నేను కవిత్వం రాయలేను
నాకు వసంతం కనుపించడం లేదు
కోయిల పాట వినిపించడం లేదు
దౌర్జన్యం ఢంకా మోగిస్తూ చెలరేగుతుంటే
కబ్జాలు నిత్యకృత్యాలవుతుంటే
మేధావుల గొంతులు మూగ పోతుంటే
ఆలోచనాపరులు అచేతనులవుతుంటే
రక్షకులే రాకాసులుగా మారి
అన్యాయాన్ని ఆదాయ మార్గం చేసుకుంటే
మదిర మత్తులో జనం ఊగుతుంటే
మాన మర్యాదలు మంట గలిపే
నిందలు, అవమానాలు సంభాషణలైతే
మావి చిగుళ్లు, ఉగాదులు మనసుని అలరించకుంటే
మదిలో మెదిలే భావనలు అరణ్య రోదనలవుతుంటే
సామాన్యుడు బిక్కుబిక్కుమని బతుకుతుంటే
నేను ఉగాది కవిత్వం ఎలా రాయను?
కవులు గతాన్ని, కలల్ని వదలి
వర్తమానంలోని సత్యాన్ని ఎలుగెత్తి చాటినపుడు
శోభకృత నామ సంవత్సరం
బతుకును శోభాయమానం చేసినపుడు
ఆనంద తాండవం చేస్తాను
ఆనాడే నవ యుగాది కవితను రాస్తాను.
Also read: “స్త్రీ”
Also read: “కామ దహనం”
Also read: “కర్తవ్యం”