- రాష్ట్రంలో మతసామరస్య కమిటీల ఏర్పాటు
- జిల్లా, రాష్ట్రస్థాయిల్లో కమిటీల ఏర్పాటు
- ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై జరుగుతున్న దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై జగన్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. వరుస దాడులపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా కీలక చర్యలు తీసుకుంది. ఇందుకోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో మత సామరస్య కమిటీలు ఏర్పాటుచేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీఎస్ ఆదిత్య నాథ్ దాస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు కానుంది.
ఇదీ చదవండి: ముఖ్యమంత్రి మతసామరస్యాన్ని కాపాడలేరా -పవన్
కమిటీలో మత పెద్దలకు ప్రాధాన్యం
20 మంది సభ్యులుండే కమిటీలో హోం శాఖ, దేవాదాయ, మైనార్టీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర కమిటీలో సభ్యుడిగా సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్శదర్శి ఉంటారు. రాష్ట్ర కమిటీలో సభ్యులుగా అన్ని మతాలకు ప్రాతినిథ్యం కల్పించనున్నారు. ఇందులో ఒక్కో మతానికి చెందిన ఒక్కొక్కరికి చోటు కల్పిస్తారు. కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. ఆలయాలపై వరుస దాడులతో రాష్ట్ర ప్రతిష్ఠ మసకబారుతోందని ఏపీ సీఎస్ ఆదిథ్యనాథ్ దాస్ అన్నారు. రాష్ట్రంలో మతసామరస్యం కాపాడేందుకు జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి కమిటీల ఏర్పాటుకు జీవో నెంబర్ 6 విడుదల చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఆలయాల పునర్మిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ
మేం కన్నెర్రజేస్తే అంతే సంగతులు–జీవీఎల్
అయితే మతసామరస్య కమిటీలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కన్నెర్రజేస్తే ప్రాంతీయ పార్టీలు అడ్రస్ లేకుండా పోతాయని జీవీఎల్ హెచ్చరించారు. హిందూ ఆలయాలపై దాడులు జరిగితే కమిటీలలో సభ్యులుగా అన్య మతస్తులు ఎందుకని ప్రశ్నించారు. దాడులను ఆకతాయిల పని అని చెబుతూ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని అన్నారు. రామతీర్థానికి వెళ్లేందుకు వైసీపీ, టీడీపీ నాయకులకు లేని ఆంక్షలు బీజేపీ నాయకులకు ఎందుకని ప్రశ్నించారు.
కుట్రదారులను అరెస్ట్ చేయండి
రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులతో సహా రామతీర్థంలో జరిగిన పరిణామాలను కేంద్ర ప్రభుత్వానికి వివరించామని జీవీఎల్ అన్నారు. దాడులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే అన్య మతాలకు చెందిన మత పెద్దలు ఎందుకు ఖండించడం లేదని జీవీఎల్ అన్నారు. దాడుల వెనుకు టీడీపీ హస్తం ఉందన్న ప్రభుత్వం కుట్ర వెనుక ఉన్నవారిని ఎందుకు అరెస్ట్ చేయడంలేదని నిలదీశారు.
ఇదీ చదవండి: తిరుపతిలో హిందుత్వ అజెండా అమలు చేస్తున్న తెలుగుదేశం