- దర్జీ కన్హయ్యను కత్తికి బలిపెట్టిన ఉన్మాదం
- దేశ ప్రజలని అవాక్కు చేసిన ఉదయపూర్ దుర్ఘటన
ఉగ్రవాదం ఉగ్రరూపం దాలుస్తోందని ఉదయ్ పూర్ తాజా ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఒక సామాన్య దర్జీ బలైపోయాడు. ఆ కుటుంబం అనాధగా మారిపోయింది.ప్రభుత్వాలు ఎన్ని లక్షల రూపాయల ఆర్ధికసాయం అందించినా,పోయిన ప్రాణం తిరిగిరాదు. మనిషి ప్రాణానికి విలువకట్టే షరాబులు లేరు. ఇటీవల ఒక టీవీ ఛానల్ వేదికగా బిజెపి మీడియా మాజీ ప్రతినిధి (స్పోక్స్ పర్సన్ ) నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దావానలం సృష్టించాయి. సోషల్ మీడియా వేదికల్లో పెద్ద హల్ చల్ నడిచింది. ఆ అగ్గి ఇంకా ఆగపోలేదు. మరింత దారుణంగా రూపాంతరం చెందుతోంది. నూపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థిస్తూ రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన దర్జీ కన్హయ్య లాల్ సామాజిక మాధ్యమాల్లో మద్దతు తెలిపాడు. తర్వాత అతనికి పలు సంస్థల నుంచి బెదిరింపులు వచ్చాయి.
Also read: అమరనాథ్ యాత్రికులకు పొంచి ఉన్న ముప్పు!
కిరాతక హత్యాదృశ్యం వీడియో
ఈ వ్యాఖ్యలకు సంబంధించిన అంశంలో రాజస్థాన్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. అతను బెయిల్ మీద విడుదల కూడా అయ్యాడు. యధావిధిగా తన దుకాణంలో తను పనిచేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. సాధారణ వినియోగదారుల్లా నటిస్తూ రియాజ్ అఖ్తారీ, గౌస్ అహ్మద్ అనే వ్యక్తులు కన్హయ్యను అతి కిరాతంగా చంపివేశారు. అంతటితో ఆగక ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ కూడా చేశారు. ఈ అగ్గి రాజేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని చంపేస్తామంటూ నినాదాలు కూడా చేశారు. దీనితో రాజస్థాన్ రణస్థలంగా మారిపోయింది. మత ఘర్షణలు చెలరేగిపోయే ముప్పును గమనించిన అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయ్ పూర్ లోని పలుప్రాంతాల్లో కర్ఫ్యూను ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని, అటువంటి వీడియోలు ప్రచారం చేయవద్దని ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తులను జారీ చేసింది. కన్హయ్యను చంపింది ఉగ్రవాదులేనని, దీనిని ఉగ్రవాద ఘటనగా కేంద్ర ప్రభుత్వం పరిగణించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ ) బృందం దర్యాప్తు కూడా ప్రారంభించింది. సరే! దర్యాప్తు సంస్థలు,చట్టం తమ పని తాము చేసుకుంటూ పోతాయి, అది వేరే విషయం. “నన్ను చంపడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి.. రక్షించండి..” అంటూ దర్జీ కన్హయ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తోంది. పోలీసులు అప్రమత్తమయ్యే లోపే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. నూపుర్ శర్మ వ్యాఖ్యల చిచ్చు అంశం కేవలం రాజస్థాన్ కే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఎవరి వాదనలు వారు చేశారు. మతాలు, రాజకీయాలుగా వర్గాలు విడిపోయాయి. ఈ చిచ్చు ఇంకా పచ్చిగా ఉంది.కన్హయ్యను హతమార్చిన ఇద్దరు వ్యక్తులకూ అంతర్జాతీయ ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయన్నది తేటతెల్లమై పోయింది. ఈ ఇద్దరిలో రియాజ్ అఖ్తారీకి పాకిస్థాన్ కు చెందిన దావత్ -ఏ – ఇస్లామీతో సంబంధాలు ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. వీరి కార్యలయాలు రాజస్థాన్ లో లేకపోయినా, దిల్లీ, ముంబయి, కాన్పూర్ లో ఉన్నాయని మీడియా కథనాలు వస్తున్నాయి. ఉదయ్ పూర్ తరహా దుర్ఘటనలు దేశంలోని మిగిలిన ప్రాంతాలలో జరుగుతాయేమోననే భయాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు స్థావరాలుగా చెప్పుకొనే పట్టణాల్లోనూ, ఇస్లామిక్ వర్గాలు ఎక్కువ సంఖ్యగా ఉన్న రాష్ట్రాలు, ప్రదేశాలలోనూ ఎంతో అప్రమత్తం కావాల్సిన సందర్భం ఇది.
Also read: విశాఖ ఉక్కు ఉసురు తీస్తున్న రాజకీయ పక్షాల దొంగాట
మాయమైపోతున్న మానవత్వం
దానికి తగ్గట్టుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిఘా సంస్థలు, పోలీస్, వివిధ రక్షణ విభాగాలు అత్యంత జాగురూకతతో వ్యవహరించాల్సివుంది. భారతదేశంలో మెజారిటీ ప్రజలు హిందూ మతానికి చెందినవారు. ఐనప్పటికీ అనేక మతాలు, సంస్కృతులు,భాషల సంగమంగా, సమాహారంగా ఈ దేశం సాగుతోంది. ఈ దేశ సంపదను,సంస్కృతిని, సర్వస్వాన్ని ఎందరో దోచుకువెళ్లిపోయారు. ఒక్కొక్క మతానికి చెందినవారు పరిపాలించినప్పుడు ఒక్కొక్క విధంగా హిందువులను అతిదారుణంగా హింసించిన చేదుచరిత్ర మనది. వీటన్నిటిని భరిస్తూ, సహిస్తూ సంయమనం పాటించిన విశాలవాదుల నిలయం మనది. సర్వమత హితంగా ప్రవర్తించే ప్రజ మనకుండడం మన సౌభాగ్యం. ఇంతటి ఉదార, విశాల భావనలు కలిగిన దేశం ప్రపంచంలో ఇంకొకటి లేదని ప్రపంచ దేశాలన్నీ భారత్ ను కీర్తిస్తుంటాయి. ఓటు బ్యాంకు రాజకీయాలతో కొందరు విభజించు – పాలించు అనే సూత్రాన్ని అమలుచేసే ప్రయత్నం చేసినప్పటికీ, చేస్తున్నప్పటికీ దేశ ప్రజలు ఎక్కువ శాతం విజ్ఞత, సమతా భావనలతోనే నడుస్తున్నారు. తోటి మతాన్ని గౌరవించడం వివేకం. అది మరచి ఉన్మాదులుగా మారిపోవడమే దారుణం. బలవంతపు మత మార్పిడులు అంతే దారుణం. కొందరి రాజకీయ, ఆర్ధిక, అధికార దాహాలకు మతం ఏదైనా, కులం ఏదైనా మనిషి బలైపోతున్నాడు. ‘మనిషితనం’ మృగ్యమైపోతోంది. కశ్మీర్ నుంచి ఉదయ్ పూర్ వరకూ జరుగుతున్న ఈ దుర్ఘటనలకు చరమగీతం పాడాలి. మతోన్మాదులు ఉగ్రవాదులుగా పెరిగి పోతున్న నేటి పరిణామాలు రేపటి పట్ల పెద్ద భయాలను కలుగజేస్తున్నాయి. ఉదయ్ పూర్ తరహా ఘటన దేశంలో ఇదే తొలిసారని సీనియర్ జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని కేవలం హత్యగా కాక, మతోన్మాద ఉగ్రవాదులు వేసిన ‘శిక్ష’గా కొందరు భావిస్తున్నారు. అది ఏ మతమైనా మనిషితనానికి మించినది కాదు. మానవత్వం లేకపోతే అది మతమే కాదు. పెరుగుతున్న మతోన్మాద నేపథ్యంలో, దేశ ప్రజలు, ప్రభుత్వాలు,వ్యవస్థలు చాలా జాగ్రత్తగా మెలగాల్సిన కాలంలోకి వచ్చేశామనిపిస్తోంది.
Also read: సంపన్న దేశాలతో సయోధ్య