చంద్రబాబునాయుడు,బిశ్వభూషణ్ హరిచందన్
- దాడులపై ప్రభుత్వం దాటవేత ధోరణి
- ఆగంతకులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలం
- గవర్నర్ కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై తెలుగుదేశం పోరును తీవ్రతరం చేసింది. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రవణ్ కుమార్, వర్ల రామయ్య, బుద్దా వెంకన్నలు గురువారం (జనవరి 7) ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఘటనలు జరిగాయని టీడీపీ నేతలు ఆరోపించారు. అన్నింటిపైనా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.
దాడులపై ప్రభుత్వం ఉదాసీనవైఖరి
ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై వరుస దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఉదాసీనవైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. దాడులపై మంత్రులు బాధ్యతారాహిత్యంగా చేస్తున్న వ్యాఖ్యలతో రాష్ట్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని టీడీపీ నేతలు అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్రంలో మతసామరస్యం దెబ్బతినే పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు.
ఇది చదవండి: విగ్రహాల విధ్వంసం చంద్రబాబు కుట్రే
అపుడేం చేశారు?
టీడీపీ హయాంలో రోడ్లను విస్తరించే క్రమంలో తొలగించిన దేవాలయాలపై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు మాట్లాడని జగన్ రాజకీయాలు చేసేందుకు ఇపుడే మేల్కొన్నారా అంటూ ప్రశ్నించారు. ఆలయాలపై జరిగిన వరుస దాడులనుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నిస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. దాడులపై ప్రశ్నిస్తున్న వారిని అరెస్టులు చేస్తూ భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వెలిబుచ్చారు. అమాయకులైన టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. జరగబోయే పరిణామాలకు జగన్ సర్కార్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసిన అగంతకులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని పాలించే అర్హత కోల్పోయినందున రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
ఇది చదవండి: తిరుపతిలో హిందుత్వ అజెండా అమలు చేస్తున్న తెలుగుదేశం