—————————
( From ” The Wanderer ” by KAHLIL GIBRAN)
(తెలుగు సేత : డా. సి. బి. చంద్ర మోహన్)
6. డేగ – భరత పక్షి
—————————
ఒక డేగ, మరియు ఒక భరత పక్షి ఎత్తైన
పర్వతం మీద ఒక శిలపై కూర్చున్నాయి.
భరత పక్షి అంది కదా ” శుభోదయం అండీ!”
అని. డేగ, ఆ పక్షిని ఎగా దిగా చూసి, అయిష్టంగా
“శుభోదయం” అంది.
భరత పక్షి ” అంతా బాగానే ఉంది కదా మీకు?!” అంది.
“ఆ…. ఆ! అంతా బాగానే ఉంది. కాని మేము పక్షి రాజులం కదా! మా అంతట మేము మాట్లాడకుండా మమ్ములను పలకరించ కూడదని
నీకు తెలీదా?” అని డేగ అంది.
“మనం ఒకే కుటుంబానికి ( జాతికి) చెందిన
వారం కదా! అనుకున్నాను.” అంది భరత పక్షి.
డేగ ఆ పక్షిని తృణీకారంగా చూస్తూ “ఎవరు
చెప్పారు మనం ఒకే కుటుంబం అని ?” అంది.
అపుడు భరత పక్షి అంది కదా !” నువ్వు
ఎగిరినంత ఎత్తుకి నేనూ ఎగరగలను. నేను నా పాటతో మిగిలిన ప్రాణులను అలరింపగలను. నువ్వు ఆనందమూ పంచలేవు, సంతోషమూ ఇవ్వలేవు.”
డేగకు కోపం వచ్చింది. ” ఆనందమూ – సంతోషమూనా! నువ్వు అల్ప జీవివి. నా కాలు అంత లేవు. నా ముక్కుతో ఒక్కసారి పొడిస్తే చాలు-
నాశనమై పోతావు.” అని కసిరింది.
భరత పక్షి పైకెగిరి డేగ వెనక భాగంలో దిగి,
దాని ఈకలు పీక సాగింది. డేగకు కోపం, చిరాకు వచ్చాయి. ఆ పక్షిని తప్పించుకుంటానికి , వేగంగా ఇంకా ఎత్తుకి ఎగిరింది. కాని కుదర లేదు. చివరకు
మరలా ఆ పర్వతం పైన శిల మీద వాలింది. భరత పక్షి మాత్రం దాని వీపు మీదే ఉంది. డేగ తన తల రాతను తిట్టుకుంటూ మరింత చిరాకు పడింది.
అదే సమయంలో ఒక తాబేలు అటుగా వచ్చి, జరుగుతున్నదంతా చూసి పడీ పడీ నవ్వసాగింది.
డేగ, కింద తాబేలు వైపు చూసి ” లోకంలో
అన్ని ప్రాణుల కన్నా నెమ్మదిగా కదులుతావు. నువ్వు
కూడా నవ్వుతున్నావా !? ఎందుకు?” అంది.
తాబేలు “ఇప్పుడు నువ్వొక గుర్రానివి. నీ పైన ఆ పక్షి సవారీ చేస్తోంది. అదే నీ కన్నా ఉన్నత మైనది.” అని అంది.
అప్పుడు డేగ, తాబేలుతో కోపంగా ఇలా అంది ” ఇది నాకూ, నా తమ్ముడు భరత పక్షికీ మధ్య ఉన్న కుటుంబ వ్యవహారం. పోయి నీ పని చూసుకో!”
Also read: కాదేదీ బూతుకనర్హం!
Also read: ఇట్లు అమ్మ
Also read: అనాచ్ఛాదితము
Also read: విపణి వీథి
Also read: వాంఛ