తెలంగాణ వైతాళికులుగా పేరుగాంచి నిజాం నిరంకుశ ఏలికపై కలం, గళమెత్తిన వారిలో వట్టికోట ఆళ్వార్‌స్వామి ప్రముఖ గణనీయులు. వట్టికోట అంటే భూమికోసం, భుక్తికోసం, విముక్తి కోసం వెలసిన`కోట`. జనచైతన్య ప్రభంజనం. ‘ప్రజల మనిషి’. తెలంగాణలోని నల్గొండ జిల్లా మాధవరం గ్రామంలో నిరుపేద సంప్రదాయక శ్రీవైష్ణవ కుంటుంబంలో పుట్టిన ఆయన చిన్నతనంలోనే తండ్రి రామచంద్రాచార్యులు మరణిండంతో, ఇతరుల ఇళ్లలో సేవక వృత్తితో పొట్టపోసుకోవలసి వచ్చింది. ఫలితంగా కనీస చదువుకు కూడా నోచలేదు. నాటి బెజవాడ నేటి విజయవాడలో ఒక హోటల్‌లో ‘సర్వర్’గా పనిచేస్తూనే తెలుగు,ఆంగ్లభాషలపై పట్టు సాధించారు. తనకు లేని విద్యను ఇతరులకు అందించాలని అనంతర కాలంలో తహతహలాడారు. ఆ దిశగా కృషి చేశారు. ప్రాథమిక చదువుకే నోచని ఆయన స్వయం కృషితో ఆయా భాషలు నేర్చి కథకుడు, నవలాకారుడు, ఉపన్యాసకుడు, పత్రికా సంపాదకుడు, ప్రచురణ కర్త, గ్రంథాలయ నిర్వాహకుడిగా ఎదిగి బహుముఖీన పాత్రలు పోషించారు. `ప్రజల మనిషి`తో తెలంగాణ తొలి నవలా రచయితగా నిలిచారు. ఆనాడు కాస్తోకూస్తో చదువుకున్న ప్రతి ఒక్కడి ఇంట్లో ఈ పుస్తకం ఉండేదని చెబుతారు.
సర్వర్ నుంచి….
హోటల్ కార్మికుడిగా జీవితం ప్రారంభించిన ఆళ్వార్ స్వామి స్టేట్ కాంగ్రెస్, ఆంధ్రమహాసభ, ఆర్యసమాజం, కమ్యూనిస్టు పార్టీ, అభ్యుదయల రచయితల సంఘం, పౌరహక్కుల ఉద్యమాలలో పాలుపంచుకుని, గ్రంథప్రచురణ, గ్రంథాలయ నిర్వహణ లాంటి అనేక కార్యక్రమాలలో అపార కృషి చేశారు.
Also Read : ఆదర్శ సభాపతి అనంత శయనం
ఉద్యమనేత….
తెలంగాణలో పౌర హక్కుల పరిరక్షణ కార్యక్రమాన్ని తొలిసారిగా నిర్వహించారు. ఆల్ హైద్రాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, గుమస్తాల సంఘం, రిక్షా కార్మికుల సంఘం, రైల్వే ఉద్యోగుల సంఘం లాంటి సంస్థల కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఇలా హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ప్రతి ఉద్యమంలో ముందున్న వట్టికోట మరణానంతరం ఆయన ప్రస్తావన వచ్చినప్పుడల్లా `వాడు పన్నెండు మంది ఆళ్వారులలో ఒకడయ్యా`అని కాళోజీ కన్నీరు కార్చేవారట.
`ప్రజల మనిషి`
కథకుడిగా తెలంగాణ ప్రాంత జనజీవనాన్ని ప్రభావితం చేసే అనేక కథానికలు రాశారు. తెలంగాణ ప్రాంత తొలి నవలా రచయితగా ‘ప్రజ మనిషి’లో అక్కడి ప్రజా జీవనాన్ని, సాయుధ పోరాటానని ఆవిష్కరించారు. ‘ప్రజల మనిషి’, ‘గంగు` నవలలు నాటి తెలంగాణ రాజకీయ ప్రజా ఉద్యమ చరిత్రకు అక్షర రూపాలు. `గంగు’ రెండవభాగం పూర్తికాకుండానే ఆయన తనువు చాలించారు. అవినీతి, అన్యాయం, సంఘ విద్రోహం, బాధ్యతారాహిత్యం, సామాజిక, రాజకీయ దురాచారా లను విమర్శిస్తూ ‘రామప్పరభస’ శీర్షికన రాసిన వ్యాసాలు మచిలీపట్నం నుంచి వెలువడే ‘తెలుగు విద్యార్థి’ పత్రికలో ధారావాహికగా వచ్చి ఆలోచింపచేశాయి.
Also Read : తెలుగు గాంధీ ‘బులుసు’
గ్రంథాలయ ఉద్యమకారుడు
సంపాదనలోఅధిక భాగం సాహిత్య పత్రికల కొనుగోలుకే వెచ్చించేవారు ఆళ్వార్ స్వామి. 23 ఏళ్ల వయస్సులో గ్రంథాలయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. సామాన్యులలో చదువు పట్ల ఆసక్తి కలిగించేందుకు సికింద్రాబాద్ లో ‘దేశోద్ధారక గ్రంథ మండలి’ని ఏర్పాటు చేయడం ద్వారా పుస్తకాలు ముద్రించి భుజాన పెట్టుకుని గ్రామగ్రామం తిరిగి చదివించేవారు, చందాదారులుగా చేర్పించేవారు. దేశోద్ధారక గ్రంథ మండలి పాత ప్రతికలతో గ్రంథాలయం ఏర్పటు చేసి పరిశోధకులకు, జిజ్ఞాసులకు అందుబాటులో ఉంచారు. కాశీనాథుని నాగేశ్వరరావు, పట్టాభి సీతారామయ్య గార్లతో కలసి అనేక సమావేశాల్లో పాల్గొన్నారు.
పాత్రికేయుడిగా….
వట్టికోట పత్రికా రచయితగా పనిచేశారు. తెలంగాణ రైతాంగ పోరాటం సాయుధ పోరాటంగా మారడానికి ఆళ్వార్‌స్వామి రచనలూ కారణంగా చెబుతారు. కడవెండిలో జరిగిన దొడ్డి కొమరయ్య హత్యోదంతాన్ని ఆయన ‘మీజాన్’ పత్రిక ద్వారా వెలుగులోకి తెచ్చారు. `తెలుగుతల్లి` పేరుతో కొన్నాళ్లు మాసపత్రికను నడిపారు.
Also Read : ప్రధాని నోట `బోయిన్ పల్లి` మాట
క్విట్ ఇండియా ఉద్యమంలో
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కొంతకాలం జైలు శిక్ష అనుభవించారు. 1944లో వామపక్ష సభ్యత్వం తీసుకున్న రెండేళ్లకే నిజాం ప్రభుత్వం ఆ పార్టీపై నిషేధం విధించడంతో అనేక మంది నాయకులు అజ్ఞాతలోకి వెళ్లిపోయారు. పోలీసుకు చిక్కిన వట్టికోటను సంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్, గుల్బర్గా జైళ్లలో ఉంచారు. ఖైదీల మనోభావాను విశ్లేషిస్తూ, `జైలులోపల` గ్రంథాన్నిరాశారు. జైలు నియమ నిబంధనలను సంస్కరించాని ఆందోళన చేశారు. ఆయనను రాజకీయ ఖైదీకి బదులుగా పెద్ద నేరం చేసిన వ్యక్తిలా జైలు సిబ్బంది పరిగణించేవారని దాశరథి వ్యాఖ్యను బట్టి తెలుస్తుంది. `నేను, మరో ముప్పయ్ రెండు మంది ఖైదీలను వరంగల్ జైలు నుంచి నిజామాబాద్ జిల్లాకు మార్చినప్పుడు అక్కడ మొదట కనిపించిన మిత్రుడు వట్టికోట ఆళ్వారుస్వామి . అజానుబాహు విగ్రహం, పచ్చని దేహచ్చాయ. చిన్నచడ్డీ, చాలీచాలని గీట్ల అంగీ, నెత్తినటోపీతో నీటి పంపు వద్దకు వెళుతున్నాడాయన. హత్యానేరాలలో శిక్షలు పడిన వారికిచ్చే దస్తులు ఆయనకు ఇచ్చారు. అవే తొడుక్కుని ఆయన కాలక్షేపం చేస్తున్నారు`అని వివరించారు.
ఆ కవితంటే ఇష్టం..
నిజామాబాద్ జైలు గోడపై దాశరథి బొగ్గుతో రాసిన ‘ఓ నిజాము పిశాచమా…’ కవిత ఆయనకు ఎంతో ఇష్టం. దానిని అధికారులు చెరిపేసిన కొద్దీ వట్టికోట తిరిగి రాస్తూనే ఉండేవారట.`కవిత వినాలన్నా,చదవాలనీ ఎంతో కుతూహలం. విప్లవాత్మకమైన రచన వింటే పొంగిపోయేవాడు. కంఠస్థం చేసిన ఈ పద్యాన్ని తరచూ చదువుతూ ఉండేవాడు. జైలు అధికారులు చెరిపిన కొద్దీ మరో గోడపై ఆ పద్యం ప్రత్యక్షమయ్యేది. అది నేనే రాస్తున్నానని వారి (జైలు అధికారుల) దురభిప్రాయం. కవులంటే….ముఖ్యంగా నేనంటే ఎక్కడలేని అభిమానం`అని దాశరథి చెప్పేవారు. అగ్నికి వాయువు తోడైనట్లు ఆయనకు దాశరథి తోడు కావడం,ఆ ‘జంట’ తిరుగుబాటు అధికారులకు ఇబ్బందిగా మారింది. అంతే ఆళ్వార్‌ను గుల్బర్గా జైలుకు, దాశరథిని హైదరాబాద్ చెంచల్‌గూడ జైలుకు తరలించారు.
Also Read : తెలుగు సినిమా ఉమ్మడి ఆస్తి ‘గుమ్మడి’
మిత్రుడికి `అగ్నిధార`
దాశరథి తొలి రచన ‘అగ్నిధార’ను అంకితం పొందిన ఆత్మీయమిత్రుడు వట్టికోట.‘మిత్రుడి కోసం కంఠం ఇవ్వగలడు/మంచికి పర్యాయ పదం ఆళ్వార్/ అతనిదే సార్థకమైన జీవితం/అతనికే అగ్నిధార అంకితం’ అన్నారు దాశరథి. దాశరథితో మైత్రికి చిహ్నంగా గ్రంథ స్వీకారానికి అంగీరించానని చెప్పిన ఆళ్వార్‌స్వామి మిత్రుడిని ‘కవితా పయోనిధి’అని సంబోధించారు. ద్రవిడ సంప్రదాయంలో…
‘అసలు ఆళ్వార్లు పన్నెండు మందే
పదమూడో ఆళ్వార్ మా
వట్టికోట ఆళ్వార్‌స్వామి
నిర్మల హృదయానికి
నిజంగా అతడు ఆళ్వార్
దేవునిపై భక్తి లేకున్నా
జీవునిపై భక్తి ఉన్నవాడు
తాను తినకుండా
ఇతరులకు అన్నం పెట్టగలవాడు
ఆశ్రయింపులెరుగనివాడు
విశ్రాంతి తెలియనివాడు
వారం వారం మారనివాడు
రంగులద్దుకోలేనివాడు
అతనిదే సార్థకమైన జీవితం
అతనికే `అగ్నిధార` అంకితం ’అన్న దాశరథి మాటల్లో ఆయన వ్యక్తిత్వం వెల్లడవుతుంది.
Also Read : నిఖార్సైన కలంయోధుడు ‘ఖాసా’
వట్టికోట భయమెరుగని వ్యక్తి. ఆయనను, కాళోజీని, మరికొందరని వరంగల్ జైలు నుంచి అజ్ఞాతానికి తరలించారని, వారిని చంపేస్తారని జనం చెప్పుకుంటుండగా, ‘వారు కేవలం కవులు, రచయితలే కారు. స్వాతంత్య్ర సమరవీరులు. జనం అనుకుంటున్నట్లు వాళ్లని చంపితే కొంచెం ఆలస్యంగా రావసిన తిరుగుబాటు ఇంకా త్వరగా వస్తుందని నా దృఢ విశ్వాసం’ అని దాశరథి వ్యాఖ్యానించడంలో వారి ధీమత్వం, ప్రజల కోసం ప్రాణం తృణప్రాయమనే భావన స్పష్టమవుతుంది.
`కల్మషంలేని కమనీయ మూర్తి.కరుణజాలువారే అనురాగమూర్తి.ఆయనను కోల్పోయి ఎలా జీవిస్తున్నామో ఆశ్చర్యంగా ఉంది. అతను లేకుండా నేను జీవించి ఉన్నందుకు నా వరకు నేను సిగ్గుపడుతున్నాను. రాత ముఖ్యం కాదు…చేత ముఖ్యమన్న ఆయన సూక్తి ఎప్పుడూ నా మనస్సులో మెదులుతుంది`అని దాశరథి `అగ్నిధార` ముందుమాటలో పేర్కొన్నారు.
Also Read : శ్రవ్యనాటక ‘కనకం’
వట్టికోట ‘వొట్టిమాట’ వ్యక్తి కాదు.మానవసేవే మాధవసేవగా నమ్మినవారు. ఇతరుల బాధ(ల)కు స్పందించే వారు.ఆయన జీవితమంతా ప్రజలే ఊపిరిగా,వారిబాగోగులే శ్వాసగా గడిచింది. మానవతాది, గిట్టనివారికి విప్లవవాది, సాహిత్యాభిలాషి ఆళ్వార్ స్వామి 46 ఏళ్ల పిన్న వయసులో గుండెపోటుతో కన్నుమూశారు.
(ఈ నెల 5వ తేదీన వట్టికోట వర్ధంతిని పురస్కరించుకొని….)
Also Read : చమత్కారం… ‘పింగళీయం’