Sunday, December 22, 2024

కమలం వైపు కదలికలా?

  • రగులుతున్న లక్షలాదిమంది విద్యార్థులు, యువత
  • తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారుతుందా ?
  • అధినేత ఆలోచించకువలసిన సమయం

( జె సురేందర్ కుమార్, ధర్మపురి )

ప్రాణాలకు తెగించి పోరాడిన ,పోరాడుతున్న పోరాటాల పురిటి గడ్డ తెలంగాణ. ఆస్తులు అంతస్తులు లేకున్నా ఆత్మాభిమానానికి ఆత్మగౌరవానికి  ఆకాశం   ఎత్తుగా ఎదిగి నిలిచిన గడ్డ. నిజాం నిరంకుశ పాలనకు, సాయుధ రైతాంగ పోరాటాలకూ, తొలిదశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో తుపాకుల తూటాలకు ఎదురొడ్డి వందలాది మంది ప్రాణత్యాగాలు చేసిన పోరాట యోధులను కన్న పోరుగడ్డ  తెలంగాణ. భూమికోసం, భుక్తి కోసం వెట్టిచాకిరి నిర్మూలన కోసం మరో నక్సల్ బరి  ఉద్యమాన్ని విస్తరింపజేసిన ఉద్యమ అగ్ర నేతలను కన్న గడ్డ. మలిదశ తెలంగాణ ఉద్యమంలో వేయి మందికి పైగా యువత ఆత్మ బలి దానాలతో ఆశించిన రాష్ట్రం సాధించుకున్న అమరవీరుల గడ్డ మన తెలంగాణ . మన పోరాటాలు , త్యాగాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం  మారుతుందా.?  అనే చర్చ వినిపిస్తున్నది.  

గత కొన్ని  నెలల క్రితం ( లాక్ డౌన్ కారణంగా ) పది లక్షల మంది విద్యార్థులు ,యువత, నిరుద్యోగులు గ్రామాల్లో  మకాం  వేయడంతో ఇటువంటి  చర్చలకు  బలం చేకూరుతున్నది.  ప్రభుత్వ యంత్రాంగ పాలనా తీరుతెన్నులు, గ్రామాల్లో ఆయా రాజకీయ పార్టీలకు చెందిన కొందరు  నాయకుల  ఆధిపత్యం, భూ వివాదాలు,  కుటుంబ తగాదాలు, తదితర అంశాలలో వారి జోక్యాన్ని   ప్రత్యక్షంగా చూస్తున్న యువత,  విద్యార్థులు, నిరుద్యోగులు   వారి ఆగడాలనూ, ఏకచ్ఛత్రాధిపత్యాన్నీ నిలదీద్దామా ?  మరో ఆత్మగౌరవ పోరాటం ఆరంభం చేద్దామా ?  లేక కమలం  వైపు  కదులుదామా?  అని తర్జనభర్జన పడుతున్నారు. 

అప్రతిహత విజయాలతో..

సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టి  ఉద్యమ నేత కేసీఆర్ ను 2014 లో  ముఖ్యమంత్రి చేశారు. మరోసారి 2018 లోనూ ప్రజలు భారీ మెజార్టీతో 119 స్థానాల లొ 88 మంది ఎమ్మెల్యేలను గెలిపించి మరోసారి   కేసీఆర్ ను సీఎంగా పట్టాభిషేకం చేశారు అనేది జగమెరిగిన సత్యం. 2019-20 లో జరిగిన స్థానిక ఎన్నికల్లో 122 మున్సిపాలిటీలు, పది మున్సిపల్ కార్పొరేషన్ లు సహకార సంఘ ఎన్నికలు 9 కే డి సి సి బ్యాంక్ చైర్మన్, వైస్ చైర్మన్ లుగా గెలిచి ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా అప్రతిహతంగా విజయం సాధించింది. దీనికితోడు 33 జిల్లా పరిషత్తులు, 585 మండలలో  అధ్యక్ష, ఉపాధ్యక్ష , పదవులతో పాటు దాదాపు 4380 మూడు గ్రామ పంచాయతీల సర్పంచులను  99% అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొని విజయ పరంపరల బాటలో కొనసాగుతున్నది. 20 14 నుంచి జరిగిన నాలుగు ఉపఎన్నికల్లో ఒక్క దుబ్బాక స్థానం మినహా అన్ని స్థానాలు టిఆర్ఎస్ ఖాతాలో చేరాయి.

దుబ్బాక దెబ్బ

దుబ్బాక టిఆర్ఎస్ సిట్టింగ్ స్థానము బిజెపి పార్టీ గెలుచుకోవడం వెంటనే జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 99 కార్పొరేటర్ స్థానాల నుంచి 56 స్థానాలకు పడిపోయింది. నాలుగు స్థానాలు ఉన్న బిజెపి పార్టీ 48 స్థానాలు చేరుకుంది. ఈ రెండు ఎన్నికల  నేపథ్యంలో బిజెపి పార్టీ గ్రాఫ్ పెరిగిందా ?  టిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందా ?   అనే అంశంపై  జనం, రాజకీయ నాయకులు, విశ్లేషకులు తర్జన భర్జన పడుతున్నారు. అధికార పార్టీకి ప్రతికూలంగా ఫలితాలు రావడానికి అనేక స్థానిక కారణాలు ఉండవచ్చు . దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని అనేక  ప్రజా సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నది అనేది నగ్నసత్యం.

Also Read : కేటీఆర్ ను ప్రమోట్ చేయడానికే బిజెపి తో కేసీఆర్ దోస్తీ?

అనేక సంక్షేమ కార్యక్రమాలు

రైతు బంధు పథకం, రైతు బీమా, రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లు పంపిణీ ,ఉచిత విద్యుత్తు ,ఆసరా పెన్షన్ లు ఒంటరి మహిళ పెన్షన్ లు, నిరంతర విద్యుత్ సరఫరా, బీడీ కార్మికులకు గీత కార్మికులకు, వికలాంగులకు, నేత కార్మికులకు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ డబుల్ బెడ్ రూములు, సాగు, తాగునీటి వనరుల కల్పన కై మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న అధికార పార్టీ పట్ల ఎందుకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ? అనే అంశంఆ పార్టీ అధినేతలు ఆలోచించుకొని చర్చించుకోవాలి సిన అవసరం ఉంది..

గ్రామాలలో 10 లక్షల మంది విద్యార్థులు, యువత

కరోనా మహమ్మారి లాక్ డౌన్ నేపథ్యంలో విద్యాసంస్థలు, ప్రైవేట్ ఉపాధి సంస్థలు, కోచింగ్ సెంటర్లు, విశ్వవిద్యాలయాలు మూసివేయడంతో లక్షలాది మంది విద్యార్థులు, ఉపాధి లేని నిరుద్యోగులు గ్రామాలలో గత కొన్ని నెలలుగా  ఉంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 1159 డిగ్రీ కళాశాలలో ఇందులో 132 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య దాదాపు లక్ష మంది ఉంటారు. 3047 జూనియర్ కళాశాలలో ఇందులో 404 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీరి సంఖ్య దాదాపు 9 లక్షల 50 వేలు. ఉన్నత పాఠశాలలు 12932 ఉండగా ఇందులో  పదవ తరగతి విద్యార్థుల సంఖ్య దాదాపు ఆరు లక్షలు ఉంటుంది. 260 ఇంజనీరింగ్ కళాశాలలో దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థుల వరకు ఉంటారు. ప్రైవేటు విద్యా సంస్థలు ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులను దాదాపు 70 శాతం వరకు పట్టణాలు వదిలి తమ గ్రామాలలో గత కొన్ని నెలలుగా ఉంటున్నారు వీరి వయస్సు దాదాపు ( 17 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు లోపే ఉండి ఉంటారు).

Also Read : తెలంగాణలో పురపాలక ఎన్నికలకు కసరత్తు ముమ్మరం

బిజెపి పార్టీ బలం పట్టణ ప్రాంతంలో కొంత మేరకు ఉంటుందని గ్రేటర్ ఎన్నికల్లో ఆ గెలుపు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని విశ్లేషించే కొందరు నేతలు 90 శాతం గ్రామీణ ప్రాంతమైన దుబ్బాక నియోజక వర్గంలో బిజెపి పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే సీటు ఎలా కైవసం చేసుకుంది అనే అంశంపై సమీక్షించుకోవలసిన అవసరముందని మరికొందరి విశ్లేషణ. త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయం అధికార, ప్రతిపక్ష పార్టీలు తర్జన భర్జన పడుతున్నట్లు వినికిడి.

సెంటిమెంటు లేదు.. స్టేట్మెంట్ ఏమైంది?

అధికార పార్టీ అనేక సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలను, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని తెలంగాణ సెంటిమెంటుతో  రాజకీయ ఇబ్బందులకు గురి చేసిందనేది వాస్తవం. గత ఆరు సంవత్సరాలుగా ఇది చేస్తాం అది చేస్తాం అంటూ ఇచ్చిన అనేక హామీల అమలు తీరుతెన్నులు గురించి చర్చించుకుంటే చాంతాడంత ఉంటుంది. ఒకే ఒక్క హామీ గూర్చి విశ్లేషిస్తే, ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా యూనివర్సిటీ అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు బహిరంగ వేదిక నుంచి హామీ  ఇచ్చారు. ఇచ్చిన ఆమె నేటికీ ఆచరణలో అగుపించడం లేదు. కనీసం 10 కోట్ల నిధులు అయినా కేటాయించలేదని విద్యార్థి లోకం ఆరోపిస్తున్నారు.

అధ్వానస్థితిలో విశ్వవిద్యాలయాలు

ఉమ్మడి రాష్ట్రంలో అద్వానంగా ఉన్న తెలంగాణ ప్రాంతంలోని  విశ్వవిద్యాలయాలు, స్వరాష్ట్రంలోనూ మరింత అధ్వానంగా మారాయి అనేది వాస్తవం.  ఈ అంశం తో పాటు  నీళ్లు, నిధులు, నియామకాలు,  డబుల్ బెడ్ రూములు దళితులకు మూడు ఎకరాల భూమి, ఆయా కుల సంఘాలకు భవనాలు, కార్పొరేషన్ ల  ఏర్పాటు, తదితర హామీలూ ఏ మేరకు అమలు జరుగుతున్నాయో ఆలోచించుకోవాల్సిన అవసరం అధికార పార్టీ నాయకత్వానికి ఉంది.

రైతు సంక్షేమం కోసం వేల కోట్ల నిధులు

రైతాంగం సంక్షేమం కోసం దేశంలో  ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయని సంక్షేమ పథకాలను  సీఎం కేసీఆర్ నెత్తికెత్తుకున్నారు.  వేలకోట్ల నిధులతో అమలుచేస్తున్నారు.  రైతులు భూ సమస్యల తో ఇబ్బందులు పడుతున్నారు మండల రెవెన్యూ కార్యాలయంలో భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు  చేసుకున్న దరఖాస్తుల సంఖ్య ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ, రైతుబీమా,  రైతుబంధు, మిషన్ కాకతీయ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చెరువులు నింపడం రివర్స్ పంపింగ్ విధానం తదితర అనేక సంక్షేమ పథకాలు రైతాంగంకోసం అమలు చేస్తున్నప్పటికీ  రైతులలో ఆత్మస్థైర్యాన్ని నింప లేకపోతున్నారు. వారు భూ సమస్యల తో సతమతమవుతున్నారు . గ్రామస్థాయిలో వివరాలు సేకరిస్తే అధినేతలకు అర్థం అవుతుంది. 

పాసుబుక్కులలో తప్పుడు వివరాలు నమోదు

ఇందులో ప్రధానంగా పట్టాదారు పాస్ పుస్తకం లో ఉన్న భూమి విస్తీర్ణం సేద్యం చేస్తున్న భూమి విస్తీర్ణం తక్కువగా నమోదు ఉంటుంది. లేదా అనేకమంది పాసు బుక్కులు కోసం నేటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆన్లైన్ పహాని లలో నమోదైన రైతుల భూమి విస్తీర్ణాన్ని తొలగించడం. ఈ సర్వే నెంబర్లో భూమి సేత్వార్ కంటే అధికంగా ఉందంటూ పేర్కొనడం ఎంజాయ్ మెంట్ సర్వే ల కోసం రైతులు సంవత్సరాల తరబడి కార్యాలు చుట్టూ తిరగడం. ఆన్ లైన్ లో వివరాలు లేకపోవడంతో రైతుబంధు పథకం ఆగిపోవడం.

కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణ

తొలగించిన భూమిని రికార్డుల్లో నమోదు చేయండి అంటే రేపు మాపు అంటూ, వెబ్ సైట్ ఓపెన్ కావడం లేదంటూ, ఫైలు ఆర్డీఓ కలెక్టర్ వద్ద ఉందంటూ కుంటిసాకులతో రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ కొందరు రెవెన్యూ అధికారులు  వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం  షరా మామూలుగా మారింది. అర్హులకు చెందాల్సిన లక్షలాది రూపాయలు విలువ కలిగిన ప్రభుత్వ భూమిని లంచాలు తీసుకొని ఇతరులకు కట్టబెట్టడంతో ఆ భూమి తమదే అంటూ కొందరు తమకు వాటా కావాలి అంటూ కొందరు గొడవపడగా ఒకరి హత్యకు దారితీసింది. దీంతో ఈ సంఘటన పూర్వాపరాలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది అందులో అప్పటి సారంగాపూర్ తాసిల్దార్ గా పనిచేసిన సమయంలోనే లక్షలాది రూపాయల లంచం తీసుకొని అర్హత లేని వారి పేరిట పట్టాలు జారీ చేశారనీ. ఈ కారణంగానే గొడవలు హత్యలు జరిగాయనీ, దీనికి సూత్రధారి ఆయన అంటూ విచారణ అధికారులు తేల్చడంతో గత నెల రోజుల క్రితం ఆయనను కలెక్టర్ విధుల నుంచి తొలగించారు.

మార్పులు చేర్పులలో వి ఆర్ ఓ ల పాత్ర ఎంత?

గత అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకుగల కారణాలను ఆయన  వివరిస్తూ ఎవరికీ లేని అధికారాలు వి ఆర్ ఓ లు పెట్టుకొని రికార్డుల నుంచి రైతుల పేర్లు తొలగించడం, నమోదు చేయడం వారి ఇష్టానుసారంగా జరుగుతోంది, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారనీ, వారి కష్టాలు తీర్చడం కోసమే వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నామనీ సీఎం కేసీఆర్ ప్రకటన సారాంశం. వాస్తవానికి ఆన్లైన్ రికార్డులలో, పహానిలలో రైతుల పేర్లు మార్పులు-చేర్పులు, భూ విస్తీర్ణం తొలగించడం, నమోదు చేయడం ఒక్క విఆర్ఓ తొ  సాధ్యం కాదు అంటూ, తమను మాత్రమే నిందించడం భావ్యం కాదంటూ విఆర్ఓ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రొఫైల్ అనుసరిస్తున్నారా?

మార్పులు చేర్పులకు ప్రొఫైల్ ఉంటుందని అందులో ప్రాథమికంగా విఆర్ఓ నివేదిక ఆధారంగా, రెవిన్యూ ఇన్స్పెక్టర్ , కార్యాలయ సూపరిండెంట్, డిప్యూటీ తహసీల్దార్ తహసిల్దార్లు, పరిశీలించి దానిపై నోట్ ఫైల్ నమోదుచేసి మార్పులు చేర్పులూ అంశాన్ని ఆన్లైన్లో చేయడం జరుగుతుందని ప్రత్యేకంగా ఆన్లైన్ కంప్యూటర్ రికార్డులలో డిజిటల్ సంతకం తహశీల్దార్లది ఉంటుంది. దానికి సంబంధించిన ” కీ ” ఆయన వద్ద  ఉంటుంది. ఈ విధానంలో తాము రికార్డులను ఎలా టాంపరింగ్ చేస్తామని సమిష్టిగా అందరి ఆమోదంతోనే మార్పులు చేర్పులు జరుగుతాయి తప్ప తామే ట్యాంపరింగ్ చేస్తున్నట్లు  తమపై నిందారోపణలు చేశారనీ, మార్పులు, చేర్పులు ,తొలగించిన భూ వివరాలకు సంబంధించిన నివేదికలు రికార్డులు పరిశీలిస్తే ఎవరు ట్యాంపరింగ్ కు పాల్పడ్డారో తెలిసే అవకాశం ఉంటుందనీ  రెవెన్యూ ఉద్యోగి ఒకరు తెలిపారు.

క్షేత్రస్థాయిలో అవినీతి, అక్రమాలు

వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన కొందరు అవినీతి అధికారుల చర్యల వల్ల ప్రభుత్వం ప్రతిష్ట మసకబారుతున్నది. రెవెన్యూ  పోలీస్, మైనింగ్ ఎక్సైజ్ ,విద్యుత్ శాఖలోని అధికారులు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా విధులు నిర్వహించడం తో పాటు గ్రామాల్లోని యువత సహజ వనరుల దోపిడీ, అవినీతి అక్రమాలపై  ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో యంత్రాంగం తీరుపై ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ప్రత్యేకంగా వివిధ అవినీతి అక్రమాలపై ప్రశ్నించిన వారిని ఇబ్బందులకు గురి చేయడం, పోలీస్ కేసులు, కక్ష సాధింపు చర్యలతో కుటుంబసభ్యులను ఇబ్బందులకు గురిచేయడం,   భూ వివాదాలను సృష్టించడం, వీరికి  అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల అండదండలు ఉండడం వారిలో వర్గ విభేదాలు గ్రూపు తగాదాలు, ఆధిపత్యపు పోరులో, గ్రామాలు సతమతమవుతున్నాయి అనేది అక్షర సత్యం.

జాయంట్ చెక్ పవర్

దీనికితోడు గ్రామ పంచాయతీ  సర్పంచ్, ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ నిబంధనలతో అభివృద్ధి కుంటుపడటం తో పాటు రెండు గ్రూపులుగా మారడం అనేక గ్రామాల్లో షరా మామూలుగానే మారింది.  కరోనా బారినపడి అనారోగ్యానికి గురైన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల లో అరకొర వైద్య సౌకర్యాలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఒకవేళ చేయించుకున్నా లక్షలాది రూపాయలు అప్పుల పాలవుతున్న గ్రామీణ కుటుంబాలు. లాక్ డౌన్ లోనే పెండింగ్ విద్యుత్చార్జీల  భారం  ఎల్ఆర్ఎస్ అమలు , తదితర సమస్యలతో విసిగివేసారిన గ్రామీణ భారతంలో ఈ అంశాలను ప్రత్యక్షంగా చూడడంతో పాటు  ప్రభుత్వ  యంత్రాంగం పనితీరు కొందరుఅధికార పార్టీ నాయకుల ఆధిపత్యాలను, పోలీస్ , రెవెన్యూ  కార్యాలయాల లో వారి ప్రవర్తననూ ఇన్ని నెలలుగా గమనిస్తున్న  యువత, విద్యార్థులు  ఓ అభిప్రాయానికి వచ్చినట్లు వారి చర్చల సారాంశం

పాత్రికేయులూ, ఉద్యోగులూ, ఉపాధ్యాయులలో అసంతృప్తి జ్వాలలు

రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి ఉత్సాహంగా ఉరకలు వేసిన గ్రామీణ పాత్రికేయులు, ఉద్యోగ ,ఉపాధ్యాయులు ప్రభుత్వం తీరుతెన్నులపై అసంతృప్తి జ్వాలలో రగిలిపోతున్నారు. పి ఆర్ సి  తదితర ఉద్యోగ సమస్యలు ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు, తదితర అంశాలపై సంఘ నాయకులతో ఒక నాడు చర్చలు సమావేశాలు ప్రభుత్వాధినేత జరపలేదని. తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని వారు అనేక అంశాలపై రగిలిపోతున్నారు అనేది వాస్తవం. ప్రత్యేకంగా 2001లో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి 2014  వరకు   అన్ని ఆందోళన కార్యక్రమాల్లో కెసిఆర్ వెన్నంటి ఉండి ముందుకు నడిచిన గ్రామీణ పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం  గత ఆరు సంవత్సరాలుగా ఎదురుచూపులే అవుతున్నాయి తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీనికితోడు రెండు యూనియన్లు ఏర్పడడం ఒక యూనియన్ ప్రభుత్వానికి అనుకూలం, మరో యూనియన్ వ్యతిరేక వర్గంగా అధికార యంత్రాంగం వివక్ష చూపడం, ఇంటి స్థలాలు,  ఆరోగ్యబీమా, ఎండమావులే. తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన హెల్త్ కార్డులు అలంకార ప్రాయంగా మారాయి.  ఆస్పత్రులలో వాటిని అనుమతించడం లేదు. అనారోగ్యంతోనో, ప్రమాదవశాత్తుగానో పాత్రికేయులు మృత్యువాత పడితే ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయల పరిహారం నెల నెల పింఛన్ పథకంలో  నిబంధనల పేరిట ఇస్తున్నామని చెబుతున్నా పాత్రికేయుల కుటుంబాలకు ఇబ్బందులు తప్పడం లేదు . దీనికితోడు పాత్రికేయులపై దాడులు, కక్ష సాధింపు చర్యలు, తప్పుడు కేసులు నమోదుతో పాత్రికేయ లోకాన్ని అధికార పార్టీ నేతలు, అధికారులు భయాందోళనకు గురి చేస్తున్న విషయం జగమెరిగిన సత్యమే.

పాత్రికేయుల ఇబ్బందులు సమస్యల గురించి సంఘ నాయకులతో ప్రభుత్వాధినేత చర్చలు జరిపిన సందర్భం సమయము లేదు.  2014 నుంచి 2019 వరకు దాదాపు 200 మంది పాత్రికేయులు అనారోగ్య, ప్రమాదాల వలన ఇతర కారణాలతో మృత్యువాత పడితే ఆ మరణాలు తీరుతెన్నులపై సంఘ నేతలతో ప్రభుత్వాధినేత స్పందించకపోవడంతో ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద ధర్నా చేసి భారత ఉపరాష్ట్రపతి కి మెమోరాండం ఇవ్వాల్సిన దుస్థితి తెలంగాణ పాత్రికేయులకు ఏర్పడిందంటే పాత్రికేయుల, పాత్రికేయ సంఘాల పట్ల ప్రభుత్వం  వ్యవహరిస్తున్న తీరును అర్థం చేసుకోవచ్చు.

కమలంవైపు కదలికలు?

ప్రత్యేక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దాదాపు కనుమరుగయిందనే చెప్పాలి.  ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఉన్నా అభివృద్ధి  కోసం అంటూ  ఆ పార్టీ నేతలు గులాబీ కండువాలు కప్పుకోవడంతో  ఆ పార్టీ పట్ల ప్రజలలో, ముఖ్యంగా నిరుద్యోగ యువతలో, నమ్మకం, విశ్వాసం సన్నగిల్లినట్టు అగుపిస్తున్నాయి.  ఈ దశలో దుబ్బాక ఉపఎన్నిక, హైదరాబాద్ గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి పార్టీ హవా దీనికితోడు  ఆ పార్టీ  కేంద్రంలో అధికారంలో కొనసాగడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గల క్లీన్ ఇమేజ్ , రాష్ట్రఅధ్యక్షుడిగా యువకుడు బండి సంజయ్ నియామకం, ఆయన పట్ల  యువతలో ఉన్న క్రేజ్ తో పలువురు ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు, మాజీ  ప్రజా ప్రతినిధులు కమలం పార్టీ వైపు కదులుతున్నట్టు గ్రామాల్లో చర్చ జోరందుకుంది. దీనికితోడు ఆ పార్టీ అయోధ్య సుందరీకరణ పేరిట ప్రతి హిందువును ప్రతి గ్రామం, వాడలో గల పౌరుడిని భాగస్వామ్యం చేయడం కోసం  పకడ్బందీగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అయోధ్య నగరానికి నోటు విరాళంగా ఇవ్వండి, రానున్న ఎన్నికల్లో బిజెపికి ఓటు వేయండి అంటూ గ్రామాల పర్యటన కార్యక్రమాన్ని సంక్రాంతి పర్వదినం తర్వాత శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా 40 రోజుల పాటు జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రంలోని దాదాపు రెండు వేల నుంచి మూడు వేల వరకు గల ఆర్ఎస్ఎస్ శాఖలు, వాటి అనుబంధ  సంఘాలు దాదాపు 20 నుంచి 30 లక్షల మంది  సభ్యులను సమీకరించి ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తారని అంటున్నారు.

కాలేశ్వరం ప్రాజెక్టు కన్నా.. కరప్షన్ అంటూ ప్రచారం

తెలంగాణ  ప్రాంత వరప్రదాయని గోదావరి నదిపై అద్భుతమైన నభూతో న భవిష్యత్ తరహాలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తో రాష్ట్రంలో  నీటి సమస్య ఉత్పన్నం ఉండదనేది మేధావులు, ఇంజనీరింగ్ నిపుణులు చెపుతున్నది వందశాతం వాస్తవమే. అయితే ఆ ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న కరప్షన్ ఆరోపణలకు ఎనలేని ప్రచారం జరిగిందనేది నిజం.  అయితే, అందులో అవినీతి జరిగిందా లేదా అనే అంశం అప్రస్తుతం. కానీ అవినీతి ఆరోపణలకు దీటుగా ప్రత్యారోపణలు చేయడంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం విఫలమయ్యారని చెప్పవచ్చు. కాలేశ్వరం ప్రాజెక్టుతో  సాగు, తాగునీటికి ఇబ్బందులు  ఉండవు. చెరువులు, కుంటలు నిండుకుండలా ఉంటాయనేది ఇంజనీరింగ్ నిపుణుల అభిప్రాయం.  వాస్తవమే కావచ్చు.

అధినేత మేధోమధనం

తెలంగాణ గడ్డ ప్రజలలో, యువతలో, పౌరుషం, ప్రశ్నించే తత్వం, పోరాట పటిమ, నిరంకుశ పాలనకు ఎదిరించే ధీరత్వం , ఆశయ సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నత్యాగనిరతికి లోటులేదు.  యువతరం, విద్యార్థి లోకం గూర్చి ప్రత్యేకంగా టిఆర్ఎస్ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి  కెసిఆర్ కు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం  తన ప్రభుత్వం పట్ల ఎందుకు అత్యధిక శాతం యువత నిరాశానిస్పృహలతో ఉన్నారు అనే అంశంపై కెసిఆర్  మేధో మథనం చేసి మూలాలు  తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఉద్యమ నేతగా, రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలకు ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆయన మాటల తూటాలు, ఆయన ప్రసంగాలు, రాజకీయ ఎత్తుగడలు. సీమాంధ్ర నేతలను ఎండగట్టిన తీరు, ఆయన మాట్లాడిన భాషను నేటికీ గ్రామాల్లో జనం వాడుకుంటూ హాస్యాన్ని  ఆస్వాదించు కుంటున్నారు. దేశంలో ఏ సినీ హీరో కు లేని గ్లామర్, క్రేజ్ ,పాపులారిటీ కెసిఆర్ కు ప్రజలలో ఉంది . అలాంటి  ప్రజలు  గత కొన్ని నెలలుగా తన పట్ల, తన పార్టీ పట్ల  ఎందుకు  అసంతృప్తితో రగిలి పోతున్నారు?  నిరాశానిస్పృహలకు గురి అవుతున్నారు అనే అంశంపై  ఆలోచించుకోవాల్సిన  అవసరం  కేసీఆర్ కి ఎంతైనా ఉంది. త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు జరగనున్న  నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు ముందు మేధోమధనం చేస్తారా ? ఆ ఎన్నికల ఫలితాల పిదప చేస్తారో వేచి చూద్దాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles