Saturday, November 23, 2024

సూర్యకాంతం పాత్రలు సజీవ శిల్పాలు

  • ప్రమాదం వల్ల తప్పిపోయిన హీరోయిన్ వేషం
  • నాగిరెడ్డి, చక్రపాణిల ఫేవరైట్ నటి

(రామ కిష్టయ్య సంగన భట్ల)

గయ్యాళి పాత్రలు అనగానే తెలుగు ప్రేక్షకులకు ఠక్కున గుర్తుకువచ్చే పేరు సూర్యకాంతం. ఓర చూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణా చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లబొల్లి కబుర్లతో, వెక్కి వెక్కి వెక్కి ఏడుస్తూ వెండి తెరపై విభిన్న పాత్రల కు జీవం పొందింది ఎవరూ అంటే అది పాటతరం సహజ నటి సూర్యకాంతం అని వేరే చెప్పనక్కర లేదు. సూర్యకాంతాన్ని హాస్య నటీమణిగా ముద్ర వెయ్యడానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చెయ్యక పోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి.  అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అనే అనాలి. తెలుగు సినిమాల్లో గయ్యాళి పాత్రల్లో తన సహజ నటనతో ఆమె ప్రాచుర్యం పొందింది. గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది.

14వ సంతానం

ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు. సహజ నట కళా శిరోమణి, హాస్య నట శిరోమణి, బహుముఖ నటనా ప్రవీణ, రంగస్థల శిరోమణి సూర్యకాంతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయ పురంలో 1924 అక్టోబర్ 28న తన తల్లితండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. ఆరేళ్ళ చిన్న వయసు లోనే పాడటం, నాట్యమాడటం నేర్చుకొంది. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకొంది. మొదట జెమిని స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్ గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూ. జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియ బరచిన మీదట 75 రూపాయలు చేశారు. తరువాత ధర్మాంగద (1949)లో ఆమెది మూగవేషం.

గృహప్రవేశంలో మంచి అవకాశం

ధర్మాంగద టైములో చిన్నా చితకా వేషాలు వేసినా తరువాత లీలా కుమారి సాయంతో మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో బొంబాయికి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించుకొంది. ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కల అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పి పోయింది. బాగైన తరువాత సంసారం చిత్రంలో మొట్టమొదటి సారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా తెలుగు సినీ అభిమానుల గుండెల్లో నిలిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది.

హైకోర్టు జడ్జితో వివాహం

అసలు సంసారం చిత్రం తరువాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాక ముందే ఇంకొక హీరోయిన్ ను పెట్టుకొని తీశేసారని తెలియడంతో, “ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను” అని ఆ సినిమాను నిరాకరించింది. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి.నాగిరెడ్డి, చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు. హైకోర్టు జడ్జి పెద్దిబొట్ల చలపతిరావు ను 1950లో వివాహ మాడారు. ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి – సూర్యకాంతం, రమణారెడ్డి – సూర్యకాంతం, ఎస్.వి.రంగారావు – సూర్యకాంతం- జంటలు, వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు.

telugu old actress Suryakantham birth anniversary special story in sakalam

సూర్యకాంతం ఉందా?

కొత్త సినిమా వస్తూంటే అందులో సూర్యకాంతం వుందా? అని ప్రేక్షకులూ, తారా గణంలో సూర్యకాంతం వున్నట్టేగదా? అని సినిమా డిస్ట్రిబ్యూటర్లూ – ఎదురు చూసేవారు. చక్రపాణి (1954), దొంగరాముడు (1955), చిరంజీవులు (1956), తోడికోడళ్లు (1957), అత్తా ఒకింటి కోడలే (1958), ఇల్లరికం (1959), భార్యాభర్తలు (1961), గుండమ్మ కథ (1962), కులగోత్రాలు (1962), దాగుడు మూతలు (1964), అత్తగారు-కొత్తకోడలు, మూహూర్తబలం (1969) లాంటి మరపురాని ఎన్నో సినిమాలలో నటించింది. నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో…”నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. ‘సూర్యకాంతం’ అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు” అని ఆమెతో చమత్కారంగా అన్నానని చెప్పాడు. వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాళి కానేకాదు – మామూలు మనిషే. ఏ సమావేశాలకో, సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్లినప్పుడు ఆటోగ్రాపుల కోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం దగ్గరకి వెళ్లడానికి భయపడేవారు.

మనసు నవనీతం

ఐతే ఆమె నికార్సయిన మనిషి, కచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి. ఆమె శుభ్రంగా కడుపునిండా తినేది, పదిమందికీ పెట్టేది. షూటింగ్‌కి వచ్చినప్పుడల్లా – తనతో ఏవో తినుబండారాలు తీసుకు రావడం, అందరికీ పెట్టడం అలవాటు. ఇలాంటి అలవాటు సావిత్రి, కృష్ణకుమారి, జానకి వంటి నటీ మణులకీ వుండేది. షూటింగుల్లో జోకులు చెప్పడం సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఓ సినిమాలో నాగయ్యను నానా మాటలూ అని, నోటి కొచ్చిన తిట్లు తిట్టాలి. షాట్‌ అయిపోయాక ఆయన కాళ్లమీద పడి ‘అపరాధం – క్షమించండి!’ అని వేడుకుంది. ‘పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావూ.  లే!-’ అని నాగయ్య లేవనెత్తితే, కన్నీళ్లు తుడుచుకున్న భక్తీ, సెంటిమెంటూ ఆమెవి.

మొహమాటం లేదు

దబాయింపూ, కచ్చితత్వమూ ఉన్న మనిషే అయినా, మనసు మాత్రం వెన్న, సున్నితం. అవసరమైన వాళ్లకి ఆర్థిక సహాయం చేసేదిగాని అనవసరం అనిపిస్తే మాత్రం ‘పూచికపుల్ల’ కూడా విదిలించేది కాదు. మొహమాట పడకుండా తనకి రావాల్సిన పారితోషకాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేది. ఆమె అందర్నీ నమ్మేది కాదు. తన కారు రిపేరుకొస్తే ఎంత పెద్ద రిపేరైనా, మెకానిక్‌ ఇంటికొచ్చి తన కళ్లముందు చెయ్యవలసిందే – ఎంత ‘ఎక్స్‌ట్రా మనీ’ అయినా తీసుకోనీ గాక. చివరి దశలో వేషాలు తగ్గిపోయినా, చివరి దాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేది. తన ఆరోగ్యం బాగులేకపోయినా, ‘నటిస్తాను’ అని ధైర్యంగా చెప్పేది.

మొబైల్: 9440595494

Related Articles

1 COMMENT

  1. సూర్యకాంతమ్మ గురించి చాలా చక్కగా వివరించారు సర్..
    ఆవిడ పేరు తలచుకొంటే చాలు కనీసం ఇంకో వెయ్యి సంవత్సరాల పాటు ఎడమచేత్తో జాకీచాన్ లెవెల్లో ఐతే అట్లకాడ లేదా తిరగేసిన చీపురుతో నిముషానికి మూడు వందల తిట్లతో ఎదుటి పాత్రను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి చితకబాదే పాత్ర మన కళ్లముందు కదలాడే అఖిలాంధ్ర కోటి అభిమాన అత్తగారు..

    ఆవిడ లేని లోటు మన తెలుగు చిత్ర పరిశ్రమకు భర్తీ చేయబడలేని లోటు.. మనందరి అభిమాన అత్తగారి జయంతి సందర్భంగా నా ముకుళిత హస్తములతో ఘనమైన నివాళులు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles