Wednesday, January 22, 2025

రోదసిలోకి వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చిన శిరీష, బ్రాన్సన్

శిరీష్ ని భుజాలపైన ఎత్తుకొని ఆనందంగా పరుగులు తీస్తున్న రిచర్డ్ బ్రాన్సన్

వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తో కలసి రోదసి యానం చేసిన గుంటూరు తెలుగమ్మాయి బండ్ల శిరీష్ చరిత్ర సృష్టించింది. రోదసి యానం చేసినవారిలో భారతీయ మూలాలు కలిగిన మూడో మహిళగా ఖ్యాతిగడించింది. విశ్వవినువీధులలో తెలుగుపతాకను రెపరెపలాడించింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఆరుగురు వ్యోమగాములను ఆదివారంనాడు అంతరిక్షంలోకి పంపి వెనక్కు రప్పించింది. ఆ ఆరుగురిలో 34 ఏళ్ళ తెలుగు బిడ్డ ఉండడం విశేషం. కల్పనాచావ్లా తర్వాత భారత దేశానికి చెందిన మహిళ అంతరిక్షయానం చేయడం ఇదే ప్రథమం. భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్ళిన నాలుగో వ్యామగామిగా శిరీష చరిత్రలో తన పేరును ఘనంగా నమోదు చేసుకున్నది.

రెండో భారతీయ మహిళ, నాలుగో భారతీయురాలు

శిరీష కంటే ముందు భారత దేశం నుంచి రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్ళారు. భారత సంతతికి చెందిన ఇండియన్ అమెరికన్ సునీతా విలియమ్స్ రోదసిలోకి వెళ్ళవచ్చారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరులో జన్మించిన శిరీష్ తన తల్లిదండ్రులతో పాటు అమెరికాలోని హూస్టన్ లో స్థిరపడ్డారు. అంతరిక్ష పర్యాటక సంస్థ వర్జిన్  గెలాక్టిక్ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్ డెబ్బయ్ ఒక్క ఏళ్ళ వయస్సులో అంతరిక్షయానం చేసిన రెండో వ్యక్తి. 1998లో అమెరికా వ్యోమగామి జాన్ గ్లెన్ 77 ఏళ్ళ వయస్సులో అంతరిక్షంలోకి వెళ్ళారు. బ్రాన్సెన్ బృందం ప్రయాణం చేసిన అంతరిక్ష నౌక ‘యూనిటీ’ ని తయారు చేసేందుకు 17 ఏళ్ళు శ్రమించారు. అద్భుతమైన గగనయాన స్వప్నాన్ని సాకారం చేసినందుకు తన బృందంలోని సభ్యులనూ, ఈ ప్రాజెక్టుకోసం పని చేసిన సహచరులందరినీ బ్రాన్సన్ అభినందించారు. సంతోషంతో గంతులు వేశారు. శిరీషని ఆనందంతో భుజాలపైకి ఎక్కించుకొని పరుగులు తీశారు ఏడుపదులు దాటిని బ్రాన్సన్ అనే సాహసి.

వ్యోమగాముల బృందం, శిరీష

అమెరికా తొలి వ్యోమగామి ఎలాన్ షిఫర్డ్ అంతరిక్ష నౌక 1961లో  యూనిటీ నౌకలాగానే 15 నిమిషాలపాటు అంతరిక్షయానం చేసింది. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షయాన సంస్థ వచ్చే సంవత్సరం నుంచి డబ్బులు చెల్లించిన ప్రయాణికులను అంతరిక్షానికి తీసుకొని వెళ్ళి తీసుకొని వస్తుంది. బిజోస్ ఈ నెల 17న తన అంతరిక్ష నౌకలో రోదసిలోకి వెళ్ళడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. తొమ్మిది రోజుల వ్యవధిలో బ్రాన్సన్ బిజోస్ ని ఓడించి మొదటి ప్రైవేటు (సొంత) అంతరిక్ష నౌకలో వెళ్ళిన వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు.

88 కిలోమీటర్ల ఎత్తు

న్యూమెక్సిక్ ఎడారిలో 88 కిలోమీటర్ల ఎత్తువరకూ వెళ్ళి భూమ్యాకర్షణశక్తికి అతీతంగా మూడు నాలుగు నిమిషాలు అంతరిక్షంలో గడిపారు. పైనుంచి భూమిని తిలకించారు. అనంతరం వెనక్కు క్షేమంగా వచ్చి రన్ వేపైన దిగారు. బ్రాన్సన్ కుటుంబ సభ్యులతో సహా 500 మంది చూస్తుండగా అంతరిక్ష నౌక దివికి ఎగసి కార్యక్రమం ముగించుకొని భువికి దిగి వచ్చింది. ఈ సాహస కార్యాన్ని తిలకించినవారిలో స్పెస్ ఎక్స్ సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. సాధారణంగా అంతరిక్ష నౌకలు రాకెట్ సాయంతో అంతరిక్షం దాకా వెడతాయి. బ్రాన్సన్ తల్లి వీఎంఎస్ ఈవ్ పేరుతో ఉన్న ప్రత్యేక విమానం ద్వారా వీఎస్ఎస్ యూనిటీ-22ను ప్రయోగించారు. సువిశాలమైన రెక్కలతో పైకి ఎగసిన విమానం, నౌకలలో అంతరిక్ష నౌకకు దారి మధ్యలో రెక్కలు తొడిగారు. ‘స్పేస్ పోర్ట్ అమెరికా’ అనే పేరుతో న్యూమెక్సికో రాష్ట్రంలో ఉన్న జొర్నడా ఎడారిలో ప్రత్యేకంగా అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని నిర్మించారు. ఇది మొదటి వాణిజ్య అంతరిక్ష ప్రయోగ కేంద్రం. 27వేల చదరపు మైళ్ళ విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. రెండు మైళ్ళకంటే పొడవైన రన్ వే నిర్మించారు. ప్రత్యేక భవనాలు కూడా ఉన్నాయి. శనివారం సాయంత్రం ఉరుములతో కూడిన జల్లులు పడటంతో రోదసి యాత్ర 90 నిమిషాలు ఆలస్యంగా మొదలయింది.

ఆదివారం ఉదయం టేకాఫ్ కు ముందు బ్రాన్సన్

ఆరుగురు వ్యోమగాములు

బ్రాన్సన్, శిరీషతో పాటు ముఖ్యపైలట్ డేవ్ మెక్ కే, మరో పైలట్ మైకేల్ మాసుకీ, ముఖ్య ఇంజనీర్ (ఆపరేషన్స్) కాలిన్ బెనెట్, వర్జిన్ గెలాక్టిక్ ముఖ్య వ్యోమగామి శిక్షకురాలు బెత్ మోసెస్ రోదసి ప్రయాణం చేశారు. భారీగా కనిపించే ఈవ్ విమానం టేకాఫ్ అయిన తర్వాత 40 నిమిషాలు ప్రయాణం చేసి 15 వేల మీటర్ల ఎత్తుకు ఎగసిన తర్వాత ఈవ్ విమానం నుంచి రెక్కలు అంటించుకుని యూనిటీ-22 విడిపోయింది. అప్పుడు యూనిటీలోని రాకెట్ ఇంజన్ ప్రజ్వలించింది. వ్యోమనౌక వేగం గంటలకు నాలుగు వేల కిలోమీటర్లకు పెరిగి నౌక నిటారుగా నింగిలోకి దూసుకొని పోయింది.

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చెబుతున్న ప్రకారం నింగిలో నిటారుగా 80 కిలోమీటర్లు దాటితే అంతరిక్షంలో ప్రవేశించినట్టే. యూనిటీ 86 కిలోమీటర్లు వెళ్ళింది. భారరహిత స్థితిలో వ్యోమనౌక ప్రవేశించింది. కిటికీల గుండా నీలిరంగులో ఉన్న భూమిని చూశారు. అనంతరం యూనిటీ-22 తిరుగు ప్రయాణంలో భూవాతావరణంలోకి ప్రవేశించింది. రెక్కల సాయంతో భూమిమీదికి మెల్లగా దిగింది. మామూలు విమానాలకు విచ్చుకున్నట్టే నేలకు సమీపంలోకి రాగానే యూనిటీ-22 చక్రాల కాళ్ళు విచ్చుకున్నాయి. యాత్రకాలం మొత్తం 65 నిమిషాలు. వ్యోమనౌక నుంచి దిగిన తర్వాత బ్రాన్సన్ చిరునవ్వు నవ్వుతూ ఆత్మీయులను ఆలింగనం చేసుకున్నారు. ‘‘ఇది జీవితకాలంలో అనుభవంలోకి వచ్చిన అద్భుతం. దీనికోసం 17 ఏళ్ళుగా శ్రమించిన వర్జిన్ గెలాక్టిక్ బృందానికి అభినందనలు,’’ అన్నారు.

న్యూనార్మల్ గీతాలాపన

ఎప్పుడూ హుషారుగా ఉండే బ్రాన్సన్ అమెరికాలోని ముఖ్యులను, మాజీ వ్యోమగాములనూ న్యూమెక్సికో లోని కంపెనీ అంతరిక్షయాన కేంద్రానికి ఆహ్వానించారు. అంతరిక్ష పర్యాటకం ఆరంభమైన సందర్భాన్ని సూచిస్తూ ‘‘న్యూనార్మల్…’అనే గీతాన్ని గాయకుడు ఖాలిద్ ఆలపించారు. మొత్తం కార్యక్రమానికి మాస్టర్ ఆఫ్ సెరిమొనీగా సీబీఎస్ లేట్ షో  హోస్ట్ స్టీఫెన్ కోల్బర్ట్ వ్యవహరించారు. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణానికి వర్జిన్ గెలాక్టిక్ దగ్గర ఇప్పటికే 600 మంది తమ సీట్లను రిజర్వు చేసుకున్నారు. ఒక్కొక్క టిక్కెట్టు ఖరీదు 2,50,000 డాలర్లు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బిజోస్ ప్రయాణించే అంతరిక్ష నౌక ‘బ్లూ ఆరిజిన్’ ఎదురు చూస్తోంది. ఆదివారం ఉదయం బ్రాన్సన్ బృందం అంతరిక్షంలోకి ప్రయాణం చేసే ముందు అంతా శుభం జరగాలనీ, క్షేమంగా అంతరిక్షానికి వెళ్ళిరావాలని కోరుకుంటూ ఒక ఇన్ స్టాగ్రామ్ ను జెఫ్ బిజోస్ పంపించారు. ప్రపంచ వైజ్ఞానిక చరిత్రలో ఇది ఒక మేలి మలుపు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles