సినిమా దర్శకులలో నాకు అత్యంత ఆత్మీయుడు దాసరి నారాయణరావు. నాకు ఇష్టమైన దర్శకుడు కాశీనాధుని విశ్వనాథ్. శంకరాభరణంతో ఆయనకు ఫిదా అయిన నేను సందర్భం వచ్చినప్పుడల్లా కలుసుకునేవాడిని. మిత్రలు మాశర్మ వల్లా, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉండటం వల్లా ఆయనను కలుసుకోవడం, ఆయనను వినడం, సినిమాగురించీ, సంగీతం గురించీ తెలుసుకోవడం, ఆయనను సన్మానించుకోవడం సాధ్యమైంది. సాక్షి ఎక్సెలెన్స్ అవార్డులో జీవితసాఫల్య పురస్కారం స్వీకరించడమే కాకుండా హీరో కృష్ణకు స్వయంగా ఆయన చేతుల మీదుగా అదే పురస్కారం అందించారు. జీవితసాఫల్య పురస్కారం ప్రప్రథమంగా డాక్టర్ సి. నారాయణరెడ్డికి ఇచ్చాం. తర్వాత విశ్వనాథ్ కి. ఆ సందర్భంలో చెక్కు ఇవ్వడం మరచిపోయాం. మర్నాడు సాక్షి చైర్ పర్సన్ భారతి స్వయంగా చెక్కుతీసుకొని ఆయన ఇంటికి వెళ్ళి అందించారు. చాలాసేపు కబుర్లు చెబుతూ కూర్చున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు జగన్ మోహన్ రెడ్డి విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి అభినందించారు. పాదనమస్కారం చేశారు. జగన్ ను మనసారా ఆశీర్వదించారు. ఈ రెండు సందర్భాలలోనూ నేనూ, శర్మ అక్కడే ఉన్నాం. కృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం అందజేయడానికి రావలసిందిగా అభ్యర్థించడానికి వెడితే ఆయన ఆనందంగా అంగీకరించారు.
మాశర్మ ఏటా ఘనంగా నిర్వహించే కొప్పరపు కవుల పురస్కార సభలలో చాలా సభలకు నేనూ వెళ్ళాను. ఒక సభలో విశ్వనాథ్ తో వేదిక పంచుకునే అదృష్టం కూడా కలిగింది. ఒక హోటల్ లో దిగి, ఒకే సభలో పాల్గొని, రెండు రోజులు గడిపిన మధుర క్షణాలు మరువలేనివి. విశ్వనాథ్, సీతారామశాస్త్రి అత్యంత సన్నిహితంగా ఉండటం చూశాను. విశ్వనాథ్ గురించి సీతారామశాస్త్రి చెప్పిన తీపి కబుర్లు కూడా విన్నాను.
విశ్వనాథ్ కారణజన్ముడు. తెలుగు సినిమాకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంగీత ప్రధానమైన సినిమాలు తీసి కీర్తిగడించారు. సినిమా రంగం నుంచి విరమించుకున్నతర్వాత ప్రశాంతంగా జీవించారు. సినిమా ప్రపంచం ఆయనది. నిండు జీవితం జీవించి, ఎన్నో విజయాలు సాధించి, తెలుగువారు గర్వపడే సినిమాలకు దర్శకత్వం వహించి బాలసుబ్రహ్మణ్యంనూ, సీతారామశాస్త్రినీ, మరెంతో మంది ఆత్మీయులను కలుసుకోవడానికి వెళ్ళిపోయారు. కళాతపస్వి బిరుదును సార్థకం చేసుకున్నప్రతిభామూర్తి. బహుముఖీనుడు. పుంభావసరస్వతి. అమృతహృదయుడు. కీర్తిశేషులు.