- తెలుగు తిరునాళ్ళు
- రాజమహేంద్రవరంలో కన్నుల పండుగగా వేడుక
- తెలుగుదనం ఉట్టిపడిన సభలు
రాజమహేంద్రవరంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ‘2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు-2024’ అద్భుతంగా జరిగాయి. ఈ వేడుకల ద్వారా తెలుగు భాషా సంస్కృతులకు పట్టాభిషేకం జరిగింది. ముఖ్యంగా యువతరానికి తెలుగు రుచులు తెలిశాయి. తెలుగు పట్ల ప్రేమను పెంచడానికి, భావి భాషా ప్రేమికులు తయారవడానికి ఇటువంటి వేడుకలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ తరహా ఉత్సవాలు విరివిగా జరిగితేనే మనతనం పదికాలాలపాటు పదిలంగా వుంటుంది. రాజమహేంద్రవరం గైట్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 5,6,7 తేదీలలో ఈ సంబరాలు జరిగాయి. నిన్న ఆదివారంతో ఇవి ముగిసాయి. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ తిరునాళ్ళు రూపుదిద్దుకున్నాయి. నరేంద్రుడి పట్టాభిషేక సహస్రాబ్ది నీరాజనంగా రూపకల్పన చేసిన ఈ వేడుకలు కన్నుల పండువగా సాగి, తెలుగు భాషా ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టాయి. ప్రముఖ గజల్ కళాకారుడు ‘గజల్’ శ్రీనివాస్ మస్తిష్కంలో కొన్నాళ్ళ క్రితం పుట్టిన మహదాలోచన మహోత్సవ రూపాన్ని సంతరించుకున్నది. 2022లో భీమవరంలో తొలి అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరిగాయి. ఈ సభలు కూడా మహోన్నతంగా సాగాయి. రెండవ అంతర్జాతీయ మహా సభలు రాజమహేంద్రవరం కేంద్రంగా ఇప్పుడు జరిగాయి. ఈ సారి జరిగిన సభలకు చైతన్య రాజు సహ భాగస్వామ్యం వహించి అండగా నిలిచారు. రవాణా మొదలు సకల సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులో ఉండడం వల్ల ఈ ఏటి సభలు మరింత ధాటిగా జరిగాయి.
కదంతొక్కిన భాషాప్రేమికులు
పల్లె నుంచి ప్రపంచం వరకూ తెలుగు భాషా ప్రేమికులు కదలివచ్చారు. అన్ని రంగాలవారు కలిసి నడిచారు.తరలి రాద తనే వసంతం అన్నట్లుగా… స్త్రీ, బాల, వృద్ధులందరూ తరలి వచ్చారు. తెలుగు భాషా సంస్కృతులకు సంబంధించిన రంగాలన్నింటికీ ఆలవాలంగా వేదికలు ముస్తాబయ్యాయి. ఒక్కొక్క వేదికకు ఒక్కొక్క మహనీయుడి పేరు పెట్టారు. ప్రధాన వేదిక రాజ రాజనరేంద్రుడి స్మృతిగా వెలసింది. మిగిలినవి నన్నయ్య, నారాయణభట్టు పేర్లతో అలంకృతమైనాయి. గిడుగు రామ్మూర్తి పేరుతో కూడా ఒక ప్రత్యేక వేదికను రూపకల్పన చేయడం విశేషం. గద్యం, పద్యం, అవధానం, గేయం, కీర్తన, గానం, నృత్యం, నాటకం, రూపకం, నవల, కథ, హరికథ, బుర్రకథ పాత్రికేయం, విందులు, చిందులు, వినోదాలు, గజల్స్, పదకవితలు, జానపదాలు, ఒక్కటేమిటి సర్వ సారస్వత దర్శన, ప్రదర్శనలు జరిగాయి. సదస్సుల నిర్వహణలోనూ సమగ్రతను చాటిచెప్పారు. కీర్తిశేషులైన తెలుగు వెలుగుల వంశాల ప్రతినిధులను పూర్ణకుంభ పురస్కారాల ప్రదానం చేసిన వైనం వినూత్నం. పూర్వ సంస్థానాధీశుల కుటుంబ సభ్యులను ఆహ్వానించి గౌరవించడం విశిష్టం. తెలుగు సినిమా రంగంలోని సారస్వత స్వరూపానికి కూడా సమున్నత స్థానం కల్పించడం సంతోషదాయకం. మేళాలు,తాళాలు, మంగళ వాద్యాలు, కవిసమ్మేళనాలు, దరువులు, జతులతో వేదికలు మార్మోగాయి.
మహాకవులకూ, వాగ్గేయకారులకూ నీరాజనం
పూర్వ మహాకవులను, వాగ్గేయకారులను,కళాకారులను, కథకులను స్మరించుకొని నీరాజనం పలుకడం పరమానందదాయకం. తెలుగు వైజ్ఞానిక, మనోవైజ్ఞానిక సదస్సులు నిర్వహించడం విశేషం. ఈ ప్రాంగణంలో పుస్తక ప్రదర్శన కూడా ఏర్పాటుచేశారు. కేంద్ర సాహిత్య అకాడెమి, నేషనల్ బుక్ ట్రస్ట్, విశాలాంధ్ర సంస్థలు ఇందులో పాల్గొనడం ఎంతో సముచితం. ఏటికొప్పాక హస్తకళా ప్రదర్శనతో పాటు, కార్టూన్ల ప్రదర్శన కూడా జరపడం మరో అదనపు ఆనంద రూపం. తెలుగు వికీపీడియా విజ్ఞాన సమాచార కేంద్రంగా కూడా ఇక్కడ వెలయడం ఎంతో ఉపయోగకరం. ప్రత్యక్ష వేదికలతో పాటు అంతర్జాల మాధ్యమంగా అంతర్జాతీయ కవిసమ్మేళనం నిర్వహించడం సమయోచితం. సభలకు నేరుగా హాజరుకాలేని పెద్దలు పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, లోక్ సభ సభాపతి ఓం బిర్లా వంటివారు తమ సందేశాన్ని ఉత్తరాల ద్వారా పంపి తమ సాంస్కృతిక ప్రేమను చాటిచెప్పుకున్నారు. ఆంధ్రమేవ జయతే! అంటూ, నా భాష తెలుగు – నా జాతి తెలుగు అని నినదిస్తూ ఈ పర్వం సాగింది. తెలుగు భాషా, సంస్కృతులు, కళారూపాలకు సంబంధించిన తలంపులు ఒక్కసారిగా అందరి మదిలో మెదిలేట్లు ఈ సంబరాలను రూపకల్పన చేసిన నిర్వాహకులను మనమందరం అభినందించి తీరాలి.
సమష్టిగా ముందుకు సాగుదాం
మన జాతి సంపదను కాపాడుకోవడంలో, మన పూర్వ వైభవాన్ని గుర్తుచేసుకోవడంలో, మన భావి సంకల్పాలను రచించుకోవడంలో ఇటువంటి సభలను స్ఫూర్తిగా తీసుకొని, అందరం కలిసి ముందుకు సాగాలి.ఈ స్థాయిలో సభలు నిర్వహించాలంటే ఎంతో వ్యయం, అంతే ప్రయాస వుంటాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు ఆర్ధికంగా అండగా నిలబడాలి. అన్ని రకాలుగా చేయూతను అందించాలి.సంపన్నులు, పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ వర్గాలు భాగస్వామ్యం వహించాలి. మన భాషను, సంస్కృతిని కాపాడుకోవడం ఏ ఒక్కరి బాధ్యతో కాదు. మన ఉమ్మడి కర్తవ్యం. సభలు చేసి,చూసి సంబరపడగానే సరిపోదు. తెలుగు సంగమంగా, సగర్వంగా ముందుకు సాగుదాం. ‘ఆంధ్రమేవ జయతే!’