- మెగాస్టార్ నాయకత్వంలో ఏపీ సీఎంతో చర్చలు ఫలప్రదం
- చిన్నసినిమాకూ ఊపిరిలూదే ప్రయత్నం
- ఫిలించాంబర్స్ కూ ఇతోధిక ప్రాధాన్యం
- విశాఖలో తెలుగు సినిమా పతాక ఎగరాలని జగన్ ఆకాంక్ష
మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశం విజయవంతంగా ముగిసినట్లు, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకున్నట్లు, సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు శుభంకార్డు పడినట్లు, పరిశ్రమ తరపున చిరంజీవి సంపూర్ణమైన సంతోషాన్ని, సంతృప్తిని ప్రకటించారు. ఆయనతో పాటు సమావేశంలో పాల్గొన్న మిగిలినవారూ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ముక్తకంఠంగా హర్షాన్నీ, ఆమోదాన్నీ ప్రకటించారు. ఈ దశలో, చిన్నసినిమాను బతికించుకొనే దిశగా అడుగులు పడడం హర్షదాయకం. రేట్ల విషయంలో అంగీకారం కుదరడం, మొత్తంగా సమస్యలు కొలిక్కిరావడం మంచి పరిణామం. అధికారికంగా త్వరలో జీఓ విడుదల కావడమే తరువాయి.
Also read: హిజాబ్ వివాదం అనర్థదాయకం
అందరికీ ప్రాధాన్యం
విభిన్న కారణాల వల్ల కొందరు రాలేకపోయినా, పరిశ్రమకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం నుంచి మంచి నిర్ణయాలు వెలువడ్డాయని వీరందరూ చెబుతున్న క్రమంలో, మిగిలినవారికి పెద్దగా అభ్యంతరాలు ఉండడానికి వీలులేదు. సరే! రాజకీయాలు, ఇగో సమస్యలు, ఈర్ష్యలు ఎలాగూ ఉంటాయి. అది వేరే విషయం. సినిమా పరిశ్రమ నుంచి ఈ రోజు వచ్చిన ప్రతినిధులను గమనిస్తే పెద్ద సినిమాలతో పాటు చిన్నసినిమాల ప్రాతినిధ్యం కూడా జరిగినట్లు భావించాలి. ఆచార్య, ఆర్ ఆర్ ఆర్, సర్కార్ వారి పాట,రాధేశ్యామ్…ఇవి త్వరలో విడుదల కావాల్సిన భారీ బడ్జెట్ సినిమాలు. ఈ సినిమాలకు సంబంధించిన ముఖ్యులు వచ్చినవారిలో ఉన్నారు. చిన్నసినిమాలకు ప్రతినిధిగా ఆర్ నారాయణమూర్తి కూడా ఉన్నారు. ఆ విధంగా సమతుల్యత కనిపించిందని చెప్పవచ్చు.
Also read: మౌనం వీడి మాయావతి మాయాజూదం
ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రతినిధులను కూడా వచ్చే సమావేశంలో పిలిచే అవకాశం ఉండవచ్చు. రేట్ల రూపకల్పన మొదలైన అంశాల్లో వారిని కూడా పరిగణలోకి తీసుకున్నామని, వారిచ్చిన సలహాలను, సమాచారాన్ని పాటించామని, వారి ప్రాతినిధ్యం కూడా ఉన్నదని మంత్రి పేర్ని నాని ప్రతిస్పందించారు. ఇవన్నీ ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ వేళ్ళువూనుకోవాలని, విశాఖపట్నంకు పరిశ్రమ తరలి రావాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. షూటింగ్స్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా జరిగేట్లు చూడాలని సూచించారు. విశాఖపట్నంలో స్టూడియోలో కట్టి, పరిశ్రమ తరలి వస్తే స్థలాలతో పాటు కావాల్సిన సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని, విశాఖపట్నంలో జూబ్లీ హిల్స్ ను తలపించే విధంగా ఇళ్లు, నిర్మాణాలకు రూపకల్పన చేద్దామని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఇలా మాట్లాడడం మొదటిసారి కాదు. గతంలోనూ ఇదే విధంగా తెలియజేశారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి, భవిష్యత్తులో మహానగరంగా రూపాంతరం చెందడానికి కావలసిన అన్ని హంగులు విశాఖపట్నంకు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఎన్నో సినిమా షూటింగ్స్ విశాఖ ప్రాంతంలో జరిగాయి. వనరులు, వసతులతో పాటు సర్వాంగ సుందరమైన ప్రదేశాలకు విశాఖలో కొదవే లేదు. స్థానికంగానూ ఉత్తమమైన కళాకారులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు తరలిరావడం పట్ల ఈరోజు పాల్గొన్న ప్రతినిధుల నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు.
Also read: విజ్ఞాన వటవృక్షం వేటూరి
హైదరాబాద్ నుంచి కదులుతారా?
ఇప్పటికే స్టూడియోలు, మిగిలిన సాంకేతిక వ్యవస్థలు హైదరాబాద్ లో పరిపుష్టిగా నిర్మాణమై ఉన్నాయి. చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ కు తెలుగు సినిమా పరిశ్రమ తరలిన క్రమంలో, పరిశ్రమకు చెందిన ముఖ్యులతో పాటు, ముఖ్య విభాగాలు కూడా హైదరాబాద్ లోనే స్థిరపడిపోయాయి. ఈ క్రమంలో, ఇప్పుడు వారంతా ఆంధ్రప్రదేశ్ వైపు, విశాఖపట్నం వైపు ఏ మేరకు తరలి వస్తారో చెప్పలేము. జనాభా, థియేటర్లు,ఆదాయం మొదలైన అంశాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా దాదాపు 60శాతం ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని వాతావరణాన్ని పరిశ్రమ సద్వినియోగం చేసుకుంటే ఉభయకుశలోపరిగా ఉంటుంది. అటు తెలంగాణలోనూ- ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ పరిశ్రమను మరింత విస్తరించవచ్చు. ఆంధ్రప్రాంతీయులకు కూడా అవకాశాల కల్పన జరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతిప్రాదనలు స్వాగతించడానికి అర్హమైనవే.
Also read: అమరగాయనికి బాష్పాంజలి
విశాఖలో సైతం సినిమా విరాజిల్లాలి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు, ఆంధ్రప్రాంతంలో,ముఖ్యంగా విశాఖపట్నంలో సినిమా పరిశ్రమ స్థాపన జరగాలని అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి సినిమా పరిశ్రమ పెద్దలకు సూచించారు. తమ ప్రభుత్వం నుంచి సంపూర్ణమైన సహకారం ఉంటుందని ప్రకటించారు. పెద్ద నిర్మాత, దివంగత డి. రామానాయుడు విశాఖ సాగరతీరంలో కొండలపై స్టూడియోను నిర్మించారు. వై ఎస్ రాజశేఖరరెడ్డి ఆ స్టూడియోను ఆవిష్కరించారు. గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది సినీ ప్రముఖులు విశాఖపట్నంలో స్థలాలు కూడా తీసుకున్నారు. విశాఖపట్నంలో సినిమా పరిశ్రమ స్థాపన జరగాలనే డిమాండ్లు, ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈసారి మరింత గట్టిగా వివరించారు. ఈ దిశగా పరిశ్రమ వ్యక్తులు ఏ మేరకు ఆచరణలో ముందుకు వస్తారో చూడాలి. కరోనా నేపథ్యంలో అన్ని పరిశ్రమల వలె సినిమా పరిశ్రమ కూడా చాలా దెబ్బతిన్నది. ఈ రంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన వ్యక్తులు, ఆ కుటుంబాలు చాలా కష్టాలు పడుతున్నాయి. ఎవరో కొందరు తప్ప ఎక్కువమంది రెక్కాడితే కానీ డొక్కాడనివారు. ధియేటర్ల లో పనిచేసేవారు కూడా నానా తిప్పలు పడుతూనే ఉన్నారు. మొత్తంగా సినిమా పరిశ్రమ మళ్ళీ ఊపిరి పీల్చుకోవాలి, ఊపందుకోవాలి. పరిశ్రమను నిలబెట్టడంలో సినిమా పెద్దలు -ప్రభుత్వాలు కలిసి సాగాలి. ‘నంది’ పురస్కారాలు, ‘ఎన్టీఆర్ అవార్డ్స్ ‘ కూడా పెండింగ్ లో ఉన్నాయి. కోవిడ్ ఉధృతి తగ్గి, సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత వాటిపైన కూడా దృష్టి పెట్టాలి. ‘సినిమా’ అనేది కళాత్మక వ్యాపారం. ఎందరికో ఆనందాన్ని, వినోదాన్ని పంచే మాధ్యమం. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమా పరిశ్రమ కళకళలాడాలని ఆకాంక్షిద్దాం. పేదకళాకారుల కుటుంబాల్లో వెలుతురులు ప్రసరించాలని కోరుకుందాం. అంతా శుభం జరగాలని ఆశిద్దాం.
Also read: ముందున్నవి మంచిరోజులు