Thursday, November 7, 2024

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు సమంజసమే

  • అందరిలో నైపుణ్యం పెంచడానికి కృషి చేయాలి
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో 3-2 ప్రాతిపదికన తీర్పు

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం న్యాయమేనని సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. ఈ రిజర్వేషన్ల కేటాయింపులో ఎటువంటి వివక్ష లేదనీ, ,రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘిoచలేదని జస్టిస్ దినేశ్ మహేశ్వరీ తీర్పు వెలువరించారు. ఐదుగురు సభ్యులుగా ఉన్న ధర్మాసనంలో ముగ్గురు ఈ తీర్పును సమర్ధించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్, మరో న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ వ్యతిరేకించారు. ఈ విషయంపై దాఖలైన పలు పిటీషన్లపై ఇటీవలే విచారణ ముగించిన సుప్రీంకోర్టు నేడు తుది తీర్పు ఇచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్ కల్పించింది. దీనిని సవాల్ చేస్తూ పలు పిటీషన్లు దాఖలైన విషయం తెలిసిందే. దీనితో ఇక ఈ అంశానికి తెరపడినట్లే భావించాలి. రిజర్వేషన్లలో 50శాతం పరిమితి అనేది ఎప్పుడూ ఒకేలా ఉండాలని లేదని జస్టిస్ బేలా త్రివేదీ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లపై 1992లో సుప్రీంకోర్టు విధించిన పరిమితిని దాటి ఈ కోటా ఎలా ఇస్తారంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ అంశాలన్నింటినీ పూర్వపక్షం చేస్తూ తాజాగా సుప్రీం కోర్టు ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లను సమర్థించింది. బిజెపికి ఈ తీర్పు రాజకీయంగా మేలు చేస్తుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

Also read: ఏ విలువలకీ ప్రస్థానం?

ఒకే అంశంపైన పలు అభిప్రాయాలు

దేశంలో రిజర్వేషన్ల విధానంపై ఎప్పటి నుంచో పలు వర్గాలు పలు వాదనలు వినిపిస్తున్నాయి. అంబేద్కర్ ఆలోచనా విధానాలకు, ఆయన చూపించిన మార్గాలకు అనుగుణంగా రిజర్వేషన్ల అమలు విధానం లేదనే వాదనలు కూడా ఉన్నాయి. ఆయన సూచించిన కాల పరిధి ఎప్పుడో ముగిసిపోయినా ఇంకా రిజర్వేషన్లు కొనసాగించడమేంటనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి. కేవలం ఓటు బ్యాంక్ ను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు రిజర్వేషన్ విధానాలను అమలు చేస్తూ వచ్చాయనే విమర్శలు ఉన్నాయి. అగ్రవర్ణాలలో ఎందరో నిరుపేదలు ఉన్నారనీ, వారు దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారనీ, కేవలం కులం శాపమై చాలా అవకాశాలకు దూరమైపోయి, సామాజికంగా ఎంతో వెనుకబడిపోయారని అగ్రవర్ణాల నుంచి ఆవేదనా స్వరాలు ఎన్నాళ్ల నుంచో వినిపిస్తున్నాయి. పేదరికం,ప్రతిభకు ప్రభుత్వాలు పెద్దపీట వేయాలని, ముఖ్యంగా సామజిక వర్గాలకు అతీతంగా పేదలపక్షపాతం వహించాలన్నది ఒక వాదన. ఆర్ధికంగా వెనుకబాటుతనం మాత్రమే ప్రాతిపదికగా కాక, సామాజిక వెనుకుబాటుతనానికి ప్రాధాన్యతనివ్వాలనీ, దానితో పాటు పేదరికాన్ని కూడా గుర్తించాలన్నది కొన్ని వర్గాల వాదన. అసలు రిజర్వేషన్ల విధానానికే ముగింపు పలకాలనీ, అందరిలో నాణ్యత పెంచే విధంగా శిక్షణ కల్పించాలనీ, అవకాశాలు అందుబాటులో ఉంచాలనీ, అన్ని రంగాల్లో సాధికారత తేవాలని, శక్తివంతమైన వ్యక్తులుగా తయారుచేయాలని, సోమరిపోతులను పెంచవద్దని మరికొందరి వాదన. దేశ జనాభాలో ఏ ఏ సామాజిక వర్గాల జనాభా శాతం ఎంత? వివిధ రంగాల్లో వారి అభివృద్ధి, వెనుకుబాటుతనం ఎంత? అనే అంశాలపై సమగ్రంగా ఇంతవరకూ అధ్యయనం జరగలేదనే వాదన కూడా ఉంది.

Also read: దిల్లీకి జబ్బు చేసింది!

ఓటు బ్యాంక్ రాజకీయాలకు స్వస్తి పలకాలి

దేశంలో సామాజికంగా, ఆర్ధికంగా ప్రతి వర్గాన్ని పైకి తేవాలని, దేశ అభివృద్ధికి అందరూ తోడ్పడేలా తీర్చిదిద్దాలని,వీటిని విస్మరిస్తూ కేవలం రాజకీయమైన ప్రయోజనాలను ఆశించి, ఓటుబ్యాంక్ ప్రాతిపదికన విధానాలను రూపకల్పన చేయడం సరియైనది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకూ గమనాన్ని గమనిస్తే పేదరికం – ధనికం మధ్య వ్యత్యాసం గణనీయంగా పెరిగిపోతోందనీ, ఈ అసమానతలు దేశ సౌభాగ్యానికి,శాంతికి, సామరస్యతకు గొడ్డలి పెట్టువంటిదనీ సామాజిక,ఆర్ధిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. రిజర్వేషన్ల విధానంలో జనాభా/ఓటర్ల ఆధారంగా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధానాన్ని సమర్ధిస్తోందని విశ్లేషకుల భావన. మొత్తంగా చూస్తే నేటి తీర్పు కొందరికి మోదంగా -కొందరికి ఖేదంగా మారింది.పార్టీల మధ్య రాజకీయ విబేధాలు, తదనుగుణంగా విమర్శలు, ప్రతి విమర్శలు సర్వ సాధారణం. భిన్న సామాజిక వర్గాలు,భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవైన భారతదేశంలో కులాల గోడలు బద్దలవ్వాలి. అదే విధంగా దేశం పేదరికం నుంచి పూర్తిగా బయటపడాలి. ప్రతి ఒక్కరిలో సమర్ధతను పెంచాలి. అందరిలో నైపుణ్యాలను పెరగడానికి రాజమార్గం వేయాలి. పేదరికం, ప్రతిభకు పట్టం కట్టాలి. రిజర్వేషన్ల విధానాలు అగ్గి రగల్చరాదు. నిష్పక్షపాతమే అన్ని ఎడలా రాజ్యమేలాలి.

Also read: ఆయుర్వేదంలో అధ్యయనం అవసరం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles