ఇద్దరు బెంగాలీలు కలిస్తే బెంగాలీ భాషలో, ఇద్దరు తమిళులు కలిసినప్పుడు తమిళంలో మాట్లాడుకోవడం సర్వత్రా అగుపించేదే. ఇద్దరు తెలుగువారు కలిస్తే తెలుగులో తప్ప ఇతర భాషలలోనే మాట్లాడతారు అనేది ఒక పెద్ద పరిహాసంగా, వేళా కోళంగా మిగులు ప్రచారంలో ఉంది. జన్మ స్థలానికి మాతృదేశానికి బహు దూరంగా ఉన్నా దశాబ్దాలుగా తమ వారితో సంబంధాలు లేకున్నా, తాము ఉండే దేశంలో అధికారిక వ్యవహార భాషలు తమ మాతృభాష కాకున్నా, తాము నిత్యకృత్యంగా తమ ఇళ్లల్లో తమ వారితో సైతం తమ మాతృభాష అయిన తెలుగులో మాట్లాడకున్నా, స్వ భాషపై స్వాభిమానంతో, దేశం కాని దేశంలో తెలుగును మరుగున పడనీయకుండా కాపాడుకోవడం గొప్ప విషయమే మరి.
అంతేకాదు తమ వారసులకు, భావితరాల వారికి, తెలుగు భాషలో సాధికారిక కతను సాధించి పెట్టేందుకు కృతనిశ్చయంతో, తెలుగు భాషా మాధ్యమంలో పాఠశాలలు నిర్వహింప చేసుకుంటూ తమ పిల్లల్ని తమ మాతృభాషలోనే చదివించడం గొప్పలలో కెల్లా గొప్ప . బతుకు తెరువు కోసం ఆంధ్ర ప్రాంతం నుంచి మారిషస్ కు వెళ్ళిన వ్యవసాయ కూలీలు 185 సంవత్సరాలుగా తమ మాతృభాష అయిన తెలుగు భాషను పరి రక్షిస్తూనే ఉన్నారు. తెలుగు భాషను నేర్చుకోవడంలో, పరిరక్షించు కోవడంలో, మారిషస్ లో స్థిరపడిన తెలుగువారికి, నాటి నుండి నేటి వరకు “ధర్మపురి నరసింహ శతకం” ప్రధాన పాత్ర వహించడం విశేషం.
మారిషసు ఆఫ్రికా ఆగ్నేయ తీర సమీపాన నెలకొని, ప్రజలలో బహుళ సంప్రదాయాలు, బహుళ మతాలు, బహుళ సంస్కృతులు, బహుళ భాషలకు చెందిన ప్రజలు ఉన్నారు. ద్వీప దేశ ప్రభుత్వం ” వెస్టు మినిస్టరు పార్లమెంటరీ సిస్టం ” విధానంలో రూపొందించ బడింది. మారిషసు ప్రజాపాలన, ఆర్ధికం, రాజకీయ స్వాతంత్రాలు అత్యున్నత స్థాయిలో ఉన్నట్లు వర్గీకరించబడింది.
ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడ్డ తెలుగు వాళ్ళలో మారిషస్‌లో ఉన్నవారిది ప్రత్యేక స్థానం. అక్కడ ఉన్న 12.5 లక్షలకు పైగా జనాభాలో లక్ష మందికి పైగా తెలుగువాళ్లు ఉంటారు. వారంతా 1835లో బానిసత్వ నిర్మూలన నిర్ణయం జరిగాక, మారిషస్ సమాజం, ఆర్థిక వ్యవస్థ, ప్రజా జీవితాలపై ప్రభావం చూపాక, చాలామంది వ్యవసాయ కూలీలుగా, చెరుకు తోటలో పనిచేసేందుకు మారిషస్ కు తీసుకెళ్ల బడినారు. వారు చక్కెర ఎస్టేట్ లలో, కర్మాగారాలలో, రవాణా, నిర్మాణ రంగాలలో పని చేశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి సేవలు చేసేందుకు, ఒప్పంద (కాంట్రాక్టు) సేవకులుగా పని చేసేందుకు ప్రవేశించిన తొలి దేశం మారిషస్ కావడం గమనార్హం.
అక్కడకు వెళ్ళి స్థిరపడిన వారంతా స్థానిక మారిషియన్ క్రియోల్‌ని మాతృ భాషగా చేసుకున్నారు. అలా స్థిరంగా ఉండేవారిలో తెలుగువారు కూడా ఉన్నారు. తమ పూర్వీకుల భాష తెలుగును సొంత భాష అని, క్రియోల్ తమ మాతృ భాష అని చెప్పుకోవడం వారి ప్రత్యేకత. వారు ఇళ్లలో కూడా క్రియోల్ భాషలోనే మాట్లాడు కుంటారు. అయినా వారికి తెలుగు మీద ఆసక్తి, అభిమానం ఉన్నాయి.
1835 నుండి మారిషస్ లో స్థిరపడిన మొదటి తరం వారిలో నిరక్షరాస్యులు అధికంగా ఉన్నా, అందులోని చదువుకున్నవారు, తమ పిల్లలకు ఇసుకపై తెలుగు అక్షరాలు దిద్దించి, నేర్పించడం ప్రారంభించారు. తర్వాత బీచ్ లలో ఇసుక తిన్నెలపై, (తాటి ఆకుల) తాళ పత్రాలపై అక్షరాలను నేర్పించారు. అక్షరాలు గుణితం రాయడం వచ్చినా, ఉచ్ఛారణ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. వాక్య నిర్మాణం రాని , వ్యాకరణం అంతగా తెలియని, విషయ పరిజ్ఞానం అంతగా లేని స్థితిలో, మౌఖిక బోధన ద్వారా పిల్లలకు భాషపై అవగాహన కల్పించే కృషి సల్పారు. ఈ క్రమంలో ధర్మపురి నివాసి “శేషప్ప” కవి రాసిన “నరసింహ శతకం” ప్రధాన పాత్ర పోషించింది. ఆపాటికే తెలుగువారి స్వస్థలాలలోనే గాక, ఇతర ప్రాంతాల్లోనూ మాధ్యమం ఏదైనా, తెలుగు విద్యార్థుల కోసం నరసింహ శతకం పాఠ్యాంశంగా ఉండేది. చాలా వరకు పద్యాలు అధిక సంఖ్యాకులకు కంఠోపాఠంగా ఉండేవి.
“చిన్న నాడు వీధి బళ్లు అందించిన పుస్తకం నరసింహ శతకం” అని జ్ఞాన పీఠ అవార్దు గ్రహీత సి.నా. రె.ఎప్పుడూ చెపుతెండే వారు. బ్రిటిష్, నైజాం పాలకుల హయాంలోనూ యావదాంధ్ర ప్రాంతంలో నాటి రోజుల్లో నరసింహ శతకం పద్యాలు అధ్యయన అంశాలుగా చేర్చబడి కంఠస్థంగా ఉండేవి. సులభతరమైన భాష, పలు ఆసక్తి కలిగించే విషయాలు, కలిగిన నరసింహ శతకం పద్యాలను వీధి బళ్లల్లో కంఠస్తం చేయించేవారు. తద్వారా పిల్లలకు ఉచ్చారణలపై సాధికారికత కల్పించేవారు. అదే పద్ధతిని అనుసరించి మారిషస్ లోనూ పిల్లలకు కంఠస్తం చేయించే వారు. అంతేకాకుండా ప్రతి సాయంత్రం నిర్ణీత స్థలాలలో తెలుగు వారంతా చేరి, నరసింహ శతక పద్యాలు రామదాసు కీర్తనలు, వివిధ భజనలు, కీర్తనలు, శ్లోకాల ద్వారా భాషపై పట్టుకు అభ్యాసం చేయించారు. అలాగే తమ స్వస్థలం ఉండి తప్పించుకున్న “పెద్ద బాలశిక్ష” ప్రాథమిక స్థాయి విద్యాభ్యాసానికి ఎంతగానో దోహద పడింది.
అక్కడి కొత్త తరం చాలా ఆసక్తిగా తెలుగు నేర్చుకుంటోంది. ఒకటో తరగతి నుంచి యూనివర్సిటీ వరకూ తెలుగు నేర్చుకునే అవకాశం ఉంది. అక్కడి వారు తెలుగు సినిమాలు చూస్తుంటారు. మారిషస్ అధికారిక టీవీ చానెల్లో కూడా వారానికి ఒక తెలుగు సినిమా వేస్తారు. డీడీ యాదగిరి చానెల్ మారిషస్‌లో వస్తుంది.
ఇక తెలుగు వారికోసం చాలా సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాల్లో అందరూ తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. భాషే కాదు, సంస్కృతిపై కూడా వారికి ప్రేమ ఉంది. కూచిపూడికి మారిషస్‌లో ఆదరణ ఉంది.
మరో ఆసక్తికర విషయం, అక్కడి తెలుగు వాళ్లకు కులం లేదు. అంతేకాదు, అక్కడి తెలుగువారి ఇంటి పేర్లు కాస్త విభిన్నంగా ఉన్నాయి. చాలా మంది తమ పూర్వీకుల పేరును ఇంటి పేరుగా వాడుతూ పేరు చివర ఇంటి పేరు రాసుకుంటున్నారు. వెంకట స్వామి, పెంటయ్య, సీతప్ప, కుప్పమ్మ, అప్పడు వంటివి అక్కడి వారి ఇంటి పేర్లలో కొన్ని.
ఆ దేశంలో ప్రభుత్వం తెలుగు నేర్చుకోవడానికి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రాథమిక స్థాయి నుంచి విశ్యవిద్యాలయ స్థాయి వరకూ తెలుగు నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మారిషస్ యూనివర్పిటీలో తెలుగులో డిప్లొమా, డిగ్రీ కోర్సులు ఉన్నాయి. అంతే కాకుండా, మారిషస్ తెలుగు మహా సభ, తెలుగు సాంస్కృతిక కళా నిలయం, తెలుగు సాంస్కృతిక నిలయం, తెలుగు భాషా సంఘం వంటి సంస్థలు అక్కడ తెలుగు భాషను, సంస్కృతిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాయి.
దేశ భాషలందు తెలుగు లెస్స