Thursday, November 21, 2024

తెలుగు సినిమా వెలుగు కనుమా..!

తెలుగు సినిమా రంగానికి తాజాగా జాతీయ పురస్కారాలు వరించిన సందర్భంగా, మన ఖ్యాతిని, మన రీతిని, మనతనాన్ని ఒకసారి మననం చేసుకుందాం. ప్రతిభకు పురస్కారాలు, భుజకీర్తులు కొలబద్ద కాకపోయినా, గుర్తింపు  ఆనందాన్ని, సత్కారం సంతృప్తిని, పురస్కారం గౌరవాన్ని ఇస్తాయి. తెలుగు సినిమాకు చెందిన అనేక రంగాలకు జాతీయ స్థాయి పురస్కారాలు, గౌరవాలు దక్కడం కొత్త విషయమేమీ కాదు. కొన్ని సినిమాలు ఖండాంతర ఖ్యాతిని కూడా గడించాయి.

తెలుగు సినిమా ఖ్యాతి

సినిమా ప్రపంచంలో తెలుగు సినిమా స్థానం తెలుగు సినిమాదే. బెంగాలీ, మలయాళీ సినిమాల వలె జాతీయ అవార్డులు ఎక్కువగా రాకపోవచ్చు. కానీ, మనకేం తక్కువ రాలేదు. మన గౌరవం మనకు ఉంది. మన సినిమా సర్వాంగ సుందరంగా ఉంటుంది. గొప్ప కథకులు, దర్శకులు, నటులు, కవులు, సాంకేతిక నిపుణులు తెలుగులో ఎందరో ఉన్నారు. ఎస్ వి రంగారావు, సూర్యకాంతం, సావిత్రి కంటే గొప్ప నటులు ఉన్నారా? కెవి రెడ్డి, బి ఎన్ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు, ప్రత్యగాత్మ,కె విశ్వనాథ్, బాపు ఏ దర్శకుల కంటే తక్కువ? ఘంటసాల, సుశీల వంటి గాత్రాలు దొరుకుతాయా? పెండ్యాల, ఎస్ రాజేశ్వరరావు, ఘంటసాల సామాన్యమైన సంగీత దర్శకులా? పింగళి, సముద్రాల, మల్లాది రామకృష్ణ శాస్త్రి, శ్రీ శ్రీ, ఆత్రేయ ఎంత గొప్ప కవులు? మాయాబజార్, మల్లీశ్వరి, శంకరాభరణం వంటివి ఎంత గొప్ప కళా ఖండాలు?

Also Read : `ఈలపాట` మధురిమల మూట

వినోదంతో పాటు విలువలు

తెలుగులో వినోదాన్ని పంచే వాణిజ్య సినిమాలు ఎన్ని ఉన్నాయో, విలువలు పెంచే సినిమాలు అన్ని ఉన్నాయి. కళాఖండాలు ఉన్నాయి, కమనీయ చిత్రాలు ఉన్నాయి. రమణీయ దృశ్యకావ్యాలు ఉన్నాయి.  ఇన్ని దశాబ్దాల తెలుగు సినిమా ప్రయాణంలో, ప్రతి తరంలోనూ గొప్ప కళాకారులు ఉన్నారు. అద్భుతాలు సృష్టిస్తున్న ప్రతిభా మూర్తులు మన మధ్యనే ఉన్నారు. తెలుగు సినిమా రంగం పొందినన్ని గౌరవాలు, గుర్తింపులు ఏ భారతీయ సినిమా రంగం సాధించ లేదంటే అతిశయోక్తి కానే కాదు. రఘుపతి వెంకయ్యనాయుడు సినిమా రంగానికి చేసిన సేవ సామాన్యమైంది కాదు. తెలుగు సినిమాను వెండితెరపై రెపరెపలాడించాలని ఆయన 1909నుంచి అవిశ్రాంత కృషి చేశారు.1921లోనే మనం “భీష్మ ప్రతిజ్ఞ” అనే నిశ్శబ్ద సినిమాను నిర్మించుకున్నాం.

ఎనిమిది దశాబ్దాల కిందటే విశ్వమోహిని

ఎప్పుడో 80ఏళ్ళ క్రితం 1940లో విడుదలైన “విశ్వమోహిని” చిత్రం జాతీయ చలన చిత్ర రంగానికి ప్రాతినిధ్యం వహించింది. మల్లీశ్వరి కళాఖండంగా 1951లోనే ఖండాంతర ఖ్యాతిని గడించింది. ఆసియా పసిఫిక్ అంతర్జాతీయ సినిమా మహోత్సవాల్లో ఆ సినిమా ప్రదర్శనా గౌరవాన్ని పొందింది. ఈ సినిమా 1953లో చైనాలో కూడా విడుదలైంది. బొంబాయిలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించిన తొలి దక్షిణాది సినిమా మనదే. అది పాతాళభైరవి. బాలీవుడ్ ను అధిగమించి అత్యధిక సినిమాలను మనం అనేకసార్లు నిర్మించుకున్నాం.

Also Read : నట `మిక్కిలి`నేని

ప్రపంచస్థాయి వంద సినిమాలలో మనవీ ఉన్నాయి

పాతాళభైరవి, మల్లీశ్వరి, దేవదాసు, మాయాబజార్, నర్తనశాల, మరోచరిత్ర, మా భూమి, శంకరాభరణం, సాగరసంగమం, శివ వంటి సినిమాలను సీ ఎన్ ఎన్ – ఐ బి ఎన్ వంటి ఇంటర్నేషనల్ ఛానల్స్ ప్రపంచ స్థాయి వంద సినిమాల జాబితాలో గుర్తించాయి. మన తెలుగు సినిమా రంగం ఎన్నో గిన్నిస్ ప్రపంచ రికార్డులను బద్ధలుకొట్టింది. అత్యధికంగా పాటలు పాడినందుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎక్కువ సినిమాలను దర్శకత్వం వహించినందుకు దాసరి నారాయణరావు, వివిధ భాషల్లో ఎక్కువ సినిమాలు నిర్మించినందుకు రామానాయుడు, అతి తక్కువ కాలంలోనే ఎక్కువ సినిమాలలో నటించినందుకు బ్రహ్మానందం, మహిళా దర్శకురాలుగా ఎక్కువ సినిమాలకు దర్శకత్వం చేపట్టినందుకు విజయనిర్మల తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి గిన్నీస్ గుర్తింపును తెచ్చారు. 1931లోనే టాకీ సినిమాలు నిర్మించుకున్నాం.

తొలి టాకీ ప్రహ్లాద సంచలనం

తొలి టాకీ సినిమా “భక్త ప్రహ్లాద ”  గొప్ప సంచలనం సృష్టించింది. హిందీ సినిమా ” ఆలం అరా”కు సాటిగా మన సినిమా నిలబడింది. వాణిజ్యపరంగానూ అద్భుతమైన విజయాలు సాధించాము.ఎన్టీఆర్ అడవిరాముడు, చిరంజీవి ఘరానామొగుడు,రాజమౌళి బాహుబలి సినిమాలు బాక్స్ ఆఫీసులను బద్దలు కొట్టాయి. ఇది టూకీగా మాత్రమే. మన వాణిజ్య విజయాల గురించి రాయాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది. ప్రతి సంవత్సరం సుమారు 100నుంచి 150సినిమాలు విడుదలవుతున్నాయి. మన సినిమా రాశిలోనే కాదు వాసిలోనూ గొప్పది.

Also Read : సరళ స్వభావుడు… సు­మధుర గాత్రుడు­

వాణిశ్రీ ఉంది, వాణిజ్యం ఉంది

మనకు ‘వాణిశ్రీ’ ఉంది, వాణిజ్యం ఉంది. ప్రతిభామూర్తులకు కొదవే లేదు. జాతీయ స్థాయి దిగ్గజ హీరోయిన్ గా వాసికెక్కిన శ్రీదేవి మన తెలుగు అమ్మాయే. తమిళనాడు, కేరళలో సంగీత దర్శకుడుగా విశేష గౌరవం గడిస్తున్న విద్యాసాగర్ మన తెలుగువాడే. గాయకులుగా  పిబి శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి గురించి దక్షిణాది చిత్ర జగత్తులో విదితమే.తెలుగు సినిమా పాటకు తొలిగా జాతీయ పురస్కారం మహాకవి శ్రీశ్రీతో ఆరంభమైంది. తర్వాత వేటూరిని, సుద్దాల అశోక్ తేజాను వరించింది. భారతదేశంలోనే తొలి కౌబాయ్ సినిమాను (మోసగాళ్ళకు మోసగాడు) మనమే నిర్మించుకున్నాం. మన “తెనాలి రామకృష్ణ” సినిమా 1956లోనే జాతీయ స్థాయి ఉత్తమ ఫీచర్ ఫిలింగా ఘన గౌరవాన్ని పొందింది. దేశంలోనే ఎక్కువ సినిమా దియేటర్లు మన తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నాయి.

తెలుగువారి జీవితంలో భాగం సినిమా

“సినిమా” తెలుగువాడి సాంస్కృతిక జీవనంలో భాగమైపోయిందని చెప్పడానికి ఇన్ని థియేటర్లు నిర్మాణం కావడమే గొప్ప ఉదాహరణ. 1954లో వచ్చిన  పెద్ద మనుషులు మొదలు, నిన్నటి పెళ్లిచూపులు, నేటి జెర్సీ వరకూ  జాతీయ పురస్కారాలను తెలుగుసినిమా విరివిగా సంపాయించుకుంటూనే వుంది. నాటి తరంలో పి. పుల్లయ్య, కమలాకర కామేశ్వరరావు, వి మధుసూదన్ రావు,మధ్య తరంలో యూ. విశ్వేశ్వరరావు, క్రాంతి కుమార్, దాసరి నారాయణరావు,వేజెళ్ల సత్యనారాయణ,నిన్నటి తరంలో వంశీ,కృష్ణవంశీ, నేటి తరంలో త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి,సుకుమార్ దర్శకత్వ ప్రతిభ అపురూపమైంది.

Also Read : జీడిపాకం టీవీ సీరియల్స్!

సంపూర్ణ నటుడు మెగాస్టార్

మెగాస్టార్ గా తెలుగు సినిమాలో శిఖరాగ్రంగా ఉన్న చిరంజీవిలోని పరిపూర్ణ నటుడిని సంపూర్ణంగా వాడుకోలేక పోయామని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎప్పుడూ అంటుండేవారు. జంధ్యాల పండించిన పదహారు అణాల అచ్చతెలుగుదనాన్ని మరచి పోగలమా? రేలంగి, అల్లు రామలింగయ్య వడ్డించిన నవరసాలు తక్కువ తిన్నాయా? కస్తూరి శివరావు నుంచి వేణుమాధవ్ వరకూ ఎందరు హాస్యనటులు ఎన్ని నవ్వులు పూయించారో. సీ ఎస్ ఆర్ ఆంజనేయులు, కోట శ్రీనివాసరావు సామాన్యమైన నటులా? పౌరాణిక నాయక పాత్రల్లో ఎన్టీఆర్ ను మించినవాడు భారతదేశంలో ఉన్నారా? కవిగా, భక్తుడుగా, ప్రేమవిరాగిగా అక్కినేని పోషించిన పాత్రలు తెలుగువాడి మనఃఫలకం నుంచి వెళ్లిపోతాయా? భాషలో, భావంలో, నటనలో, భావప్రకటనలో, గానంలో, గీతంలో,నృత్యంలో చిరస్మరణీయమైన పాత్రలను పోషించిన ప్రతిభామూర్తులు ఎందరెందరో తెలుగు సినిమా రంగంలో ఉన్నారు.

మిధునం సినిమాను ఏమని అభివర్ణించాలి?

కేవలం ఇద్దరు నటులతో తీసిన  “మిధునం” సినిమాను చిన్న సినిమా అనాలా. ప్రతి సినిమానూ ప్రయోగాత్మకంగా తీసి, అద్భుతమైన విజయాలను అందించిన సింగీతం శ్రీనివాసరావు వంటి విలక్షణ దర్శకులు మిగిలిన భాషల్లో ఎందరు ఉన్నారు? ఫక్తు కమర్షియల్ సినిమాలే కాదు ” జ్యోతి”, “ప్రేమ లేఖలు” వంటి కథాత్మక చిత్రాలను కె రాఘవేంద్రరావు సృష్టించారు. బి.ఎన్ రెడ్డి నుంచి బి.నర్సింగరావు వరకూ సినిమాను సహజ సుందరంగా చూపిన సహజ ప్రతిభామూర్తులే. “లవకుశ” సంగీతం సినిమా సంగీతానికి పెద్దబాలశిక్ష వంటిది.

Also Read : అచ్చ తెలుగు ఆణి ముత్యం మన వేటూరి

గొప్ప సినిమాలను గౌరవించాలి

ఆదినారాయణరావు, రమేష్ నాయుడు వంటివారి హిందూస్థానీ సంగీత పరిజ్ఞానం ఏ దక్షిణాది సంగీత దర్శకులకూ లేదు. సినిమాకు సంబంధించిన 24 కళల్లోనూ నిష్ణాతులు మన దగ్గర ఎందరో ఉన్నారు.  మన సినిమాలు జాతీయ, అంతర్జాతీయ యవనికపై జయకేతనాలు ఎగుర వేశాయి. మన కళాకారులు జాతీయ స్థాయి, ప్రపంచ స్థాయి గుర్తింపును పొందారు. గొప్ప సినిమాలను, గొప్ప కళాకారులను గొప్పగా ఆదరించే సంస్కృతి తెలుగులో ఇంకా పెరగాలి. ఆన్నీ కుదిరితే, త్వరలోనే తెలుగు సినిమాకు ఆస్కార్ కూడా వస్తుంది. “తెలుగు సినిమా”  కొంగొత్త శోభలతో, కోటి ప్రభలతో, కొత్త రుచులతో వెలుగుతూ వుండుగాక.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles