Friday, December 27, 2024

ప్రముఖ కవి సింగమనేని నారాయణ అస్తమయం

  • శోకసంద్రంలో సాహితీప్రియులు
  • సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు

ప్రముఖ రచయిత, సాహిత్య విమర్శకులు, సింగమనేని నారాయణ  ఈరోజు (ఫిబ్రవరి 25) అనారోగ్యంతో కన్నుమూశారు. సాహిత్య కారుడు గానే కాకుండా ఎన్నో ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించిన వ్యక్తి. హంద్రీ నీవా జల సాధన సమితి జిల్లా కన్వీనర్ గా దరూరు పుల్లయ్య గారితో పాటు ఎన్నో సమావేశాల్లో పాల్గొని సమస్యలపై గళమెత్తారు. సింగమనేని నారాయణ  అనంతపురం పట్టణానికి సమీపంలోని బండమీదపల్లి గ్రామంలో మధ్యతరగతి  రైతు  కుటుంబంలో  జూన్ 23, 1943లో జన్మించిన సింగమనేని వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయులు. అనంతపురం జిల్లా లోని పలు ప్రాంతాల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి 2001లో పదవీ విరమణ చేశారు. అభ్యుదయ రచయితల సంఘంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యుఒడికి చేరుకున్నారు. సింగమనేని మృతిపట్ల సాహితీకారులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ప్రజల సందర్శనార్ధం

అనంతపురం జిల్లా రామచంద్ర నగర్ లోని సింగమనేని నివాసంలో ఆయన భౌతికకాయాన్ని బంధు, మిత్రుల సందర్శన కోసం ఉంచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రేపు ఉదయం (ఫిబ్రవరి 26)   అనంత పురం నగరానికి 40.కి.మీ.దూరం లో ఉన్న కనగానీపల్లి గ్రామం వద్ద సింగమనేని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి : తెనాలి సాహిత్య కృషీవలుడు దుర్గాప్రసాద్ కన్నుమూత

రచనలు

ఇప్పటివరకు సింగమనేని సుమారు 43  కథలు వ్రాశారు. మొట్టమొదటి కథ “న్యాయమెక్కడ? “1960లో కృష్ణాపత్రికలో ప్రచురితమయింది. ఈయన కథలు జూదం (1988), సింగమనేని నారాయణ కథలు (1999), అనంతం (2007), సింగమనేని కథలు(2012) అనే నాలుగు కథా సంపుటాలుగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. సీమకథలు, ఇనుప గజ్జెలతల్లి, తెలుగు కథలు – కథన రీతులు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి ‘తెలుగుకథ’ మొదలైన పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. సంభాషణ పేరుతో ఒక వ్యాస సంపుటిని కూడా వెలువరించారు.  అప్పాజోస్యుల, విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ ఈయనకు సాహిత్య సేవామూర్తి జీవిత కాల సాఫల్య  పురస్కారాన్ని 2013లో అందజేసింది. ఆదర్శాలు – అనుబంధాలు, అనురాగానికి హద్దులు, ఎడారి గులాబీలు అనే నవలలు సింగమనేని రాశారు.

అవార్డులు

1997లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం జరిగింది. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారంతో సత్కరించారు. రాయలసీమకు చెందిన రచయిత సింగమనేని ఇక లేరంటూ సామాజిక మాధ్యమాలలో పలువురు సాహితీ ప్రియులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: నండూరి పార్థసారథి కి నాగరత్నమ్మ పురస్కారం

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles