గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
- పోలీసుల అదుపులో గో రక్షకులు
- గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని డిమాండ్
- గో సడక్ బంద్ లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజాసింగ్
దేశంలో జరుగుతున్న గోవుల అక్రమ రవాణాపై గో సంరక్షులు ఆందోళన చేపట్టారు. ప్రతి రోజూ దేశంలో ఏదో ఒక చోట గోవులను అక్రమంగా తరలించి వధించటం జరుగుతోందని గో సంరక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గో వధను నిషేధిస్తూ ఇప్పటికే పలు రాష్ట్రాలు చట్టాలు కూడా చేశాయి. ఈ నేపథ్యంలో గో హత్యలను నివారించాలని ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గోసడక్ బంద్ కు గో సంరక్షులు పిలుపు నిచ్చారు. వేలాది మందితో ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో గో రక్షకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎల్బీనగర్ ను దిగ్భంధనం చేస్తామన్న గో సంరక్షకులు పిలుపు మేరకు ఎల్బీనగర్, వనస్థలిపురం, మీర్ పేటలలో ముందస్తుగా ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆందోళనకు మద్దతు తెలిపిన రాజాసింగ్
మరోవైపు ఆందోళనలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. గోమాతను రాష్ట్ర ప్రాణిగా ప్రకటించాలని ఆయన సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. కర్ణాటక తరహాలో తెలంగాణ ప్రభుత్వం గో సంరక్షణకు చట్టం తేవాలని అన్నారు. ముఖ్యమంత్రి చర్యలు తీసుకునే వరకు తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. సడక్ బంద్ లో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: ప్రగతిభవన్ ముట్టడికి బీజేపీ యత్నం
అక్రమ రవాణాను అడ్డుకోవాలని రాజాసింగ్ డిమాండ్:
గోవులు అక్రమ రవాణాను అడ్డుకోవాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ కు రాజాసింగ్ డిమాండ్ చేశారు. పోలీసులు చేయలేని పక్షంలో తానే రంగంలోకి దిగుతానని హెచ్చరిక చేశారు. బహదూర్ పురా పోలీస్ స్టేషన్ నుంచి ఆవులను అక్రమంగా తరలిస్తున్నా పోలీసులు అడ్డుకోవడంలేదని అన్నారు. ఆవుల సంరక్షణకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. అక్రమంగా గోవులను తరలిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆవుల అక్రమ రవాణాకు సంబంధించి వీడియోలు, పక్కా సమాచారం అందించినా సజ్జనార్ స్పందించడంలేదని అన్నారు. అధికార ప్రతిపక్షాలనుంచి రాజకీయ ఒత్తిళ్లు ఉంటే మేమే చర్యలు తీసుకుంటామని రాజాసింగ్ అన్నారు.
ఇదీ చదవండి: విగ్రహాల ధ్వంసంపై బండి సంజయ్ మండిపాటు