- బడుగు,బలహీన వర్గాలదే తెలుగుదేశం : చంద్రబాబునాయుడు
- బీసీ,ఎస్సి,ఎస్టీ,మైనార్టీలకు 61 శాతం పదవులు
- 50 ఉపకులాలకు ప్రాధాన్యత
- అన్ని ప్రాంతాలు,అన్ని కులాల సమతుల్యంతో టిడిపి ఏపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు
- వారసత్వం కంటే పనితీరుకే ప్రాధాన్యత
- యువనాయకత్వానికి పెద్దపీట
- 219 మందితో ఆంధ్రప్రదేశ్ కమిటీ
అమరావతి: తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణంతో నూతనుత్సాహాన్ని నింపుతున్నానని అంటున్నారు పార్టీ అధినేత చంద్రబాబు. ఓటమి నేర్పిన పాఠాలను విజయానికి మెట్లుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు పార్టీని భావితరాలకు అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో సమూలమైన మార్పులకు నాంది పలికారు.జిల్లా పార్టీ వ్యవస్థకి స్వస్తి పలికి పార్లమెంటరీ పార్టీ వ్యవస్థ ని తీసుకొచ్చారు. ఇటీవల పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీలను ప్రకటించిన టిడిపి శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ని ప్రకటించింది.ఇప్పటికే టిడిపి ఏపీ అధ్యక్షుడిగా బీసీ నేత అచ్చెన్నాయుడుని ప్రకటించిన అధినేత చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు తరువాత ఏపీ రాష్ట్ర కమిటీ ఎంపికను పూర్తి చేసారు. 219 మందితో టిడిపి ఆంధ్రప్రదేశ్ కమిటీని ప్రకటించారు. బడుగు,బలహీన వర్గాలకు ఈ కమిటీలో అధిక ప్రాధాన్యత లభించింది.
బడుగులకు పదవులు
గతంలో ఎన్నడూ లేని విధంగా 61 శాతం బడుగు,బలహీన వర్గాల వారికి పదవులు దక్కాయి.బీసీలకు 41 శాతం,ఎస్సి 11 శాతం,ఎస్టీ 3 శాతం,మైనార్టీలకు 6 శాతం మొత్తంగా 61 శాతం పదవులు బడుగు,బలహీన వర్గాల వారికి ఇచ్చి తెలుగుదేశాన్ని బడుగు,బలహీన వర్గాల పార్టీగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. కమిటీ ఏర్పాటు కోసం సుదీర్ఘ కసరత్తు చేసిన అధినేత 17 నెలల పనితీరుకి పట్టం కట్టారు. వారసత్వం కంటే పనితీరుకే ప్రాధాన్యత ఇస్తూ ప్రతిపక్షంలో గళం వినిపిస్తున్న వారికి పదవులు కట్టబెట్టారు. ఇప్పటి వరకూ పార్టీలో ఎటువంటి పదవులు లేని ఎంతో మంది కొత్త మొహాలకు రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించారు. పార్టీలో సమూల మార్పులకు ప్రతిపక్షంలో ఉండటం కూడా అనుకూలించే అంశం. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో మార్పులకు సాహసం చెయ్యరు. ఈ అంశం టిడిపి కి కలిసొచ్చింది.
గతంలో పదవులు దక్కని ప్రాంతాలకు ప్రాతినిధ్యం
పార్లమెంట్ స్థానాల వారీగా అన్ని ప్రాంతాలకు సమానంగా అవకాశాలు కల్పించారు. గతంలో ఎప్పుడూ పదవులు దక్కని కొన్ని ప్రాంతాలను గుర్తించి మరీ పదవులు ఇవ్వడం కమిటీ ఏర్పాటు వెనుక జరిగిన కసరత్తు ని ఆవిష్కరిస్తుంది. ఉదాహరణకు పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంతానికి గతంలో ఎప్పుడూ పదవులు దక్కలేదు కానీ ఈసారి ప్రకటించిన కమిటీలో ఆ ప్రాంతంలో ఉన్న నాయకుల్ని గుర్తించి పదవులు ఇచ్చారు. ఇలా అన్ని జిల్లాల్లో గతంలో పదవులు దక్కని ప్రాంతాలను గుర్తించి మరి పదవులు కట్టబెట్టారు. రాష్ట్ర కమిటీ ఏర్పాటులో మరో విశేషం అన్ని కులాల సమతుల్యత. 50 ఉపకులాలకు ఈ కమిటీలో ప్రాధాన్యత దక్కింది. శాస్త్రీయ పద్దతిలో పార్లమెంట్ పరిధిలో ఉన్న ముఖ్యమైన కులాలను ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్ర కమిటీ కూర్పు జరిగింది.
కమిటీ సగటు వయస్సు 48 ఏళ్ళు
యువ నాయకత్వానికి పార్టీని అందించడమే లక్ష్యంగా ఎంపిక జరిగింది.కమిటీలో ఉన్న వారి సగటు వయస్సు 48 ఏళ్ళు. మహిళలకు కమిటీలో ప్రాధాన్యత లభించింది.219 మందితో ఏర్పాటైన కమిటీలో ఉపాధ్యక్షులు 18 మంది,ప్రధాన కార్యదర్శులు 16 మంది,అధికార ప్రతినిధులు 18,కార్యనిర్వాహక కార్యదర్శులు 58 మంది,రాష్ట్ర కార్యదర్శులు 108 మంది, కోశాధికారి ఒకరు కలిసి మొత్తంగా 219 మందితో కమిటీని ప్రకటించారు. ప్రతిపక్షంగా ప్రజల ప్రక్షాన పోరాటం చేస్తారనే భావనతో కమిటీ ఏర్పాటు చేశారు.