వోలేటి దివాకర్
‘‘ఎందుకంటే …
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా లోక్ సభ తలుపులు మూసేసి …
టివి కెమేరాలు ఆఫ్ చేసేసి … సంఖ్యా బలాన్ని నోటి మాటగా చెప్పించేసి … మెజారిటీ సభ్యులు ఎటు అనుకూలం, ఎటు ప్రతికూలం అనే గణన శాస్త్రీయంగా జరగకుండా …. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించడానికి వచ్చిన బిల్లుని ‘ఆమోదించేశాం’ అని స్పీకర్ ప్రకటించి ఫిబ్రవరి 18 నాటికి సరిగ్గా పదేళ్ళు!!! కేకలు, అరుపులు, నిరసనలు, వాక్-అవుట్ల మధ్య ‘ఎవరు అనుకూలురు – ఎవరు ప్రతికూలురు’ అని తలలు లెక్కపెట్టడం కూడా మానేసి జరిపిన ‘రాష్ట్ర విభజన ఓటింగ్ ప్రక్రియ ‘ ప్రహసనం 2014 ఫిబ్రవరి సాయంత్రం (గం. 3-24 నుంచి గం. 4-24 కి మధ్య) “ముగిసింది” అంటూ స్పీకర్ ప్రకటించటంతో ముగిసింది’’ అని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Also read: కాపుల ఆవేదన…కమ్మవారి ఆందోళన!
ఆరోజున పార్లమెంటు కార్యకలాపాలపై ఆకాశవాణీ ప్రసారాలను వినిపించి, ప్రొసీడింగ్స్ పుస్తకాన్ని ప్రదర్శించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ ప్రకారం రాష్ట్ర విభజన రాజ్యాంగబద్ధంగా జరగలేదన్నారు. ఇలాంటి అన్యాయం మరో రాష్ట్రానికి జరగకుండా ఉండేందుకే తాను సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. విభజన బిల్లు ఆమోదించిన రోజున బిల్లును సమర్థించే 70 మంది బిజెపి, కాంగ్రెస్ సభ్యులు, ప్రాంతీయ పార్టీల సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారన్నారు. అయినా ప్రజాస్వామ్య, రాజ్యాంగ విరుద్ధంగా పార్లమెంటు తలుపులన్నీ మూసివేసి బిల్లును ఆమోదించినట్లు ప్రకటించారన్నారు.
బ్లాక్ డే అన్న అమిత్ షా
రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన రాష్ట్ర విభజన జరిగిన రోజును బ్లాక్ డేగా కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా పార్లమెంటులోనే వ్యాఖ్యానించారన్నారు. రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లు గడుస్తున్నా ఏపీకి తగిన న్యాయం జరగలేదన్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, 58:42 నిష్పత్తి ప్రకారం ఉమ్మడి ఆస్తుల పంపకం, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలేవీ అమల్లోకి రాలేదన్నారు. కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కనీస రాతకోతలు, ఒప్పందాలు లేకపోవడం శోచనీయమన్నారు. అయినా అప్పటి తెలుగుదేశం, ఇప్పటి వైఎస్సార్‌సిపి ప్రభుత్వాలు కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నోరు మెదపకపోవడం శోచనీయమని ఉండవల్లి విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కనీస న్యాయం జరగనపుడు ఎన్నికలు నిర్వహించడం, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఎందుకని నిలదీశారు. పాలకులు అవినీతిపరులైనా పర్వాలేదని పిరికిపందలైతే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. విభజన బిల్లును ఆమోదించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పటికైనా పాలక, ప్రతిపక్షాలు ఏపీకి జరిగిన అన్యాయంపై గళమెత్తి, విభజన హామీలు నూరుశాతం అమలయ్యేలా పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న విభజన కేసు త్వరితగతిన పరిష్కారమయ్యేలా కృషిచేయాలని జగన్ ప్రభుత్వానికి సూచించారు. ఈకేసులో పార్టీగా ఉన్న తనకు పోరాడే శక్తి చాలదని, రాష్ట్ర ప్రభుత్వమే సీనియర్ న్యాయవాదిని నియమించి, కేసు త్వరితగతిన విచారణకు తెచ్చి, ఎపికి న్యాయం జరిగేలా కృషిచేయాలన్నారు.
Also read: చైన్ లాగి 1097 మంది జైలు పాలయ్యారు!
బీజేపీ నాయకుల వైఖరి దారుణం
ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసిన ఎలక్ట్రోల్ బాండ్లలో హైదరాబాద్ నుంచి అత్యధికంగా బిజెపికి విరాళాలు అందడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనను తప్పుపట్టిన జగద్గురు కంచి మఠాధిపతి శంకరాచార్యను హిందూ మతానికి, ఆయనకు ఏమి సంబంధమని బిజెపి నాయకులు నిలదీయడం దారుణమన్నారు.దీనిపై మఠాధిపతులు, కనీసం అర్చకులు కూడా బిజెపిని తప్పుపట్టకపోవడం విచారకరన్నారు.
Also read: రానున్న ఎన్నికలపై ఉండవల్లి జోస్యం!