* టాప్ ర్యాంక్ ఇంగ్లండ్ కు భారత్ సవాల్
* మోడీ స్టేడియంలో స్టార్స్ వార్
కొత్త దశాబ్ది…తొలిసంవత్సరం టీ-20 చరిత్రలోనే అతిపెద్ద సమరానికి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రంగం సిద్ధమయ్యింది. ఐదుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గురువారం రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే తొలిపోరులో టాప్ ర్యాంకర్ ఇంగ్లండ్ కు రెండో ర్యాంకర్ భారత్ సవాలు విసురుతోంది.
ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లోనే రెండు అతిపెద్ద జట్ల నడుమ జరిగే ఈ పోరు కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది క్రికెట్ అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
Also Read : భారత క్రికెట్లో ప్రతిభావంతుల అతివృష్టి
స్థానబలంతో భారత్
కొద్దిరోజుల క్రితమే ముగిసిన నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో 3-1తో ఇంగ్లండ్ ను చిత్తు చేసిన ఆతిథ్య భారతజట్టు ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో సైతం అదేజోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది.
విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టులో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, హార్థిక్ పాండ్యా లాంటి మేటి ఆటగాళ్లున్నారు.
పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ కలిగిన భారతజట్టుకు పదునైన బౌలింగ్,చురుకైన ఫీల్డింగ్ సైతం అదనపు బలంగా ఉన్నాయి. తమదైనరోజున ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేయగల పలువురు ఆటగాళ్ళు భారతజట్టులో ఉన్నారు.
Also Read : విజయ్ హజారే టోర్నీలో కుర్రోళ్ల జోరు
ఆల్ రౌండ్ బలంతో ఇంగ్లండ్
టీ-20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా ఉన్న ఇంగ్లండ్…వోయిన్ మోర్గాన్ నాయకత్వంలో భారత గడ్డపై భారత్ ను చిత్తు చేయాలన్న పట్టుదలతో ఉంది.
సూపర్ ఓపెనర్ డేవిడ్ మలాన్, డాషింగ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, జానీ బెయిర్ స్టో, సామ్ బిల్లింగ్స్, సామ్ కరెన్, క్రిస్ జోర్డాన్, అదిల్ రషీద్, జేసన్ రాయ్, మార్క్ వుడ్ లాంటి ఆటగాళ్లతో అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.
Also Read : శిక్షకుల్లో మహాశిక్షకుడు రవిశాస్త్రి
గురువారం రాత్రి 7గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో టాస్ కీలకం కానుంది. మ్యాచ్ కు వేదికగా ఉన్న మోతేరా పిచ్ బ్యాటింగ్ కు ఏమాత్రం అనుకూలంగా ఉన్నా పరుగుల వెల్లువతో హైస్కోరింగ్ గేమ్ గా ముగిసే అవకాశం లేకపోలేదు.
లక్షా 13వేల సీటింగ్ సామర్థ్యం కలిగిన నరేంద్ర మోడీ స్టేడియంలోకి..కోవిడ్ నిబంధనల ప్రకారం..50 వేల మందిని మాత్రమే అనుమతించే అవకాశం ఉంది.