వోలేటి దివాకర్
వెయ్యేళ్ళ తెలుగు చరిత్ర. వెయ్యేళ్ళ తెలుగు వైభవానికి గోదావరి తీరం పట్టం కట్టింది. ఇదొక అద్భుతమైన భాషా, సాహిత్య, సాంస్కృతిక ఉత్సవం. సందడి. అభిమానం. ఉప్పొంగే సంతోషం.
ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పోటెత్తిన భాషాభిమానుల ఆనందానికి అవధి లేదు. ఎంతోమంది అతిథులుగా ప్రముఖులు విచ్చేసి విలువైన మాటల్ని అందించారు. తద్వారా తెలుగును ఒక వెలుగు వెలిగించారు..
రాజరాజ నరేంద్రుని పట్టాభిషేకం మహోత్సవానికి నన్నయ మహాభారత అవతరణానికి ఇప్పటికి వెయ్యిళ్లు పూర్తయింది. ఈ సందర్భానికి నీరాజనంగా ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలకు రాజమహేంద్రవరంలోని గైట్ కళాశాల జనవరి 5,6,7 తేదీలలో వైభవంగా జరిగాయి.
మూడు రోజులపాటు రాజరాజ నరేంద్ర వేదిక, నన్నయ వేదిక, నారాయణ భట్టు వేదిక అనే పేర్లతో సాహిత్యంలోని అన్ని ప్రక్రియలకు సంబంధించిన మహోపన్యాసాలు, కవి సమ్మేళనాలు, కథా పఠనాలు, కార్టూన్ ప్రదర్శనలు, పుస్తక ప్రదర్శనలు, అవధానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, విద్యార్థుల నృత్య గీతాలు, మహనీయుల విగ్రహాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాల నమూనా ఆలయాలు, ఆధ్యాత్మిక యోగా కేంద్రాలు…. ఇలా విశేషమైన ప్రదర్శనలను లక్ష మంది తెలుగు భాషాభిమానులు తలెత్తితిలకించారు. విద్యార్థుల ప్రదర్శనలు కన్నుల పండుగను, సాహితీవేత్తల విలువైన ఉపన్యాసాలు వీనుల విందును అందించాయి. ఇంతమందికి అల్పాహారాలు, భోజనాలు, వసతి, రవాణా సౌకర్యాలు, సత్కారాలు, సన్మానాలు, పారితోషికాలు…భాషా సాహిత్యాలకు ఆంధ్ర సారస్వత పరిషత్ చైతన్య విద్యాసంస్థలు ఇచ్చిన భక్తి నీరాజనం.
శ్రీగజల్ శ్రీనివాస్,శ్రీ చైతన్యరాజుల సంకల్పం సిద్ధించింది.
భాషను బ్రతికించుకోవటానికి, తెలుగు భాషలోని సౌందర్యాన్ని ఆస్వాదించడానికి, తెలుగు సంస్కృతి,చరిత్ర వారసత్వాన్ని పునర్మూల్యాంకనం చేసుకోవటానికి ఇటువంటి సభలు జరిగి తీరాలి.
తెలుగు భాషకు పూర్వ వైభవం రావాలి
ఎన్నో భాషలున్నప్పటికీ తెలుగు భాషకు ఉన్న గొప్పతనం మాధుర్యం దేనికీ లేదని, అటువంటి తెలుగు భాషకు పూర్వ వైభవం రావాలని మహాసభలను ప్రారంభించిన విశాఖ శారదా పీఠం అధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామి ఉద్భోధించారు. ఆయన ఆశీస్సులు అందిస్తూ, అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహిస్తుండడం అద్భుతం, పరమాద్భుతం అని అన్నారు. తెలుగు భాషలాంటి భాష ఈ సృష్టిలో లేదన్నారు.
అయితే తెలుగు రాష్ట్రాలు తెలుగు భాషను చంపేస్తున్నాయని ఆయన విచారం వ్యక్తంచేశారు.
ఏ భాషకు లేనన్ని అక్షరాలు గల, అవధాన ప్రక్రియ గల తెలుగు భాషను సుసంపన్నం చేసుకోవాలని, ఇందుకోసం కొత్త పదాలకై పరిశోధనలు జరగాలని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారత కార్యకారిణి వారణాసి రామ్ మాధవ్ సూచించారు.
చదువు కన్నా సంస్కారం ముఖ్యమని, తెలుగు భాష నేర్చుకుంటే సంస్కారం అలవడుతుందని మహా మహోపాధ్యాయ విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి అన్నారు. అ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని నేర్చుకుంటామని ఆయన చెబుతూ అమ్మ ప్రేమకు సంకేతమైతే, ఆవు త్యాగానికి సూచికని అందుకే తెలుగు నేర్చుకుంటే సంస్కారం అలవడుతుందని విశ్లేషించారు.
పద్మవిభూషణ్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ మాట్లాడుతూ, తెలుగునేలను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్ధర్ కాటన్, తెలుగు నిఘంటువు రూపొందించిన సిపి బ్రౌన్, అలాగే గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం ప్రాతః స్మరణీయులన్నారు. తెలుగు భాషా వ్యాప్తికి మన రచనలను హిందీలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.
హరిబాబు ఉద్బోధ
ఒక జాతి సాంస్కృతిక గొంతుక భాషేనని, అందుకే అమ్మ భాష తెలుగు వ్యాప్తికి అందరూ బాధ్యత తీసుకోవాలని, మిజోరాం గవర్నర్ డా. కంభంపాటి హరిబాబు సూచించారు. తెలుగు భాష పట్ల అభిమానం పెంచుకుని వ్యాప్తి చేయడం, ప్రోత్సహించడం చేయాలన్నారు.
తప్పనిసరిగా తెలుగులో మాట్లాడుకోవాలని, తెలుగులోనే సంతకం చేయాలని నాగాలాండ్ గవర్నర్ , ప్రవాసాంధ్రులు లా గణేశన్ సూచించారు. మాతృ భాష తెలుగు పరిరక్షించాలంటే కేవలం మాటలకే పరిమితం కాకుండా ఈ మహాసభల తర్వాత అందరూ తమ తమ ఇళ్లల్లో తెలుగులోనే మాట్లాడుకోవడం అలవర్చుకోవాలన్నారు. పద్యం, అవధానం, కథ, నృత్యం, శిల్పం ఇలా ఎన్నో ప్రక్రియలున్న తెలుగు భాష గురించి సుందర తెలుగు అని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి పేర్కొన్నారని లా గణేశన్ గుర్తుచేశారు. ఈసభలో దివంగత రెబెల్ స్టార్ కృష్ణంరాజు తరుపున పూర్ణకుంభం పురస్కారాన్ని స్వీకరించేందుకు వచ్చిన ఆయన సతీమణి శ్యామల దేవి కృష్ణంరాజును గవర్నర్ పదవిలో చూడాలని తమ కుటుంబం, అభిమానులు ఆశించామని వెల్లడించారు.