—హిమజ
అయినవాళ్ళొకరు అలా
అకస్మాత్తుగా, అకాలంగా
చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారు
గుండెఒక శూన్యపు దిగుడు బావి అయిపోతుంది
చివరిగా కలుసుకున్నదీ
చూసుకున్నదీ
తరచి తరచి తోడి చూసుకుంటాం
ఆఖరుగా ఏం మాట్లాడి ఉంటాం
అప్పుడు ఇదే చివరి చూపు అని
ఊహించనైనా ఊహించిఉండము
కలిసి ఉన్న కాలమెలా గడిచినా
చివరాఖరి గుర్తులు
ఆ మనిషి పంచిన ప్రేమ
మనకై పడిన ఆరాటం
తనవారి కోసం తండ్లాట
తలచి తలచి విలపిస్తాం
జాడ దొరకక కన్నీటి జల్లెడవుతాం
కరాళ కాలపు కోరలలో
ఉన్నచోటే ఉన్నారులే
అనుకోమంటుంది మనసు
అపుడిపుడు
యోగక్షేమాలు విచారించే
ఆ స్వరం
కాలం గడిచిన కొద్దీ
మదిమూలల్లో మారుమోగడం
మొదలవుతుంది
ఇష్టం లేకున్నా
కష్టమైనా
మనిషి లేనితనం
మనిషి మాయమైన నిజం
ఆ క్షణం నుంచే నమ్మాల్సివస్తుంది
………………….