ఆగష్టు 29 గిడుగు వెంకట రామ్మూర్తి పుట్టినరోజు. దీనిని ‘తెలుగు భాషా దినోత్సవం’గా జరుపుకోవడం మనకు ఆనవాయితీ. ఎన్నో ఏళ్ళుగా వేడుకలు జరుపుకుంటూనే ఉన్నాం. అందివచ్చిన ఆధునిక సాంకేతికత ఆలంబనగా, కరోనా కాలంలో భాషా సాంస్కృతిక ఉత్సవాలు ఉవ్వెత్తున జరుగుతున్నాయి. ప్రపంచంలోని తెలుగువాళ్ళందరూ ఈ వేదికల వేడుకల సాక్షిగా ఏకమవుతున్నారు. తెలుగుదనం, భారతీయతను చాటి చెబుతున్నారు. అవధానాలు, వాగ్గేయకారుల ఉత్సవాలు, జయంతులు, స్మృతులు, సమీక్షలు, ఆవిష్కరణలు, చర్చోపచర్చలు.. ఒకటేమిటి? ఇంటి నుంచే అన్నింటినీ జరుపుకుంటున్నాం. ఇదొక గొప్ప పరిణామం, గొప్ప ప్రగతికి సంకేతం.
Also read: జనహృదయాధినేతకు జోహార్లు
ఎందరో మహానుభావులు
భాషా వికాసంలో ఎందరో మహనీయుల నిస్వార్ధ, నిరంతర కృషి దాగివుంది. ఆధునిక కాలంలో,వాడుకభాషా ప్రస్థానంలో గిడుగుదే తొలి అడుగు. జనం భాష ‘వాడుక భాష’గా వేడుక చేసుకోవాలని గిడుగు రామ్మూర్తి కలలు కన్నారు. ఆచరణలో నెరవేరడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో ఆన్నీ చేశారు. ఆ ప్రయాణంలో కొందరు ఆయనతో కలిసి సాగారు. కొందరు తిరుగుబాటు చేశారు. వాదనలకు దిగారు. సంప్రదాయ భాషా వ్యతిరేకిగా ముద్రవేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. గిడుగు ఎవరికీ భయపడలేదు. వెనుకంజ వేయలేదు. తను నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి నడిచారు. ఆ కృషి వూరకే పోలేదు. వేల ఫలాలను ఇచ్చింది. ఎందరినో భాషకు దగ్గరగా చేర్చింది. ఎందరికో తెలుగు సొగసులు చేరాయి. పాఠ్యపుస్తకాలు, పత్రికలు, సినిమాలు, మీడియా, జాబులు -జవాబులు, కబుర్లు ఆన్నీ వాడుకభాషలోనే ఈనాడు వేడుక చేస్తున్నాయి. ప్రతి విషయం సామాన్యుడికి చేరాలి. ప్రతి తెలుగువాడికీ మనోవికాసం జరగాలి. అడుగడుగునా తెలుగు వెలగాలి. అన్నింటా తెలుగువారు ఎదగాలి. అంతే తప్ప సంప్రదాయ సాహిత్యానికి, తెలుగు పద్యానికి ఆయన వ్యతిరేకి కారు. ఛందస్సు వ్యాకరణం, అలంకార శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. కావ్యాలను, ప్రబంధాలను పుష్కలంగా చదివి, అనుభవించి పల్లవించారు. విశేషమైన జ్ఞానాన్ని పొంది, అదంతా వాడుకభాషలో సామాన్యుడికి చేర్చాలని తపించారు.
Also read: సృజనాత్మక సంపాదకుడు ఆంధ్రపత్రిక వీరాజీ
పద్యం ఎప్పటికైనా హృద్యమే
ఈ క్రమంలో,తదనంతర ప్రయాణంలో,పద్యాన్ని చిన్నచూపు చూసే విష సంస్కృతి ప్రవేశించింది. అది రానురాను పెరిగి మహా విషవృక్షమై వేళ్లూనుకుంది. పద్యం రాయాలంటే ఛందస్సు బాగా నేర్చుకోవాలి. వ్యాకరణం, అలంకార శాస్త్రాలు, పూర్వ కవుల సాహిత్యాన్ని విరివిగా చదవాలి. వాటన్నింటినీ ఒంటపట్టించుకోవాలి. ఈ అభ్యాసం పూర్తయిన తర్వాత మంచిపద్యం రాయవచ్చు. గొప్ప వచనం చెప్పవచ్చు. కవితలు అల్లవచ్చు. ఏ ప్రక్రియలోనైనా సారస్వతాన్ని పండించవచ్చు. భావాన్ని ప్రకటించవచ్చు. భాషా వికాసానికి బలమైన పునాదులు వేయవచ్చు. గురజాడ అదే చేశాడు. కందుకూరి అలాగే నడిచాడు. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ అలాగే సాగింది. చలం అలాగే చలించి జ్వలించాడు. కృష్ణశాస్త్రి, తిలక్ అదే రీతిన వికసించారు. ‘బావా ఎప్పుడు వచ్చితీవు…’ అంటూ తిరుపతి వేంకటకవులు వాడుకభాషలో పద్యనాటకాలు రాసి పద్యానికి పట్టాభిషేకం చేశారు. కొప్పరపు కవులు అవధానాలు, ఆశుకవిత్వం ద్వారా తెలుగు పద్యాన్ని ఊరువాడా ఊరేగించారు. ధూర్జటి, బద్దెన, వేమన వంటి కవులు శతకాల రూపంలో, పద్యమార్గంలో నీతి కథలు, హితోపదేశాలు, జీవిత సారాలు తెలుగువాడికి చేర్చారు. కవిత్రయ కృషితో, పాండవుల కథలు ‘పంచమ వేదం’గా ‘మహాభారత’ రూపంలో తెలుగువాడికి చేరాయి. శ్రీరాముడు మొదలు పలనాటి వీరుల వరకూ ఎందరో మహనీయుల చరితలు రసరమ్య కావ్యాలుగా మనకు అందాయి. భాగవతాన్ని తెలుగులో గొప్పగా చెప్పి పోతన్న ‘తెలుగువాడి పుణ్యపేటి’ అయ్యాడు. అరిస్తే పద్యం, స్మరిస్తే పద్యం… అన్నాడు శ్రీశ్రీ. ‘పద్యం’ తెలుగువాడి ఆస్తి. ‘అవధానం’ తెలుగువాడి సంతకం. భారతీయ భాషల్లో, తెలుగు పద్య ‘నిర్మాణశిల్పం’ చాలా గొప్పది. దానికి ఛందస్సు పునాది. ఆ పునాదులపై మహా కవనభవనాలు నిర్మాణమయ్యాయి.
Also read: మహామహితాత్ముడు మాస్టర్ ఇకె
అనితరసాధ్యమైన అవధానం
ఇంతటి పరిపుష్టి, పరిపక్వత ఏ ఇతర భాషలకూ లేదు. అందుకే, ‘అవధానం’ తెలుగులోనే విరాజిల్లుతోంది. హిందీ, తమిళ, కన్నడ భాషీయులు తీవ్రంగా ప్రయత్నం చేశారు, చేస్తూనే వున్నారు. కానీ మనంత గొప్పగా అవధానాన్ని అందుకోలేకపోయారు.అది అసాధ్యమని వారికి ఎప్పుడో అర్ధమైపోయింది. సంస్కృతాన్ని గొప్పగా కలుపుకొని,సాగి, వికసించిన భాషల్లో తెలుగుదే అగ్రస్థానం. సంగీతానికి అత్యంత అనువైన భాష మన తెలుగు. తమిళ, కన్నడ, మలయాళీలంతా ఎక్కువగా మన వాగ్గేయకారుల కీర్తనలనే పాడుకుంటున్నారు. కర్ణాటక సంగీతానికి ‘రాజభాష’ తెలుగు. ఈ వాగ్గేయకారులందరూ పద్యాలను ప్రేమించి, పూజించి, ఉపాసించినవారే. ప్రక్రియ మారినా వాటిపై పద్య ప్రభావం చాలా ఎక్కువ. పద్య సంస్కారపు పునాదులపై వాగ్గేయకారులు పదరచనలు చేశారు. జానపదాలు వాటికి ఆలంబనగా నిలిచాయి. తమిళులు మహాకవిగా భావించే సుబ్రహ్మణ్య భారతి తెలుగువంటి సుందరమైన భాష ఇంకొకటి లేదన్నాడు. అంతే అందమైనది మన తెలుగుపద్యం. పద్యాన్ని, పద్యరూపాత్మకమైన అవధానాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. పాఠ్యపుస్తకాలలో తెలుగు పద్యానికి పెద్దపీట వెయ్యాలి. ఛందస్సు అనాదరణకు గురికాకుండా చూడాలి. ఒకప్పటి వలె..విద్యార్థి దశ నుంచే పద్యరచన ప్రారంభం కావాలి. ‘అవధాన విద్య’, పూర్వ అవధాన మహాకవుల విశేషాలు తెలుగువాచకాలలో చేర్చాలి. అవధాన విద్యాలయాలు నిర్మించాలి.డొక్కశుద్ధి కలిగిన కొత్త తరం అవధానులు తయారవ్వాలి. తెలుగు పద్యానికి నిత్యం పట్టాభిషేకం జరగాలి. మాతృభాషను ప్రేమించడంలో తమిళ ప్రజలను,ప్రోత్సహించడంలో తమిళ ప్రభుత్వాలను ఆదర్శంగా తీసుకోవాలి. తెలుగు భాష ప్రతి దినం వేడుక చెయ్యాలి.
Also read: వ్యధాభరిత కథావిశ్వనాధుడు