Sunday, December 22, 2024

రాణే-ఠాక్రే సంచలనాత్మక సమరం

నారాయణ్ రాణే, ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ సంచలనాలే. కేంద్రమంత్రి నారాయణ రాణే ‘చెంపదెబ్బ’ వ్యాఖ్యల ఉదంతం ఆ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఆ వ్యాఖ్యలు వ్యక్తిగతంగానూ, రాజ్యాంగపరంగానూ అభ్యంతరమైనవి. అందులో ఎటువంటి సందేహం లేదు. అరెస్టు చేయడం చట్టబద్ధమేనని న్యాయమూర్తులు చెప్పేశారు. కానీ, కస్టడీకి తీసుకొని విచారణ చేయాల్సినంత అవసరం లేదని కూడా వారే అన్నారు. న్యాయపరమైన, చట్టబద్ధమైన అంశాలు అటుంచగా, పదవిలో వున్న కేంద్రమంత్రిని రాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడం పెనుసంచలనంగా మారింది. మా జోలికి వస్తే ఎవరినీ వదలం, ఎవ్వరికీ భయపడం అంటూ సంకేతం ఇవ్వడానికి శివసేన ఈ పని చేసిందని అర్ధమవుతోంది. దీనికి తోడు నారాయణ రాణేతో పాత తగువులు ఎట్లాగూ ఉన్నాయి. నారాయణ రాణేకు మొదటి నుంచీ వివాదాస్పదమైన వ్యక్తిగా పేరుంది. చాలా పార్టీలు మారిన చరిత్ర కూడా ఉంది. గతంలో ఆయన కొన్ని నెలల పాటు శివసేన నేతగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. తగాదాల నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి శివసేన బహిష్కరించింది. ఆ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొన్నాళ్ళు అక్కడ కాపురం చేసి తర్వాత దానిని కూడా వీడి ‘మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష’ పేరుతో సొంత దుకాణం పెట్టుకున్నారు. 2018లో బిజెపికి మద్దతు ప్రకటించి,బిజెపి తరపున రాజ్యసభకు వెళ్లారు. తుదకు తన పార్టీని బిజెపిలో కలిపేశారు.

Also read: మూడో ముప్పు తిప్పలు తప్పవు

వివాదాస్పదుడిగా పేరు

ఇటీవల కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో చిన్న తరహా పరిశ్రమల శాఖకు క్యాబినెట్ హోదాలో కేంద్రమంత్రి పదవిని పొందారు. రాణేను కేంద్ర మంత్రిగా ఎంపిక చేసిన సమయంలో వివాదాస్పదమైన వ్యక్తికి మంత్రి పదవి ఏంటంటూ…పలు విమర్శలు వచ్చాయి. మహారాష్ట్ర ‘ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ’ అంశంలో రాణేపై 2011లో పలు ఆరోపణలు వచ్చాయి. పుణెకు చెందిన సమాచార హక్కు ఉద్యమ నేత రవీంద్ర బర్హాతే,1998 లో భూసేకరణ విషయంలో దత్తా బహిరత్ అనే వ్యక్తికి నారాయణ రాణే సహకారం అందించారనే వివాదాన్ని బయటకు తెచ్చారు. రాణే రెవిన్యూ మంత్రిగా ఉన్నప్పుడు  పలువురు ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు ప్రభుత్వ భూములను డీ రిజర్వ్ చేశారని శివసేన నేతల బృందం 2011లో అప్పటి గవర్నర్ కె శంకరనారాయణన్ కు ఫిర్యాదు చేసింది. విద్యాసంస్థలకు కేటాయించిన భూమిలో రాణే భార్య నీలమ్ రెస్టారెంట్ ను స్థాపించారని 2011లో బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం  దాఖలైంది. ఇవ్వన్నీ న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి. ఇలా నారాయణ రాణేను పలువివాదాలు చుట్టుముట్టుకొని ఉన్నాయి. మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన అంశం తాజాగా వార్తల్లో సంచలనం రేపుతోంది. అరెస్టు జరిగిన కొన్ని గంటలలోపే రాణే బెయిల్ పై విడుదల అయినప్పటికీ ఈ వివాదం బిజెపి – శివసేన మధ్య మరింత అగ్గి రగులుస్తోంది.

Also read: తాజా అఫ్ఘాన్ రణక్షేత్రం పాంజ్ షీర్!

ఎవరు  ఆ మాట అన్నా సంస్కార రాహిత్యమే

స్వాతంత్య్రం ఎప్పుడో వచ్చిందో కూడా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు నిజంగా తెలియకపోతే  అంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంకొకటి ఉండదు.అది ఇంకా నిర్ధారణ కావాల్సివుంది. చాచి చెంపదెబ్బ కొడతాను.. అనే మాట ఎవరు ఎవరిని అన్నా అది చాలా తప్పు. అత్యంత అభ్యంతరకరం, సంస్కార రాహిత్యం.  కేంద్రమంత్రి స్థాయి వ్యక్తి – రాష్ట్ర ముఖ్యమంత్రిని అంత మాట అనడం ముమ్మాటికీ తప్పే. అయితే, ఇదే ఉద్దవ్ ఠాక్రే గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఉద్దేశిస్తూ ఇంచుమించు ఇటువంటి వ్యాఖ్య చేశారని, అరెస్టు చేయకుండా బిజెపి సంయమనం పాటించిందని కొందరు బిజెపి నేతలు గుర్తుచేస్తున్నారు. అరెస్టుల సంగతి ఎలా ఉన్నాభారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుపుకుంటున్న ఈ పవిత్ర వేళలలో ఇటువంటి వివాదం చెలరేగడం విషాదకరం. భావ సారూప్యత కలిగిన బిజెపి – శివసేన మధ్య మైత్రి ఇప్పటికే పాడైపోయింది.  ఆన్నీ బాగుంటే  ఇద్దరు కలిసి మరోమారు మహారాష్ట్రలో అధికారాన్ని పంచుకొని ఉండేవారు. ముఖ్యమంత్రి కుర్చీ దగ్గర ఆ బంధం తెగిపోయింది. ఏ మాత్రం స్నేహబంధం, పూర్వ అనుబంధం లేని కాంగ్రెస్ -శివసేన -ఎన్ సీ పి కలిసి కొత్త కాపురం పెట్టాయి. ప్రస్తుతం ఈ త్రయం మహారాష్ట్రలో అధికారంలో కొనసాగుతోంది. ఈ బంధం ఏదో ఒక రోజు విడిపోక తప్పదనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎలాగో కాపురాన్ని నెట్టుకొస్తూనే ఉన్నారు. మళ్ళీ బిజెపి – శివసేన దగ్గరవుతాయనే ఊహాగానాలు ఈ మధ్య బాగా పెరిగాయి. మొన్న జూన్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ – శివసేన అధినేత ఠాక్రే చాలా సేపు సమావేశమయ్యారు. రెండు పార్టీలు కలిస్తే బాగుంటుంది కదా అని ఒక బిజెపి నేత లేఖ విడుదల చేశారు.  ఈ సన్నివేశాలు ఆ వార్తకు మరింత బలాన్ని చేకూర్చాయి.

Also read: జనహృదయాధినేతకు జోహార్లు

శరద్ పవార్ కదలికలు

ఇంచుమించుగా అదే సమయంలో ఎన్ సీ పి అధినేత శరద్ పవార్  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్  వరుసగా బేటీ అయ్యారు. ఈ అంశాలన్నీ ఎన్ డి ఏ కు వ్యతిరేకంగా మూడో కూటమి వస్తుందనే కొత్తవార్తలను మోశాయి. కానీ తర్వాత పరిణామాలు వేరుగా ఉన్నాయి.  టార్గెట్ 2024 నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జూమ్ లో విపక్షాలతో సమావేశం నిర్వహించారు. ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్ కూడా ఆ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి కొన్ని రోజులు ముందుగా శరద్ పవార్ కూడా ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. మోదీపై ఎప్పుడూ కారాలు మిరియాలు నూరే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇటీవలే మోదీని కలిశారు. ఈ భేటీలకు – తెరవెనుక జరిగే అసలు రాజకీయాలకు సంబంధమే ఉండదని తెలిసిందే. నారాయణ రాణే తాజా వివాదంతో, బిజెపి – శివసేన రాజకీయ క్రీడ మరోమారు తెరపైకి వచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం, రిపబ్లిక్ టీవీ అధినేత అర్ణవ్ గోస్వామి అరెస్టు, కంగనా రనౌత్ వివాదం మొదలైనవన్నీ ఆ మధ్య  శివసేన -బిజెపి పెద్ద అగాధాన్ని పెంచాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త వివాదం రాజకుంది. రాజకీయాలు ఎలా ఉన్నా, మాట తీరు,సంస్కారం నిలుపుకోవడం ఎవరికైనా ముఖ్యం. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారికి మరీ ముఖ్యం.

Also read: ప్రక్షాళన జరిగితేనే అధికారప్రాప్తి

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles