున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. దీనిపై ఇంకా స్పష్టత రావాలి. కరోనా సోకినవారిలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తీవ్రతను కనిపెట్టేందుకు కృత్రిమ మేధను ఆశ్రయిస్తున్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ పరిశోధకులు ఈ సాఫ్ట్ వేర్ ను రూపొందించారు. దీని ద్వారా ఊపిరితిత్తుల పనితీరును తెలుసుకొని, వేగంగా చికిత్సను అందించవచ్చు. కొత్త కరోనా వైరస్ ల వ్యాప్తి తీవ్రత ఆందోళన కలిగిస్తున్న ఈ తరుణంలో మరింత అప్రమత్తంగా ఉండడం అవసరం. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజింగ్ వాడడం విధిగా భావించాలి.

వాక్సీన్ల విషయంలో రాజీ లేదు

ఎన్నో కొత్త వ్యాక్సిన్లు ఇంకా తయారీ దశలో ఉన్నాయి. అత్యంత ప్రభావవంతంగా వ్యాక్సిన్ల రూపకల్పన జరగాలి. ఈ విషయంలో ఏ దశలోనూ రాజీ పడకూడదు. జనాభా అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి కావాలంటే చాలా ఏళ్ళ సమయం పడుతుంది. ఇప్పటికే అనేక వ్యవస్థలు ఛిద్రమయ్యాయి. మానవ సంబంధాలు మృగ్యమయ్యాయి. కరోనాతో మళ్ళీ పోరాటం చేయాల్సిన పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. ఇందులో ప్రభుత్వాలకు, ప్రజలకు కూడా సమ భాగస్వామ్యం ఉంది. సెకండ్ వేవ్ తో తస్మాత్ జాగ్రత్త.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles