పుస్తక సమీక్ష
మిత్రులు, విశేషమైన అనుభవం కలిగిన జర్నలిస్టు దాసు (హిందూ) కేశవరావుగారు ‘ఎ సెంటనరీ ఎపిక్: తెలుగు – ఇంగ్లీషు కాన్వర్సేషన్స్’ అనే విలువైన పుస్తకాన్ని నాకు పంపించి నెల రోజులు దాటింది. నేను పని చేసుకునే కంప్యూటర్ టేబిల్ పైనే ఆ పుస్తకం ఇన్ని రోజులూ ఉంది. నేను నడుపుతున్న తెలుగు, ఇంగ్లీష్ వైబ్ సైట్లకు అవసరమైన సామగ్రి తయారు చేయడంలో భాగంగా ఇంగ్లీషు లో నుంచి తెలుగులోకీ, తెలుగు లో నుంచి ఇంగ్లీషులోకీ అనువాదం చేయడం అవసరం. ఆ ప్రక్రియలో ఉన్నప్పుడు ఈ నెల రోజులలో కనీసం ఇరవై సార్లు ఈ శతవార్షిక గ్రంథాన్ని సంప్రతించాను. తెలుగు మాతృభాష కలిగినవారు ఇంగ్లీషులో రాసినా, హిందీలో రాసినా సర్వసాధారణంగా తెలుగులోని ఆలోచిస్తారు. ఇందుకు మినహాయింపు లేకపోలేదు. ప్రాంతీయ భాషా జర్నలిస్టులూ, జవహర్ లాల్ నెహ్రూ వంటి కొందరు వ్యక్తులు – చిన్నతనం నుంచి ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకొని, ఇంగ్లీషు పుస్తకాలే చదువుకొని, ఆక్సఫర్డ్ లోనో, కేంబ్రిడ్డ్ లోనో చదివి అమాంతం స్వాతంత్ర్య సంగ్రామంలో అడుగుపెట్టిన యోధులు- ఇంగ్లీషులో ఆలోచిస్తారు. తెలుగు జర్నలిజంలో దశాబ్దాల పాటు పని చేసిన నాబోటివారికి ఇంగ్లీషు నుంచి తెలుగులోకి తర్జుమా చేసే క్రమంలో ఇంగ్లీషులో ఆలోచించడం అలవాటు అవుతుంది. దాని ప్రభావం తెలుగు వాక్య నిర్మాణంపైన పడుతుంది. అనుభవజ్ఞాడైన జర్నలిస్టు కల్లూరి భాస్కరంగారిని సంప్రదిస్తే ఆయనకూ ఇటువంటి సమస్య లేదా అనుభవం ఉన్నదని చెప్పారు. నిజానికి ఇప్పుడు మనం చదువుతున్న తెలుగు వాక్యాలమీద ఇంగ్లీషు ప్రభావం ప్రబలంగా ఉంది. తెలుగు జర్నలిజం తెచ్చిన మార్పులలో ఇది ఒకటి. తెలుగు పండితులు రాసే వాక్యాలకీ, తెలుగు పాత్రికేయులు రాసే వాక్యాలకీ వ్యత్యాసం ఉంటుంది. తెలుగు ఆచార్యులు జీవీ సుబ్రహ్మణ్యంగారు పండిత తెలుగులో వెయ్యి పేజీల సాహిత్య విమర్శ రాస్తే చదివేవారు కరువయ్యారు. అదే విషయం పాత్రికేయుడు రాస్తే చదవడం, గ్రహించడం సులభం అవుతుంది. గిడుగు రామమూర్తి పంతులూ, గురజాడ అప్పారావు రాసిన తెలుగుకీ, శ్రీశ్రీ వివిధ పత్రికలలో రాసిన వ్యాసాలలో వాక్యాలకీ చాలా తేడా ఉంటుంది. శ్రీశ్రీ కవిత్వంపైనా, వచనంపైనా ఇంగ్లీషు ప్రభావం జాస్తి. ఆ ధోరణి నుంచే పత్రికా భాష రూపుదిద్దుకోవడం ప్రారంభించింది. ముట్నూరు కృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, అడవి బాపిరాజు, నార్ల వెంకటేశ్వరరావు, కొడవటిగంటి కుటుంబరావు, ముళ్ళపూడి వెంకటరమణ వంటి పాత్రికేయ ప్రముఖులు నిర్వహించిన తెలుగు పత్రికలలో వాక్య నిర్మాణంపైన ఇంగ్లీషు ప్రభావం ఉంది. అది వేరే చర్చ. తాను ఇంగ్లీషులో ఆలోచించి హిందీలోకి మనసులోనే తర్జుమా చేసుకొని మరీ బహిరంగసభలలో హిందీలో మాట్లాడేవాడినని జవహర్ లాల్ నెహ్రూ అనేవారు. అటువంటి అరుదైన నేపథ్యం ఉన్నవారు తప్ప తక్కినవారు మాతృభాషలోనే ఆలోచిస్తారు. తెలుగులో నిత్యజీవితంలో ఉపయోగించే మాటలకు ఇంగ్లీషు పదాలు చప్పున స్ఫురించవు. సంస్కృతం మాటలకు ఇంగ్లీషు సమానార్థకాలను అందించే మోనియల్ విలియమ్స్ డిక్షనరీ వంటివి తెలుగు నుంచి ఇంగ్లీషులో వివరించే నింఘంటువులు లేకపోలేదు. సి.పి. బ్రౌన్, శంకరనారాయణ నిఘంటువులు ప్రసిద్ధమైనవి. సిహెచ్ సుశీల, ఉషా అయినవోలు కూడా ఇటువంటి ప్రయత్నం చేశారు. లిఫ్కో వారిది కూడా మార్కెట్ లో ఉంది. వీటిలో చాలా వరకూ ఇటీవలి కాలంలో వచ్చినవి. కేశవరావు పంత్ గారి కాలంలో అందుబాటులో ఉన్నవి తక్కువ. ఇడియమ్స్, ప్రావెర్బ్స్ తెలుగు నుంచి ఇంగ్లీషులోకీ, ఇంగ్లీషు నుంచి తెలుగులోకి పరిచయం చేసిన పుస్తకం మాత్రం పంత్ గారిది ఒక్కటే.
తెలుగువారు ఇంగ్లీషులో చక్కగా మాట్లాడాలంటే…
తెలుగు పదబంధాలకు సమానార్థకాలైన ఇంగ్లీషు పదబంధాలను ఉపయోగించడంలో ఆరితేరిన దాసు కేశవరావు పంత్ (మన దాసు కేశవరావుగారి పూర్వీకులు) తాను సంపాదించిన విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలని శతాబ్దానికి పూర్వమే ఆలోచించడం, ఆచరించడం విశేషం. తెలుగులో మాట్లాడే మాటలలో వందలాది మాటలకు ఇంగ్లీషులో సమానార్థకాలనూ, తెలుగులో సామెతలకు ఇంగ్లీషులో సమానమైన సమాసాలనూ, ఇంగ్లీషు ప్రావెర్బ్ లకు తెలుగు సామెతలనూ సూచిస్తూ ఆయన పుస్తకం రచించారు. దాని పేరు ‘ఎ వేద్ మెక్యూమ్ ఆఫ్ ఆల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రీడర్స్’. ‘వేద్ మెక్యూమ్’ అన్నది లాటిన్ మాట. అంటే ‘నాతోపాటు’ అంటే నాకు మార్దదర్శనం చేయాలనీ, గైడ్ లాగా ఉండాలన్నది విస్తృతార్థం.
తెలుగు పదబంధాలతో, వాక్యాలను ఛందోబద్ధంగా, సవ్యంగా ఇంగ్లీషులో ఎట్లా అనువదించాలో చెప్పే పని మొదటి అధ్యాయంలో చేశారు దాసు కేశవరావు పంత్ గారు. ఆ తర్వాత అధ్యాయంలో ఇంగ్లీషు పదబంధాలను (ఇడియమ్స్) జాను తెలుగులోకి అనువదించి ఎట్లా మాట్లాడాలో తెలిపారు. తెలుగు సామెతలూ, వాటికి సరితూగే ఇంగ్లీషు ప్రావెర్బ్ లూ పొందుపరిచారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, న్యాయవ్యవస్థ, వాణిజ్యం, పనిముట్లు, ఆటలూ, ఆయుధాలూ, వాహనాలూ, గ్రహాలూ, రాసులూ వగైరా సమస్త ప్రాపంచిక విషయాలలో ప్రయోగించే ఇంగ్లీషు మాటలను పరిచయం చేశారు. ‘మీరు ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా చదివితే మీరు ఇంగ్లీషు అందంగా మాట్లాడగలరు’ అని ఈ పుస్తకం సగర్వంగా చాటుతుంది. ఆ రోజుల్లో ఈ పుస్తకానికి మంచి ప్రాచుర్యం ఉండేది. 1920లో మొదటి ఎడిషన్ ప్రచురిస్తే, 1938లో 18వ ఎడిషన్ ని, అంటే ఏడాదికి ఒకటి చొప్పున, ప్రచురించారు.
శతాబ్దం కిందటి ఖజానా
ఆ తర్వాత కేశవరావు పంత్ గారి (1867-1934) కుటుంబీకులు, మనుమలూ, మునిమనుమలూ ఆ పుస్తకం గురించి మాట్లాడుకోవడమే కానీ దాన్ని చూసే భాగ్యానికి ఇటీవలి వరకూ నోచుకోలేదు. ఆ అదృష్టం కేశవరావుగారికి దక్కింది. పెద్దెనిమిదో ఎడిషన్ ఆయనకు దొరికింది. శతాబ్దం కిందటి ఖజానా తనకు లభించిందని ఆయన సంతోషంగా రాసుకున్నారు. వయోధిక పాత్రికేయ సంఘం ఈ పుస్తకాన్ని పరిష్కరించడం కోసం నియమించిన సంపాదక మండలిలో కేశవరావుగారు సభ్యులు. లాటిన్ టైటిల్ ని ‘తెలుగు-ఇంగ్లీష్ కాన్వర్సేషన్స్’ గా మార్చి ‘గైడ్ టు డెయిలీ యూసేజ్‘ అని తోకతగిలించి, ‘ఎ సెంచరీ ఆఫ్ ఎన్ ఎపిక్’ అనే మకుటం పెట్టి 19 వ ఎడిషన్ ను ప్రచురించారు. కేశవరావుగారు ఇంగ్లీషులో ముందుమాట, విశిష్ట జర్నలిస్టు భండారు శ్రీనివాసరావుగారు తెలుగులో పరిచయ వాక్యాలు రాశారు.
దాసు వంశవృక్షం
దాసు వంశవృక్షాన్నిఈ పుస్తకంలో పరిచయం చేయడం బాగుంది. నిజానికి ఈ వంశం గురించి ప్రత్యేక గ్రంథమే రావాలి. కవులు, ముద్రాపకులు, సంగీత ప్రియులు, జర్నలిస్టులు, రచయితలూ ఈ వంశంలో చాలామంది ఉన్నారు. మహాకవి దాసు శ్రీరాములుగారు (1846-1908) తెలుగులో దేవీభాగవతాన్ని రచించిన మహాకవి. తన పందొమ్మిదవ ఏటనే తెలుగు, సంస్కృతాలలో పండితుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహిత్యం, నాటకాలు, నృత్యం, ఖగోళశాస్త్రం, సాంఘిక సంస్కరణలు తదితర రంగాలలో చురుకైన పాత్ర పోషిస్తూ న్యాయవాదిగా పని చేసేవారు. కృష్ణా జిల్లాకు చెందిన దాసు వంశం శాఖోపశాఖలుగా విస్తరించి తెలుగు, ఇంగ్లీషు సాహిత్యాలకీ, జర్నలిజానికి విశిష్టమైన సేవలు అందిస్తూ వస్తున్నది.
బహుముఖ ప్రజ్ఞాశాలి దాసు కేశవరావు పంత్
శ్రీరాములుగారి పెద్ద కొడుకు దాసు కేశవరావు పంత్. 1867లో జన్మించారు. సంగీతం సమకూర్చే విద్యాంసుడే కాకుండా వ్యాకరణంలో నిష్ణాతుడు. సాంఘిక సంస్కరణలలో తండ్రి వారసత్వాన్ని కొనసాగించారు. న్యాయవాదిగా రాణించారు. భాషావేత్తగా, సంగీత దర్శకుడుగా, సాహిత్యకారుడుగా, జ్యోతిష్య పండితుడుగా ప్రతిభ ప్రదర్శించారు. ఇంట్లో ఉన్న సౌభాగ్యాన్నీ, సుఖాలనూ వదులు కొని స్వశక్తిమీద పైకి రావాలని తీర్మానించుకొని బొంబాయి వెళ్ళి రైల్వే కాంట్రాక్టులు తీసుకొని పని చేశారు. త్రివాన్కూర్, హైదరాబాద్ లో కూడా కాంట్రాక్టు పనులు చేసి బాగా సంపాదించారు. 1896లో విజయవాడలో వాణిప్రెస్ ను నెలకొల్పి అక్షరయాత్రలో వంశాన్ని ప్రతిష్ఠించారు. టైప్ సెట్టింగ్ మెషీన్లనూ, విలియం బుల్లక్ రోటరీ ప్రింటింగ్ ప్రెస్ నూ మొదటిసారి విజయవాడకు తీసుకొని వచ్చింది పంత్ గారే. దేశం 20వ దశాబ్దంలో అడుగుపెడుతున్న సమయంలో బాపట్లలో తన కుమార్తె నివాసం దగ్గర ఒక విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పారు. ఆ ప్రాంతాన్ని అంతా వెలుగులతో ముంచారు. దాన్ని ఇప్పుడు రంగారావుతోట అని పిలుస్తున్నారు. ఒక్క రోజులో వంద పేజీల పుస్తకాన్ని అచ్చువేసి బైండింగ్ చేసి ఇవ్వగలిగే శక్తి, సామర్థ్యం ఆ రోజుల్లొనే సొంతం చేసుకున్న ఘనత ఆయనది. ప్రింటింగ్ ప్రెస్ మీద వంద సంవత్సరాలపాటు వంద కుటుంబాలు బతికేవి. ఏలూరు నుంచి ‘జ్ఞానోదయం’ అనే పత్రికను 1890లో ప్రారంభించారు. మంచి యజమానిగా, సంగీతప్రియుడుగా, సాహిత్యపోషకుడుగా పేరు గడించారు. ప్రతిసంవత్సరం త్యాగరాజ గానోత్సవాన్ని నిర్వహించేవారు. బెంగళూరు నాగరత్నమ్మ, ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ వంటి మహామహులు కచ్చేరీలు చేసేవారు. 1934లో దాసు కేశవరావు పంత్ దివంగతులైనప్పుడు ఆయన పట్ల గౌరవ సూచకంగా బెజవాడ మునిసిపాలిటీవారు నగరంలో వీధి దీపాలను ఆపు చేశారు.
కృష్ణాజిల్లాతో అనుబంధం
ఈ వంశానికి చెందిన సభ్యులలో అత్యధికులు హైదరాబాద్ లో, దిల్లీలో, అమెరికాలో ఎక్కడెక్కడో పని చేసినా కొంతకాలంపాటు విజయవాడలో పని చేయడం మనకు కనిపిస్తుంది. విజయవాడతో, కృష్ణాజిల్లాతో వారికి ఉన్న అనుబంధం అటువంటిది.
శ్రీరాములుగారి కుమారుడు దాసు నారాయణ రావు (1869-1905) మచిలీపట్టణంలో క్రిమినల్ లాయర్ గా పేరుప్రతిష్ఠలు సంపాదించారు. ఈయన సైతం తెలుగు, సంస్కృత భాషలలో పాండిత్యం కలిగినవారు. వేమూరి (దాసు) శారదాంబ (1881-1899) 15వ శతాబ్దపు రచయిత్రి మొల్లతో పోల్చదగినవారు. ఆమె 19 సంవత్సరాలకంటే తక్కువ కాలమే జీవించినప్పటికీ మంచి రచయిత్రిగా, గాయనిగా పేరు తెచ్చుకున్నారు. దాసు త్రివిక్రమరావుగారు (1894-1960) న్యాయవాది, పాత్రికేయుడు, కార్మికనాయకుడు. కొలంబోలో న్యాయశాస్త్రం అభ్యసించారు.అక్కడే డెయిలీ న్యూస్ పత్రికలో సహాయ సంపాదకుడుగా పని చేశారు. తర్వాత లండన్ వెళ్ళి బారిస్టర్ కోర్సు పూర్తి చేశారు. డీటీ రావుగా ప్రసిద్ధులు. మాజీ రాష్ట్రపతి వివి గిరితో సుదీర్ఘ స్నేహం ఉండేది. 1935లో ఆంధ్రప్రాంతంలో తెలుగు పత్రిక ‘ఆంధ్రవార్త’ నెలకొల్పారు. 1939 నుంచి 1942 వరకూ డెయిలీన్యూస్ అనే ఇంగ్లీషు పత్రిక నడిపారు. 1942లో హైదరాబాద్ కు వచ్చి మైనింగ్, లేబర్ వ్యవహారాలలో నిజాం ప్రభుత్వానికి సలహాదారుగా పని చేశారు. సింగరేణి కంపెనీకి చీఫ్ లేబర్ ఆఫీసర్ గా రెండు పర్యాయాలు పని చేశారు.
త్రివిక్రమరావు సంతానం అందరూ పాత్రికేయులే
దాసు త్రివిక్రమరావుగారితో ప్రారంభమైన పాత్రికేయ యాత్రను ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ముగ్గురు కుమారులు దాసు కృష్ణమూర్తి, హృషీకేశ్ రావు, కేశవరావు (జూనియర్) దేశంలోని పేరుప్రఖ్యాతులున్న ఇంగ్లీషు పత్రికలలో పని చేశారు. దాసు నారాయణరావు పెద్ద కొడుకు దాసు వామనరావు మద్రాసులో ప్రెసిడెన్పీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉండగా మహాత్మాగాంధీ పిలుపునుఅందుకొని స్వాంతంత్ర్య సంగ్రామంలోకి దూకారు. 1925లో మద్రాసులో ఆంధ్రపత్రిక సంపాదకుడుగా పని చేశారు. రాజకీయ, సామాజికాంశాలపైన వ్యంగ్యంగా వ్యాసాలు రాసేవారు. టోపీదాస్ అనీ, భావసంచారి అనీ మారు పేర్లతో హాస్యస్ఫోరకమైన అంశాలు రాసేవారు. కాలక్షేపం వామనరావుగా ప్రసిద్ధి చెందారు. కాలక్షేపం, ఇష్టాగోష్ఠి, తమాషాకులాసా అనే శీర్షికలతో హాస్య గుళికలు రాసేవారు. ఆకాశవాణి మద్రాసు, విజయవాడ కేంద్రాల నుంచి వారంవారం వ్యాసాలు ప్రసారం చేసేవారు. 1954లో ఆంధ్రపత్రిక నుంచి విరమించుకున్న తర్వాత ప్రజామత, ఢంకా, ఆనందవాణి, ఆంధ్రభూమి పత్రికలలో వ్యాసాలు రాసేవారు. కంచి శంకరాచార్య కోరికపైన ఆయన రచనలను తెలుగులోకి అనువదించారు.
అమెరికాలో స్థిరపడిన కృష్ణమూర్తి
దాసు కృష్ణమూర్తి 1926లో జన్మించారు. 95 ఏళ్ళ వయసులో కూడా నిత్యం రచనావ్యాసంగం కొనసాగిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిప్లొమా ఇన్ జర్నలిజం మొదటి బ్యాచ్ విద్యార్థి. ద హైదరాబాద్ బుల్లెటిన్, ద దక్కన్ క్రానికల్, ద సెంటినెల్, ద డెయిలీ న్యూస్ వంటి హైదరాబాద్ నగర పత్రికలలో పని చేశారు. 1955లో ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిషన్ ను విజయవాడలో ప్రారంభించినప్పుడు అందులో చేరారు. అహ్మదాబాద్ లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో కొంతకాలం పని చేసిన తర్వాత దిల్లీ వెళ్ళి 1969లో పేట్రియట్ సంపాదకవర్గంలో చేరారు. 1984లో సహాయ సంపాదకుడుగా ఉద్యోగం విరమించారు. దిల్లీ లో ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేశారు. అదే సమయంలో ఆకాశవాణి దిల్లీ కేంద్రలో రాజకీయ వ్యాఖ్యాతగా కార్యక్రమాలు ప్రసారం చేసేవారు. 1989లో హైదరాబాద్ కు తిరిగి వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోనూ, ఉస్మానియా యూనివర్శిటీలోనూ జర్నలిజం బోధించారు. 2001లో అమెరికా వెళ్ళిపోయారు. తెలుగు కథలను ఇంగ్లీషులోకి అనువదించి మూడు ఎడిషన్లకు సంపాదకుడుగా వ్యవహరించారు. ద సీసైడ్ బ్రైడ్ అండ్ అదర్ స్టోరీస్ అనే తాజా సంపుటిని తన 94వ ఏట 2019లో విడుదల చేశారు. అన్నట్టు నా సంపాదకత్వంలో కొనసాగుతున్న ‘ప్రైమ్ పోస్ట’ ఇంగ్లీషు వెబ్ సైట్ లో ఆయన వ్యాసాలు కొన్ని ప్రచురించే అవకాశం కలిగింది.
పాత్రికేయులే తొలి అనువాదకులు
సాధారణంగా కొత్తగా అనుభవంలోకి వచ్చే ఇంగ్లీషు పదాలకు మొదటి అనువాదకులు భాషావేత్తలు కాదు. ఆ పదం వాడుకలోకి వచ్చిన క్షణంలో పగలు షిఫ్ట్ లోనో, రాత్రి షిఫ్ట్ లోనో తెలుగు దినపత్రిక డెస్క్ లో వార్తలు రాసే సబ్-ఎడిటర్ లేదా సీనియర్ సబ్-ఎడిటర్ దానిపైన కసరత్తు చేస్తాడు. తనకు తోచిన విధంగా అనువదిస్తాడు. 1980లలో టెలివిజన్, మొబైల్ అనుభవంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి క్లౌడ్ టెక్నాలజీ వరకూ అనేక ఆంగ్ల, సాంకేతిక పదాలు వాడుకలోకి వచ్చాయి. వాటిని తెలుగు దినపత్రికలు అనువదించిన తర్వాత ఒక వ్యవస్థ అంటూ లేకుండానే రూఢి అవుతున్నాయి. ఈనాడు పత్రిక దస్త్రం అని ఫైలును అనువదిస్తే, తక్కిన పత్రికలు ఇప్పటికీ ఫైలు అనే రాస్తున్నాయి. లోగడ ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక ఒకే ఆంగ్ల పదానికి వేర్వేరు తెలుగు మాటలు రాసి ప్రచురించిన సందర్భాలు ఉన్నాయి. సరిపోల్చుకొని, సరిదిద్దుకోకుండా అదే మాటలను సంవత్సరాల తరబడి ఉపయోగించిన ఉదంతాలూ ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ ను ఐక్యరాజ్యసమితిగానూ, నానారాజ్యసమితిగానూ రెండు పత్రికలూ అనువదించాయి. ఆంధ్రప్రభ రాసిన ఐక్యరాజ్య సమితి అనే అనువాదమే కాలపరీక్షలో నిలిచింది. ఆధునిక యుగంలో అమలులోకి వచ్చే కొత్త ఇంగ్లీషు పదాలను అనువదించే బాధ్యత, భాగ్యం భాషాజర్నలిస్టులది. 1900ల ప్రథమార్ధంలో ఈ బాధ్యతను దాసు కేశవరావు పంత్ స్వయంగా నిర్వహించడం విశేషం.
దాసు హృషీకేశ్ కూడా బీఏ, ఎల్ ఎల్ బీ పూర్తి చేసిన తర్వాత ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో సబ్ ఎడిటర్ గా చేరారు. తన 32వ ఏటనే మశూచి సోకి ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. ఆయన మంచి క్రీడాకారుడు. నిజాం కాలేజిలో క్రికెట్ ఆడేవారు. గుంటూరులో జరిగిన జాతీయ టేబుల్ టెన్నిస్ పోటీలలో హైదరాబాద్ తరఫున ఆడారు. దాసు దామోదరరావు ఆంధ్రాయూనివర్శిటీలో సైన్స్, ఎడ్యుకేషన్ లో పట్టా తీసుకొని హైదరాబాద్ లో హైస్కూలు టీచర్ గా పని చేశారు. దాసు శ్రీరాములు స్మారక సమితిని నిర్వహిస్తున్నారు. దాసు శ్రీరాములు రచనల పునర్ముద్రణలు వెలుగులోకి తెచ్చారు. శాస్త్రీయ సంగీతం అంటే ప్రాణం. త్యాగరాజ, అన్నమాచార్య, శ్యామశాస్త్రి కృతులను ఇంగ్లీషులోకి అనువదించారు.
పత్రికారంగంలో మేటి నేటి కేశవరావు
దాసు కేశవరావు 1943లో జన్మించారు. రాజకీయ వారపత్రిక ఆంధ్రారిపోర్టర్ లో జర్నలిజం వృత్తిని ప్రారంభించి. అక్కడి నుంచి ద డైలీ న్యూస్ లో చేరారు. తర్వాత ద డక్కన్ క్రానికల్, అనంతరం 1970లలో ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పని చేశారు. ఇంత వరకూ అన్నగారు దాసు కృష్ణమూర్తిగారి బాటలోనే కేశవరావుగారి ప్రయాణం సాగింది. 1977లో ద హిందూలో చేరి, విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలలో సుదీర్ఘకాలం పని చేసి అందులోనే ఉద్యోగవిరమణ చేశారు. ఆయన కూడా ఉస్మానియా జర్నలిజం శాఖలో పోస్ట గ్రాడ్యేయేట్ డిగ్రీ చదివారు. తాతగారు దాసు శ్రీరాములుగారి జీవితచరిత్రను కాఫీ టేబుల్ బుక్ గా తీసుకొని వచ్చారు. రాష్ట్రప్రభుత్వ నెలకొల్పిన ఉత్తమ జర్నలిస్టు అవార్డునూ, జర్నలిజానికి చేసిన సేవలకు గుర్తింపుగా తెలుగు విశ్వావిద్యాలయం ప్రదానం చేసే అవార్డునూ స్వీకరించారు.
దాసు వంశం అక్షరయాత్ర నిరంతరంగా కొనసాగుతోంది. దాసు హరినారాయణరావు, దాసు గోవిందరావు, దాసు అచ్యుతరావు జర్నలిజంతో తమ వంశప్రతిష్ఠను కొనసాగించడానికి శక్తివంచన లేకుండా పరిశ్రమిస్తున్నారు. యువతరం జర్నలిస్టులకు సైతం రక్తజనితంగా ఉన్న పాత్రికేయ నైపుణ్యం, అక్షరవిన్యాస క్రీడాభిరుచి, విషయగ్రహణశక్తి సహజంగానే అబ్బాయి.
అంతా అద్భుతం
అంతా అద్భుతంగా ఉంది. తెలుగువారు ఇంగ్లీషులో తప్పులు లేకుండా,ఛందోబద్ధంగా, అందంగా మాట్లాడటానికీ, రాయడానికీ ఈ పుస్తకం దోహదం చేస్తుంది. తెలుగు మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లీషును సరళంగా బోధించడానికి అవసరమైన ఉదాహరణలూ, వాక్యాలు ఇందులో విరివిగా ఉపాధ్యాయులకు లభిస్తాయి. 19వ ఎడిషన్ త్వరలోనే అమ్ముడుపోతుందని నానమ్మకం. వీలైతే అమలు చేయడానికి ఒక చిన్న సూచన. ఇంగ్లీషు మాటలను ఏ విభాగంలో ఇచ్చినా అక్షరక్రమంలో ఉంటే చదువుకోవడం లేదా చూసుకోవడం తేలిక అవుతుంది. సంపాదకవర్గం కొద్దిగా శ్రమిస్తే ఈ సంస్కరణ తీసుకొని రావచ్చు. ఉదాహరణకు పక్షుల విభాగంలో మొదట వల్చర్ (vulture) అంటే రాబందు అని ఇచ్చి, దాని తర్వాత ఈగిల్ (Eagle) అంటే గరుడ పక్షి అని ఇచ్చారు. తర్వాత కైట్ అనీ, అనంతరం ఫాల్కన్ అనీ ఒక క్రమం లేకుండా ఉంది. మొదటి ఎడిషన్ లో ఇచ్చిన క్రమాన్ని మార్చకుండా కొనసాగించామని ప్రకాశకులు తెలియజేశారు. మార్చితే ఇంకా సులభంగా చదవడానికి అనువుగా ఉంటుందని నా అభిప్రాయం. ఇంత గొప్ప పనిని, చారిత్రక బాధ్యతను, ప్రయోజనకరమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కేశవరావుగారికీ, వారిని ప్రోత్సహించినందుకు వయోధిక పాత్రికేయ సంఘ నిర్వాహకులకు శతాధిక వందనాలూ, అభినందనలు.