Friday, December 27, 2024

నగదు స్వాధీనం, ఉద్రిక్తంగా దుబ్బాక

  • బీజేపీ అభ్యర్థి రఘునందనరావు బంధువుల నివాసంలో నగదు స్వాధీనం
  • రఘునందన్ రావు లక్ష్యంగా పోలీసు దాడులు : బీజేపీ ఆరోపణ
  • ఓటర్లకు బీజేపీ డబ్బును ఎరగా వేస్తోందని హరీష్ ఆరోపణ

దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో సిద్దిపేటలో పోలీసుల తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. దుబ్బాక బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు, ఆయన  బంధువుల ఇళ్లలో రెవెన్యూ పోలీసు అధికారులు సోదాలు నిర్వహించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య జరిగిన వాగ్వాదం, నినాదాలతో సిద్దిపేట రణరంగంగా మారింది. సోదాల్లో పోలీసులు రూ. 18.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ నేతల ఆరోపణలు

పోలీసుల సోదాలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో ప్రచారంలో ఉన్న రఘునందన్ నావు, బీజేపీ శ్రేణులు హుటా హుటీన సిద్ధిపేటలోని బంధువుల ఇంటికి చేరుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సెర్చ్ వారంట్ లేకుండా పోలీసులు సోదాలు చేయడాన్ని ఆయన నిరసించారు. పోలీసులే నగదును పెట్టి బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.  బీజేపీని ఓడించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపన్నుతోందని రఘునందన్ రావు విమర్శించారు.  పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదులో 12 లక్షలు గల బ్యాగ్ ని కార్యకర్తలు లాక్కెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బండి సంజయ్ అరెస్టు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, చింతల రామ కృష్ణా రెడ్డి మోత్కుపల్లి, నర్శింహులు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎంపీ వివేక్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిలు సిద్ధిపేట  చేరుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అనంతరం కరీంనగర్ లోని ఆయన నివాసంలో దించారు. పోలీసులు తనపట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని సిద్దిపేట కమిషనర్ ను బదిలీ చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం ఆదేశాల మేరకే పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. సీఎం ఫాం హౌస్ నుంచే టీఆర్ ఎస్ డబ్బులు పంచుతోందని ఆరోపిస్తూ, ఆ ఫామ్ హౌస్ లో సోదాలు నిర్వహించే సత్తా పోలీసులకు ఉందా అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు.

 ఓడిపోతామనే నైరాశ్యంలో బీజేపీ

బీజేపీ తీరును ఆర్థిక మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. మూడో సారి కూడా ఓడిపోతామనే భయంతో బీజేపీ డబ్బును వెదజల్లేందుకు సిద్ధపడిందన్నారు. ఓటమి భయంతో బీజేపీ తీవ్ర నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతోందని ఈ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని హరీష్ రావు అన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగానే పోలీసులు సోదాలు నిర్వహించారని ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేదని అన్నారు, టీఆర్ఎన్ నేతల ఇళ్లలోనూ పోలీసులు తనిఖీలు చేశారని హరీష్ రావు అన్నారు.  టీఆర్ఎస్ నేతలు పోలీసులు తనిఖీలు చేస్తే సహకరించారని…బీజేపీ నేతలు మాత్రం గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉప ఎన్నికల్లో సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఉంచిన నగదుతో అడ్డంగా దొరికినా బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. ఈ నేపథ్యంలో కేంద్ర  హోం శాఖ మంత్రి అమిత్ షా స్థానిక నేతలతో మాట్లాడి ఘటన గురించి తెలుసుకున్నారు. ఘటనపై బీజేపీ ఎన్నికల సంఘం, టీఆర్ఎస్ పై ఫిర్యాదు చేశారు.

బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరిక

మరోవైపు దుబ్బాకలో పలువురు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు హరీష్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకూ నెరవేర్చలేదని మండిపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయడంలేదని విమర్శించారు. బీజేపీ మునిగే పడవ కనుకనే ఆ పార్టీ కార్యకర్తలు విజయపథంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు.

ఉద్రిక్త పరిస్థితులకు కారణం ?

దుబ్బాక ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ బీజేపీలు పరస్పర విమర్శలు దిగుతున్నారు. తొలుత విజయంపై బీజేపీ ధీమా గా ఉన్నప్పటికీ … హరీష్ రావు దుబ్బాక ప్రచారంలోకి దిగడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు సమాచారం. షామీర్ పేటలో రఘునందన్ అనుచరుడి కారు నుంచి పోలీసులు రూ. 40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ నాయకుడి కారునుంచి రూ. 7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటిపై రఘునందన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  అయితే బీజేపీ టీఆర్ఎస్ కంటే హరీష్ రావు పైనే విమర్శలకు దిగడంతో పరిస్థితి మరింత దిగజారింది. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు మూడో సారి ఎన్నికల బరిలో నిలిచారు.

రెండో స్థానం కోసం పోటీ?

నియోజకవర్గంలో సానుభూతి అధికార పార్టీకే ఉందని తెలుసున్న ప్రతిపక్షాలు రెండవ స్థానం కోసం పోటీ పడుతున్నాయని టీఆర్ ఎస్ నాయకులు అంటున్నారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేవరకు ఆ పార్టీకి బలమైన అభ్యర్థి లేడు. ధరావతు దక్కించుకునే స్తోమత కూడా లేదు.  అయితే బీజేపీ మాత్రం మూడోసారి రఘునందన్ నే బరిలోకి దించింది. ప్రారంభంలో బీజేపీ అభ్యర్థి ముందున్నప్పటికీ ప్రచారంలో హరీష్ రావు అమలు చేస్తున్న వ్యూహాలతో పరిస్థితులు తారుమారయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. తనపై నమ్మక ముంచి పార్టీ అభ్యర్థి సుజాతను గెలిపించాలని నియోజక వర్గ అభివృద్ధిని తాను చూసుకుంటానని హరీష్ రావు ఇచ్చిన హామీకి విస్తృత ప్రచారం జరగడంతో ఓటర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గినట్లు సమాచారం.

వాస్తవంగా ఏం జరిగింది?

పోలీసులు సిద్ధిపేట లెక్చరర్స్ కాలనీలోని రఘనందన్ రావు బంధువు అర్జున్ రావు నివాసంలో తనిఖీలు చేపట్టారు. సోదాల్లో భాగంగా రూ. 18.67 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇంటి నుంచి వెళ్ళిపోయే సమయంలో రఘనందన్ రావుతో పాటు బీజేపీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దాదాపు రూ. 12 లక్షల నగదు ఉన్న బ్యాగ్ ను పోలీసుల నుంచి కార్యకర్తలు లాక్కుని  పారిపోయారు. బీజేపీ నేతలు  మాత్రం పోలీసులే నగదు ఉంచి తమ పార్టీని బదనాం చేయడానికి కుట్రపన్నారని ఆరోపించారు.

Tension in Dubbaka, Money seized at Siddipet residence of BJP candidate’s relative

పోలీసులు ఏ మంటున్నారు?

సోదాలు, వాగ్వాదం అనంతరం  సిద్దిపేట కమిషనర్ జోయల్ డేవిస్ వివరణ ఇచ్చారు. తమకు వచ్చిన సమాచారంతో మూడు చోట్ల తనిఖీలు చేశామన్నారు. రఘునందన్ మామ, సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్  రాజనర్సు నివాసం,  ఎస్. రామ గోపాల రావు, ఎస్.అర్జున్ రావు నివాసాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. సెర్చ్ వారంట్ ను కుటుంబ సభ్యులకు అందజేశామని కమిషనర్ అన్నారు. అర్జునరావు నివాసంలో నగదును దుబ్బాక ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు  తెచ్చినట్లు కమిషనర్ తెలిపారు. పోలీసుల వద్ద నుంచి నగదు లాక్కెళ్లిన వారిని త్వరలో అరెస్టు చేస్తామని అన్నారు. అయితే అర్జున్ రావు వాదన మరోలా ఉంది. సివిల్ డ్రస్ లో వచ్చిన 40 మంది పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి మొబైల్ ఫోన్లు లాక్కుని దౌర్జన్యానికి పాల్పడ్డారని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా  బీజేపీ నిరసనలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా  బీజేపీ శ్రేణులు మంగళవారంనాడు భారీ ఎత్తున నిరసనలకు దిగారు. సికిందరాబాద్ పారడైజ్ వద్ద బీజేపీ కార్యకర్తలు రాస్తా రోకో చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవడంతో బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి, నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈసీఐఎల్ చౌరస్తా ,మౌలాలి హౌసింగ్ బోర్డ్   వద్ద  సీఎం కేసీఆర్ బొమ్మను దగ్ధం చేశారు.   నిరసన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి నివాసం ‘ప్రగతి భవన్’ ముట్టడికి ప్రయత్నిస్తున్న బీజేపీ కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles