Thursday, November 21, 2024

బాలీవుడ్ భామల వేధింపు

(‘సకలం’ ప్రత్యేక ప్రతినిధి)

రాజకీయ నాయకులకూ, సినిమా స్టార్లకూ మధ్య సంబంధాలు విచిత్రంగా ఉంటాయి. ఈ మధ్య బాలీవుడ్, టోలీవుడ్ తారలపైన డ్రగ్స్ కేసులు పెట్టి విపరీతంగా బదనాం చేసేవిధంగా పత్రికలలోనూ, టీవీ చానళ్ళలోనూ ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వాల వైఫల్యాలను నుంచి ప్రజల దృష్టి మరల్చడం ఒక ఉద్దేశం కావచ్చు. బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిహార్ కూ,మహారాష్ట్రకూ మధ్య కృత్రిమ వైరం సృష్టించడంలో భాగంగా బాలీవుడ్ పైన పడి ఉండవచ్చు.  దీపికా పడుకోన్ వంటి అగ్రశ్రేణి నటిని సైతం విడవకుండా నార్కోటిక్స్ విభాగం అధికారులు  గంటలకొద్దీ ప్రశ్నిస్తున్నారు. తెలుగు సినిమాలలో నటిస్తూ, హైదరాబాద్ లో స్థిరపడిన రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా ఆరేడు గంటల సేపు నిశితంగా ప్రశ్నించారు. ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజపూత్ అనుమానాస్పద మరణంతో, అతనితో నటీమణి రియా చటర్జీ సంబంధాల విచారణ ఒక వైపు, బిహార్ ఎన్నికలలో రాజపూత్ చావును సొమ్ము చేసుకోవాలన్న ఎన్నికల వ్యూహం మరో వైపు బాలీవుడ్ తారలని వేధిస్తున్నాయి.

సాంస్కృతిక రాయబారులు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సినిమా నటుల వల్ల దేశానికి మేలే కానీ కీడు జరిగిన దాఖలాలు లేవు. వారు సాంస్కృతిక రాయబారులుగా పని చేసేవారు. రాజకపూర్ పేరు చెబితే మాస్కోలో రష్యన్లు అభిమానించేవారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి వారూ విదేశీయుల మనసు దోచుకున్నారు. రజనీకాంత్ ను జపాన్ లో నాట్యం చేసే మహరాజుగా అభిమానిస్తారు. అటువంటిది నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాలీవుడ్ నటీనటుల మతాలూ, కులాలూ ప్రాముఖ్యత సంతరించుకున్నాయనీ, హిందీ చలనచిత్ర పరిశ్రమలో ముస్లింల ఆధిపత్యం ఎక్కువగా (సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ లు హీరోలుగా వెలుగుతున్నారు. జావెద్ అఖ్తర్ రచయితగా సాగుతున్నారు) ఉన్నదనీ, హిందీ కంటే ఉర్దూకు ఎక్కవ చలామణి ఉన్నదనే దుగ్థ కొందరిని బాధిస్తున్నదనీ, ఈ కారణంగా ఇబ్బందులు పెరిగాయని బాలీవుడ్ నటీనటులూ, సాంకేతిక  సిబ్బంది అనుకుంటున్నారు.  బీజేపీలో హిందూత్వవాదుల ప్రమేయం కారణంగానే ఇటువంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు.  ఇండియాలో నివసించడం క్షేమదాయకం కాదంటే తన భార్య వ్యాఖ్యానించిందని ఆమిర్ ఖాన్ కొంతకాలం కిందట చెప్పడం పెద్ద వివాదానికి దారి తీసింది.

అక్కినేనిపట్ల అసహనం

డ్రగ్స్ వంటి గొడవలు లేకపోయినా తెలుగులో వెండితెర వేల్పులకూ, రాజకీయ నేతలకూ మధ్య సంబంధాలు ఒక రీతిలో ఉండేవి కావు. 1960-70లలో నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తెలుగు పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్  కు తరలించాలని ప్రయత్నం చేసినప్పుడు ఆయనకూ, ఆయనకు సన్నిహితులైన నిర్మాతలకూ నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, అనంతరం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి విలువ ఇచ్చేవారు. అక్కినేని నటించిన, ఆయన స్నేహితులైన నిర్మాతలు నిర్మించిన సినిమాలకు రాయితీలు ఇచ్చేవారు. ఒక సారి నాటి ముఖ్యమంత్రి కాసుబ్రహ్మానందరెడ్డి మద్రాసు వెళ్ళారు. విజయాగార్డెన్స్ లో నాగిరెడ్డి ఆధ్వర్యంలో సన్మానం ఏర్పాటు చేశారు. ఎస్. వి. రంగారావు వినతిపత్రం చదివి వినిపించారు. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క హీరోకీ (అక్కినేనికి), అయనకు సన్నిహితులైన నలుగురు నిర్మాతలకీ ప్రాధాన్యం ఇస్తున్నదనీ, తమకు కూడా రాయితీలు ఇవ్వాలనీ అడిగారు. సత్యజిత్ రే వంటి దర్శకుడిని అందించే అవకాశం తెలుగు చిత్రసీమకు ఇవ్వాలని అభ్యర్థించారు.  చిత్ర పరిశ్రమను తరలించే విషయంలో తమను కూడా సంప్రదించాలని వారు కోరారు. అప్పటికే హైదరాబాద్ కు మకాం మార్చివేసిన అక్కినేని పట్ల వ్యతిరేకత ఉండేది. మద్రాసు పరిశ్రమలోని వారందరూ నటరత్న ఎన్. టి. రామారావు పక్షాన ఉండేవారు. ఆ తర్వాత అక్కినేనికి పద్మశ్రీ ఇవ్వవలసిందిగా సిఫార్సు చేసినప్పుడు ఎన్. టి. ఆర్ ను విస్మరించకూడదని బ్రహ్మానందరెడ్డి గుర్తించారు. ఇద్దరికీ ఒకే సంవత్సరం పద్మశ్రీ అవార్డు ఇప్పించారు. ఒకరిని అభిమానించడం ఉన్నది కానీ ఎవరినీ ద్వేషించడం అనేది ఉండేది కాదు.

కిశోర్ కుమార్ బహిష్కరణ

త్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)లో ప్రముఖ నేపథ్య గాయకుడు కిశోర్ కుమార్ ని ఆకాశవాణి బహిష్కరించింది. అందువల్ల కిశోర్ కుమార్ కు నష్టం జరగలేదు. ఇందిరాగాంధీకి చిత్రపరిశ్రమలో చెడ్డపేరు వచ్చింది. అమెరికాలోనూ అధ్యక్షుడికీ, సినీ నటీనటులకూ మధ్య సంబంధాలు రకరకాలుగా ఉండేవి. కొందరు అధ్యక్షులు హాలీవుడ్ తారలతో సన్నిహితంగా ఉండేవారు. వారిలో జాన్. ఎఫ్. కెన్నడీ ముఖ్యులు. రొనాల్డ్ రేగన్ స్వయంగా హాలీవుడ్ నుంచి నేరుగా సెనేట్ కూ, అధ్యక్ష నివాసమైన శ్వేతభవనానికీ వచ్చారు. బిల్ క్లింటన్ సైతం హాలీవుడ్ తారలతో సత్సంబంధాలు పెట్టుకునేవారు.  ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సినిమావాళ్ళంటే పడదు. నెహ్రూ, ఇందిర, రాజీవ్ హయంలలో నర్గీస్ తోనూ, సునీల్ దత్ తోనూ, రాజకపూర్ తోనూ, రాజేష్ ఖన్నాతోనూ సన్నిహిత సంబంధాలు ఉండేవి. వాజపేయి సర్కార్ కు కూడా హిందీ చలనచిత్ర పరిశ్రమతో ఎటువంటి పేచీ లేదు.

మోదీ వచ్చిన తర్వాత ముస్లిం హీరో త్రయం ప్రాముఖ్యం తగ్గిచడానికీ, అక్షయ్ కుమార్ వంటి నాయకుల ప్రాబల్యం పెంచడానికి ప్రయత్నం విశేషంగా జరుగుతోంది. బీజేపీకి అనుపమ్ ఖేర్ వంటి నటులు దగ్గరైనారు. బాలీవుడ్ లో ఉర్దూ ప్రాబల్యాన్నీ, ముస్లిం నటీనటుల ప్రాముఖ్యాన్నీ తగ్గించే ప్రయత్నం బుద్ధిపూర్వకంగా జరుగుతోందని అంటున్నారు. సుశాంత్ సింగ్ రాజపూత్ విషయంలో కుల ప్రస్తావన లేకపోయినప్పటికీ, కంగనా రనౌత్ వ్యాఖ్యలు మతంవైపు లాగుతున్నట్టు కనిపిస్తున్నాయి. ముంబయ్ ఆక్రమిత కశ్మీర్ లాగా ఉన్నదంటూ ఆమె చేసిన వ్యాఖ్య దుమారం సృష్టించింది.

నేరం చేస్తున్నవారిపై చర్యలు సబబే

బాలీవుడ్ కూ అండర్ గ్రౌండ్ డాన్లకూ ఉన్న సంబంధాలనూ, బాలీవుడ్ లో చెలామణి అవుతున్న నల్లధనం మూలాలనీ, డ్రగ్స్ వినియోగం వంటి దురాచారాలనీ పరిశోధించి నివారణ చర్యలు తీసుకోవలసిందే. కానీ పరిశోధన పేరుతో ఒకానొక మతం వారిని అనుమానంతో చూడటం, దూరంగా పెట్టడం మంచిది కాదు. బిహార్ ఎన్నికలు పూర్తియిన తర్వాతనైనా బాలీవుడ్ లో యథాతథ స్థితి పునరుద్ధరిస్తే హిందీ చలనచిత్ర పరిశ్రమలో వెలుగుతున్న తారలు దేశానికి మంచి పేరు తెస్తారు. నటీనటుల వ్యక్తిగత జీవితాలను బజారుకీడ్చి యాగీ చేయరాదని టీవీ చానళ్ళకు ఎవరైనా గట్టిగా చెప్పాలి. నరేంద్రమోదీ ప్రభుత్వం ఆ పని చేయగలిగితే మచ్చ మాపుకోవచ్చు. అనుమానాలు నివృత్తి చేయవచ్చు. రాజ్యాంగం దృష్టిలో దేశంలోని పౌరులందరూ సమానమే. అందరికీ ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అందరికీ ఆదేశకసూత్రాలు వర్తిస్తాయి. ఎవ్వరినీ ద్వితీయశ్రేణి పౌరుల స్థాయికి దిగజార్చకూడదు. అప్పుడే భారత్ అనే పవిత్ర భావన (ద ఐడియా ఆఫ్ ఇండియా) చెదరకుండా, దుర్భేద్యంగా, పదిలంగా ఉంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles