Tuesday, January 7, 2025

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు

భారత  రాజ్యాంగం స్వభావంపట్లా,పనితీరుపట్లా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వానికీ, అత్యున్నత న్యాయస్థానికీ మధ్య వివాదం చెలరేగుతున్నది. రాజ్యాంగబద్ధమైన పాలన ఏమి అవుతుందో, రాజ్యాంగం ఏమి అవుతుందోనని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయడం ప్రారంభించిన సందర్భం 74 వ వార్షికోత్సవం సందర్భంగా గణతంత్రదినోత్సవంనాడు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము రాజ్యాంగ మౌలిక విలువలు అనుల్లంఘనీయమైనవని పునరుద్ఘాటించారు. ఆమె 15వ రాష్రపతి. ఆ సర్వోన్నత పదవిని అధిరోహించిన మొట్టమొదటి ఆదివాసీ మహిళ. ఆదివాసీలకూ, దళితులకూ రిజర్వేషన్లూ, బలహీనవర్గాల బలోపేతం, ప్రజాస్వామ్య పరిరక్షణ అనే లక్ష్యాల సాధనకు కృషి చేస్తూ భారత గణతంత్ర వ్యవస్థ ప్రయాణం కొనసాగిస్తోంది.

భారత ప్రాచీన నాగరికత నుంచీ, ఫ్రెంచ్ విప్లవం నుంచి స్ఫూర్తి పొంది స్వీకరించి రాజ్యాంగంలో నమోదు చేసుకున్న సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం అనే విలువలను కాపాడుకోవడం అందరి కర్తవ్యం కావాలి. పాతకొత్త మేలు కలయికనూ, ప్రాచీన, ఆధునిక సంప్రదాయాల సమ్మేళనాన్ని అర్థం చేసుకున్న రాష్ట్రపతిగా ముర్ము ప్రసంగించడం ఆనందం కలిగించింది. స్వాతంత్ర్య సముపార్జనకోసం, మన విలువల పునరావిష్కరణకోసం స్వాతంత్ర్య సమరం జరిగిందని ఆమె చెప్పడం ఎంతో సమయోచితం. ఎన్నో విశ్వాసాలు, ఎన్నో భాషలు మనలను విభజించకపోగా కలిపి ఉంచడానికి ఈ విలువలే కారణం.

రాజ్యాంగ వ్యవస్థాపక విలువలూ, సూత్రాలూ మారకపోయినా కొన్ని అధికరణలు సవరణలకు నోచుకున్నాయి. ఈ ప్రక్రియ మున్ముందు సైతం కొనసాగుతుంది. మారుతున్న కాలమాన పరిస్థితుల దృష్ట్యా రాజ్యాంగాన్ని సవరించుకునే వెసులుబాటును రాజ్యాంగ నిర్మాత జాతికి ప్రసాదించారు. వివిధ రంగాలలో భారత్ సాధించిన ప్రగతిని శ్లాఘిస్తూ,  ఆర్థికంగా ఎదుగుతున్నందుకు సంతోషిస్తూ రాష్ట్రపతి ముర్ము సర్వోదయ,  ఆత్మనిర్భర్ భారత్ సూత్రాలను నొక్కివక్కాణించారు. అణచివేత, సామాజిక సమస్యలూ, పేదరికం ఇంకా సమాజాన్ని పట్టిపీడిస్తున్న జాడ్యాలని ఆమె గుర్తించారు. ఇప్పటికీ చాలావర్గాలు సంకెళ్ళలో బందీలుగా ఉన్నాయి. వారికి విముక్తి కలిగించడం మనకు ప్రాథమ్యం కావాలి. రాజ్యాంగ స్వభావంపైన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజూ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా వంటి ఉన్నత పదవులలో ఉన్నవారు సుప్రీంకోర్టు కొలీజియం విధానాన్ని ప్రశ్నిస్తూ వ్యాఖ్యానాలు, యుద్ధారావాలు చేస్తూ ప్రజలకు దడ పుట్టిస్తున్నారు. వారికి దీటుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులూ సమాధానం ఇస్తున్నారు. న్యాయమూర్తుల నియామకం కోసం సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను ఆమోదించకుండా తొక్కిపెట్టడం ప్రజాస్వామ్యానికి కీడు చేస్తుందని జస్టిస్ నారిమన్ వ్యాఖ్యానించారు. దేశ భవిష్యత్తు ఏమైపోతుందోనని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రసంగం కొంత ఊరట కలిగిస్తున్నది. రాజ్యాంగ ప్రాథమిక స్వభావానికి ప్రమాదం ఏదీ లేదన్నట్టు ఆమె మాట్లాడటం సంతోషంగా ఉన్నది. అదే మాటమీద కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉంటుందనీ, కొలీజియం విషయంలో పట్టుదలకు పోదనీ ఆశిద్దాం. ఈ భావన వల్ల ప్రజలలో గణతంత్రం పట్ల విశ్వాసం ప్రబలుతుంది. భయాందోళనలకు తెరబడుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు వచ్చిన ప్రమాదం ఏదీ లేదని నమ్మకం ఏర్పడుతుంది. ఇటువంటి ఆశ్వాసన కలిగించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles