నవదీప్ సైనీ
- భారత 299వ టెస్ట్ క్రికెటర్ గా సైనీ
- సిడ్నీ వేదికగా టెస్ట్ అరంగేట్రం
భారత సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లోకి మరో యువఫాస్ట్ బౌలర్ దూసుకొచ్చాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న మూడోటెస్ట్ తుదిజట్టులో చోటు సంపాదించడం ద్వారా ఢిల్లీ మెరుపు ఫాస్ట్ బౌలర్ నవదీప్ అమర్ జీత్ సైనీ అరంగేట్రం చేశాడు.
ఇది చదవండి: టీమిండియాను వెంటాడుతున్న గాయాలు
హర్యానాలో పుట్టి దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న 28 ఏళ్ల సైనీకి గంటకు 140కి పైగా కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే సత్తా ఉంది. ఇప్పటికే భారత్ తరపున ఏడు వన్డేలు, 10 టీ-20 మ్యాచ్ లతో పాటు 46 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. అంతేకాదు…గల్ఫ్ దేశాలు వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020 సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు సభ్యుడిగా తానేమిటో నిరూపించుకోడం ద్వారా ఆస్ట్ర్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు.
ఇది చదవండి: రహానేను ఊరిస్తున్న అరుదైన రికార్డు
సీనియర్ ఫాస్ట్ బౌలర్లు ఇశాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ గాయాలతో జట్టుకు అందుబాటులో లేకపోడంతో యువఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, నటరాజన్ , శార్దూల్ ఠాకూర్ లకు అనూహ్యంగా అవకాశాలు దక్కాయి. అడిలైడ్ టెస్టులో ఆడుతూ ఉమేశ్ యాదవ్ గాయపడడంతో ఆ స్థానం కోసం శార్దూల్ ఠాకూర్, నటరాజన్ లతో సైనీ పోటీ పడి చివరకు టెస్ట్ క్యాప్ సొంతం చేసుకొన్నాడు.
భారత 299వ టెస్ట్ క్రికెటర్ గా నవదీప్ సైనీ రికార్డుల్లో చేరాడు. ప్రస్తుత ఆస్ట్ర్రేలియా సిరీస్ ద్వారా ముగ్గురు భారత యువక్రికెటర్లు (శుభ్ మన్ గిల్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ ) టెస్ట్ క్యాప్ లు సాధించినట్లయ్యింది.
ఇది చదవండి: అపురూపం ఆ ఇద్దరి త్యాగం….!