Sunday, December 22, 2024

సివిల్స్ పరీక్షల్లో నిలిచి వెలిగిన తెలుగువారు

  • అఖిల భారత సర్వీసుల్లో ముందంజ
  • తెలుగు మహిళల సంఖ్య ఇంకా తక్కువే
  • జాతీయ స్థాయిలో మొదటి మూడు ర్యాంకులూ మహిళలకే

అత్యంత ప్రతిష్ఠాకరమైన సివిల్స్ -2021లో తెలుగువారు సత్తా చాటడం ఎంతో సంతోషదాయకం. సుమారు 21 మంది ఈ అత్యున్నత సర్వీసెస్ కు ఎంపికవ్వడం విశేషం. వీరిలో 100 ర్యాంక్ లోపు వచ్చినవారు ఆరుగురు ఉండడం మరో విశేషం. యశ్వంత్ కుమార్ రెడ్డి 15 వ ర్యాంక్ సాధించి అగ్రగామిగా నిలిచారు. యూపీఎస్సీ నిర్వహించే ఈ పరీక్షలో ప్రతిభను చాటుకున్న తెలుగువారు ఎందరో గతంలోనూ ఉన్నారు.అయితే మొదటి ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించిన తెలుగువారు ఇప్పటి వరకూ చాలా తక్కువమందే ఉన్నారు. ఒకసారి సర్వీస్ లో చేరిన తర్వాత అందరూ సమానమే కానీ, అగ్రస్థానం ఎప్పుడూ ఆదర్శవంతం. మొదటి ర్యాంక్ ను పొందిన తెలుగువారిలో దువ్వూరి సుబ్బారావు ప్రథములు. 1971-1972 లో సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో భారతదేశంలోనే మొదటి ర్యాంక్ ను సాధించిన మొదటి తెలుగువాడిగా ఆ ఘనత దువ్వూరి సుబ్బారావుకే చెందుతుంది. 2006-2007లో రేవు ముత్యాలరాజు దేశంలోనే మొదటి ర్యాంక్ సాధించి చరిత్రను తిరగరాశారు. వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చి ప్రతిభకు సాటిలేదని చాటిచెప్పిన ఘనుడు ముత్యాలరాజు. అడపా కార్తీక్, అనుదీప్ వంటివారు కూడా ఆ వరుసలో చేరి మనతనాన్ని చాటి చెప్పారు. ఈ సారి పరీక్షా ఫలితాలలో మొదటి మూడు ర్యాంకులూ మహిళలకే రావడం, వారు ముగ్గురూ ఉత్తరాదివారు కావడం విశేషం.

Also read: హిమయమసీమలు

సామాన్య సామాజిక నేపథ్యం

సివిల్ సర్వీసెస్ లో ఎంపికైన తెలుగువారిలో పేద, మధ్య, ఎగువ తరగతి కుటుంబాల నుంచి వచ్చినవారు ఉన్నారు. ప్రాంతం, సామాజిక వర్గం ఏదైనా ప్రతిభయే సోపానంగా వారు విజయతీరాలకు చేరుకున్నారు. ప్రతి ఏటా తెలుగువారు ఎంతో కొంతమంది ఎంపికవుతూనే ఉన్నారు. సివిల్ సర్వీసెస్ లోకి ప్రవేశించిన తర్వాత కొందరు అత్యున్నతమైన పదవులను కూడా అలంకరించారు. దువ్వూరి సుబ్బారావు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు. వై వేణుగోపాల్ రెడ్డి కూడా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా సేవలు అందించారు. మాచవరం రామకృష్ణయ్య నాబార్డ్ వ్యవస్థాపక చైర్మన్ గానూ, రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ గానూ చేశారు. ఇలా ఎంతోమంది ప్రతిభామూర్తులు తెలుగువారి ఖ్యాతిని రెపరెపలాడించారు.  వారందరూ ప్రేరణాస్వరూపులు. స్వాతంత్రం రాక ముందు – వచ్చిన తర్వాత పరీక్షా విధానంలోనూ, వ్యవస్థల్లోనూ చాలా మార్పులు వచ్చాయి. ఐనప్పటికీ ఇప్పటికీ అత్యున్నతమైన, అత్యుత్తమమైన సర్వీస్ ఇదే. ఈ పరీక్షల వైపు గతంలో కంటే అవగాహన కొంత పెరుగుతున్నప్పటికీ, ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతవాసులు, పేద, మధ్యతరగతివారు కూడా పరీక్షల్లో పోటీపడి ఎంపికవ్వడం శుభశూచకం. ఉత్తరాది వారితో పోల్చుకుంటే మనం ఇంకా వెనుకబడే ఉన్నామన్నది వాస్తవం. కొంతకాలం క్రితం వరకూ దక్షిణాదిలో తమిళనాడువారు కాస్త ఎక్కువమంది ఎంపికయ్యేవారు. తదనంతర కాలంలో తెలుగువారి సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. సివిల్ సర్వీసెస్ పరీక్షను ఎదుర్కోవడంలో మనవారు అధిగమించాల్సిన అంశాలు ఉన్నాయి. తెలుగు మీడియంలో చదువుకున్నవారు, ఇంగ్లిష్ పై అధికారంలేనివారు, పేద, మధ్యతరగతివారు, అమ్మాయిలు ఇంకా ఈ పరీక్ష వైపు రావడానికి వెనుకడుగు వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కంటే ఐటీ వంటి ప్రైవేట్ ఉద్యోగాలు,అమెరికా వంటి విదేశీ కొలువుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో సివిల్ సర్వీసెస్ లో మనవారి భాగస్వామ్యం చెప్పుకోతగ్గ స్థాయిలో ఉండడం లేదు. ఉత్తరభారతంలో, ముఖ్యంగా దిల్లీ, ఉత్తరప్రదేశ్ లోని విద్యార్థులు 10 వ తరగతి, ఇంటర్మీడియట్ దశ నుంచే సివిల్ సర్వీసెస్ పరీక్షలు గురించి సంకల్పం చేసుకొని, సాధన చేస్తూ ఉంటారు. ఈ ఒరవడి మన దగ్గర రావాల్సి ఉంది.

Also read: ఎన్టీఆర్ కి భారత రత్న ఇప్పుడైనా…

ఆడపిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి

మన తెలుగురాష్ట్రాల్లో కూడా ఆడపిల్లలను ఈ పరీక్షల వైపు మళ్ళించడంలో తల్లిదండ్రులు ఇప్పటికీ అనాసక్తి చూపిస్తున్నారు. చాలామంది మధ్యతరగతి మనస్తత్వం నుంచి బయటబడకపోవడం ముఖ్యమైన కారణం. ఆత్మన్యూనత, భయం వంటివాటిని అధిగమించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నెల్లూరు జిల్లా కావలి ప్రాంతీయులు సివిల్ సర్వీసెస్ కు ఎక్కువమంది ఎంపికయ్యేవారని చెబుతూండేవారు. జవహర్ భారతి వంటి విద్యాశాలలు కారణం కావచ్చు. ప్రతిభకు ప్రాంతం, కులం కొలబద్దకాదు. కృషి, పట్టుదల తోడై, నిబద్ధత నీడై గెలుపుగుర్రాలుగా నిలిచిన వారే ఎప్పటికీ ఆదర్శప్రాయులు. దేశభక్తి, సేవాదృక్పథం వున్నవారు మాత్రమే ఈ సర్వీసెస్ ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. కాలమాన పరిస్థితుల్లో అధికారులపై రాజకీయనాయకుల పెత్తనం పెరుగుతూ వస్తోంది. కొంతమంది అధికారులు పాలకులకు తలఒగ్గుతూ, వారితో కలిసిపోయి, తప్పుల్లో భాగస్వామ్యులవుతున్నారనే విమర్శలు ఈమధ్య కాలంలో వస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదు. కేవలం కొంతమంది వల్ల మొత్తం వ్యవస్థను తప్పుపట్టడం కూడా సరియైనది కాదు. అత్యున్నత స్థాయి అధికారులు అవినీతికి, బంధుప్రీతికి లొంగిపోవడం ఏ మాత్రం మంచి పరిణామం కాదు. ఇప్పటికీ యూపీఎస్సీ నిర్వహించే పరీక్క్షా విధానం, సివిల్ సర్వీసెస్ ‘చెక్కుచెదరని పరిపాలనా వ్యవస్థ ‘ ( స్టీల్ ఫ్రేమ్ అఫ్ అడ్మినిస్ట్రేషన్ ) గా ఎంతో పేరు ప్రఖ్యాతులతో వెలుగొందుతున్నాయి. వీటిని కలకాలం కాపాడుకోవడం జాతి కర్తవ్యం. ఈసారి ఎంపికైన 21 మందిలో 14 మందికి బాలలత సౌరయ్య వద్ద శిక్షణ పొందడం విశేషం. కోచింగ్ సెంటర్లు ఎన్నో ఉన్నప్పటికీ ఉత్తమమైనవాటిని ఎంపిక చేసుకోవడంలో తెలివి దాగి ఉంటుంది. ఎంపికైన తర్వాత ఉత్తమ పౌరసేవకుడిగా నిలవడంలో విజ్ఞత దాగి ఉంటుంది. భవిష్యత్తులో తెలుగువారు ఈ అత్యున్నత పరీక్షకు ఎక్కువమంది ఎంపికకావాలని, దేశభక్తిని చాటుకోవాలని, జాతి  పునఃనిర్మాణంలో, పూర్వవైభవ సాధనలో భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షిద్దాం.

Also read: ఇతర దేశాలతో పోల్చితే మనం చాలా నయం!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles