- 125వ జయంత్యుత్సవాలు
- విశ్వనాథ వేయిపడగలకు దీటుగా బాపిరాజు నారాయణరావు
- గోనగన్నారెడ్డి నవల చిత్రీకరణ
- స్వాతంత్ర్య పోరాటంలో ఏడాది జైలు
మాశర్మ
ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో 1895 గొప్ప సంవత్సరం. ఈ సంవత్సరంలో పుట్టినవాళ్ళు తదనంతర జీవితకాలంలో గొప్పవాళ్ళుగా చరిత్రకెక్కారు. ఇప్పటికీ కీర్తికాయులుగా చిరంజీవిగా ఉన్నారు. విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషువా, నండూరి సుబ్బారావు మొదలైన ఉద్దండులంతా ఒకే సంవత్సరంలో పుట్టారు. “ఆ సమయంలో కాలపురుషుడు ఎంత ప్రసన్నంగా ఉన్నాడో! ఇంత గొప్పవాళ్లను జాతికి అందించాడని” ఆ మధ్య ఒక విమర్శకుడు ఛలోక్తి విసిరాడు. ఇది నిజంగా నిజం. బహుముఖ ప్రతిభా భాస్వంతుడు అడవి బాపిరాజు కూడా అదే 1895లో జన్మించాడు. బాపిరాజును తెలుగువారి విశ్వకవిగానూ అభివర్ణిస్తారు. ఎన్నో చారిత్రక నవలలు రాయడం వల్ల హిందీ సాహిత్యంలో ప్రసిద్ధుడైన బృందావన్ లాల్ వర్మ తోనూ పోలుస్తారు. బాపిరాజు జన్మించి నేటితో (గురువారంతో) 125 ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఆయన్ని అందరూ బాపి బావ, అని ముద్దుగా పిలుచుకునేవారు. “అతడు గీసిన గీత బొమ్మై /అతడు చూసిన చూపు మెరుపై /అతడు పలికిన పలుకు పాటై… అంటూ కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మరింత ముద్దుగా తలచుకున్నాడు.. ఇంత ముద్దుగా పిలుచుకోడానికి కారణం బావా బావా పన్నీరు.. అంటూ పాట రాశాడని కాదు. మెత్తని హృదయం, తియ్యని జీవిక బాపిరాజు సొంతమని ఎందరో భావించడం వల్లనే. బావా బావా పన్నీరు అనే పాట జగత్ ప్రసిద్ధం. హాయిగా,స్వేచ్ఛగా జీవించాడు. జీవించిన కాలం తక్కువే అయినా, ప్రతి క్షణం కళాత్మకంగా రసమయం చేసుకున్నాడు. 1952లో 57 ఏళ్లకే ఈలోకం వీడి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ బోలెడు బొమ్మలు, కథలు, పాటలు ఇచ్చేసి వెళ్ళాడు.
బహుముఖ ప్రతిభ
ఈ భూమిపై ఉన్నంతకాలం బహుముఖంగా వికసించాడు. సారస్వతలోకంలో చాలా సందడి చేశాడు. ఈ భీమవరం బుల్లోడు తెలుగునేలంతా అల్లరల్లరి చేశాడు. కథలు చెప్పాడు, బొమ్మలు గీశాడు, సినిమాలకు పనిచేశాడు, పాటలు రాశాడు, పాడాడు. ఒకటేమిటి, ఎన్నో చేశాడు. హైదరాబాద్ లో మీజాన్ సంపాదకుడిగా జర్నలిస్ట్ వేషం వేశాడు. ఆకాశవాణికి సలహాదారుడుగానూ ఉన్నాడు. బందరు నేషనల్ కాలేజీలో అధ్యాపకుడిగా పాఠాలు చెప్పాడు. లా చదివి, కొంతకాలం ప్రాక్టీస్ చేసి, మానేశాడు. నవ్య సాహిత్య పరిషత్ స్థాపకుల్లో ఒకడిగా నిలిచాడు. గుంటూరులో చిత్రకళను నేర్పడానికి ఒక ఫౌండేషన్ కూడా స్థాపించాడు. నండూరి సుబ్బారావు ఎంకిపాటలకు, విశ్వనాథ సత్యనారాయణ కిన్నెరసాని పాటలకు బాపిరాజు గీసిన బొమ్మలు మరింత అందాన్ని అద్దాయి. తిక్కన మహాకవిని మనసులో ఊహించుకొని, బొమ్మగా గీసి చూపాడు. భారతిని బొమ్మ కట్టించాడు. సరస్వతి రూపానికి తోడుగా త్రివర్ణపతాకం, తెలుగుతల్లిని కూడా పక్కనే చిత్రించి, తన దేశభక్తిని చాటుకున్నాడు. 1922లో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఒక సంవత్సరం జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఈ అనుభవాలను తొలకరి నవలలో అక్షరబద్ధం చేశాడు.
తిక్కనబొమ్మకు బ్రహ్మరథం
బాపిరాజు వేసిన బొమ్మలలో తిక్కన మహాకవి, భారతి, సముద్రగుప్తుడు బాగా ప్రసిద్ధమయ్యాయి. బాపిరాజు బొమ్మలు ఎక్కువగా నవరంగ్ సంప్రదాయంలో ఉంటాయి. ఈయన గీసిన కొన్ని బొమ్మలు డెన్మార్క్, తిరువాన్ కూర్, మద్రాస్ ప్రదర్శనశాలలో ఉన్నాయి. ఇతని కవితలు తేటతెలుగు పదాలతో గుండెలను హత్తుకుంటాయి. ఇటీవలకాలంలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ నిర్మించిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర చాలా ప్రాచుర్యమయ్యింది. ఈ పాత్ర అల్లు అర్జున్ కు నటుడుగా మంచి పేరు తెచ్చింది. అడవి బాపిరాజు రాసిన గోన గన్నారెడ్డి అనే చారిత్రక నవల ఈ పాత్రకు మూలాధారంగా చెప్పవచ్చు. ఆంధ్రవిశ్వవిద్యాలయం నిర్వహించిన నవలల పోటీలో విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు, అడవి బాపిరాజు రాసిన నారాయణరావు ప్రథమ స్థానానికి ఎంపికయ్యాయి. విశ్వవిద్యాలయం ప్రకటించిన నగదు బహుమతిని వీరిద్దరికీ పంచి ఇవ్వడం విశేషంగా ఆ కాలంలో వార్తల్లోకి ఎక్కింది. మా బాపి బావ కాబట్టి, సగం నగదు తీసుకోడానికి ఒప్పుకున్నానని, విశ్వనాథ సత్యనారాయణ విసిరిన ఛలోక్తి నవ్య సాహిత్య లోకంలో సుప్రసిద్ధం.బాపిరాజు చేసిన రచనలలో తుఫాన్, కోనంగి, హిమబిందు, గోన గన్నారెడ్డి మొదలైనవి ఎంతో ఖ్యాతి తెచ్చి పెట్టాయి.
ఉప్పొంగి పోయింది గోదావరి
బాపిరాజు రాసిన పాటలలో ఉప్పొంగి పోయింది గోదావరి.. మొదలైనవి చాలాకాలం సందడి చేశాయి. శశికళ పాటల సంపుటిలోని చాలా పాటలు విజయవాడ, హైదరాబాద్, మద్రాస్ రేడియో కేంద్రాల్లో ప్రసారమయ్యాయి. పాడకే నా రాణి, బాలవే నీవెపుడూ పాటలను ప్రసిద్ధ గాయకుడు ఎమ్మెస్ రామారావు పాడి రికార్డు చేశారు. బాపిరాజు రాసిన కొన్ని పాటలను కన్నడంలోకి కూడా అనువాదం చేశారు. మీరాబాయి, అనసూయ, ధ్రువ విజయం, పల్నాటి యుద్ధం మొదలైన సినిమాలకు కళా దర్శకత్వం కూడా వహించారు. రచయిత, నవలాకారుడు, కవి, కథకుడు, గాయకుడు, చిత్రలేఖకుడు, కళాదర్శకుడు, జర్నలిస్ట్, న్యాయవాది.. ఇన్ని పాత్రలను సముచితంగా పోషించిన సమున్నత ప్రతిభామూర్తి అడవిబాపిరాజు ఎప్పటికీ చిరంజీవి.