Thursday, November 21, 2024

షిండే ముఖ్యమంత్రి, ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రి

  • మహానాటకంలో అనూహ్యమైన మలుపు
  • శివసేనను శివసాయుజ్యం చేయించాలని కమలనాధుల వ్యూహం

మహారాష్ట్రలో సంభవించిన నాటకీయ పరిణామాలకు అనూహ్యమైన ముగింపు పలికింది బీజేపీ అధిష్ఠానం. శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్ నాథ్ షిండే ను ముఖ్యమంత్రిని చేసి, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ఉపముఖ్యమంత్రిగా సరసన కూర్చోబెట్టింది. ఇది ఎవ్వరూ ఊహించని మలుపు. ఘటనాఘటన సమర్థుడిగా పేరు తెచ్చుకున్న శరద్ పవార్ ను సైతం ఆశ్చర్యంతో ముంచెత్తిన పరిణామం. అంటే ఒక తిరుగుబాటుదారుని ముఖ్యమంత్రి చేయడం ద్వారా అతనికి అధికారం ఇవ్వడం, శివసేనకు అసలుసిసలు నాయకుడు ఆయనే అని చెప్పడం బీజేపీ ఉద్దేశం. క్రమంగా ఉద్ధవ్ ఠాక్రేని బలహీనపరచి శివసేనను రద్దు చేయడమే బీజేపీ సంకల్పం.

బీజేపీ, శివసేన మిత్రపక్షాలుగా మూడు దశాబ్దాల కిందట ప్రయాణం ప్రారంభించినప్పుడు శివసేప పెద్ద పార్టీ, బీజేపీ చిన్నది. క్రమంగా బీజేపీ పెరుగుతూ వచ్చింది. శివసేన తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా ప్రధానిగా నరేంద్రమోదీ అధికారంలో ఉన్న గత ఎనిమిదేళ్ళలో బీజేపీ మహారాష్ట్రలో బాగా పుంజుకున్నది. ఇప్పుడు ఉద్ధవ్ నాయకత్వంలోని శివసేన అస్థిత్వ సమస్యలో కొట్టుమిట్టాడుతోంది.

ఇంగ్లీషులో క్యాచ్-22 సిచువేషన్ అంటారు. ముందు గొయ్యి, వెనుక నుయ్యి అన్న చందం అన్నమాట. ఇదే పరిస్థితి ఉద్ధవ్ ఠాక్రే ఎదుట ఉంది. ఆయన ఇప్పుడు శివసేనని పునర్నిర్మించాలి. అందుకోసం శివసేన సిద్ధాంతమైన హిందూత్వను ఆశ్రయించాలి. ఇప్పటికీ హిందూత్వ వాదం బలంగా వినిపిస్తున్న బీజేపీ ఉంది. దానితో శివసేన తిరుగుబాటుదారులు స్వరం కలిపారు. ముందునుంచి తిరుగుబాటుదారులు అంటున్నది శివసేనకు బీజేపీ సహజమత్రిపక్షమని.  అఘాదీ కూటమిలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ హిందూత్వ వ్యతిరేకులనీ, అసహజమిత్రులనీ తిరుగుబాటుదారుల వాదన. బీజేపీ కంటే మెరుగైన, నికార్సయిన హిందూత్వవాదులమని నిరూపించుకోవాలంటే ఉద్ధవ్ ఠాక్రే మరింత తీవ్రంగా హిదూత్వ విధానాలను అవలంబించాలి. అంటే శరద్ పవార్ కూ, కాంగ్రెస్ నాయకులకూ ఇంకా దూరం జరగాలి.

ఇటీవలి సంక్షోభం శివసేన వైఫల్యం వల్ల ఏర్పడింది. తన పార్టీలో తిరుగుబాటు జరుగుతున్నా, తన ఎంఎల్ఏలు తీరం విడిచి బస్సులో సూరత్ వెడుతున్నా తెలుసుకోలేని అయోమయ స్థితిలో శివసేన అధిష్ఠానం ఉన్నది. హోం శాఖను నిర్వహిస్తున్న పవార్ వర్గీయుడు కూడా వేగుల ద్వారా సమాచారం తెలుసుకోవడంలో దారుణంగా విఫలమైనాడు. మొత్తంమీద 2019లో 55 మంది శాసనసభ్యులను గెలిపించిన ఉద్ధవ్ సంక్షోభంలో తన వెంట ఉన్నది 15 మందేనని తెలుసుకొని ఖిన్నుడైనారు. రాజీనామాకు అప్పుడే సిద్ధపడ్డారు. కానీ శరద్ పవార్ హితవు విని ఆగారు. చివరికి గవర్నర్ మర్నాడే (గురువారం) బలనిరూపణ జరిపించాలని బుధవారంనాడు ఆదేశించారు. దానికి స్టే మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఫలితంగా వెనువెంటనే ఉద్ధవ్ రాజీనామా ప్రకటించారు. మరుక్షణం గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ హుషారుగా రాజీనామాను ఆమోదించారు. కొన్నిగంటల తర్వాత షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ పరిణామాలలో ఉద్ధవ్ ఠాక్రేకు మిత్రపక్షాలైన ఎన్ సీపీ, కాంగ్రెస్ లు కొండంత అండగా ఉన్నాయి. ఈ మిత్రపక్షాలు అందిస్తున్న సంఘీభావంతో ఏమి చేయాలన్నది ఉద్ధవ్ ఠాక్రే ఎదుట ఉన్న సమస్య. ఎన్ సీపీ, కాంగ్రెస్ తో స్నేహం కొనసాగాలంటే, వారితో ఏర్పాటు చేసుకున్న కూటమి ప్రతిపక్షంలో కూడా ఉండాలంటే, వచ్చే 2024 ఎన్నికలలో ఒక కూటమిగా కలసి పోటీ చేయాలనుకుంటే హిందూత్వ వాదాన్ని ఎంతో కొంత పలచన చేయవలసి ఉంటుంది. హిందూత్వవాదాన్ని బలోపేతం చేసే పక్షంలో బీజేపీ కంటే వీర హిందూత్వవాద పక్షంగా శివసేన నిరూపించుకోవాలని సంకల్పించే పక్షంలో ఈ సెక్యులర్ మిత్రుల స్నేహానికి స్వస్తి చెప్పాలి. అప్పుడు బీజేపీ, శివసేన తిరుగుబాటుదారులూ ఒక గుంపుగా, ఎన్ సీపీ,కాంగ్రెస్ లు వేరొక గుంపుగా ఎన్నికల బరిలో నిలచినప్పుడు ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన ఒంటరిపోరాటం చేయవలసి వస్తుంది.

మిత్రుల వ్యవహారంలో ఉద్ధవ్ ఠాక్రే వెంటనే నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. బృహన్ ముంబయ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఇప్పడు కార్పొరేషన్ శివసేన చేతుల్లో ఉంది. ముందు కూడా ఇది శివసేన చేతుల్లోనే కొనసాగాలంటే ఉద్ధవ్ ఠాక్రే తన వ్యూహానికి ఇప్పుడే పదును పెట్టాలి. ఒంటరిగా వీరహిందూత్వ ఎజెండాతో ముందుకు పోయి అటు బీజేపీనీ, శివసేన తిరుగుబాటుదారులనూ, ఇటు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులనూ ఎదిరించి ఒంటరి పోరాటం చేయాలో లేక హిందూత్వను నీరుగార్చి మిత్రపక్షాలతో కలసి ముంబయ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పాల్గొనాలో నిర్ణయించుకోవాలి. మిత్రపక్షాలతో స్నేహం కొనసాగించాలనుకుంటే అసలుసిసలు శివసేన షిండే నాయకత్వంలో ఉన్నదేనని అంగీకరించవలసి వస్తుంది. 6 డిసెంబర్ 1992లో బాబ్రీ మసీదును కూలగొట్టినప్పుడు బీజేపీ నాయకులు నీళ్ళు నములుతూ ఉండగా శివసేనాధిపతి బాలాసాహెబ్ ఠాక్రే హర్షాతిరేకం ప్రకటించారు. అంటే బీజేపీ కంటే హిందూత్వ సిద్ధాంతంలో రెండాకులు ఎక్కువ చదివినట్టే లెక్క. అటువంటి హిందూత్వవాది అయిన బాలాసాహెబ్ కుమారుడు ఉద్ధవ్ హిందూత్వ విధానాన్ని ముమ్మరం చేస్తారో, నీరుగారుస్తారో తెలియదు. హిందూత్వ విధానాన్ని అతి చేయడం సమాజానికి మంచిది కాదు. తక్కువ చేయడం రాజకీయంగా ఉద్ధవ్ కు ఉపకరించదు. ఇదంతా కాదని శివసేన మరాఠా అస్మిత (ఆత్మగౌరవ నినాదం)ను నెత్తికెత్తుకుంటే దానికి ఎన్ సీపీ, కాంగ్రెస్ కూడా తోడుగా ఉంటాయి. వచ్చే ముంబయ్ ఎన్నికలలోనూ, సార్వత్రిక ఎన్నికలలోనూ ఎంవీఏ అవిచ్ఛిన్నంగా ఉంటుంది. మరాఠా అస్మిత నినాదంపైన కలసి పోటీ చేసి బీజేపీ గట్టి సమాధానం చెప్పవచ్చు. ఏ దిశలో ప్రయాణం చేయాలో నిర్ణయించుకోవలసిన కీలకమైన సంధిసమయంలో ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles