Sunday, December 22, 2024

మరపురాని నటి గీతాంజలి

– రామకిష్టయ్య సంగనభట్ల

బాలనటిగా, హీరోయిన్ గా నటించి, క్యారెక్టర్ యాక్టర్ గా రాణించిన గీతాంజలి అరుదైన నటీమణి. మనమధ్య లేకపోయినా ఎన్నటికీ మరపురాని విదుషీమణి ఆమె.

గీతాంజలి (1947 – అక్టోబరు 31, 2019) 1960వ దశకములో పేరొందిన తెలుగు సినిమా నటి. గీతాంజలి దక్షిణ భారత భాషలన్నింటితో పాటు హిందీ సినిమాలలో కూడా నటించింది.

గీతాంజలి 1947లో కాకినాడలో శ్రీరామమూర్తి, శ్వామసుందరి దంపతులకు జన్మించారు. నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్న కుటుంబంలో గీతాంజలి రెండవ అమ్మాయి. పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలోనైనా, పెరిగింది, నటిగా ఎదిగింది చెన్నై మహానగరంలోనే. పువ్వు పూయగానే వికసిస్తుందంటారు. అలా నటి గీతాంజలి బాల్యంలోనే నటిగా అడుగులు వేశారు. తన మూడో ఏట నుంచే నాట్యంలో శిక్షణ పొందిన గీతాంజలి అసలు పేరు మణి. కాకినాడలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంటులో కొన్నేళ్లు చదివింది. మూడేళ్ల ప్రాయం నుండే గీతాంజలి తన అక్క స్వర్ణతో పాటు కాకినాడలోని గంధర్వ నాట్య మండలిలో లక్ష్మారెడ్డి, శ్రీనివాసన్ ల వద్ద నాట్యం నేర్చుకోవటం ప్రారంభించింది. నాలుగేళ్ల నుండే అక్కతో పాటు సభల్లో నాట్య ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభించింది.

తొలిచిత్రం ఏన్టీఆర్ తో…

విశ్వ విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు దర్శకత్వంలో ఆయనే కథా నాయకుడిగా నటించిన సీతారామ కళ్యాణం సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన గీతాంజలి ఆ సినిమాలో సీతగా నటించి మెప్పించారు. తొలి చిత్రంలో గీతాంజలి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆమె ఎన్టీఆర్ తో పోటీగా నటించి మెప్పించారు. ఎన్టీఆర్‌ను తన సినీ గురువుగా గీతాంజలి చెప్పు కునేవారు. సీతారాముల కళ్యాణం సినిమాలో కథా నాయికగా తనను ఎంపిక చేసి సీత పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారని అనేవారు. ఆ పాత్ర వల్లే తనకంటూ తెలుగులో ఓ ప్రత్యేకత వచ్చిందని ప్రతి ఇంటర్వ్యూ లోనూ గీతాంజలి తలచు కునేవారు. అన్ని భాషల్లోనూ 500కు పైగా చిత్రాల్లో నటించారు. కలవారి కోడలు, డాక్టర్‌ చక్రవర్తి, లేత మనసులు, బొబ్బిలి యుద్ధం, ఇల్లాలు, దేవత, గూఢచారి116, కాలం మారింది, శ్రీ శ్రీ మర్యాద రామన్న, నిర్దోషి, మాయాజాలం, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. ఆమె అసలు పేరు మణి. పారస్ మణి అనే హిందీ చిత్రంలో పని చేస్తుండగా ఆ చిత్ర నిర్మాతలు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సినిమా టైటిల్లోనూ మణి ఉంది కాబట్టి ఈమెకు గీతాంజలి అని నామకరణం చేశారు. ఆ పేరు సినీరంగంలో అలానే స్థిరపడి పోయింది.

క్యారెక్టర్ అర్టిస్ట్ గా రాణింపు

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిన ఆమె పెళ్లైన కొత్తలో, మాయాజాలం, భాయ్‌, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. గీతాంజలి చివరి చిత్రం తమన్నా కథానాయికగా రూపొందుతున్న దటీజ్‌ మహాలక్ష్మి. రాజకీయాల్లోకి వచ్చిన గీతాంజలి 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమె కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పని చేసింది. నటిగా మంచి స్థాయిలో ఉన్న సమయంలోనే తన సహనటుడు రామకృష్ణని వివాహం చేసుకొని సినిమాలకు దూర మయ్యారు. నటుడు రామకృష్ణ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. అప్పట్లో ఆయనతో సినిమాలు చేయాలని దర్శక నిర్మాతలు ఎదురు చూసేవారు. గీతాంజలి పలు ఇంటర్వ్యూ లలో  తమ వివాహ నేపథ్యం గురించి చెపుతుండే వారు. రామకృష్ణ ఆమె అంటే  ఇష్టపడ్డారట. ఆ విషయాన్ని ఆమెకి చెప్పినప్పుడు ఏడాది వరకు ఒప్పు కోలేదట. ఆ సమయంలో తన బాధ్యతలు మొత్తం తన తండ్రే చూసుకునే వారని గీతాంజలి చెప్పింది.

రామకృష్ణతో పెద్దలు కుదిర్చిన పెళ్ళి

దీంతో రామకృష్ణ తన తండ్రిని కలిసి మాట్లాడారనీ రామ‌కృష్ణ‌గారి గుణ‌గ‌ణాలు న‌చ్చ‌డంతో ‘అబ్బాయి మంచి అంద‌గాడు. డీసెంట్ బిహేవియ‌ర్‌` అని చెప్పి తనను పెళ్లికి ఒప్పించినట్లు గీతాంజలి వెల్లడించింది. ఇద్ద‌రం సినిమా రంగానికి చెందిన‌ వారం కాబ‌ట్టి చాలా మంది మాది ప్రేమ వివాహం అనుకున్నారు. కానీ మాది పెద్ద‌లు కుదిర్చిన వివాహమని క్లారిటీ ఇచ్చింది గీతాంజలి. పెళ్లికి ముందు మాత్రం సినిమాలు చేయకూడదని రామకృష్ణ తనకు చెప్పారనీ ఆయన చెప్పినట్లే విన్నానని అన్నారు. ఇద్దరికీ పెళ్లి జరిగిన తరువాత రామకృష్ణ పదహారు సినిమాలు వరుసగా వచ్చాయని వెల్లడించారు. మంచిరోజు, పెళ్ళిరోజు, తోటలోపిల్లా కోటలోరాణి, రాజయోగం, రణభేరివంటి చిత్రాల్లో రామకృష్ణ, గీతాంజలి కలిసి నటించినట్లు వివరించారు.

telugu senior actress geethanjali first death anniversary special story in sakalam

గీతాంజలి ఫూల్స్ (2003); పచ్చ తోరణం (1994); కాలం మారింది (1972); నిర్దోషి (1970); ఆదర్శ కుటుంబం (1969); మంచి మిత్రులు (1969); నిండు హృదయాలు (1969); దో కలియా (హిందీ)(1968); రణభేరి (1968); గూఢచారి 116 (1967); పూల రంగడు (1967); ప్రాణ మిత్రులు (1967); శ్రీకృష్ణావతారం (1967); శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న (1967); లేత మనసులు (1966); దేవత (1965) – హేమ; తోడూనీడా (1965); ఇల్లాలు (1965); బబ్రు వాహన (1964); బొబ్బిలి యుద్ధం (1964);  డాక్టర్ చక్రవర్తి (1964); మురళీకృష్ణ (1964); పారస్‌మణి (హిందీ) (1963); సీతారామ కళ్యాణం (1961) – సీత; పేయింగ్ గెస్ట్ (1957) (బేబీ గీతాంజలి) తదితర చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించారు. ఆమె సుమారు 500కు పైగా చిత్రాల్లో నటించింది.

నాలుగు భాషలలో వెలిగిన తార

ఆమె తెలుగు, కన్నడ, తమిళ, హిందీ చిత్రాలలో హీరోయిన్, కామెడీ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆమె ఎన్టీఆర్, అక్కినేని, శివాజీ గణేశన్, రాజ్‌కుమార్ వంటి అనేక ప్రముఖ దక్షిణ భారతీయ నటులతో కలిసి పనిచేశారు. వివిధ చిత్రాలలో నటించినందుకు ఆమె నంది అవార్డు, రేలంగి అవార్డు మరియు ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకుంది. గీతాంజలికి చెన్నైతో విడదీయరాని అనుబంధం ఉంది. ఈమె నటిగా పుట్టి పెరిగింది చెన్నైలోనే. స్థానిక హబిబుల్లా రోడ్డులో నివసించేవారు. సహ నటుడు రామకృష్ణను వివాహమాడి ఓ ఇంటివారయ్యింది చెన్నైలోనే. తమిళంలో పలు మరపురాని చిత్రాల్లో గీతాంజలి నటించారు. ఎంజీఆర్, శివాజీ గణేశన్, ఎస్‌ఎస్‌.రాజేంద్రన్, రవిచంద్రన్, జెమినీ గణేశన్‌ వంటి అగ్ర నటులతో నటించి పేరు గడించారు. 

గీతాంజలి జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, అక్టోబరు 31 ఉదయం 4 గంటలకు మరణించారు. బాల నటిగా పరిచయం అయ్యి కథానాయకిగా ఎదిగి, చివరి దశలో బామ్మ పాత్రల్లో కూడా నటించిన గీతాంజలి భౌతకంగా లేకపోయినా నటిగా మాత్రం సజీవంగానే ఉంటారు.

(గీతాంజలి ప్రథమ వర్థంతి అక్టోబర్ 31న)

మొబైల్ : 9440595494

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles