నేటి విశ్వవ్యాప్తమై అన్నమాచార్య కీర్తనలు వెలుగు చూడడానికి ప్రధాన కారకులు వేటూరి ప్రభాకరశాస్త్రి. తాళ్లపాక వారి సంకీర్తనలపై ఆయన కృషి ప్రాత: స్మరణీయం. తిరుమలలోని రాగిరేగులపై గల సంకీర్తనలు ఉద్ధరించి వాటితో రెండు సంపుటాలు ప్రకటించారు.తెలుగునాట అన్నమాచార్యుల ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనేక శాసనాల పరిష్కర్త వేటూరి ప్రభాకరశాస్త్రి. తాటాకులలో శిథిలమవుతున్న విలువైన సాహిత్యాన్ని పరిరక్షించి భావితరాలకు అందించిన సాహితీమూర్తి. కృష్ణాజిల్లాలో దివిసీమల పెద్దకళ్లేపల్లి గ్రామంలో 1888 ఫిబ్రవరి 7వ తేదీన సుందరశాస్త్రి, శేషమ్మ దంపతులకు జన్మించిన ఆయన చిన్నతనంలోనే సోమనాథశాస్త్రి గారి వద్ద లఘుకౌముది, తర్కశాస్త్రం, భాష్యం, కావ్య, నాటక, అలంకార గ్రంథాలు అధ్యయనం చేశారు. తిరుపతి వేంకటకవులలో ఒకరైన చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి ప్రథమ గణ శిష్యులలో ఒకరిగా పేరుపొందారు. `తెలుగున నాకేమిని యెఱుక యేర్పడెనన్నచో అది శ్రీ వెంకటశాస్త్రి గారి గురుతానుగ్రహప్రాప్తమేనని`గురుభక్తిని జీవితాంతం ప్రదర్శించారు. గురువను సేవించి, అనంతర కాలం శిష్యలు సేవలు అందుకున్నారు.
Also Read : విజ్ఞాన విరాడ్రూపం వేటూరి ప్రభాకరశాస్త్రి
ఉద్యోగ ప్రస్థానం
సంస్కృతాంధ్రాలలో విద్యను పూర్తి చేసిన తరువాత 1906 ప్రాంతంలో మద్రాసు చేరుకొని అక్కడి వెస్లీ మిషన్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా చేరారు. తీరికున్నప్పుడు ప్రభుత్వ ఓరియంటల్ గ్రంథాలయానికి వెళ్లేవారు. అలా గ్రంథపఠనానికి అధిక సమయం కేటాయించేవారు. నాలుగేళ్ల తరువాత `వెస్లీ`లో ఉద్యోగం మానేసి ప్రాచ్య గ్రంథాలయంలో `కాపీయిస్టు` గా చేరారు. అక్కడే పండితుడిగా పదోన్నతి పొంది సుమారు రెండు దశాబ్దాల పాటు సేవలు అందించారు. ఆ సమయంలోనే ప్రాచీన తాళపత్ర సేకరణ కోసం ఆనాటి ప్రభుత్వం వేటూరి వారితో పాటు మానపల్లి రామకృష్ణ కవిగారిని నియమించగా వేటూరి కోస్తాజిల్లో విస్తృతంగా పర్యటించారు. ఏ మాత్రం ప్రాథమిక సదుపాయాలు లేని కాలంలో అలా మారుమూల గ్రామాలు సందర్శించి ప్రాచీన గ్రంథ సేకరణలో అనేక ఇబ్బందులు పడ్డారు. ఎందరో చూరుల్లో దూరి, అటకలపై చేరిన ఎన్నో అమూల్యగ్రంథాలను సేకరించి భద్రపరిచారు. అప్పటికే పెద్ద సంఖ్యలో ఎన్నో తాళపత్ర గ్రంథాలు కనుమరుగైపోయిగా మిగిలిన వాటిని భావితరాల కోసం భద్రపరిచారు.అలా ఊరూరా సేకరించిన తాళపత్ర గ్రంథాలను `19 సంపుటాలుగా తీసుకువచ్చారు.
Also Read : తెలుగు భాషావేత్త పోరంకి దక్షిణామూర్తి అస్తమయం
సాహితీ సేవ
సాహిత్యం పరంగా ఒక వ్యవస్థ చేయవలసిన పనులను శాస్త్రిగారు ఒంటిచేతితో చక్కపెట్టుకొచ్చారు. 33 గ్రంథాలను పరిష్కరించి, ఆరు కావ్యాలకు వ్యాఖ్యానాలు, ఏడు చారిత్రక గ్రంథాలు రాశారు. ఎనిమిది రూపకాలు నిర్మించి, ఎనిమిది సంకలనాలు వెలువరించారు. మనుచరిత్ర, క్రీడాభిరామం, బసవపురాణం, ఉత్తర హరివంశం తదితర 29 గ్రంథాలకు విపులమైన పీఠికలు రాశారు.పిల్లల కోసం నవోదయ వాచకాలు, పత్రికలకు శతాధిక వ్యాసాలు రాశారు.
వ్యావహారికానికి బాసట
గ్రాంధికవాదం బలంగా ఉన్న కాలంలో వ్యావహారిక భాషావాదాన్ని సమర్థించారు. వ్యావహారిక భాష విషయంలో `రామమూర్తి పంతులు వాదముతో నేను సంపూర్ణముగా ఏకీభవించువాడను` అని స్పష్టంగా చెప్పారు. వేటూరి వారు గ్రాంథిక, వ్యావహరికాలను నిర్దుష్టంగా రాసేవారు.
Also Read : అచ్చ తెలుగు ఆణి ముత్యం మన వేటూరి
పదవులు
పండితపదవి నుంచి విరమణ (1938) చేసిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధన సంస్థలో, అనంతరం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంస్కృత కళాశాలలో తెలుగు శాఖ ప్రధానాచార్యుడిగా పని చేశారు. అణ్ణామలై విశ్వ విద్యాలయం, మద్రాసు ప్రభుత్వ ప్రాచ్యగ్రంథాలయం, తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయ ప్రచురణ విభాగాలకు సలహా మండలి సభ్యులుగా, తిరుపతి శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధన సంస్థలో రీడర్ గా, ఆంధ్ర విశ్వకళాపరిషత్ బోర్డు ఆప్ స్టడీస్ సభ్యునిగా సేవలు అందించారు. ఆయన ఆధ్వర్యంలోనే శిల్ప,చిత్ర కళా ప్రదర్శనశాల ఏర్పాటైంది.
యోగా సాధకులు
ఎంతటి ఉన్నత వ్యక్తిత్వం కలవారికైనా కొన్నిసందర్భాలలో జీవితంపై విరక్తి గలిగి ఒక్కోసారి ఆత్మహత్యకు ప్రయత్నించవచ్చు. అలాంటి వారిలో వేటూరి వారికి మినహయింపు లేదని ఆయన అనుభవం చెబుతోంది.1912-16 మధ్య కాలం తీవ్ర అస్వస్థులైన ఆయన ఆత్యహత్య చేసుకోవాలనుకున్నారు. ఆ సమయంలో కుంభకోణానికి చెందిన మహాయోగి సీవీవీ (కంచుపాటి వేంకాసామిరావు) గురించి విని, ఆయనను కలసి , ఆయన ఆశ్రమంలో యోగాధ్యయనంతో పూర్తిగా స్వస్థత పొందారు. నాటి నుంచి సీవీవీ అడుగుజాడల్లో యోగ సాధనతో పాటు సాహితీసేవను కొనసాగించారు. ఆయన సాహిత్యవ్యాసంగాన్ని, యోగాను విడివిడిగా చూడలేదు.
Also Read : రజని జయంతి
విద్యాప్రదాత… ఆదర్శ గురువు
విద్యార్థులకు కులంలేదన్నది శాస్త్రి గారి భావన. జాతిమత భేదాలకు అతీతంగా ఎందరో విద్యార్థులను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పారు. తమ ఇంటనే ఆశ్రమ వాతావరణంలో వారికి చదువులు చెప్పారు. చదవు నేర్పడంతోనే గురువు బాధ్యత తీరదని, శిష్యుల శీలనిర్మాణం, వారిని సత్ప్రవర్తకులుగా తీర్చిదిద్దడం కూడా విద్యలో భాగమన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. `తనకు ప్రణమిల్లిన వాడిని తనంతవాడుగా చేసేవాడే గురువు` (`ప్రణుత నిజజనానాం స్వాత్ము తుల్యాన్ కరోతి`)అనే ఆర్యోక్తిని త్రికరణశుద్ధిగా నమ్మి తమ గురువుల నుంచి అందిపుపుచ్చుకొన్న ఆ హితోక్తిని అక్షరాల ఆచరించారు. శిష్యులను కన్నపిల్లలుగా చూసుకున్న మానవతావాది. తమ ప్రతి వ్యాసంగంలోనూ శిష్యులకు ప్రమేయం కల్పించేవారు. వారితో చర్చిస్తూ గ్రంథ రచన సాగించేవారు. ఎవరి అభిప్రాయాలు వారివి అనే కోణంలో అందరి అభిప్రాయాలను మన్నించేవారు.
Also Read : తెలుగు సినిమా ఉమ్మడి ఆస్తి ‘గుమ్మడి’
పరిశోధనే శ్వాసగా..
పరిశోధనే శ్వాసగా జీవించిన ఆయన అహరహరం అక్షరం కోసం తపించారు తప్ప సంపాదన పట్ల దృష్టిలేదు. భాషకు సంబంధించి కొత్త పదంలోనే సంపదను చూసుకున్నారు. అక్షరాలనే లక్షలుగా మురిసిపోయేవారు. అమరావతి శాసనంలోని `నాగబు` అనే పదం కనిపెట్టినందుకు ఎంతో పొంగిపోయారట. తండ్రి సాహిత్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్నవారు ఆచార్య ఆనందమూర్తి. శాస్త్రి గారి తమ్ముడి (చంద్రశేఖరశాస్త్రి గారు) కుమారుడు సుందరరామమూర్తి గురించి ఈ తరానికి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. పెదతండ్రిగారు `అన్నమయ్య చరితం` రాస్తే సుందరరామమూర్తి `అన్నమయ్య`చిత్రానికి అన్నమయ్య జన్మవృత్తాంతాన్ని గీతంలో పొందుపరచడం గమనార్హం. కడదాకా పరిశోధన కోసం శ్రమించిన మహనీయుడు 62వ ఏట అనారోగ్యంతో తనువు చాలించారు.
Also Read : కథాభి`రాముడు`
( ఈ నెల 7న వేటూరి ప్రభాకరశాస్త్రి గారి జయంతి)