- రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, తారక్, చరణ్ జంట
- రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ద్వయం చరిత్రకె ఎక్కారు
తెలుగు సినిమాలకు ఆస్కార్ పురస్కారాలు రావనే అపకీర్తి, భారతీయ చిత్రాలకు అంత సీన్ లేదనే అపప్రద నేటితో తొలగిపోయాయి. గొప్ప స్వప్నం సాకారమైంది. భారత పతాక, తెలుగు ప్రతాపం ఎవరెస్టంత ఎగసి, మురిసి భ్రమశాయి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు..’అవార్డును గెలుచుకుంది. భారతీయ చిత్ర చరిత్ర లో ఇది బంగరుపుట. ఈ ఖ్యాతి కేవలం తెలుగువారిదే కాదు, సినిమా పాటను ప్రేమించే వారందరిదీ. ఆస్కార్ కు ఎంపికంటే అల్లాటప్పా కాదు. అత్యుత్తమ ప్రమాణాలే అక్కడ కొలబద్దలు. ఎంపిక ప్రక్రియ అసాధారణంగా ఉంటుంది. ఆషామాషీ వ్యవహారం కానేకాదు. డబ్బులతో కొనుక్కొనేది అస్సలే కాదు. రికమండేషన్స్ తో తెచ్చుకొనే వీలే లేదు. అందునా భారతీయ సినిమాకు, అందులోనూ తెలుగు పాటకు రావడం నూటికి నూరు శాతం అద్భుతం! ఈ గెలుపుతో ఈ సినిమాకు, ఈ పాటలో భాగస్వామ్యులైన వారందరికీ విశ్వ విఖ్యాతి దక్కిందని చెప్పి తీరాలి. రాజమౌళి అక్కడ నెలల తరబడి తిష్టవేసి, కోట్ల డబ్బులు కుమ్మరించి ఈ అవార్డు కొట్టేశాడనే విమర్శలు చేసేవారు ఉన్నారు. ఇదేం పాట? గతంలో ఇంతకంటే గొప్ప పాటలు రాలేదా? అనే విసుర్లు విసిరేవారు లేకపోలేదు. ఆ పాటలతో పోల్చుకోవాల్సిన సందర్భం కాదిది. మన తెలుగుపాటకు ఇంత ఖ్యాతి వచ్చినందుకు గర్వపడడం మాత్రమే వివేకం.
Also read: గుంటడికి గుండెపోటా?
ప్రచారం అవసరం
ఆస్కార్ అవార్డ్స్ వంటి అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవాలంటే ఆ స్థాయిలో ప్రచారం అవసరం. ప్రతిభావంతులు చాలామంది ఉంటారు. అందరూ వెలుగులోకి రారు. అన్నీ వెలుగులోకి రావు. ఆ ప్రతిభను బలంగా లోకానికి చాటిచెప్పగలిగే ప్రజ్ఞ అత్యవసరం. అది రాజమౌళికి, వారి బృందానికి పుష్కలంగా ఉందని అంతర్జాతీయ స్థాయిలో నేడు నిరూపితమైంది. అన్ని హద్దులు, అడ్డంకులు దాటుకొని, అన్ని విద్యలు ప్రదర్శించి, తెలుగు సినిమాకు ‘ఆస్కార్ అవార్డు’ను అందించిన వినూత్న విజేతగా రాజమౌళి చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతారు. ఈపాటలో భాగస్వామ్యులైన వారందరూ తెలుగువారే కావడం మరో విశేషం. గొప్పగా పాటను రాసిన చంద్రబోస్, అద్భుతంగా స్వరరచన చేసిన కీరవాణి, భావోద్వేగంతో, రసస్ఫూర్తితో పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ద్వయం, సంభ్రమ చకితంగా చిందులు వేసిన తారక్, చరణ్ జంట, విభ్రమంగా తెరకెక్కించిన రాజమౌళి అభివందనీయులు. ఈ సందర్భంలో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ను ఎంతగానో అభినందించి తీరాలి. ఈ పాటను ధియేటర్ లోనే కాదు ఎక్కడ చూసిన పూనకాలు వస్తాయి! సముద్రాలు లంఘించి, పర్వతాలు ఎగబాకి, తెర తీరాలను దాటి ప్రపంచ వీధుల్లో భారతీయ జయపతాకను ఎగురవేసిన ఈ విజయగీతికి వీరతాళ్లు వేద్దాం.
Also read: స్వాతిముత్యం ఒక ఆణిముత్యం
మహాకవి శ్రీశ్రీ తర్వాత సహజకవి చంద్రబోస్
‘ఆర్ ఆర్ ఆర్’ కాసుల వర్షం కురిపించింది. కీర్తి కానుకలను గుప్పించింది. ఎప్పుడో 50ఏళ్ళ క్రితం తెలుగు సినిమా పాటకు ‘తెలుగు వీర లేవరా..’ రూపంలో ‘మహాకవి’ శ్రీశ్రీ తొలిగా జాతీయ పురస్కారాన్ని అందించాడు. నేడు ‘సహజకవి’ చంద్రబోస్ ఆస్కార్ ను అందించి తెలుగుతల్లికి కర్పూర ఆరతులు అర్పించాడు. గీతకారులుగా వీరిద్దరూ చరిత్రలో ఎన్నటికీ మిగిలిపోతారు. ఎవరేమనుకున్నా ‘ఆర్ ఆర్ ఆర్’ ఘనత త్రిపుల్ ఆర్ దే. దక్కించిన రాజమౌళి విజయరాజేంద్రుడు. ఆస్కార్ తో పాటు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘గోల్డెన్ గ్లోబ్’ వంటి పురస్కారాలను వరింపజేసుకున్న ‘నాటు నాటు…’ పాట ఒక చరిత్ర. ఆ భువన భవన నిర్మాణంలో రాళ్లేత్తిన కూలీలు, కీర్తి పల్లకిని మోసిన బోయీలు ఎందరెందరో ఉన్నారు. అందరి శ్రమఫలితం, ఎందరో ఆశీస్సుల ఫలం ఈ విజయప్రస్థానం. అంతం కాదిది ఆరంభం! భారతీయ చిత్రజగతి చరిత్రలో తొలి అధ్యాయం రాసుకున్న శుభసమయం.
Also read: స్త్రీపురుషుల సమానత్వాన్నిస్వాగతిద్దాం