• బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్టు
• గృహనిర్బంధంలో పలువురు నేతలు
• పోలీసుల తీరుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ, జనసేనలు
విజయనగరం జిల్లాలో కోదండరామస్వామి విగ్రహ ధ్వంసం పై రాజకీయ దుమారం కొనసాగుతోంది.. బీజేపీ జనసేన పార్టీలు పిలుపునిచ్చిన ఛలో రామతీర్థం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బీజేపీ, జనసేనలు సంయుక్తంగా తలపెట్టిన రామతీర్థ ధర్మయాత్రపై అనుమతి లేనికారణంగా ఆ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడకక్కడ గృహనిర్భంధంలో ఉంచారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు నేతలు బయలుదేరుతుండగా పలువురు నేతలను గృహనిర్భంధం చేశారు. విగ్రహ ధ్వంసంసై అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ జనసేన సంయుక్తంగా రామతీర్థ యాత్ర తలపెట్టాయి. యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు జనసేన నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ధర్మయాత్రకు వెళుతున్న పలువురు నేతలను పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. కన్నా లక్ష్మీనారాయణను గుంటూరులోని ఆయన నివాసంలో గృహనిర్బంధం చేశారు
పోలీసుల అదుపులో పలువురు నేతలు:
విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, అరకు పార్లమెంటు ఇంఛార్జి పరశురామ రాజు, గాజువాక నియోజక ఇంఛార్జి కరణం నర్శింగరావు, పార్వతీపురంలో బీజేపీ నేత ఉమామహేశ్వరరావును గృహనిర్భంధంలో ఉంచారు. విశాఖలో ఎంపీ సీఎం రమేష్ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ను పోలీసులు అడ్డుకున్నారు. అయితే గృహనిర్బంధంపై కన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సాయంతో ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇది చదవండి: విగ్రహాల ధ్వంసంపై బండి సంజయ్ మండిపాటు
ఉద్రిక్తంగా ధర్మయాత్ర:
రామతీర్థం సందర్శనకు వెళ్లకుండా స్థానిక రామతీర్థం కూడలి వద్ద బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ర్యాలీలు నిర్వహించకూడదని పోలీసులు తెలిపారు. వీర్రాజుతో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నా పోలీసులు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరుకు బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కోదండరాముడి ఆలయ సందర్శనకు వైసీపీ, టీడీపీ నాయకులను అనుమతించి బీజేపీ జనసేన నాయకులకు ఎందుకు అడ్డుకుంటున్నారని బీజేపీ నేతలు ప్రశ్నించారు. గృహనిర్బంధం చేసిన బీజేపీ జనసేన నాయకులను తక్షణం విడుదల చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు
ఇది చదవండి: రామతీర్థంలో రాజకీయాలు
సింగరాయకొండలో విగ్రహాల ధ్వంసం:
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఆలయాల ధ్వంసం కొనసాగుతూనేఉంది. తాజాగా ప్రకాశం జిల్లా సింగరాయ కొండ మండలంలోని పాత సింగరాయకొండ గ్రామంలో వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లే ముఖ ద్వారంపై ఉన్న మూడు విగ్రమాల చేతులు విరిగిపోయాయి. మంగళవారం ఉదయం గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి సీఐడి:
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామతీర్థం ఘటనపై నిజా నిజాలను నిగ్గుతేల్చేందుకు సీఐడీ రంగంలోకి దిగింది. ఆలయంపై దాడి, రాముడి విగ్రహ ధ్వంసంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు నెల్లిమర్ల పోలీసులను వివరాలను సేకరించే పనిలో పడ్డారు. దాడి జరిగిన సమయంలో రామతీర్థం ప్రాంతంలో యాక్టివ్ గా ఉన్న సెల్ ఫోన్ సిగ్నల్స్ పై సీఐడీ దృష్టి పెట్టింది. క్లూస్ టీమ్ రాముని విగ్రహంతో పాటు కోనేట్లో దొరికిన హెక్సా బ్లేడ్, ఆలయానికి సంబంధించిన తాళం, ఆలయ ద్వారాలపై వేలిముద్రలను సేకరించి ఫొరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. దర్యాప్తులో ఇంటెలిజెన్స్ వర్గాల సహాయం కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఘటనక బాధ్యులైన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని సీఎం జగన్ ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
ఇది చదవండి: రాజకీయాల్లోకి దేవుడ్ని లాగుతారా-సీఎం జగన్ ఆవేదన