‘రుణాను బంధ రూపేణా
పశు పత్నీసుతాలయ‘ అన్నారు.
బాగా చదివితే మెచ్చుకుంటారు తలిదండ్రులు
బాగా సంపాదిస్తే ఆరాధిస్తుంది భార్య
ఎన్ని కొనిపెడతామో చూసి
అభిమానిస్తారు సహోదరులు
ఏమి ఇస్తామోనని
ఎదురు చూస్తారు పిల్లలు
అందరితో బాంధవ్యానికి మూలం
నువ్వు చెల్లించే మూల్యం — డబ్బు.
ఏమీ ఆశించకుండా
సహచర్యం మాత్రం కోరుకునేది — స్నేహం
కలియుగ ప్రభావమేమో
అదీ కల్తీ అయింది
దాన్ని కాలాక్షేపం బటానీలా భావించే వాళ్ళు
అవసరమైనంత మేర ఉపయోగించుకునే వాళ్ళు
లెక్కకు మిక్కుటంగా కనిపిస్తున్నారు.
మనసులు, బ్రతుకులు ఒకటై బ్రతికేవాళ్ళు
మచ్చుకు కూడా కనిపించడం లేదు.
రాగ ద్వేషాలు, ఈర్ష్యాసూయలు
రాజ్యమేలుతున్నాయి.
ఎందుకు ఇష్టపడతాడో
ఎప్పుడు ద్వేషిస్తాడో
తనకే తెలియని పరిస్థితిలో
ప్రతి ఒక్కడు బ్రతికేస్తున్నాడు.
అవతలి వాడితో పోల్చుకోకుండా
బ్రతకడం చేతకావడం లేదు.
సంబంధాలు బంధనాలై పోయాయి
విముక్తి పొందితేనే ముక్తి.
Also read: కల్తీ
Also read: అంతంలో అనంతం
Also read: 26/11
Also read: న్యాయం
Also read: రైలు దిగిన మనిషి